యంత్రాలు- ఆధునిక పరిశ్రమ..
సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి నుంచి సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి పరివర్తన కర్మాగారంలో సాధారణ సహకారంతో ప్రారంభమవుతుంది. తయారీ అభివృద్ధితో పాటు వచ్చిన విస్తృతమూ, తీవ్రమైన శ్రమ విభజనతో ఇది మరింత ముందుకు పురోగమిస్తుంది.
పెరిగిన ఉత్పాదకతకు, దాని సహకారం ఏదిఏమైనప్పటికీ తయారీ రంగం సాపేక్ష అదనపు విలువను మరింత విస్తారంగా ఉత్పత్తి చేయడానికి అడ్డంకిగా ఉన్న కొన్ని లోపాలతో బాధపడుతోంది. గత అధ్యాయంలో చెప్పికున్నట్లు, తయారీ రంగంలో అతి ముఖ్యమైన లోపమేంటంటే- నిరంతర, క్లిష్టమైన చేతి వృత్తులపై ఆధారపడటం. ఇది ఇరుకైన సాంకేతిక పునాదిని సూచిస్తుంది.
వ్యక్తిగత శ్రమ ప్రక్రియను క్రమ పద్దతిలో శాస్త్రీయ విశ్లేషణ చేయడానికి గల అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది. కార్మికుల ఉత్పాదకతా, మరింత సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి గల అడ్డంకులను మార్క్స్ కాలం నాటి మరింత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశం బ్రిటన్‌లో ‘యంత్రాలు, ఆధునిక పరిశ్రమ’ ఆవిర్భావంతో అధిగమించడం జరిగింది.
మానవ శక్తి, అరుదైన హస్తకళా నైపుణ్యాల పరిమితుల నుంచి ఉత్పత్తి ప్రక్రియకు విముక్తిలోనే ఈ పరివర్తన సారాంశం ఇమిడి ఉంది.
మార్క్స్‌ను అనుసరించి, మనం యంత్రాన్ని మూడు భాగాలుగా విశ్లేషించవచ్చు:(నడిపే)మోటారు విధానం, ప్రసార విధానం(ఉదాహరణకు గేర్లు, క్రాంక్ షాఫ్టులు), సాధనాలు(ఉదాహరణకు మర యంత్రంలో కోత సాధనం ‘కట్టర్’). యంత్రాలు, ఆధునిక పరిశ్రమ ఆవిర్భావంతో(వీటిలో యంత్రమే ప్రారంభ స్థానం).
ఉత్పత్తి నైపుణ్యంలో రెండు ప్రధాన పరిణామాలు వచ్చాయి. ఒక మోటారును ఉపయోగించడం ఏకకాలంలో ఒక యంత్రం అనేక సాధనాలను వినియోగంలోకి తెస్తుంది. ఈ విధంగా ‘హస్తకళాకారుడి సాధనాల సహజ పరిమితుల కంచెనుండి’ తప్పించుకుంటుంది.
ఇంకా నైపుణ్యం గల హస్తకళా కార్మికుడి చేతితో వినియోగించే సాధనాన్ని యంత్రం వినియోగించే సాధనంగా మార్చడం ద్వారా ప్రేరణ విధానం కూడా మానవ శక్తి పరిమితుల నుంచి పూర్తిగా విముక్తి పొంది. స్వతంత్రరూపాన్ని సంతరించుకుంది. ఈ పరిణామంతో, ఏక కాలంలో అనేక సాధనాలను నడిపే ఒకే ప్రేరణ యంత్రాంగాన్ని కలిగి ఉండడం సాధ్యమయ్యింది. ఎవరైనా ఒక శక్తి వనరుతో ప్రతిదీ స్వతంత్ర ప్రసరణ విధానం, సాధనం కలిగిన అనేక యంత్రాలను పని చేయించగలడు. వీటిని ‘సంక్లిష్ట యంత్ర వ్యవస్థలు’ అని పిలవవచ్చు.
యంత్రాలను తయారు చేసే సాంకేతిక విజ్ఞానం..
