ఈ సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నట్టే, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరాన్ని కూడా జరుపుకున్నట్టు ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకటించింది.
భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో శ్రామిక మహిళల పాత్రను గుర్తించడానికి ఇది ఒక అవకాశం. అధికారిక గణాంకాలు మహిళల భాగస్వామ్యం, పని రకం, ఆర్థిక సహకారం గురించి పూర్తి చిత్రాన్ని ఇవ్వనందున, క్షేత్రస్థాయి డేటాను మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది.
పంట, పశువుల ఉత్పత్తికి మహిళల శ్రమ కేంద్రంగా ఉన్నప్పటికీ- మహిళా కార్మికులకు వేతనం చాలా తక్కువగా, స్తబ్దుగా ఉందని అర్థమవుతున్నది.
మహిళా కార్మికులను ఎలా లెక్కిస్తున్నారు?
వ్యవసాయం, పశువుల పెంపకం, మత్స్య సంపద, ఇతర అనుబంధ కార్యకలాపాలలో ఎంత మంది మహిళలు వాస్తవానికి పనిచేస్తున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు.
పెద్ద ఎత్తున జరిగే శ్రామిక శక్తి సర్వేలు(పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలు వంటివి) మహిళా కార్మికులను కచ్చితంగా లెక్కించలేకపోతున్నాయి.
ఎందుకంటే ఎక్కువగా అనధికారిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో, మహిళల పని తరచుగా ఇంటి లేదా వ్యవసాయ ఆధారితంగా, జీతం లేనిదిగా, సీజన్ల వారీగా, అడపాదడపా, ఒకే రోజులో కూడా సంరక్షణ పనితో కలిసి ఉంటుంది.
ఉదాహరణకు, ఒక మహిళ తన రోజులో జంతువుల పెంపకంతో పాటు పిల్లల సంరక్షణ వంటి బహుళ పనులు ఉంటే తనను తాను “కార్మికురాలిగా” పరిగణించుకోకపోవచ్చు.
గ్రామీణ మహిళల పని భాగస్వామ్యం-పెరుగుదల
మహిళా కార్మికుల గురించి చేసిన సర్వేలు అధిక శాతం మనకు చెబుతున్నది ఏమిటంటే, గ్రామీణ భారతదేశంలో మహిళల పని భాగస్వామ్యం ఇటీవలి సంవత్సరాలలో బాగా పెరిగింది.
15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న గ్రామీణ బాలికలు, మహిళల్లో- 2011-12లో 35%తో పోలిస్తే 2023-24లో 46.5% మంది శ్రామిక శక్తిలో ఉన్నారు.
ఇది ఇప్పటికీ ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే తక్కువగా ఉంది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) లెక్కల ప్రకారం, మెజారిటీ దేశాలలో మహిళల పని భాగస్వామ్యం 57%-63% పరిధిలో ఉంది.
స్వయం ఉపాధి వర్సెస్ వేతన ఉపాధి అవకాశాలు
గ్రామీణ మహిళా కార్మికుల పెరుగుదలను చూపించే ఈ గణాంకాల వెనుక దాగి ఉన్న వాస్తవం ఏమిటంటే, ఈ పెరుగుదల ఎక్కువగా ‘స్వయం ఉపాధి’ మహిళల సంఖ్యలో ఉంది. ఇది వేతన ఉపాధి అవకాశాల కొరతను ప్రతిబింబిస్తుంది.
2011-12లో గ్రామీణ మహిళా కార్మికులలో 60% మంది స్వయం ఉపాధి పొందుతున్నవారుగా వర్గీకరించబడ్డారు. 2023-24లో ఈ నిష్పత్తి 73 శాతానికి పెరిగింది.
అదే కాలంలో రెగ్యులర్, క్యాజువల్(రోజువారీ) వేతన కార్మికులుగా పనిచేసే మహిళల వాటా తగ్గింది. వ్యవసాయ రంగంలో పనిచేసే స్వయం ఉపాధి పొందుతున్న మహిళల వాటా 48% నుంచి 62%కి పెరిగింది.
వ్యవసాయంలో స్వయం ఉపాధి పొందుతున్న మొత్తం కార్మికుల సంఖ్యలో, మహిళలు దాదాపు సగం మంది ఉన్నారు(2023-24లో 47.2%).
2023-24 సంవత్సరంలో, వ్యవసాయంలో కనీసం 117.6 మిలియన్ల మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరిలో 21.7 మిలియన్లు మాత్రమే కార్మికులు.
95.1 మిలియన్లు స్వయం ఉపాధి పొందేవారు. 0.8 మిలియన్లు సాధారణ కార్మికులు.
క్షేత్రస్థాయి అధ్యయనాలు: కుటుంబ శ్రమలో మహిళల వాటా
కుటుంబ శ్రమపై లింగ-విభజిత డేటాగా పంట సాగులో నియమించబడిన మొత్తం శ్రమలో మహిళా కార్మికుల గురించి అంచనా వేసినా పురుష శ్రామిక శక్తి వాటాను సేకరించలేదు.
