ఓటరు జాబితాల సవరణ పేరుతో ప్రజా ప్రతినిధుల చట్టంలో లేని రుజువు భారాన్ని గతానికి వర్తించేలా ప్రజలపై మోపలేరు
పటియాలాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి పుట్టినప్పటి నుంచి అదే చిరునామాలో నివసిస్తున్నాడు. అతని తల్లి కూడా దశాబ్దాలుగా అదే చిరునామాలో ఓటరుగా నమోదై ఉంది. అయినప్పటికీ అతని బూత్ లెవల్ అధికారి (BLO) 2002లో అతని అర్హత కలిగిన కుటుంబ సభ్యుడు ఎక్కడ ఓటరుగా నమోదై ఉన్నారో నిరూపించే పత్రాలు సమర్పించాలని కోరుతున్నారు.
ఎన్నికల కమిషన్ రూపొందించిన ఎన్యూమరేషన్ (గణన) ఫారంలో లెగసీ అనుసంధానాన్ని కేవలం తండ్రి ద్వారా మాత్రమే కాకుండా తల్లి, తాత లేదా అమ్మమ్మ ద్వారా కూడా చూపించే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పలువురు బూత్ లెవల్ అధికారులు పొరపాటుగా కేవలం తండ్రి వివరాలనే కోరుతున్నారు.
ఈ కేసులో స్పష్టంగా అర్హత కలిగిన కుటుంబ సభ్యుడు అతని తండ్రే. ఆయన పదవీ విరమణ చేసిన సీనియర్ ప్రభుత్వ అధికారి. మాజీ సైనిక ఉద్యోగి. చట్టంలో సేవా సిబ్బందికి ఉన్న ప్రత్యేక నిబంధనల ప్రకారమే ఉద్యోగ కాలంలో ఆయన కుటుంబ ఇంటి చిరునామా వద్ద కాకుండా తాను విధులు నిర్వహించిన వివిధ ప్రాంతాల చిరునామాల వద్ద ఓటరుగా నమోదై ఉండేవారు.
ఆయన ఓటరు గుర్తింపు కార్డు (EPIC)పై, కుటుంబం నివసిస్తున్న పటియాలా ఇంటికి ఎలాంటి సంబంధం లేని పాత ఉద్యోగ స్థలం చిరునామా ఉంది. ఆ కుమారుడు గత 15 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక ఎన్నికల్లో ఓటు వేశాడు. అతని తల్లి అదే కుటుంబ చిరునామాలో ఓటరుగా నమోదై ఉండడంపై ఎలాంటి వివాదం లేదు. అంతేకాదు ఎన్యూమరేషన్ ఫారంలోని సూచనల ప్రకారం ఆమె కూడా అర్హత కలిగిన కుటుంబ సభ్యురాలే.
అయినప్పటికీ తల్లి ఓటరు నమోదు గానీ, కుమారుడు గత 15 ఏళ్లుగా ఓటరుగా ఉన్న రికార్డు గానీ సరిపోతాయని పరిగణించడం లేదు. బదులుగా బూత్ లెవల్ అధికారి తండ్రి ఉద్యోగ స్థలం చిరునామా ఉన్న EPIC కార్డుపైనే పట్టుబడుతున్నారు. ఈ పట్టుదల చట్టపరమైన అవసరం వల్ల కాదు. అధికారులకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఏర్పడిన లోపం. ఆ శిక్షణ లోపం కారణంగా పంజాబ్ అంతటా ఓటర్లు అనవసరంగా, చట్టవిరుద్ధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక జర్నలిస్ట్ అనుభవం
పటియాలా ఘటన ఒక్కటే కాదు. జర్నలిస్టు గోపీకృష్ణ కూడా దీనికి చాలా దగ్గరగా ఉన్న ఒక అనుభవాన్ని పంచుకున్నారు. 1989 నుంచి కేరళలో ఓటరుగా నమోదై ఉన్న ఆయన ఉద్యోగ రీత్యా ఢిల్లీకి మారారు. ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయి అధికారులు ఆయన పేరును కేరళ ఓటరు జాబితా నుంచి తొలగించారు.