ప్రారంభించడానికి యంత్రాలు, ఆధునిక పరిశ్రమ దశ దాని తయారీ పునాదులపై ఆధారపడి ఉంది. ఈ దశలో కీలకమైన భాగం(యంత్రం) తయారీ హస్తకళ ఆధారితమైనది. మార్క్స్‌ను ఉదహరిస్తే, వ్యక్తిగత బలం, నైపుణ్యంపై, కండరాల అభివృద్ధిపైనా, కంటి చూపు శక్తిపైనా, తయారీ పనివారి చేతివాటం పైనా, సహజ హస్తకళా కార్మికులు తమ మర్రిగుజ్జు పనిముట్లపై ఆధారపడి ఉన్నంతవరకూ, ఆధునిక పరిశ్రమ దాని సంపూర్ణ అభివృద్ధిలో కుంటుపడింది.
అధిక నైపుణ్యం గల కార్మికుల లభ్యంపై ఆధారపడి ఉన్నంత వరకు, ఇది అధిక వ్యయం, తప్పనిసరిగా యంత్రాల ద్వారా ఉత్పత్తి తక్కువ స్థాయి విస్తరణ రెండింటికీ దారితీసింది. ఆధునిక పరిశ్రమ అభివృద్ధికి తయారీ, హస్తకళల ప్రస్తుత సాంకేతిక నైపుణ్య పునాది ఉత్పత్తి చేయలేక పోతున్న చాలా పెద్దపెద్ద చలన యంత్రాలూ, గేర్లు, శాఫ్తింగులు, సాధనాల అవసరం ఎంతైనా ఉంది.
అదేవిధంగా తయారీ కాలం ఇచ్చిన సమాచార, రవాణా సాధనాలు, ఆధునిక పరిశ్రమకు దాని ఉత్పత్తి తీవ్రత, అపారమైన విస్తృతి, ఒక ప్రభావిత రంగం నుంచి మరొక ప్రభావితా రంగానికి తరలుతున్న దాని మూలధనం, కార్మికులతో, మొత్తం ప్రపంచంలో కొత్తగా సృష్టించబడిన మార్కెట్లతో దాని సంబంధాలతో దానిని త్వరలోనే భరించలేని చిక్కులను తెచ్చాయి.
ప్రధానంగా ఎంత శక్తినైనా ఉపయోగించగల సామర్ధ్యం కలిగి ఉండి, ఇంకా పరిపూర్ణ నియంత్రణలో ఉండే కదిలించే శక్తి స్లైడ్ రెస్ట్, ఆవిరి యంత్రం – సాంకేతిక ఆవిష్కరణల ద్వారా(సాపేక్షంగా) తక్కువ నైపుణ్యం కలిగిన శ్రమతో యంత్రాలచే యంత్రాల తయారీ చేయడం వచ్చింది. ఈ పరిణామంతో ఇంగ్లాండులో ఆధునిక పరిశ్రమ క్రమంగా ఉత్పత్తి అనేక శాఖలను జయించడం జరిగింది.
ఇంగ్లాడు ప్రపంచంలోని అత్యధిక భాగాన్ని జయించినప్పటికీ, అత్యంత అధునాతన పెట్టుబడిదారీ దేశంగా అవతరించడం కూడా జరిగింది. యంత్రాల ద్వారా ఉత్పత్తి గురించి సాంకేతిక అంశాలకు ఈ క్లుప్తమైన సంక్షిప్త పరిచయంతో ఇప్పుడు మనం వివిధ లోగుట్టుల వైపు దృష్టి సారిస్తున్నాము.
యంత్రాల వినియోగం, ఆధునిక పరిశ్రమలు ప్రారంభం కావడం శ్రమ ఉత్పాదకతను బాగా పెంచుతుంది. ఏమైనప్పటికీ అదే సమయంలో శ్రమలో అధిక భాగం యంత్రాలనూ, ఆధునిక పరిశ్రమలో కార్మికులు ఉపయోగించే ఇతర సాధనాలనూ ఉత్పత్తి చేయడానికి వ్యయమవుతున్నది.
ఒక వైపున శ్రమ ఉత్పాదకత పెరగడం సరుకులు చౌకగా లభ్యమవడాన్ని సూచిస్తుంది. మరొకవైపు యంత్రాలనూ, ఆధునిక సాధనాలనూ వినియోగించడం ఆధునిక పరిశ్రమల రాక ముందుకంటే, అస్థిర పెట్టుబడితో(సజీవ శ్రమతో) పోల్చినప్పుడు స్థిర పెట్టుబడి(మూలధనం)(నిర్జీవ శ్రమ) ప్రాముఖ్యతను సూచిస్తుంది. సరుకుల విలువలు, విలువల కూర్పుపై ఈ రెండు కారకాల ప్రభావం ఏమిటనే ప్రశ్న వస్తుంది.
