గుర్గావ్ నగరంలోని రెండు ఫ్యాక్టరీల కార్మికులు వేరువేరుగా నిరసనలకు దిగారు.
హర్యానా ప్రభుత్వం సవరించిన కనీస వేతన ఉత్తర్వులను యజమానులు ఉల్లంఘిస్తున్నారని- పని అనుభవం, నైపుణ్యంతో పాటు ఓవర్టైమ్ను, వేతన ప్యాకేజీల అమలును యజమానులు ఉల్లంఘిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
కార్మిక నేతలపై విదేశీ నిధుల ఆరోపణలు..
ఏప్రిల్ 13న జరిగిన కార్మికుల ఆందోళన సందర్భంగా హింసను ప్రేరేపించారనే ఆరోపణపై సత్యం వర్మ, ఆకృతిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం ప్రయోగించిన ఒక రోజు తర్వాత, వర్మ తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి డాలర్లు, పౌండ్లు, యూరోల రూపంలో రూ 1 కోటి కంటే ఎక్కువ విదేశీ నిధులు పొందారని, వెంటనే ఆ డబ్బును బదిలీ చేశారని పోలీసులు ఆరోపించారు.
ఉద్యోగ్ విహార్‌లోని లెదర్ వస్తువుల యూనిట్, నర్సింగ్‌పూర్‌లోని గ్లాస్ ఫ్యాక్టరీ క్యాంపస్‌లో జరిగిన ఈ జంట నిరసనలు.. నోయిడాతో పాటు మానేసర్‌లో వేతన సవరణ, ఇతర సమస్యలపై కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారిన కొన్ని వారాల తర్వాత ఇవి జరిగాయి.
ఇది ఫ్యాక్టరీలలో మళ్లీ ఉద్రిక్తతకు దారితీస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
అయితే, వర్మ తరఫు న్యాయవాది ఈ ఆరోపణ కల్పితమని కొట్టిపారేశారు. పోలీసులు కోర్టు ముందు ఎటువంటి ఆధారాలు ఉంచలేకపోయారని, ఇప్పుడు కేసును నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
జారీ చేసిన ఒక ప్రకటనలో నోయిడా పోలీసు కమిషనర్, హింసకు సంబంధించి నమోదైన కేసుల విచారణలో ఈ ఆరోపణలు బయటపడ్డాయని తెలిపారు.
వర్మ ఆ నిధులను వివిధ సమయాల్లో తన ఇతర వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేశారని; “వివిధ సంస్థలతో” ఆయనకు ఉన్న సంబంధాలు కూడా పరిశీలనలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
మజ్దూర్ బిగుల్ దస్తాతో సంబంధం ఉన్న వర్మ, ఆకృతిలు- కార్మికులను రెచ్చగొట్టి, అలజడి సృష్టించి, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించారనే తప్పుడు ఆరోపణలతో ఎన్ఎస్ఏ నిబంధనల కింద పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఆరోపణలను కొట్టిపారేసిన న్యాయవాది కబీర్..
వర్మ తరపున హాజరైన సుప్రీంకోర్టు న్యాయవాది కబీర్, పోలీసుల వాదనను పూర్తిగా తోసిపుచ్చారు.
“ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. నా క్లయింట్ బ్యాంక్ ఖాతాలో రూ 1 కోటి లేదు” అని ఆయన అన్నారు.
వర్మ ఫ్రీలాన్స్ అనువాదకుడిగా పని చేస్తారని, గూగుల్‌తో పాటు మెటా వంటి కంపెనీలకు వాణిజ్య అనువాద పనులు చేశారని కబీర్ చెప్పారు.
“ఆ పనికి సంబంధించిన చెల్లింపులు ఆయన బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని, దానితోనే తనను, తన కుటుంబాన్ని పోషించుకుంటారు.
కానీ ఆయన నెలవారీ సంపాదన రూ 1 కోటికి దరిదాపుల్లో కూడా ఉండే ప్రశ్న లేదు” అని న్యాయవాది కబీర్ అన్నారు.
ఉద్యోగ్ విహార్ లెదర్ యూనిట్లో ఉద్రిక్తత..
ఉద్యోగ్ విహార్ లెదర్ యూనిట్లో సుమారు 200 మంది కార్మికులు సమ్మెకు దిగి, ప్రాంగణం లోపల బైఠాయించారు.
