ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) 74వ వార్షిక దినోత్సవ సమావేశం ఢిల్లీలో నవంబర్ ఒకటో తేదీన జరిగింది.
ఈ ఉత్సవానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఉపన్యాసం ఆశ్చర్యకరంగా ఉంది.
ఈపీఎఫ్‌వో ఉద్యోగులు మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ పద్ధతులు మార్చుకోవాలని, నూతన ఆవిష్కరణలను అమలు చేయాలని, ఇవన్నీ కార్మిక ప్రయోజనం లక్ష్యంగా ఉండాలని ఆయన హితోపదేశం చేశారు.
అలాగే ఈ సంస్థ కార్పస్ నిధులు రూ.32 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇది 8 కోట్లకు పైగా సభ్యుల చందాల రూపంలో వసూలైన డబ్బు అని తెలియజేశారు.
సామాజిక సంక్షేమం అనేది సున్నితమైనదని, ప్రతి ఒక్క కార్మికుడి సమస్యను మానవత్వంతో, సహృదయంతో పరిష్కరించాల్సిన పథకమని ఆయన ఉద్యోగులకు బోధ చేశారు.
నేడు పెన్షనర్లు కోరుతున్నది కనీస పెన్షన్ పెంపుదల
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం-1995 కింద పెన్షన్ పొందుతున్న వారి ప్రధాన సమస్య ‘కనీస పెన్షన్ నెలకు రూ.9 వేలకు పెంచాలి, దానికి డీఏ కూడా జోడించాలి’ అనేది.
యూపీఏ ప్రభుత్వం దిగిపోయే ముందు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. కానీ నోటిఫికేషన్ విడుదల చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది.
2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయల పెంపుదల నిర్ణయాన్ని అమలు చేసింది. అప్పటినుంచి ఈరోజు దాకా కనీస పెన్షన్ ఏమాత్రం పెరగలేదు.
ద్రవ్యోల్బణం – మంత్రుల వేతనాలు
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ 12 సంవత్సరాల కాలంలో(2014 నుంచి 2026 వరకు) ధరలు 75% పెరిగాయి. ప్రభుత్వం లెక్కించే ద్రవ్యోల్బణం రేట్లు వాస్తవ ధరల పెరుగుదలకు ఏమాత్రం సరిపోని విధంగా, మోసపూరితంగా ఉంటున్నాయి. అయినప్పటికీ, వాటినే ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ పెన్షన్ 75% పెరగాలి. కానీ పెరగలేదు.
కేంద్ర మంత్రివర్యుల వేతనం, కొన్ని అలవెన్సులు కలిపి 2014లో రూ.97,000లు ఉండగా, 2026 నాటికి రూ.2,13,000లకు పెరిగింది. అంటే ప్రభుత్వం ప్రకటించిన ధరల పెరుగుదల కంటే కూడా మంత్రుల జీతాలు ఎక్కువగా పెంచుకున్నారు.
ఈ జీతాలలో మెడికల్ అలవెన్స్, రవాణా అలవెన్స్ వగైరాలు కలపలేదు. వారికి ఇంటి అద్దె ఉండదు. కరెంటు, వాటర్, టెలిఫోన్ ఉచితం.
తమకు మాత్రం అడ్డగోలుగా వేతనాలు, అలవెన్సులు పెంచుకునే మంత్రులకు కోట్లాది మంది పెన్షనర్ల గురించి మాత్రం పట్టింపు లేదు. వారు ఐదు సంవత్సరాల కోసం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులనే విషయం కనీసం స్పృహలో ఉన్నదా?
ముప్పై సంవత్సరాలు కష్టపడి సర్వీస్ చేసి, రక్తమాంసాలు ధారబోసి సంపద సృష్టించిన కార్మికులు, ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు పెంచలేదు?
నిర్ణయాలు చేయాల్సింది ఉద్యోగులా? ప్రభుత్వమా?
మానవత్వం గురించి మాట్లాడే మంత్రులకు ఆ మాత్రం తెలియదా? కనీస పెన్షన్ పెంపుదల నిర్ణయం చేయాల్సింది ప్రభుత్వం. ఈపీఎఫ్ ఉద్యోగులు, అధికారులు కాదు. వారు కేవలం ప్రభుత్వ నిర్ణయాలను అమలు జరిపే వారు మాత్రమే.
కనీస పెన్షన్ ఎందుకు పెంచలేదో సంజాయిషీ ఇవ్వాల్సిన ప్రభుత్వం తాను తప్పుకొని, ఈపీఎఫ్ ఉద్యోగులు, అధికారులు మాత్రమే ఎనిమిది కోట్ల కార్మిక వర్గానికి శత్రువులుగా ఉన్నారని చిత్రీకరించడానికి మంత్రి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గం.
ఇకనైనా కళ్ళు తెరుస్తారా?
కేంద్ర కార్మిక శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల పైచిలుకు కార్మికులు, ఉద్యోగుల కనీస పెన్షన్ పెంచాల్సిన ఆవశ్యకతను ఎప్పటికైనా గుర్తించాలి.
2027-28 బడ్జెట్ సన్నాహాలు ఈ పాటికే ప్రారంభమయ్యాయి. 2027 ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలకు పెంచి, డీఏ కూడా జోడించాలనే డిమాండ్‌ను అంగీకరించాల్సిన అవసరం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
