నిర్ణయాత్మకమైన 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తుందనే ఆయన అంచనా, ప్రతిపక్షాలను ఏకం చేసి, ఆయనకే ఎదురుదెబ్బగా మారవచ్చు.
వివాదాస్పదమైన సీఈసీ జ్ఞానేష్ కుమార్తో కలిసి అమిత్ షా అడుగులు వేస్తూ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రధానమంత్రికి అత్యంత నమ్మకస్తుడైన అమిత్ షా పనితీరు ఈ మధ్య కాలంలో బాగా పేలవంగా ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో ఆయన ఉభయ సభలకు దాదాపు దూరంగానే ఉన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం, బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పడం వంటి అంశాల వల్ల ప్రతిపక్షాలకు ఆయన ప్రధాన లక్ష్యంగా మారారు.
ఇప్పటికే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’, ఓట్ల చోరీ, పేపర్ లీకేజీల వంటి అంశాలతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మచ్చ పడింది.
అమిత్ షా చర్యలు ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహం కలిగించేలా ఉన్నాయి. ఇది మోదీ ప్రభుత్వ పాలనను మరింత చీకట్లు కమ్మేలా చేసింది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ చర్యలు ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఆయన నిర్ణయాలను సమర్థించుకోవడం ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతుంది.
ఈ విషయంలో ప్రధానమంత్రి ఇప్పటివరకు మౌనం వహించగా, సీఈసీ కుమార్ తమ సొంత మనిషే అని షా కూడా ఇంకా స్పందించలేదు.
ప్రతిపక్షాలు ‘చొరబాటుదారులకు’ మేలు చేస్తున్నాయనే ఆరోపణ వారి మద్దతుదారులు అరువు తెచ్చుకున్నదే తప్ప దాన్ని ఎవరూ నమ్మట్లేదు.
ఏకమవుతున్న ప్రతిపక్షాలు
రాజకీయంగా, ఇది ప్రతిపక్ష పార్టీలకు పునరుజ్జీవం పోసింది. భారతదేశ రాజకీయాలను, యువత, జెన్ జీలను ‘మండల్-కమండల్’ నినాదం మూడు దశాబ్దాలకు పైగా ప్రభావితం చేసింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే యువత బయటపడుతోంది.
విభేదాలు, అహంభావాలు, వ్యక్తిగత ఘర్షణలు ఉన్నప్పటికీ, బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి.
అమిత్ షా వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలను సమైక్యంగా నిలబడేలా చేస్తాయనడంలో సందేహం లేదు. తాము విడిపోతే ఓటమి తప్పదని ప్రతిపక్షాలు ఇప్పటికే గ్రహించి ఉంటాయని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
నిజానికి ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల అగ్రనేతలు, బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేదిక పైకి రావాలని చర్చలు ప్రారంభించారు.
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటి బీజేపీయేతర పార్టీల్లో చీలికలు, ఫిరాయింపుల వ్యూహకర్తగా అమిత్ షా కీలక వ్యక్తి.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారసుడిగా ఎదగాలనే ఆయన ఆశయం, సొంత పార్టీలోనే ఆయనకు అనేక మంది వ్యతిరేకులు తయారయ్యేలా చేస్తోంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని హేళన చేస్తూ అమిత్ షా జోస్యం చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది ప్రతిపక్ష పార్టీలకు మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటాయి.
బెడిసికొడుతున్న వ్యూహాలు
హోంమంత్రి రూపొందిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం పార్టీకి, అధికార కూటమికి ప్రతికూల ఫలితాలను ఇవ్వడం బీజేపీకి, నరేంద్ర మోదీకి ఒక పెద్ద సమస్యగా మారింది.
‘జంతర్ మంతర్-1.0’, ‘జంతర్ మంతర్ 2.0’ సందర్భంగా పోలీసుల తీవ్రమైన చర్యల ద్వారా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయాలని అమిత్ షా అనుసరించిన వ్యూహం, ప్రజల్లో పాలకుల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టింది.
ఏ నియంతృత్వ పాలకులకైనా ఇది మంచి పరిణామం కాదు. ప్రస్తుత కాలంలో బీజేపీకి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఎదురవుతున్న సమస్య ఇదే.