వ్యవసాయ అధ్యయనాల కోసం ఫౌండేషన్, PARI ప్రాజెక్ట్ నిర్వహించిన గ్రామ-స్థాయి సర్వేల నుంచి వచ్చిన డేటాతో మిగతా సమాచారం అందిస్తున్నాము.
27 గ్రామాల ఈ ప్రత్యేకమైన డేటాబేస్ నుంచి, మేము తమిళనాడులోని నాగపట్నం జిల్లా(2019లో అధ్యయనం చేయబడింది) నుంచి పాలకురిచి, వెన్మణి అనే రెండు గ్రామాలను, పశ్చిమ- తూర్పు ఉత్తరప్రదేశ్(2023లో అధ్యయనం చేయబడింది) నుంచి హార్వేలి, మహత్వార్ అనే రెండు గ్రామాలను తీసుకోవడం జరిగింది.
ఈ గ్రామాలలో గృహాల సామాజిక-ఆర్థిక వర్గీకరణ అందుబాటులో ఉన్నందున: మేము రైతు, శారీరక శ్రమ కుటుంబాలపై దృష్టి పెట్టడం జరిగింది. వీరు మెజారిటీగా ఉన్నారు.
భూస్వామి లేదా పెట్టుబడిదారీ రైతు కుటుంబాలను, వ్యాపారం లేదా జీతాల ఉపాధిలో నిమగ్నమైన వారిని మినహాయించడం జరిగింది.
ఎంపిక చేయబడిన నాలుగు గ్రామాలలో, కుటుంబ శ్రమలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలు ఉన్నారు(పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గ్రామం తప్ప, ఇక్కడ అది తక్కువగా ఉంది).
కుటుంబం, కూలీ కార్మికులను కలిపితే- తమిళనాడులోని పాలకురిచి(61%), వెన్మణి(57%)లలో మహిళలు ప్రధాన వాటాను కలిగి ఉన్నారు.
తూర్పు ఉత్తరప్రదేశ్లోని మహత్వర్ గ్రామంలో దాదాపు 41% మంది ఉన్నారు. పంట ఎంపిక, వ్యవసాయ వ్యవస్థలు, గృహాల సామాజిక-ఆర్థిక కూర్పుతో సహా అనేక అంశాల కారణంగా ఈ తేడాలు తలెత్తాయి.
అయినప్పటికీ ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే, పంట సాగు మహిళల శ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
పాడి పరిశ్రమ, పశువుల పెంపకంలో మహిళల పాత్ర
రెండవ రంగం పశువుల పెంపకం. ఇది వ్యవసాయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. ఇక్కడ మహిళలు ప్రాథమిక శ్రామిక శక్తిగా ఉన్నారు.
పరి గ్రామ అధ్యయనాలు కుటుంబ ఆధారిత పశువుల పెంపకంలో(ముఖ్యంగా పాడి పశువులు, కోళ్ల పెంపకం), చాలా పనులు మహిళలే నిర్వహిస్తారని చూపిస్తున్నాయి.
ఒక ఇంటి వద్ద పశువులు ఉంటే, తప్పనిసరిగా ఒక మహిళ పశువుల శ్రమలో కూడా పాల్గొంటుంది. పెంచుతున్న ప్రతి జంతువుకు దాదాపు 2 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
చివరి లెక్క ప్రకారం, 40 మిలియన్ల గ్రామీణ కుటుంబాలు పాడి జంతువులను కలిగి ఉన్నాయి(ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, 2018-19). ఇది దాదాపు 40 మిలియన్ల మహిళలు జంతువుల పెంపకంలో నిమగ్నమై ఉన్నారని సూచిస్తుంది.
వ్యవసాయ రంగంలో కూలీ కార్మికులు
యాంత్రీకరణ పురోగమిస్తున్న కొద్దీ, వ్యవసాయంలో శ్రమకు మొత్తం డిమాండ్ తగ్గుతున్న కొద్దీ, మహిళా కార్మికులకు డిమాండ్ కూడా తగ్గింది.
పంట ఉత్పత్తిలో మొత్తం సాధారణ కార్మిక ఉపాధిలో మహిళా కార్మికుల వాటా నాలుగు గ్రామాలలో 16% నుంచి 71% వరకు ఉంది. కానీ పశ్చిమ యూపీ గ్రామం తప్ప మిగతా వాటిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ(చెరకు సాగు స్థాయిని బట్టి కార్మికుల నియామకం మరింత క్లిష్టంగా ఉంటుంది).
ఈ మహిళా కార్మికులు వ్యవసాయ కార్మిక కుటుంబాలకు మాత్రమే కాకుండా, రైతుల దిగువ వర్గాలకు కూడా చెందినవారు.
మహిళా కార్మికుల వేతనాలు-ఆదాయ స్థాయిలు
నేడు వ్యవసాయంలో మహిళా కార్మికురాలు పొందే స్పష్టమైన సంపాదన స్థాయి ఏంటి? వేతన కార్మికులకు, ప్రస్తుతం ఉన్న వేతన రేటు.
