“కుల ఆధిపత్యం, ప్రతిఘటన దక్షిణ భారత దేశంలో దళిత అస్తిత్వ రాజకీయాలు” అనే పుస్తకాన్ని కర్లి శ్రీనివాసులు రచించారు.
ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్‌లోని(దక్షిణ భారతదేశంలోని) దళిత ఉద్యమంపై సమయోచితమైన, కఠినంగా పరిశోధించబడిన, సైద్ధాంతికంగా సూక్ష్మమైన మోనోగ్రాఫ్.
ఇది దళిత రాజకీయాలను అనాలోచితంగా అందలమెక్కించడం లేదా పూర్తిగా తోసిపుచ్చడం రెండింటినీ నివారిస్తుంది.
సబాల్టర్న్ స్టడీస్(ముఖ్యంగా రణజిత్ గుహ) పద్ధతిశాస్త్ర సూచనలను ఎంపిక చేసుకొని ఉపయోగించడం ద్వారా, దాని తరువాతి సాంస్కృతికవాద మలుపును విమర్శిస్తూ, శ్రీనివాసులు సమతుల్యమైన విధానాన్ని సూచిస్తారు.
అతను కుల-వర్గ ఆధిపత్య నిర్మాణాలు, వాస్తవ దళిత ప్రతిఘటనల మధ్య పరస్పర చర్యను పరిశీలిస్తారు.
ఒకవైపు సంకుచిత(క్రూడ్) ఆర్థికవాదాన్ని, మరోవైపు స్వయంస్ఫూర్తి గల సబాల్టర్న్ చైతన్య స్పృహల పట్ల ఉన్న రొమాంటిక్ భావనలను నివారిస్తారు.
చారిత్రక నేపథ్యం- ప్రధాన విశ్లేషణ..
స్వాతంత్ర్యానంతర అభివృద్ధి, ముఖ్యంగా హరిత విప్లవం(గ్రీన్ రివల్యూషన్)తోపాటు వ్యవసాయ వాణిజ్యీకరణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కులానికి చెందిన రైతుల ఆర్థిక ఎదుగుదలకు ముఖ్యమైన అవకాశాలను అందించాయి.
ఫలవంతమైన తీరప్రాంత జిల్లాల్లో కేంద్రీకృతమైన ఆ కులం కొత్త నీటిపారుదల సౌకర్యాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, మార్కెట్ సంబంధాలను ఉపయోగించి వ్యవసాయ మిగులును పోగేశారు.
వారు వ్యాపారం, రవాణా, సినిమా, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, పరిశ్రమల్లోకి విస్తరించారు.
ఈ ఆర్థిక సాధికారత వారి రాజకీయ ప్రాబల్యంగా ప్రతిఫలించింది. పాత రెడ్డి ఆధిపత్య కాంగ్రెస్ నెట్‌వర్క్‌లను, సాంప్రదాయ జజ్‌మానీ(యజమాని-క్లయింట్) వ్యవస్థను ఇది సవాలు చేసింది.
శ్రీనివాసులు స్వయంస్ఫూర్తి దళిత ఉద్యమ ఎదుగుదలను ఆంధ్రప్రదేశ్‌లోని ఈ విస్తృత స్వాతంత్ర్యానంతర రాజకీయ-ఆర్థిక మార్పుల నేపథ్యంలో విశ్లేషిస్తారు.
కాంగ్రెస్ వ్యవస్థ క్రమంగా క్షీణత, కొత్త ఆధిపత్య శూద్ర రైతు కులాల(ముఖ్యంగా కమ్మల) ఎదుగుదల, సాంప్రదాయ జజ్‌మానీ సంబంధాల క్షీణత- ఇవన్నీ కింది కులాలు(దళితులతో సహా) స్వతంత్ర ఆర్థిక, సామాజిక పట్టును సాధించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాయి.
టీడీసీ విస్తృత సమీకరణ విఫలం..
ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో విస్తృతమైన పాపులిస్ట్ తెలుగు గుర్తింపుతో పాటు సంక్షేమ చర్యలను(ఉదా కేజీకి రూ 2 అన్నం పథకం, రైతులకు సబ్సిడీ విద్యుత్) మేళవించి అధికారాన్ని దక్కించుకుంది.
