ప్రధాన ఆడిటోరియంలో విద్యార్థులు అప్పటికే వేరే పనుల్లో ఉండగా వినియోగదారులను చైతన్యవంతం చేసే సంఘం ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ అక్కడే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని విద్యార్థులు వ్యతిరేకించిన కారణంగా వారిపై ఘోరంగా దాడి చేశారు.
కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్(ఎస్సార్ఎఫ్టీఐ) విద్యార్థులపై భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలుగా చెప్పబడుతున్నవారు సెప్టెంబర్ 27న దారుణంగా దాడి చేశారు.
ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక లైబ్రేరియన్తో పాటు అనేక మంది ఉపాధ్యాయులు, సుమారు 150 మంది విద్యార్థులు కూడా రకరకాలుగా రక్తగాయాల పాలైనట్లు విద్యార్థులు తెలియజేశారు.
దాడులు చేసినవారు కత్తులతో దాడి చేయడం వల్ల ఏర్పడిన గాయాలను కనీసం నలుగురు విద్యార్థులు చూపించారు.
రాత్రి సుమారు 7 గంటలకు గేట్లను మూసివేసి దాడికి పాల్పడిన కొంత మందిని ఆ ప్రాంగణం నుంచి తొలగించినట్లు పోలీస్ వర్గాలు తెలియజేశాయి.
తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను లాగేసుకున్నట్లు అనేక మంది విద్యార్థులు చెప్పారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం సమావేశం
వినియోగదారులను చైతన్యవంతం చేసే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ పేరుతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన థియేటర్ స్టేజిపై ప్రారంభమైంది.
సమావేశం గురించి విద్యార్థులకు లేదా యూనియన్‌కు సమాచారం ఇవ్వలేదని విద్యార్థి సంఘం అధ్యక్షులు బ్లొస్సమ్ హజరికా అన్నారు.
తమకు ఆ సంఘం గురించి ఏ మాత్రం తెలియదని, సినిమాతో సంబంధం లేని సంఘం సమావేశానికి అనుమతించారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దాదాపు 2 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలుగా చెప్పబడుతున్నవారు హాల్లో ఉన్న విద్యార్థుల వద్దకు వచ్చి వారి గొంతు పట్టుకొని ఒక మూలకు తోసేసినట్లు విద్యార్థులు వివరించారు.
దాంతో విద్యార్థులు స్పందిస్తూ, మాకు ఇన్స్టిట్యూట్లో అప్పజెప్పిన పనిని చేసుకుంటున్నామని, ముందుగా నోటీస్ ఇవ్వకుండా థియేటర్ స్టేజిపై సమావేశం పెట్టరాదని స్పష్టం చేశారు.
“అనేక మంది బీజేపీ కార్యకర్తలు అక్కడ వేచి ఉన్నారు”
“మేము నిరసన తెలుపుతామనే దాని కోసమే వారు వేచి చూస్తున్నట్లు ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే వారిలోంచి ఒక గ్రూపు మాపై కర్రలు, లాఠీలతో దాడి చేయడం మొదలు పెట్టారు. మాపై అన్నిరకాలుగా దుర్భాషలాడటం ప్రారంభించారు. మమ్మల్ని వామపక్ష తీవ్రవాదులు, బంగ్లాదేశీయులు ఇంకా ఎన్నో మాటలంటూ తిట్ల పురాణానికి దిగారు. అకస్మాత్తుగా వారిలోంచి కొంత మంది బయటకు వెళ్లి అక్కడ వేచి ఉన్న మరి కొంత మంది బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చి మాపై దాడి చేశారని” ఈ సంఘటనకు సాక్షుడైన విద్యార్థి నీరజ్ కుమార్ ది వైర్‌కు వివరించారు.
విద్యార్థులు దారుణ హింసకు గురయ్యారని కుమార్ చెప్పారు:
“విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం మొదలు పెట్టారు. విద్యార్థినుల దుస్తులు లాగడానికి ప్రయత్నించారు. విద్యార్థులందరినీ ద్రోహులుగా, బొద్దింకలంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు”.
విద్యార్థులు లైబ్రేరీలోకి పరుగులు పెట్టారని కుమార్ తెలిపారు.
“విద్యార్థులు ఆ తర్వాత తమను తాము కాపాడుకోవడానికి లైబ్రేరీలో తలదాచుకున్నారు. వారు లైబ్రేరీలోకి కూడా ప్రవేశించి లైబ్రేరియన్‌ను చితకబాదారు”.
బెంగాల్లో ఐదు మాసాల బీజేపీ ప్రభుత్వ నియంత్రణ కింద పోలీస్ వ్యవస్థ ఉంది, వారు విద్యార్థులపైనే కోపగించుకున్నారని కుమార్ చెప్పారు.
“ఈ సంఘటన ప్రారంభమైన గంట తర్వాత పంచసాయర్ పోలీసులు వచ్చారు. వారు చేరుకున్న వెంటనే విద్యార్థులపై లాఠీచార్జి మొదలుపెట్టారు. పోలీసుల కళ్ల ముందు బీజేపీ కార్యకర్తలు, వారి మద్దతుదారులు మాపై దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా వారు ఏమీ చేయలేదు”.
పలు మార్లు దాడి చేయడంతో విద్యార్థులు తీవ్ర గాయాలకు గురయ్యారని మరో విద్యార్థి ఉజ్వల్ రాయ్ తెలిపారు.