నేటి ధరల ప్రకారం, వ్యవసాయంలో పనిచేసే మహిళా కార్మికులు నాలుగు గ్రామాలలోనూ రోజుకు రూ 300 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. మొత్తం మీద వేతన స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వేతనాలలో లింగ వివక్ష ఎక్కువగా ఉంది.
తమిళనాడులోని రెండు గ్రామాల్లో పురుషుల వేతనాలలో మహిళల వేతనాలు(రూ 290) 50% కంటే తక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని రెండు గ్రామాల్లో, మహిళల వేతనాలు తక్కువగా ఉన్నాయి(రూ242 – 276). పురుషుల వేతనాలు కూడా అలాగే తక్కువగా ఉన్నాయి.
లింగ వివక్ష కూడా తక్కువగా ఉంది. అధికారిక గణాంకాలు కూడా ఇలాంటి వివరాలనే వెల్లడిస్తున్నాయి.
2025 నవంబరులో లేబర్ బ్యూరో ప్రకారం, వ్యవసాయ పనులకు(విత్తనాలు/మార్పిడి/కలుపు తీయడం) ఒక మహిళకు సగటు అఖిల భారత దినసరి వేతనం 384 రూపాయలు.
వాస్తవానికి, రాష్ట్రాలలో వైవిధ్యాలు ఉన్నాయి, కేరళలోని మహిళా కార్మికులు అత్యధిక దినసరి వేతనం(రూ 2646) పొందుతున్నారు.
గత దశాబ్దంలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు కొద్దిగా పెరిగాయని డేటా చూపిస్తుంది. పశువుల పెంపకంలో మహిళల సంపాదనపై అధికారిక డేటా లేదు.
సంవత్సరంలో జంతువుల నుంచి వచ్చే ఆదాయం(పాలు, పేడ ఉత్పత్తి ఆధారంగా) మొత్తం పని గంటల ఆధారంగా అంతర్లీన రోజువారీ సంపాదనను అంచనా వేయడం జరిగింది.
పాలిచ్చే జంతువులు విస్తృతంగా ఉన్న రెండు యూపీ గ్రామాలలో, అంతర్లీన రోజువారీ సంపాదన దాదాపు రూ 100. సంక్షిప్తంగా, పశువుల పెంపకంలో మహిళలు తమ శ్రమకు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ వేతన రేటులో ఐదింట రెండు వంతులు మాత్రమే సంపాదించారు.
పంట ఉత్పత్తి విషయానికి వస్తే, ఒక కార్మికుడి ఆదాయాన్ని అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఒక కుటుంబంలోని చాలా మంది సభ్యులు ఉత్పత్తికి దోహదపడవచ్చు.
నాలుగు అధ్యయన గ్రామాలలోనూ, పంట ఉత్పత్తి నుంచి వచ్చే రాబడి తక్కువగా ఉందని, తూర్పు యూపీ గ్రామంలో సగటున సంవత్సరానికి రూ 16,000 కంటే తక్కువగా ఉంది.
తమిళనాడు గ్రామమైన పాలకురిచిలో రూ 24,000 కంటే తక్కువ అని తెలుస్తోంది. సగం ఆదాయం మహిళలకు పంచినప్పటికీ, వారి ఆదాయాలు ఎక్కువగా ఉండవు.
వాస్తవాలు – వివక్ష
భారతదేశంలో వ్యవసాయ శ్రామిక శక్తిలో ఇప్పుడు మహిళలు సగం మంది ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది(పైన పేర్కొన్న కారణాల వల్ల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది).
గ్రామీణ మహిళల్లో ఎక్కువ మంది స్వయం ఉపాధి పొందేవారు. కానీ గ్రామీణ మహిళల్లో కేవలం 10% మంది మాత్రమే భూమిని కలిగి ఉన్నారు. ఇది సాగుదారునికి ప్రాథమిక ఆస్తి.
వ్యవసాయ కార్మికుల వైపు తిరిగితే, ఇప్పుడు మహిళా కార్మికులు 21.7 మిలియన్లు. అంటే పురుష కార్మికుల సంఖ్యను (19.7 మిలియన్లు) మించిపోయారు, ఇది స్వాతంత్య్రానంతర భారతదేశంలో మొదటిసారి. కానీ మహిళలకు వేతన రేట్లు (అక్కడక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి) చాలా తక్కువగా ఉన్నాయి. ఇది లింగ వివక్ష తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
గ్రామీణ భారతదేశంలో మహిళా కార్మికులు మొత్తం కార్మికులలో సగం పైనే ఉన్నారు. భారత ప్రభుత్వం మహిళల శ్రమను గుర్తించడంలో, లెక్కించడంలో విఫలమైంది.
స్వేచ్ఛానువాదం: ఆర్ లక్ష్మయ్య
ఈ వ్యాసాన్ని ది హిందూ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