పాన్-తెలుగు గుర్తింపును ప్రతిబింబించినప్పటికీ, టీడీపీ కమ్మ సామాజికవర్గ మద్దతు నెట్‌వర్క్‌లపై బాగా ఆధారపడింది.
ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఈ రైతు కుల ఆర్థిక, రాజకీయ విశ్వాసాన్ని మరింత బలపరిచింది.
అయితే, కింది కులాలను సమీకరించడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
విద్య, పరిమిత భూసంస్కరణలు, క్షీణిస్తున్న పోషక(ప్యాట్రనేజ్) వ్యవస్థల ద్వారా సాధికారత పొందిన దళితులు- శ్రమ సంబంధాలలో, బహిరంగ ప్రదేశాలలో సాంప్రదాయ కుల సోపానాలను నిరోధించడంతోపాటు సామాజిక గౌరవాన్ని డిమాండ్ చేయడం ప్రారంభించారు.
విస్తృత సమీకరణ విఫలమైనప్పుడు, టీడీపీ- దాని మిత్రపక్షాలైన ఆధిపత్య కులాల ప్రయోజనాలు ఉప-కుల విభజనలను(ముఖ్యంగా దీర్ఘకాలిక మాల-మాదిగ విభేదాన్ని) వాడుకున్నాయి.
మాలలు (తరచుగా సాపేక్షంగా ఎక్కువ విద్యావంతులు, పట్టణీకరణ చెందినవారు) దీంతోపాటు మాదిగలు(సంఖ్యాపరంగా బలమైనవారు కానీ కొన్ని ప్రాంతాల్లో చారిత్రకంగా మరింత అంచున ఉన్నవారు) రిజర్వేషన్ ప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యతపై పోటీ పడ్డారు.
అధికార పార్టీ మాదిగ సమూహాలకు ఎంపిక చేసిన మద్దతును అందించింది.
ఇది 1990లలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా ఎస్సీ ఉప-వర్గీకరణ డిమాండ్లతో తీవ్రమైన విభేదాన్ని మరింత లోతుగా చేసింది.
కుల హింస – ప్రతిఘటన..
ఈ రాజకీయ కలకలం, నిరంతర గ్రామీణ కుల సోపానాలు, మారుతున్న రాజకీయ శక్తి సమీకరణాల మధ్య(కమ్మ – రెడ్డి) కుల అణచివేత, హింసల పరంపరకు దారితీశాయి.
ఇందులో ప్రధానమైన ఎంతో భయంకర సంఘటనలు: కారంచేడు(1985)లో కమ్మ భూస్వాములు మాదిగ దళితులపై దాడి చేయడం, నీరుకొండ(గుంటూరు జిల్లా)లో మాలలపై దాడి, చుండూరు(1991)లో రెడ్డిలు మాల దళితులను లక్ష్యంగా చేసుకోవడం.
ఇవి కేవలం ప్రాథమిక ద్వేషం నుంచి ఉద్భవించిన విడిపోయిన “కుల ఘర్షణలు” కావని, కాంగ్రెస్ ఆధిపత్యం క్షీణించిన తర్వాత ఏర్పడిన కొత్త శక్తి సమీకరణాల తార్కికమైన, తరచుగా ప్రణాళికబద్ధమైన ఫలితాలని శ్రీనివాసులు చూపిస్తారు.

అవి ఆధిపత్య కులాలు తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి చేసిన ప్రయత్నాలను సూచిస్తాయి.
ఇకపై లోబడి ఉండటానికి సిద్ధంగా లేని దళితులకు “పాఠం నేర్పే” చర్యలవి. ఈ సంఘటనలు దళిత మహాసభ వంటి వేదికల ద్వారా బలమైన స్వయంస్ఫూర్తి దళిత సమీకరణను ప్రేరేపించాయి.
సారాంశంలో, ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్యానంతర ప్రయాణం- ఆర్థిక ఆధునికీకరణ, రాజకీయ ప్రజాస్వామ్యీకరణ అనేవి ఎదుగుతున్న రైతు కులాలకు, దళితులకు ఇద్దరికీ కొత్త అవకాశాలను ఎలా తెరిచాయో చూపిస్తుంది.
అయితే గ్రామీణ అధికార నిర్మాణాల అసంపూర్ణ పరివర్తన కుల, ఉప-కుల గీతాల వెంట తీవ్రమైన సంఘర్షణలను, వ్యూహాత్మక విభజనను ఉత్పత్తి చేసింది.