మేనేజ్మెంట్ హెల్పర్లు, నైపుణ్యం లేనివారు, సెమీ-స్కిల్డ్, నైపుణ్యం కలిగిన కార్మికులందరినీ యాజమాన్యం ఒకే వేతన స్కేల్లోకి కలిపి, ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన వేతనాలను నిరాకరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు.
ఫ్యాక్టరీ కార్మికుడు కమలేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల్లో 35% పెంపును అమలు చేయాలని ఉద్యోగులు పదేపదే మేనేజ్మెంట్ను కోరారని, కానీ వారు పట్టించుకోలేదని చెప్పారు.
“అధికారులు మమ్మల్ని అదే జీతానికి పని చేయమని లేదా వెళ్లిపోమని చెబుతున్నారు. మేము ఎలా వెళ్ళగలం? మేము చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇంటి అద్దెలు ఉన్నాయి” అని ఆయన అన్నారు.
ఈ ఆందోళన నిలిచిపోయిన వేతనాల వల్ల ప్రారంభమై, తర్వాత పారిశ్రామిక ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
ఓవర్‌టైమ్ లెక్కింపులో లోపాలు..
మహమ్మద్ తబ్రేజ్ అనే కార్మికుడు మాట్లాడుతూ, కార్మికులతో రోజుకు 12 నుంచి 16 గంటలు పని చేయించుకుంటున్నారని, ఆదివారాలతో సహా, చట్టబద్ధమైన రేటు ప్రకారం ఓవర్‌టైమ్ చెల్లించడం లేదని ఆరోపించారు.
“నైపుణ్యం లేని, సెమీ-స్కిల్డ్, నైపుణ్యం కలిగిన కార్మికులందరినీ ఒకే తరగతి కార్మికులుగా చూస్తున్నారు. అంతేకాకుండా, మా అందరికీ నిర్ణీత వేతనాల కంటే తక్కువ చెల్లిస్తున్నారు” అని ఆయన తెలిపారు.
ఓవర్టైమ్ను కూడా తప్పుగా లెక్కిస్తున్నారని కరణ్ కుమార్ చెప్పారు. “దీనిని సాధారణ వేతనానికి రెట్టింపుగా చెల్లించాలి. నెలలో 24 పని దినాల ఆధారంగా లెక్కించాలి. బదులుగా, దీనిని 31 రోజుల ఆధారంగా లెక్కిస్తున్నారు. కాబట్టి, మేము ఎక్కువ మొత్తంలో డబ్బును నష్టపోతున్నాము” అని ఆయన అన్నారు.
మరో కార్మికుడు మిరాజ్ మాట్లాడుతూ, వేతనాలపై ప్రభుత్వ ఆదేశాలను పాటించడానికి కంపెనీ నిరాకరిస్తున్నందున ఫ్యాక్టరీ లోపల నిరసన కొనసాగుతోందని చెప్పారు.
నర్సింగ్‌పూర్ గ్లాస్ ఫ్యాక్టరీలోనూ నిరసన సెగలు..
నర్సింగ్‌పూర్‌లోని గ్లాస్ ఫ్యాక్టరీలో కూడా ఇటువంటి సమస్యలపై కార్మికులు గేటు వెలుపల నిరసన వ్యక్తం చేశారు.
అక్కడి ఉద్యోగి దీపక్ కుమార్ మాట్లాడుతూ, 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగులు నెలకు రూ 15,000 సంపాదిస్తుంటే, ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారు దాదాపు రూ 12,500 పొందుతున్నారని చెప్పారు.
“మేము సవరించిన కనీస వేతనాలను అమలు చేయాలని కంపెనీని కోరుతున్నాము. కానీ వారు నిరాకరిస్తున్నారు” అని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని తరగతుల కార్మికుల కనీస వేతనాలను 35% పెంచి, అమలు తేదీని నిర్ధారించాలని కార్మిక శాఖను కోరింది.
అదనపు లేబర్ కమిషనర్ (గుర్గావ్) కుశాల్ కటారియా నిరసనలు, ఆరోపణలపై వ్యాఖ్య కోసం చేసిన పదేపదే కాల్స్‌తో పాటు మెసేజ్‌లకు స్పందించలేదు.
ఆర్ లక్ష్మయ్య అనువాదం చేసిన ఈ వ్యాసాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