దీనిపై ఆయన కేరళ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ నా పొరుగు వారైన అప్పటి రక్షణ మంత్రి ఏ.కే. ఆంటోనీ కూడా 2005 మధ్యకాలం నుంచి కేరళలో నివసించడం లేదు. అయినప్పటికీ ఆయన పేరు మాత్రం ఓటరు జాబితా నుంచి తొలగించలేదు అని ప్రశ్నించారు. దీనికి ప్రధాన ఎన్నికల అధికారి సమాధానం చెప్పలేకపోయారు. ఆయన వ్యాఖ్యలోని వ్యంగ్యాన్ని మాత్రం ఆమె అంగీకరించారు.
చివరికి గోపీకృష్ణ తన కేరళ ఓటరు నమోదును రద్దు చేయాలని ప్రకటించి 2012లో ఢిల్లీలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఆయన అభిప్రాయం ఏమిటంటే ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా లేవు. 2009లో కూడా అవి అంతగా ప్రజా అనుకూలంగా లేవు. ఇప్పుడు SIR ప్రక్రియ వాటిని మరింత కఠినంగా మార్చి ఓటు హక్కును కాపాడతామని చెప్పి అదే ఓటర్లకు ఇబ్బందులు కలిగించే స్థితికి తీసుకెళ్లింది.
చట్టం ప్రకారం ఒక వ్యక్తి సాధారణ నివాసం ఎక్కడ ఉందో అనేది ఆ ఓటరు స్థిరంగా అక్కడే నివసించాలనే తన ఉద్దేశం ఆధారంగా నిర్ణయించాలి. ఇరుగుపొరుగు వారు క్షేత్రస్థాయి అధికారికి ఇచ్చిన సమాచార ఆధారంగా కాదు. 17 ఏళ్ల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు కూడా ఎన్నికల వ్యవస్థలోని అదే వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ రెండు ఘటనలు ఒకే వ్యవస్థాపరమైన సమస్యను సూచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బూత్ లెవల్ అధికారులు, ఎన్నికల కమిషన్ (ECI) స్వయంగా రూపొందించిన ఫారంలో ఉన్న నిబంధనలపై పూర్తి ఏకరీతి శిక్షణ లేకుండానే వ్యవహరిస్తున్నారు. voters.eci.gov.inలో ఉన్న ఎన్యూమరేషన్ ఫారంలో మూడు ఎంపికలు ఉన్నాయి. అవి
1. (a) గత SIR ఓటరు జాబితాలో నా పేరు ఉంది.
2. (b) గత SIR ఓటరు జాబితాలో నా తల్లిదండ్రులు లేదా తాత/అమ్మమ్మ (తండ్రి, తల్లి, తాత లేదా అమ్మమ్మ)లో ఎవరి పేరు అయినా ఉంది.
3. (c) గత SIR ఓటరు జాబితాలో నా పేరు గానీ, నా తల్లిదండ్రులు లేదా తాత/అమ్మమ్మలో ఎవరి పేరు గానీ లేదు.
అంటే ఈ ఫారంలో తల్లిదండ్రులు అనే పదాన్ని విస్తృత అర్థంలో ఉపయోగించారు. కేవలం తండ్రినే కాదు మొత్తం నలుగురు అర్హత కలిగిన కుటుంబ సభ్యులను (తండ్రి, తల్లి, తాత, అమ్మమ్మ) పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.
తెలంగాణలో SIR సందర్భంగా నిర్వహించిన దర్యాప్తులో సియాసత్ గుర్తించిన విషయం ఏమిటంటే తల్లి వైపు తాత, అమ్మమ్మ కూడా అర్హులేనా అనే విషయంలో ఎన్నికల కమిషన్ కాల్‌సెంటర్ సిబ్బందికే స్పష్టత లేదు. అదే సమయంలో రాజస్థాన్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివాహిత మహిళలు తమ భర్త ఇంటి ఆధారంగా కాకుండా తమ తల్లిదండ్రుల కుటుంబ వివరాల ఆధారంగానే లెగసీని చూపించాలని ప్రత్యేకంగా స్పష్టీకరణ జారీ చేయాల్సి వచ్చింది.అత్యున్నత పరిపాలనా స్థాయిలోనే ఉన్న ఈ అయోమయం క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లే బూత్ లెవల్ అధికారుల వ్యవహారంలో కూడా అలాగే కనిపిస్తోంది.