సైద్ధాంతిక దృక్పథం..
పుస్తకం ప్రధాన బలం ఎంఎన్ శ్రీనివాస్ ‘సంస్కృతీకరణ సిద్ధాంతం’ పట్ల చూపిన విమర్శ.
కొన్ని అణగారిన(సబాల్టర్న్) సమూహాలు ఆధిపత్య కుల నియమాలను అనుకరిస్తాయని అంగీకరిస్తూనే, ఈ అనుకరణ అనేది- కుల-ఆధారిత ఆధిపత్యం పట్ల, వనరుల పట్ల ఉన్న అసమాన ప్రాప్యతకు వ్యతిరేకంగా రగులుతున్న లోతైన అసంతృప్తి, నిరసనతోపాటు నిరోధాన్ని తొలగించదని అతను చూపిస్తారు.
అత్యంత ఆకర్షణీయమైనది ఈ పుస్తకంలో మార్క్సిస్ట్ సిద్ధాంతంతో చేసిన విమర్శనాత్మక పరిశీలన. ఆర్థిక “పునాది” పరివర్తన “ఉపరితలం” అయిన కులంతో ప్రారంభమవ్వాలనే కేంద్ర దళిత సైద్ధాంతిక స్థానం, ఆర్థోడాక్స్ మార్క్సిజం బేస్-సూపర్‌స్ట్రక్చర్ సోపానాన్ని సవాలు చేస్తుంది.
శ్రీనివాసులు దీనిని ఆంటోనియో గ్రామ్షీ సైద్ధాంతిక, హెజిమోనిక్ పోరాటంపై ఉన్న దృష్టికి సృజనాత్మక పునర్వ్యాఖ్యానంగా హైలైట్ చేస్తారు.
కులం ఉపరితలం అయినప్పటికీ, అది ఆర్థిక సంబంధాలకు ఆధారంగా నిలుస్తుంది కాబట్టి మొదట దానిని ఎదుర్కోవాలి.
ఇక్కడ విశ్లేషణను మరింత మెరుగుపరిచేది గ్రామ్షీ “పాసివ్ రివల్యూషన్” భావన సముచిత అన్వయం.
భారతీయ రాజ్యం పెట్టుబడిదారీ వ్యవసాయంతోపాటు వర్గ ఏర్పాటును (జమీందారీ రద్దు, కౌలు సంస్కరణలు, హరిత విప్లవం ద్వారా ఆధునికీకరణతో కూడిన వ్యవసాయ సంస్కరణవాదం) ప్రోత్సహించింది.
అయితే పెట్టుబడిదారీ పూర్వ సామాజిక, సాంస్కృతిక సంబంధాలను, ముఖ్యంగా కులాన్ని, ఎక్కువగా అలాగే ఉంచింది.
ఇది హైబ్రిడ్ ఆధునికతను ఉత్పత్తి చేసింది. ఆర్థిక డైనమిక్స్‌తో పాటు కుల సోపానాల నిరంతరత్వంతోపాటు రాజకీయీకరణ ఇందుకు నిదర్శనం.
శ్రీనివాసులు సందర్భవాద విధానం కులాన్ని డైనమిక్తోపాటు సంబంధాత్మకంగా, ఆధిపత్య-లోబడి అనుభవంగా, నిరోధాన్ని చారిత్రకంగా నిర్దిష్టంగా చూస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ తర్వాత దళిత వర్గాలపై హింసాత్మక అణచివేత, మాల-మాదిగ విభేదం, మాదిగ దండోరా ఉద్యమం, హరిత విప్లవం తర్వాత మార్పులపై ఈ పుస్తకంలో బలమైన దృష్టి ఉంది.
దళిత ఉద్యమం పరిమితులు- అంతర్గత వైరుధ్యాలు..
శ్రీనివాసులు ఉద్యమం లోపాల గురించి స్పష్టంగా ఉన్నారు. దీని ముందు మిలిటెంట్ దశ సామర్థ్యంతోపాటు ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఎన్నికల విజయం నుంచి ప్రేరణ పొందినప్పటికీ, ఇది చివరికి క్షీణించి విభజనకు గురైంది.
