వేతనాలు చెల్లించకపోవడం, భద్రతా పరికరాల నిరాకరణతోపాటు కులాధారిత వివక్షతకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన 130 ఫిర్యాదులతో సహా, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 842 ఫిర్యాదులు అందినట్టు డేటా తెలియజేస్తోంది.
న్యూఢిల్లీ: పారిశుధ్యం అనేది కులాధారితమైనది కాదని, అది “వృత్తి ఆధారిత” కార్యకలాపమని స్పష్టం చేస్తూ- 2017 నుంచి దేశవ్యాప్తంగా ప్రమాదకరమైన మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరుస్తూ 622 మంది పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌధరి అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావలే మార్చి 17న లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, రాష్ట్రాల వారీగా డేటాను లోక్‌సభకు సమర్పించారు.
ఈ డేటా ప్రకారం 539 బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం చెల్లించబడగా, 25 కుటుంబాలు మాత్రం కొంతమేర నష్టపరిహారం పొందాయని ఆయన చెప్పారు.
కానీ 52 బాధిత కుటుంబాలు అసలు ఎలాంటి నష్టపరిహారం అందుకోలేదని డేటా వెల్లడిస్తోంది. అలాగే ఎలాంటి పరిష్కారం లేకుండానే ఆరు కేసులను మూసివేశారు.
ఇందులో, ఉత్తరప్రదేశ్‌లో 13 కుటుంబాలు ఎలాంటి నష్టపరిహారం స్వీకరించకపోగా, మూడు కేసులను మూసివేసినట్టు డేటా పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 86 మరణాలు నమోదు కాగా- ఆ తర్వాత మహారాష్ట్రలో 82, తమిళనాడు 77, హర్యానా 76, గుజరాత్ 73, ఢిల్లీలో 62 మరణాలు నమోదయ్యాయి.
ఒక్కో కుటుంబం ఎంత నష్టపరిహారం అందుకుందన్న దానిపై తదుపరి సమాచారం లేదు.
దళిత్ ఆదివాసీ శక్తి అధికార్ మంచ్ ప్రకటన- డిమాండ్..
‘మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం, వారి పునరావాస చట్టం-2013’ కింద నిర్వహించిన “తాజా సర్వే” ప్రకారం, దేశవ్యాప్తంగా ఏ జిల్లాలోనూ “మాన్యువల్ స్కావెంజర్లు”లేనట్టు తేలిందని మంత్రి అథావలే చెప్పారు.
అయితే 2013, 2018లలో నిర్వహించిన రెండు సర్వేల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో 32,473 మందితో సహా దేశవ్యాప్తంగా 58,098 మంది మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించినట్టు మంత్రి తెలిపారు.
దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ సంబంధిత మరణాలపై వెంటనే ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని ‘దళిత్ ఆదివాసీ శక్తి అధికార్ మంచ్’ 2025లో ఒక ప్రకటన విడుదల చేస్తూ డిమాండ్ చేసింది.
ఈ వృత్తిలో ఉన్న 116 మంది కార్మికులు 2024లో చనిపోగా, 2025లో 158 మంది చనిపోయినట్లు ఆ సంస్థ వివరించింది.
సుప్రీంకోర్టు మండిపాటు- ఉత్తర్వులు..
మాన్యువల్ స్కావెంజింగ్ను నిర్మూలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఉన్న సందిగ్ధతపై తీవ్ర స్థాయిలో మండిపడిన సుప్రీంకోర్టు, ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ వృత్తిని నిషేధిస్తూ గత ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
పారిశుధ్యం అనేది “కుల ఆధారిత కాదని, అది వృత్తి ఆధారిత పని” అని మంత్రి పేర్కొంటూ, “కార్మికుల భద్రతను పెంచడానికి; పారిశుధ్య కార్మికులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు” చెప్పారు.
అయితే కుల ఆధారిత వివక్షత, వేతనాలు చెల్లించకపోవడం, భద్రతా పరికరాల నిరాకరణకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 130 ఫిర్యాదులతో సహా మొత్తం 842 ఫిర్యాదులు అందినట్లు డేటా చూపిస్తోంది.
భద్రతా చర్యల గురించి నివేదిక..
పారిశుధ్య, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల గౌరవం, భద్రతే ప్రధాన ఉద్దేశంగా తీసుకువచ్చిన నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్(నమస్తే- ఎన్ఏఎంఏఎస్టీఈ) పథకం కింద, పారిశుధ్య కార్మికుల పునరావాసానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యల జాబితాను ప్రభుత్వం అందజేసింది.
మార్చి 12 నాటికి, ‘నమస్తే’ పథకం కింద దేశవ్యాప్తంగా 89,248 మంది మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులను, 2,34,425 మంది వ్యర్థాలను ఏరుకునే కార్మికులను నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.
ఇందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12,424 మంది ఎస్‌ఎస్‌డబ్ల్యూలు, 35,641 మంది వ్యర్థాలను ఏరుకునే వారు ఉన్నారు.
గతంలో మాన్యువల్ స్కావెంజర్ల కోసం ఉన్న పునరావాస పథకాన్ని ఇప్పుడు నమస్తే పథకంలో విలీనం చేసినట్టు మంత్రి తెలియజేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
