గత కొంత కాలంగా టీడీపీ– జనసేన సంబంధాల్లో చిన్నచిన్న ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల పంపిణీ దామాషా ప్రకారం జరగటం లేదని మొదట జనసేన కార్యకర్తలు ఆరోపించినప్పుడు, పొత్తులో అలాంటివి సహజమేనని కొట్టిపారేయటం జరిగింది. కానీ, ఇటీవల అసెంబ్లీలో జనసేనకు సంబంధించిన మంత్రుల మీద కొందరు టీడీపీ శాసన సభ్యులు చేసిన ప్రత్యక్ష విమర్శలు, సమస్య చిన్నది కాదేమోననే అనుమానానికి తావిచ్చాయి.
తాజాగా మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కేంద్రంగా అసెంబ్లీలో జరిగిన వివాదాస్పద చర్చలతో ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్నట్టుగా ప్రజలు చర్చికుంటున్నారు. దీన్ని జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ మొదటి ట్రయల్ రన్‌గా కొందరు భావిస్తున్నారు. కూటమి మద్దతుదారులకు ఇది కొంత ఇబ్బందికరంగా మారింది.
అయితే కూటమిలోని వారే కొందరు అధికారపక్షంగానూ, మరికొందరు ప్రతిపక్షంగానూ ద్విపాత్రాభినయం చెయ్యటం సంకీర్ణ రాజకీయాల్లో కొత్తకాదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంచలనంగా మారిన ఈ పరిస్థితిని అర్ధం చేసుకోవటానికి ఒక దృక్పథం కావాలి.
చిన్న విషయాలే పొత్తులను దెబ్బతీస్తాయి..
దేశంలో ఏక పార్టీ ఆధిపత్యం కొనసాగినంత కాలం పొత్తుల అవసరం ఏర్పడలేదు. కాలక్రమంలో ఏక పార్టీ ఆధిపత్యం పతనమై ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ స్థాపనకు సరిపోయే మెజారిటీ రానందు వల్ల సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ కొత్త పద్ధతి చిన్న పార్టీల ప్రాధాన్యతని పెంచి, వాటికి కూడా ప్రభుత్వ భాగస్వామ్యంలో అవకాశాన్ని కల్పించింది. ఇది ప్రజాస్వామ్య పరిధిని విస్తరింపజేసిందనటంలో సందేహం లేదు.
ఇది అంతే స్థాయిలో భాగస్వామ్య పక్షాల్లో ఒకరిపట్ల ఒకరికి అనుమానాలు, అసమ్మతులు, అస్థిరతలు కూడా పెంచిందని చెప్పవచ్చు.
సంకీర్ణ రాజకీయాల తొలి దశలో బాగస్వాముల మధ్య చిన్నచిన్న సమస్యలు కూడా ఒక్కోసారి పొత్తుల్ని భగ్నం చేసేవి. జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోవటం ఇందులో భాగంగానే చూడాలి.
అయితే కాలక్రమంలో సంకీర్ణ రాజకీయాలు పరిణతి చెందాయి. పొత్తు అవసరం లేకుండా సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి వున్న పార్టీలు కూడా ఇతర పార్టీలని కలుపుకునిపోయే పద్ధతి మొదలైంది. ఆ విధంగా గెలుపు, ఓటములకు అతీతంగా దేశంలో రాజకీయ పార్టీలు రెండు కూటములుగా విడిపోవటం మొదలైంది. ఒకే కూటమిలోని పార్టీలు అన్నీ సాధారణంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేసే వాతావరణం ఏర్పడింది.
ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచినా పార్టీ ఆధిపత్యం ప్రత్యక్షంగా కొనసాగుతూనే ఉంది. ఇందువల్ల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మధ్య స్థాయి, చిన్న పార్టీలు కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఒకసారి పునరావలోకనం చేసుకుంటే అధికారంలోకి వచ్చాక కూటముల్లోని పెద్ద పార్టీల పెత్తనం, ఒంటెత్తు పోకడులు పెరిగిపోతున్నాయి.
సంకీర్ణ ప్రభుత్వాల మూలసూత్రాలు విస్మరణకు గురవుతున్నాయి. పొత్తుల వల్ల రాజకీయ సంబంధాల్లో అనేక మార్పులు వస్తాయి. అప్పటి వరకు కత్తులు దూసుకున్న ప్రత్యర్ధి పార్టీలు ఒకరినొకరు సమర్ధించుకుంటూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కారణం వల్లే రాజకీయాల్లో శాశ్వత ప్రయోజనాలు తప్ప శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి వచ్చింది.