అత్యంత ముఖ్యమైన పరిణామం మాదిగ దండోరా ఉద్యమం. ఇది ఎస్సీ రిజర్వేషన్ల ఉప-వర్గీకరణ డిమాండ్‌తో రావడం దళిత సమాజాలలో అంతర్గత కుల స్తరీకరణను పరిష్కరించడంలో విఫలమైన విస్తృత దళిత ఉద్యమ ఫలితం.
ఉప-కుల విభజనల వలన వచ్చే సంశయాత్మక నిర్ధారణలకు వ్యతిరేకంగా, కొందరు విశ్లేషకులు దళితుడిని ‘ఊహాత్మక సమాజం’గా (Dalit as an imagined community a la Benedict Anderson) అభివర్ణించినప్పటికీ, ఒక ఊహాత్మక సమాజాన్ని ఏర్పరచడం ఎంత కష్టమైనప్పటికీ ముందుకు ఉన్న ఏకైక మార్గం అదే అని రచయిత ఆశావాదంగా ఉన్నారు.
ఎన్నికల రాజకీయాలు భావోద్వేగ, గుర్తింపు-ఆధారిత అప్పీల్లకు ప్రాధాన్యతనిచ్చి, భూసంస్కరణ, వేతనాలు, నిర్మాణాత్మక మార్పు వంటి సారాంశపరమైన సమస్యలను పక్కన పెట్టి ఈ విభజనలను మరింత తీవ్రతరం చేశాయి.
వ్యక్తి-కేంద్రిత కథనాలు ప్రజాస్వామ్య ప్రక్రియలను మరింత బలహీనపరిచాయి. ఎన్జీఓ ఫండింగ్ అదనపు సంక్లిష్టతలను ప్రవేశపెట్టింది. కార్యకలాపాలు వాణిజ్యీకరణ చెంది, వృత్తిపరంగా మారాయి.
ముందుగా నిర్ణయించిన అజెండాలతో, నిస్వార్థ సేవ నుంచి మార్కెట్-ఆధారిత వ్యాపారంగా మారాయి. నిజమైన గ్రాస్రూట్స్ నిబద్ధత డోనర్-ఆధారిత(దాతల) ప్రాధాన్యతలకు లొంగిపోయింది.
పుస్తకం గ్రామీణ అవమానాల నుంచి దూరంగా వెళ్లే మార్గంగా పట్టణ వలసలను కూడా గమనిస్తుంది. ఇది వ్యక్తిగత సామాజిక చలనశీలతను అనుమతించినప్పటికీ, అన్వేషించని ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది.
దళితులు గ్రామాలను ఎదిరించకుండా నిష్క్రమిస్తే, వ్యవసాయ సంబంధాల రాడికల్ పునర్నిర్మాణం జరుగుతుందా? వలసలు కేవలం నిష్క్రమణను అందిస్తాయి కానీ వ్యవస్థాగత పరివర్తనను కాదు.
సమకాలీన ప్రాసంగికత..
శ్రీనివాసులు సంయమనంతో, అయినప్పటికీ ఆశావాదంగా ముగిస్తారు. నియోలిబరల్, గ్లోబలైజ్డ్ ప్రపంచంలో కొత్త రూపాలైన దోపిడీ, బహిష్కరణ అసమానతలను పునరుత్పత్తి చేస్తూనే ఉన్నాయి.
ఈ పరిస్థితులు కొనసాగినంత వరకు నిరోధం(ప్రతిఘటన) అనివార్యం. ఎందుకంటే మానవులు సృజనాత్మక ఏజెంట్లుగా గౌరవం, న్యాయం, విముక్తి కోసం పోరాడుతూనే ఉంటారు.
పుస్తకం బలాలు గణనీయమైనవి. ఇది ఆంధ్రప్రదేశ్ మార్గాన్ని సమగ్రమైన, ప్రాంతీయ-నిర్దిష్ట విశ్లేషణతో అందిస్తుంది.
అంతేగాక, మార్క్సిజం, సబాల్టర్న్ స్టడీస్‌తో సృజనాత్మక సైద్ధాంతిక పరిశీలనను అందజేస్తుంది. దాని డయలెక్టికల్ పద్ధతి—మెటీరియలిస్ట్‌గా ఉంటూనే రిడక్షనిజం లేకుండా ఏజెన్సీపై శ్రద్ధ పెడుతుంది, వాలంటరిజం లేకుండా కుల స్కాలర్షిప్లో రిఫ్రెషింగ్ అయిన మూడవ మార్గాన్ని అందిస్తుంది.
