సామాజిక భద్రతా కోడ్ అమలైన ఒక సంవత్సరం తర్వాత, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డులను ఏర్పాటు చేసింది.
ఆలస్యంగానైనా ఈ బోర్డుల ఏర్పాటు స్వాగతించదగిన పరిణామం. అయితే, ఇందులో కేంద్ర ప్రభుత్వ అధికార కేంద్రీకరణ ఎక్కువగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు.
అధికార కేంద్రీకరణ, బోర్డుల స్వరూపం
బోర్డు నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వమే రెండు బోర్డులను నియంత్రిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ బోర్డులకు అధ్యక్షత వహిస్తారు.
అసంఘటిత రంగ కార్మికుల బోర్డులో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన 40 మంది సభ్యులు ఉంటారు. వీరిలో అసంఘటిత రంగ కార్మికుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు సభ్యులు, అసంఘటిత రంగ యజమానుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు సభ్యులు ఉంటారు.
అదేవిధంగా, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమ బోర్డులో 22 మంది సభ్యులు ఉంటారు. ఇందులో అగ్రిగేటర్లు, కార్మికుల నుంచి చెరో ఐదుగురు ప్రతినిధులు ఉంటారు. అయితే, ఇందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కేంద్ర కార్మిక సంఘాల నుంచి లేదా ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో కార్మిక రంగం ఉంది. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రాష్ట్రాలు, కేంద్రం రెండూ కలిసి పనిచేయాలి.
ఐఎల్ఓ మార్గదర్శకాలు, వాస్తవ పరిస్థితులు
అంతర్జాతీయ కార్మిక సంస్థ సామాజిక భద్రతను ఇలా నిర్వచించింది: “ముసలితనం, నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, పనిలో గాయాలు, ప్రసూతి లేదా సంపాదించే వ్యక్తిని కోల్పోవడం వంటి సందర్భాల్లో.. వ్యక్తులకు, కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందేలా, ఆదాయ భద్రతకు భరోసా కల్పించడానికి సమాజం అందించే రక్షణ”.
దేశంలో సామాజిక భద్రత పరిధి 2015లో 19 శాతం నుంచి 2025 నాటికి 64.3 శాతానికి పెరిగిందని, ఇది సుమారు 94 కోట్ల మంది పౌరులకు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ, దేశంలోని మొత్తం కార్మికుల్లో 92 శాతానికి పైగా ఉన్న అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు ఈ నిర్వచనం కింద ఎలాంటి సామాజిక భద్రతను పొందలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
బుట్టదాఖలైన సిఫార్సులు
సుమారు రెండు దశాబ్దాల క్రితం, ఆర్థికవేత్త డాక్టర్ అర్జున్ సేన్ గుప్తా అధ్యక్షతన అసంఘటిత రంగ సంస్థల కోసం ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్, అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను మెరుగుపరచడానికి అనేక సిఫార్సులు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
కేరళ ప్రభుత్వం కోసం జస్టిస్ వీ గోపాల గౌడ ఈ ఏడాది మార్చిలో రూపొందించిన నివేదిక, సామాజిక భద్రతా కోడ్‌లోని కొన్ని సమాఖ్య వ్యతిరేక, కార్మిక వ్యతిరేక లక్షణాలను ఎత్తిచూపుతూ సవరణలను సూచించింది.
భారీ సంఖ్యలో ఉన్న కార్మికుల సామాజిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి కొత్త వ్యవస్థలు, విధానాలను రూపొందించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలి.
(ది హిందూ సౌజన్యంతో – ది హిందూ సంపాదకీయం: 31-10-2026)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