“రాత్రి దాదాపు 7 గంటలకు అంబులెన్స్‌లో ఎనిమిది మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించామని, వారు అంబులెన్స్‌ను కూడా చుట్టుముట్టి మరోసారి మాపై దాడి చేశారు. ఒక పథకం ప్రకారం వారి దాడి ఉంది”.
సంస్థలో అనేక మంది విద్యార్థులు రాష్ట్రం బయట నుంచి వచ్చిన వారు ఉన్నారని, అందుచేత క్యాంపస్ బయట తలదాచుకోవడానికి వారికి అవకాశం లేదని రాయ్ గుర్తు చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల రాజకీయ సమావేశాలు
వామపక్ష కూటమి ప్రభుత్వ హయాంలో 1995లో ఈ సంస్థను స్థాపించారని, ఈ తరహా రాజకీయ సమావేశాలు, హింస సంప్రదాయం ఏనాడు లేదని కొంత మంది మాజీ, ప్రస్తుత విద్యార్థులతో ది వైర్ మాట్లాడగా వారు చెప్పారు.
“గత జూన్ నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రతి ఆదివారం ప్రధాన ఆడిటోరియంలో రాజకీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. గతంలో ఇలాంటి సంప్రదాయం లేదు. ఒక రాజకీయ పార్టీ ఈ రకంగా ప్రాంగణాన్ని ఉపయోగించడానికి ఎలా అనుమతిస్తారని విద్యార్థులందరూ ప్రశ్నిస్తున్నారని” తనకు తాను తన మొదటి పేరుతో పరిచయం చేసుకున్న ఒక విద్యార్థిని బ్రిష్టి తెలియజేసింది.
ప్రధాన స్టేజిని ఉపయోగిస్తే సమస్య ఏమిటని బ్రిష్టి వివరించారు.
“ఆదివారం అంటే ఇక్కడ సెలవు అని కాదు. అనేక మంది విద్యార్థులు వారి వారాంతపు సెలవులో వారి ప్రాక్టికల్ అసైన్‌మెంట్‌పై పని చేసుకుంటారు. కాబట్టి బయట నుంచి ఒక రాజకీయ కార్యకర్తల గుంపు వచ్చి సమావేశాలు పెట్టుకుంటామంటే, అది విద్యార్థుల పనికి ఆటంకం కలిగిస్తుంది”.
జరిగిన సంఘటనను వివరిస్తూ పంచసాయర్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల సంఘం ఫిర్యాదు చేసింది.
విద్యార్థులపై దాడికి పాల్పడిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలుగా చెప్పబడుతున్న వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది.
జరిగిన సంఘటనపై ఎస్సార్ఎఫ్టీఐ రిజిస్ట్రార్ దీపక్ కుమార్ వ్యాఖ్యల కోసం ది వైర్ సంప్రదించగా ఆయన ఫోన్‌ను డిస్కనెక్ట్ చేశారు.
ది వైర్ పంచసాయర్ పోలీస్ స్టేషన్‌ను కూడా సంప్రదించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి తప్ప వివిధ వర్గాల నుంచి అధికార వ్యాఖ్యలు రావడం ఇప్పుడు అసాధారణమైందని ఒక సీనియర్ పోలీస్ అధికారితో ది వైర్ మాట్లాడగా ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
“విద్యార్థులపై దాడి చేసిన వారు దేశ వ్యతిరేకులు”
బెంగాల్‌కు చెందిన వివిధ వర్గాల ప్రజలు ఈ దాడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మాట్లాడారు.
“టెలివిజన్, సినిమా లేదా మరే ఇతర కళలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఒక ప్రభుత్వ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని”? ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత కమలేశ్వర్ ముఖర్జీ ది వైర్‌కు చెప్పారు.
“విద్యార్థులను కొట్టి వారిని దేశ వ్యతిరేకులంటున్నారు? ఈ ప్రజలు ఎవరు? దీనిపై దర్యాప్తు జరగాలి”? అని అన్నారు.
“ఎవరైతే విద్యా సంస్థలోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేశారో వారే దేశ వ్యతిరేకులని, బెంగాలీ సినిమాపై పరిశోధకులు ప్రొఫెసర్ సంజయ్ ముఖోపాధ్యాయ అన్నారు. పౌరుల డబ్బుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన సంస్థ ఇది. దాన్ని అద్దెకు ఇవ్వడానికి ఒక రాజకీయ పార్టీకి ఎందుకు అనుమతించాలి? ఇది చూడాలంటే హృదయవిదారకమైపోతుంది. ఇది దారుణమైన పరిస్థితి ”గా పేర్కొన్నారు.
దాడిని ఖండిస్తూ అందుకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని వామపక్ష అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ సంఘటనను అనాగరికమైనదిగా వర్ణిస్తూ “సత్యజిత్ రే పేరుతో నెలకొల్పిన ఈ విద్యా సంస్థ దేశంలోనే గొప్ప సంస్థల్లో ఒకటని, దాంట్లో భవిష్యత్తు ఫిల్మ్ మేకర్లు, మేధావులపై దాడి చేయడం అంటే ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంస్కృతి కావాలి అనేది చూపించిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సుజన్ చక్రబర్తి అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