ముఖ్యంగా స్పష్టమైన, ఖచ్చితమైన గద్యం.. విద్యార్థులు, కార్యకర్తలు, పాలసీ నిర్ణేతలకు దీనిని విలువైన వనరుగా చేస్తుంది.
అయితే, కొన్ని పరిమితులు ఉన్నాయి. దట్టమైన సైద్ధాంతిక పరిచయం మేధోపరంగా సమృద్ధమైనప్పటికీ, స్పెషలిస్ట్‌లు కాని సాధారణ పాఠకులను ఇబ్బంది పెట్టవచ్చు.
స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదా గ్లాసరీ ఇచ్చుంటే విస్తృత ప్రాప్యతను పెంచేది. ఆంధ్రప్రదేశ్‌పై ఎంపిక చేసిన దృష్టి (తీరప్రాంత vs తెలంగాణ డైనమిక్స్, రెడ్డిలు, కమ్మలు, మాలలు, మాదిగలు) ఒక బలం అయినప్పటికీ, ఉపశీర్షికలో ఉన్న విస్తృత “దక్షిణ భారతదేశ” వాదనలకు ఇది పరిమితంగానే ఉంటుంది.
తమిళనాడు ద్రవిడ రాజకీయాలు, కర్ణాటక లింగాయత్-వొక్కలిగ డైనమిక్స్, కేరళ ఇంటర్సెక్షన్స్ గురించి తులనాత్మక అంతర్దృష్టులు ఉంటే సాధారణీకరణ మరింత మెరుగుపడేది.
ముందుకు మార్గం..
శ్రీనివాసులు దళిత ఉద్యమం సాధనాలను స్పృహను లేవనెత్తడంలో, రాజకీయాలను ప్రజాస్వామ్యీకరించడంలో ఎలా ఉపయోగపడ్డాయో ఒప్పించేవిధంగా చూపిస్తారు.
అయితే దాని భవిష్యత్ ప్రాసంగికత మాత్రం.. స్వచ్ఛమైన కుల-ఆధారిత అణచివేతలను అధిగమించి విస్తృత ఫ్రేమ్‌వర్క్‌ల వైపు—ఉదా. ఫ్రాన్సిస్ ఫుకుయామా చెప్పిన “క్రీడల్ నేషనల్ ఐడెంటిటీస్” (Francis Fukuyama’s “Creedal national identities”) వంటివి, సంయుక్త రాజ్యాంగ సూత్రాలు (న్యాయ వ్యవస్థ, సమానత, వ్యక్తిగత హక్కులు)పై ఆధారపడిన వాటివైపు మళ్లాల్సి ఉంటుంది.
కుల వాస్తవాలను విస్మరించకుండానే ఈ సూత్రాలపై ఆధారపడవచ్చు. అలాంటి మార్పు నియోలిబరల్ డిపాలిటిసైజేషన్, పోటీతత్వ గుర్తింపు రాజకీయాల విభజనా ప్రభావాలను ఎదుర్కోగలదు.
మొత్తంమీద, “Caste, Dominance and Resistance” దళిత అధ్యయనాలతోపాటు దక్షిణ భారత రాజకీయ సామాజిక శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిపక్వమైన, మేధోపరంగా నిజాయితీగల సహకారం.
ఇది దళిత రాజకీయాల స్థితిస్థాపకతను గౌరవిస్తూనే- దాని పరిమితులకు, ప్రస్తుతం ఉన్న సైద్ధాంతిక సాధనాల అపర్యాప్తతలకు విమర్శనాత్మక అద్దాన్ని పడుతుంది.
దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు మిలిటెంట్ స్థాయికి చేరిన ఉద్యమం.. లేవనెత్తిన స్పృహను శాశ్వత నిర్మాణాత్మక మార్పుగా మార్చడంలో ఎందుకు కష్టపడింది అన్న విషయాన్ని—కొనసాగుతున్న కుల అత్యాచారాలు, ఎన్నికల అంకగణితం, నిరంతర సోపానాల మధ్య—అర్థం చేసుకోవాలనుకునే ఎవరికైనా ఈ పుస్తకం అత్యావశ్యక పఠనం.
సమీక్షకులు డా అందేమ్ మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వర్ధన్నపేట, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ జిల్లా.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