ప్రధాన పార్టీలు ఎలాగూ కలిసే అవకాశం ఉండదు. అవి నిరంతరం కత్తులు దూసుకుంటూ ఒకరిపైఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. మధ్యస్థాయి పార్టీలు మాత్రం ఏ పార్టీతోను తెగేవరకు లాగకుండా పరిస్థితుల్ని బట్టి సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటాయి. బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థలలో మధ్యస్థాయి పార్టీలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ వస్తుంది. అందుకే ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు ఆ పార్టీలతో పొత్తు వ్యూహాలు పన్నుతూ ఉంటాయి.
ప్రత్యర్ధిని అధికారంలోకి రాకుండా చెయ్యటానికి పెద్ద పార్టీలు కొన్నిసార్లు మధ్యస్థాయి పార్టీల నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది కూడా. ఆ పార్టీల నాయకులకు ప్రధాని, ముఖ్యమంత్రి పదవులిచ్చి పక్కన కూర్చున్న సందర్భాలు దేశంలో అనేకం ఉన్నాయి.
ఆ విధంగా ఇచ్చిపుచ్చుకోవటం, సర్దుకుపోవటం, పరస్పర సహకారం, చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవటం, దిద్దుబాట్లు చేసుకోవటం. అవసరమైతే మధ్య స్థాయి పార్టీలకి అధికారంలో ఎక్కువ షేర్ ఇవ్వటం పొత్తు రాజకీయాల్లో బేసిక్ గ్రామర్‌గా మారిపోయింది.
ఈ సర్దుబాట్లు సాధారణంగా పెద్ద భాగాస్వాములకు ఇష్టం వుండదు. అయినా ఎన్నికల్లో వారి సపోర్ట్ కోసం సర్దుకు పోతారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలని పరిశీలిస్తే అనేక సార్లు రాష్ట్రాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు పాలించాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయడు సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. అయితే, అవి చాలా సింపుల్ సంకీర్ణాలు. ప్రస్తుతం కూడా టీడీపీ- జనసేన- బీజేపీ మధ్య పొత్తుతో ఎన్డీఏ పొత్తు ప్రభుత్వమే నడుస్తుంది. రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పాలించటం ఇది రెండోసారి. ఈ రెండు సార్లు జనసేన పొత్తు ఆ కూటమి విజయంలో కీలక పాత్ర వహించింది. ఈ సారి గత పొత్తుల్లాగా కాకుండా జనసేన పొత్తు కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషించింది.
అయితే ముఖ్యంగా టీడీపీ- జనసేన రెండు పార్టీలు ఒకరికొకరు పూరకమనేది గుర్తించాలి. ఈ ఇద్దరు కలవకపొతే ఇద్దరూ ఓడిపోయేవారని జాతీయ మీడియాలో కూడా చర్చలు జరిగాయి. 2014 పొత్తులో ఉన్నప్పటికీ జనసేన అధికారంలో భాగం తీసుకోలేదు. కానీ 2024లో అధికారంలో భాగస్వామి అయ్యింది.
అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య చిన్నాచితక ఒడిదుడుకులు వస్తూపోతూ ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటంలేదని కొందరు జనసేన నాయకులూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
అందులో కొంత నిజం లేక పోలేదు. రేషన్ షాపులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సహకార సంఘాల చైర్మన్లు, యానిమేటర్లు, ఇరిగేషన్లో లష్కర్ ఇతర పదవుల నియామకాల్లో దామాషాలో వారికి ప్రాధాన్యత దక్కటంలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
పదవుల్లో ఎంతోకొంత షేర్ వస్తున్నప్పటికీ, రావల్సినంత రావటల్లేదని ప్రధాన ఆరోపణ. అదేవిధంగా అసెంబ్లీలో టీడీపీ శాసన సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పర్యావరణ మంత్రిత్వ శాఖపై చేసిన వ్యాఖ్యలు కూటమిలో కొంత గందరగోళాన్ని సృష్టించాయి. తరువాత పౌర సరఫరాశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ మీద శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపణలు ఆ కన్ఫ్యూజన్ని మరింత పెంచాయి. దీంతో కూటమిలో రెండు పార్టీల మధ్య ఎదో జరుగుతుందనే వాతావరణం రాష్ట్రంలో పెరిగిపోయింది.
అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవలిసిన సమస్యలు అసెంబ్లీ దాక రావటం పరిశీలకుల్ని ఆశ్చర్య పరిచింది. ఇది యాదృశ్చికంగా జరిగినట్టు ఎవరు భావించటం లేదు. టీడీపీ పెద్దల అనుమతితోనే జరిగి ఉంటుందని సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వడ్డించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అనుమతిలేకుండా టీడీపీ శాసనసభ్యులు అంత ధైర్యం చెయ్యరని చర్చోపచర్చలు జరిగాయి.
కారణం ఏదైనా కూటమిని సమర్ధించే వారికి షాక్‌కు గురిచేసింది. అదేవిధంగా అసెంబ్లీలో మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఉద్దేశించి శాసన సభ్యుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. ప్రశాంతంగా నడుస్తున్న కూటమి ప్రయాణాన్ని ఆ వ్యాఖ్యలు ఒక్క కుదుపుకుదిపాయి. చిరంజీవి లేఖ రాయవలిసిన అనివార్య పరిస్థితులని కల్పించాయి. ఆ వ్యాఖ్యలతో కూటమిలో ఏదో కుంపటి రగులుతుందని ప్రజలు భావించారు.
నిజానికి బాలకృష్ణ వ్యాఖ్యలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమోదించలేదు. చిరంజీవి సోదరులు ఈ విషయంలో సంయనం పాటించినట్టు అర్ధమవుతుంది. ఒక పెద్ద మేలు కోసం కొన్ని చిన్నచిన్న ఇబ్బందులను చూసీచూడనట్టు వదిలెయ్యటం పొత్తు రాజకీయాల్లో సహజమే, తప్పదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు సంయమనం పాటించటం భవిష్యత్తులో కూటమికి ఒక ప్రమాదాన్ని నిలవరించిందని చెప్పవచ్చు. వారి మౌనం జనసైనికుల నోళ్ళను కట్టేసింది.
ఈ వేడి వాతావరణంలోనే పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి కలవటం కూటమికి కొంత సాంత్వనను చేకూర్చింది. అయన పవన్ కళ్యాణ్‌ని కలిసింది బాలకృష్ణ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పటానికే అని సోషల్ మీడియా వ్యాఖ్యానించింది.
కారణం ఏదైనా అది ఒక మంచి పరిణామమే. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మౌనం– చంద్రబాబు చొరవ కూటమికి కొంత రిలీఫ్ ఇచ్చింది. తాజాగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో బొండా ఉమా ‘పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి’అని నినాదాలు ఇవ్వటం కొంత ఉపశమనం కలిగించినా సమస్య తీవ్రతని ఎత్తి చూపింది. పవన్ కళ్యాణ్ పదేపదే కూటమి పదిహేనేళ్ళు వుండాలని ఆశించటం, భాగస్వామిని పొత్తు మర్యాద పాటించమని గుర్తు చేయ్యటమేనని కొందరు అనువదిస్తున్నారు.
సంకీర్ణ రాజకీయాల్లో సాధారణంగా చిన్న భాగాస్వాములకు ఒక సున్నితత్వం, మొహమాటం ఉంటాయి. వాళ్ళు అన్ని అంశాల్ని డిమాండ్ చేసి అడగలేరు. తాము చిన్న భాగాస్వాములమనే అవగాహన వాళ్ళని వెంటాడుతూ, వేధిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి తమ చట్టబద్ద హక్కులని కూడా అడగలేక నలిగిపోతూ ఉంటారు. మరోవైపు పెద్ద భాగస్వాములు అధికారంలో మునిగితేలుతూ సమాజమంతా సుఖంగానే వున్నట్టు భ్రమిస్తారు. అధికారమత్తులో మిత్ర పక్షాలు వున్న సంగతి కూడా మరిచిపోతారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సంబంధాలు జఠిలమవుతాయి.