అమిత్ షా హోదా క్షీణిస్తున్న సమయంలో ఆయనను ఉప ప్రధానమంత్రిని చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. అప్పటికే వాస్తవంగా ఆ హోదాలో ఉన్నట్లు వ్యవహరిస్తున్న ఆయన, ఇక అధికారికంగా కూడా ఆ పదవిని చేపడతారని అందరూ అనుకున్నారు. కానీ నెలలు గడిచిపోయినా అటువంటిదేమీ జరగలేదు.
ప్రధానమంత్రి నిర్ణయాధికారం కలిగిన వ్యక్తి అయితే, హోంమంత్రి ఆయన ఆదేశాలను అమలు చేసే వ్యక్తిగా ఉన్నారు.
ప్రధానమంత్రి ఎదుర్కొంటున్న సంక్షోభం హోంమంత్రికి కూడా ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు వరుసగా విఫలమవుతున్నాయి. అయినా మోదీకి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా అమిత్ షా తప్ప మరొకరు లేరు.
మోదీ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయం అత్యంత శక్తివంతమైన కేంద్రంగా మారింది. ఆ తరుణంలో, పాలనపై అమిత్ షాకు ఉన్న పట్టును ఇది తెలియజేస్తుంది.
‘కాక్రోచ్ జనతా పార్టీ’కి చెందిన సౌరవ్ దాస్, అభిజీత్ రంకాలు జంతర్ మంతర్లో నిరసన తెలపడానికి ప్రయత్నించినప్పుడు, అక్కడ నిరసనలకు అనుమతి లేదనీ, ఉత్తర్వులను ఉల్లంఘించారన్న కారణంతో వారిని వారం రోజుల పాటు నిర్బంధించారు.
విమర్శకులను, ఆందోళనకారులను భయభ్రాంతులకు గురిచేయడానికి హోంమంత్రి ఇటువంటి వ్యూహాలను ఉపయోగిస్తున్నారని స్పష్టమవుతోంది. అయితే, ఈ పద్ధతులు మద్దతుదారులను కూడా విమర్శకులుగా మారుస్తున్నాయి.
ఒకప్పుడు మోదీ-షా ద్వయానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న అన్నామలై (తమిళనాడు) కూడా ఇప్పుడు ఇటువంటి వ్యూహాలను తీవ్రంగా విమర్శించారు.
12 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి కొత్త శత్రువులను సృష్టించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ప్రపంచవ్యాప్త విమర్శలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్, భిన్నాభిప్రాయాలను అస్సలు సహించకపోవడంపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా, ఎన్నికల ప్రక్రియలో బీజేపీ నిష్పక్షపాతంగా లేదా సరైన పద్ధతిలో వ్యవహరించకుండా ప్రతిపక్షాలను ఇబ్బందుల పాలు చేస్తోందనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది. ఇది బీజేపీని మరింత కలవరపరుస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అమిత్ షా
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలక మార్పులకు దారితీస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఇది అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ మధ్య ‘ఢిల్లీ అగ్రస్థానం’ కోసం పోటీకి దారితీయవచ్చు.
ప్రస్తుతం ప్రధానమంత్రి తన పాత ఉత్సాహాన్ని కోల్పోతూ, కొత్త ఆలోచనలు చేయలేని స్థితిలో ఉన్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
యోగి ఆదిత్యనాథ్ కఠినమైన హిందుత్వకు ప్రతిరూపంగా ఉంటే, ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న అమిత్ షా పరిపాలనా యంత్రాంగాన్ని చక్కదిద్దే వ్యక్తిగా పేరు పొందారు.
అయితే ఆయనకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మొదటిది యువతరాన్ని ఆయన ఆకర్షించలేకపోవడం, రెండోది ఎన్డీయే లోపల, బయట ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు లేకపోవడం.
మూడోది ప్రత్యర్థి పార్టీలలోని ఫిరాయింపుదారులకు, చీలిక వర్గాలకు ఆయన రక్షకుడిగా కనిపించడం. మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే, ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండటం అనేది షాకు ఒక గొప్ప ఆస్తి, అదే సమయంలో ఒక బలహీనత కూడా.
రచయితలు : సునీల్ గటాడే, వెంకటేష్ కేసరి (న్యూఢిల్లీ పాత్రికేయులు)
అనువాదం : సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