విలువ కూర్పుపై ప్రభావం..
సరుకులు చౌకగా లభ్యమవ్వడమే ఫలితమైనప్పుడు మాత్రమే సరుకుల ఉత్పత్తిలో యంత్రాల వినియోగం జరుగుతుంది. ఆ విధంగా దాని ఉత్పత్తిలో ఆధునిక పారిశ్రామిక పద్ధతులను వినియోగించడంతో సరుకుల విలువ(దానిని ఉత్పత్తి చేయడానికి సామాజికంగా అవసరమైన ప్రత్యక్ష, పరోక్ష శ్రమ సమయం) తప్పనిసరిగా క్షీణిస్తుంది.
సరుకుల విలువ కూర్పులోని మార్పు అంటే దాని ఉత్పత్తిలో వెచ్చించిన సజీవ, నిర్జీవ శ్రమ సాపేక్ష నిష్పత్తిని జాగ్రత్తగా అధ్యయనం చెయ్యవలసి ఉంది.
సంఖ్యా ఉదాహరణలను ఉపయోగిద్దాం..
నిర్దిష్ట కొలతలతలతో కూడిన నాణ్యమైన నేత వస్త్రానికి 15గంటల శ్రమ వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో 5 గంటలు నేరుగా దాని నేత ప్రక్రియలో వెచ్చించబడతాయి. శ్రమ ప్రక్రియ(ముడి సరకుల సేకరణ)అంశం ద్వారా 5 గంటలు వినిమయం అవుతాయి. మిగిలిన 5 గంటలు నేత ప్రక్రియలో వినియోగించిన శ్రమ సాధనాల కొరకు వెచ్చించబడతాయి.
ఆధునిక నేత యంత్రాలను వినియోగించడంతో ఆ వస్త్రాన్ని ఉత్పత్తి చెయ్యడానికి అవసరమైన మొత్తం శ్రమ సమయాన్ని 10 గంటలకు తగ్గించవచ్చు. అందులో దాని నేతకు వినియోగించిన ప్రత్యక్ష శ్రమకు 2 గంటలు, శ్రమ నూతన పరికరాలకు(యంత్రం) వినిమయ విలువకు 3 గంటలు. దానిని ఉత్పత్తి చేసే విధానంలో మార్పు ఏమీ లేనందున శ్రమ ప్రక్రియ(ముడి సరుకు, దారం సేకరణ)అంశానికి 5గంటలు వినిమయం ఇదివరకు లాగానే అలాగే ఉంటుంది.
ఇప్పుడు రెండు పరిస్థితులను పోల్చి చూద్దాం: నేత యంత్రాన్ని ప్రవేశపెట్టడానికి ముందు పరోక్ష, ప్రత్యక్ష శ్రమ నిష్పత్తి 2:1. యంత్రాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఈ నిష్పత్తి(5+3):3 లేదా 4:1 అదే సమయంలో వస్త్రోత్పత్తిలోని పరోక్ష శ్రమ మొత్తం సంపూర్ణ విలువ 10 గంటలు(5+5) నుంచి 8(5+3) గంటలకు పడిపోయింది. ఆ విధంగా యంత్రాల ద్వారా ఉత్పత్తి వలన (i)సరుకు విలువలో తగ్గుదల (ii)ఈ విలువలోని స్థిర మూలధన భాగం తగ్గుదల మాత్రమే కాక (iii) (ప్రత్యక్ష శ్రమ భాగానికి సంబంధించి స్థిర మూలధన భాగంలో సాపేక్ష పెరుగుదల మనకు ఫలితంగా వచ్చింది.
ఈ ప్రక్రియలో ముడి సరుకుల ప్రవేశంలో మార్పేమీ లేనందున ఈ విధంగా సూత్రీకరించినప్పుడు మనం మార్క్స్‌తో ఎకీభవించగలం: ‘హస్తకళా నిపుణులు లేదా తయారీ దారులు ఉత్పత్తి చేసిన సరకుల ధరను, యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసిన అవే సరకుల ధరను విశ్లేషించి, పోల్చి చూసినప్పుడు యంత్రాల ఉత్పత్తిలో, శ్రమ సాధనాలవల్ల విలువ సాపేక్షంగా పెరగడం, బొత్తిగా/సమగ్రంగా తగ్గిపోవడాన్ని చూపుతుంది.’
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 25వ భాగం, 24వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