నేటి సంకీర్ణ రాజకియాల్లో ఇంటి మీద పెత్తనం పెద్ద భాగాస్వామిదే అయినప్పటికీ, దాని తాళం(కీ) మాత్రం దాదాపు మిత్రపక్షాల దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఇల్లు, తాళం ఇద్దరికీ ఉమ్మడిగా చెందుతుందని ఇద్దరూ గుర్తించాలి. ఇదే సంకీర్ణ రాజకీయాల్లో వుండే అందం. చిన్న పార్టీలని కలుపుకు వెళ్ళవలిసిన బాధ్యత పెద్ద భాగస్వాముల మీద వుంటుంది. అలా జరగనప్పుడు చిన్న పార్టీలు క్రీడ ప్రారంభిస్తే రాజకీయాలు ఎంత అతలాకుతలమవువుతాయో ఉత్తరప్రదేశ్‌ని చూసి అర్ధం చేసుకోవచ్చు.
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కూడా అటువంటిదేనని గుర్తించాలి. ఆ రాష్ట్ర ఎన్నికల్లో జనసేన ఒక ‘కీ’ స్థానానికి ఎదిగిందని అందరికి తెలుసు.
గుంభనంగా తాజా పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అసెంబ్లీలో అంతంత మాత్రమే అయినా క్షేత్రస్థాయిలో నలభై శాతం బలం కలిగి ఉంది. 2014, 2019 ఎన్నికల్లో జనసేన పొత్తువల్ల దానికి తీవ్రమైన దెబ్బ తగిలినట్టు అది గుర్తించింది. ఈ పొత్తు ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రతిపక్షానికి అధికారం దక్కటం దాదాపు కష్టమే. కాబట్టి పొత్తును భగ్నం కావాలని అది కోరుకుంటుంది. ఆ దిశలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందిన ప్రతి అవకాశాన్ని వాడుకొంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పొత్తుకు ఇచ్చే ప్రాధాన్యత వల్ల ప్రతిపక్షం ఆశలు తీరటంలేదు.
జనసేన నాయకులు టీడీపీ వారిని ప్రతి విమర్శ చెయ్యటం లేదు. అందువల్ల పరిస్థితి కొంత గుంభనంగా ఉంది. కానీ తెలుగుదేశం వారు అసెంబ్లీలో చేసిన విమర్శలు మరోసారి పునరావృతమయితే మాత్రం ప్రతిపక్షం కోర్కె వారే తీర్చిన వారౌతారు. మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాల్ని ప్రతిపక్ష మీడియా, సోషల్ మీడియా ఏ స్థాయిలో వాడుకుందో గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. చిరంజీవి- బాలకృష్ణ ఎపిసోడ్‌ని మరీ విపరీతంగా ప్రచారం చేసింది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో జనసేన కార్యకర్తలకు గౌరవం దక్కటంలేదని లెక్కలు తీసి మరీ చూపిస్తుంది. ఇదంతా జనసేన మీద ప్రేమ వలన కాక పోవచ్చు. ఆ పార్టీ మద్దతుదారులని రెచ్చగొట్టె వ్యూహం కావొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణాలు ఇంకా తొలిదశలోనే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు టీడీపీ- జనసేన కలిసున్నప్పుడే ఓడించాలనే మొండి పట్టుదలతో క్షేత్రస్థాయి సత్యాన్ని విస్మరిస్తున్నారు. కూటమిని ఓడించి ఒక ప్రబలమైన శక్తిగా నిలబడాలనుకుంటున్నట్టు అర్ధమవుతుంది. కానీ రాష్ట్రంలో ఎవరూ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అది నిజం. అంటే సంకీర్ణం తప్పదు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ రాజకీయాలు ఇప్పుడే మొదలైనాయి. అవి పూర్తిస్తాయిలో ఆవిష్కృతం కావటానికి ఎక్కువ కాలం పట్టక పోవచ్చు. అవి పరిపక్వ దశకు చేరుకోవటం మాత్రం అనివార్యం. ఆ దశలో ముఖ్యమంత్రి పదవి సగంసగం అనే ప్రతిపాదన రావటం కూడా అనివార్యమే. పెద్దాచిన్నా తేడాల కంటే సగం కాలమైన కుర్చీ దక్కటం అవసరమనే అంశమప్పుడు ప్రాధాన్యతని సంతరించుకోవచ్చు.
మొండిగా ఎప్పుడూ కుర్చీకి దూరంగా వుండి బలహీనపడేకంటే సగం- సగం సూత్రం సేఫ్ కదా! ఈ సూత్రం మీదే యూపీలో చాలాకాలం ప్రభుత్వాలు నడిచిచాయి. ఈ ఏర్పాటు చిన్న పార్టీలకు అవకాశం కల్పించింది కూడా.
ఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ బలాబలాల దృష్ట్యా సగం- సగం సూత్రం భవిష్యత్తులో అమలుకాక తప్పదు. కనీసం ఇంకా రెండు సాధారణ ఎన్నికలు సంకీర్ణాలతోనే జరిగే అవకాసం ఉంది. ఇష్టమున్నా, లేకపోయినా జనసేన ఒక ప్రభావశీలమైన శక్తిగా ఎదగటం వల్ల రాష్ట్రంలో ఈ మార్పు వచ్చింది. కొందరు గుర్తించనంత మాత్రాన మార్పు మరణించదు. గుర్తించని వారే మరుగునపడిపోతారు.
“మార్పుల్ని స్వీకరింఛి, మారక పోవటమే ఈ కాలపు నిరక్షరాస్యత” అన్న ఆల్విన్ టాఫ్లర్ మాటలు ఈ సందర్భానికి కూడా వర్తిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ- జనసేన కూటమికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గీటురాయిగా మారవచ్చు. ఏకపక్ష ధోరణలు విడిచిపెట్టి భాగస్వాముల మధ్య ఒక ప్రజాస్వామిక పద్దతిలో సీట్లు పంపిణీ జరుగుతాయో, లేదోనని ప్రజలు చూస్తున్నారు. అలా జరగపోతే కూటమికి నష్టం జరిగే ప్రమాదం ఉంది.
గత కొంత కాలంగా ఎన్నికల ప్రక్రియ మీద అన్ని వర్గాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈవీఎంల మీద ఆధారపడి, నాయకులు ప్రజలని పట్టించుకోవటం లేదనే విమర్శలతో సమాజం నిండిపోయింది. అది నిజమో, అబద్దమో తెలియదు. కానీ రాష్ట్ర ప్రతిపక్షంతో ఢిల్లీ సంబంధాలు దాదాపు యధావిధిగానే కొనసాగుతున్నట్టు గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బహిర్గతమైంది.
పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలంటే పార్టీలు కేవలం ఒకే పద్ధతి మీదే ఆధారపడి ఉండకూడదు. నిరంతరం సొంత బలం పెంచుకోవటంతో పాటు నూతన ప్రత్యామ్నాయాలని సృష్టించుకుంటూ ముందుకెళ్లాలి. దేన్నీ తెగేవరకు లాక్కోకూడదు. అన్ని చోట్ల కొంత స్పేస్ ఉంచుకోవాలి. సంకీర్ణ రాజకీయాల్లో అన్నీ పార్టీలకి ఇది వర్తిస్తుంది.
ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వాన్ని నడపడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయమనం, సమన్వయము పాటిస్తున్నారు. చిన్నాచితక ఒడిదుడుకులు వచ్చినా ఇద్దరూ రంగంలోకి దిగి దిద్దుబాట్లు చేపడుతున్నారు. వారద్దరూ దీర్ఘకాలం కలిసి నడవటానికి ఒక దృఢనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది.
అసెంబ్లీలో శాసనసభ్యుల భాషణని టీడీపీ ట్రయల్ రన్ అనటం తొందరపాటు అంచనా కావచ్చు. ఈ దశలో వాటిని చర్చలుగానే చూడటం విజ్ఞతగా భావించాలి. వాదోపవాదాలు శాసన సభలో సాధారణమే. ప్రధాన నాయకులిరువురు కలిసి సమస్య మీద చర్చించుకుంటున్న పద్ధతిని గమనిస్తే, దూరం పెరుగుతున్నట్టు భావించాల్సిన అవసరం కనిపించటం లేదు. కానీ ప్రతిపక్షానికి మాత్రం ఇదొక అవకాశం ఇచ్చింది.
ఒక కుటుంబంలోనే వాగ్వాదాలు తప్పవు. అలాంటిది ఒక పెద్ద రాష్ట్రాన్ని నడిపే కూటమిలో చిన్న చిన్నఒడిదుడుకులు సహజంగానే వస్తూపోతూ ఉంటాయి. అయితే చిన్నస్థాయిలోని ఈ ఎపిసోడ్ భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాకుండా చూసుకునే విధంగా కూటమి భాగాస్వాములని సన్నద్దం చేసిందని చెప్పవచ్చు.
(వ్యాసరచయిత హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీలో ప్రొఫేసర్.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