పంజాబ్‌లో బూత్ లెవల్ అధికారులు ఓటర్లను కేవలం తండ్రి 2003 నాటి ఓటరు నమోదు వివరాలనే ఇవ్వాలని కోరడం, ఎన్నికల కమిషన్ రూపొందించిన ఫారంలోని నిబంధనలను అనుసరించడం కాదు. వారికి ఇచ్చిన అసంపూర్ణమైన సూచనల ప్రకారమే వారు వ్యవహరిస్తున్నారు.
ఆ సమయంలో అక్కడే ఉండే బూత్ లెవల్ ఏజెంట్ (BLA), బూత్ లెవల్ అధికారికంటే ఫారంపై మెరుగైన అవగాహన కలిగి ఉండి, ఆ పొరపాటును వెంటనే సరిదిద్దగలగాలి. అలాగే ఇంటి తలుపు తట్టే ముందే తనకు ఉన్న హక్కుల గురించి ప్రతి పౌరుడూ తెలుసుకుని ఉండాలి.
ఇది SIR ప్రక్రియను వ్యతిరేకించే వాదన కాదు. మే 27న సుప్రీంకోర్టు SIR చట్టబద్ధతను సమర్థించింది. ఆ తీర్పును ఇక్కడ ఎవరూ ప్రశ్నించడం లేదు. ఓటరు జాబితాలను సరిచేయడం, నవీకరించడం అవసరమే. ఆ ప్రక్రియను నిర్వహించే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది.
వివాదాస్పదంగా మారింది SIRలో అనుసరిస్తున్న ఈ ప్రత్యేక లెగసీ లింకేజ్ విధానమే. అంటే 2003 తర్వాత ఓటరుగా నమోదైన వారు తమ కుటుంబ ఓటరు నమోదును 2003 వరకు వెనక్కి అనుసంధానించి చూపాలని అలాగే తమ ప్రస్తుత అర్హతను నిరూపించేందుకు పావు శతాబ్దం క్రితం (సుమారు 25 ఏళ్ల క్రితం) తల్లిదండ్రుల ఓటరు నమోదు రికార్డులను సమర్పించాలని కోరడం.
ఇలాంటి డిమాండ్‌కు భారత రాజ్యాంగంలో గానీ, ప్రజా ప్రతినిధుల చట్టంలో గానీ, ఓటర్ల నమోదు నియమావళి లో గానీ ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదు. 2003 నాటి ఓటరు జాబితాను పరిపాలనా పరంగా వివరాలను సరిపోల్చుకునే ఒక ఆధారంగా ఉపయోగించడం సమంజసమే. కానీ అదే జాబితాను ఓటరు అర్హతకు తప్పనిసరి ప్రమాణంగా పరిగణించడం మాత్రం ఏ చట్టమూ అనుమతించదు.
I. రాజ్యాంగపరంగా ప్రారంభమయ్యే మౌలిక సూత్రం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేకుండా స్పష్టంగా చెబుతోంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి భారత పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునే హక్కు కలిగి ఉంటాడు.
అదే సమయంలో ఓటరుగా నమోదు కాకుండా అనర్హుడిగా ప్రకటించడానికి ఉండే కారణాలను కూడా రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. అవి భారత పౌరుడు కాకపోవడం, మానసిక అస్వస్థత, నేరానికి పాల్పడటం, లేదా అవినీతి/చట్టవిరుద్ధ ఎన్నికల కార్యకలాపాలకు పాల్పడటం.
కానీ 2003లో తల్లిదండ్రుల ఓటరు నమోదు వివరాలను గుర్తించి చూపలేకపోవడం మాత్రం ఈ అనర్హత కారణాల్లో ఎక్కడా లేదు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటరు జాబితాల తయారీ, పర్యవేక్షణ, నిర్వహణ, సవరణలపై సంపూర్ణ అధికారం ఎన్నికల కమిషన్‌కు అప్పగించబడింది. అయితే ఈ అధికారం ఓటరు జాబితాలను పర్యవేక్షించి సవరించడానికి మాత్రమే. రాజ్యాంగంలో లేని కొత్త అర్హత ప్రమాణాలను సృష్టించే అధికారం మాత్రం ఎన్నికల కమిషన్‌కు లేదు.
మే 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మరియు ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. ఆ తీర్పు ప్రస్తుతం అమల్లో ఉంది. దానిని ఇక్కడ ఎవరూ ప్రశ్నించడం లేదు.అయితే రాజ్యాంగం లేదా ప్రజా ప్రతినిధుల చట్టం నిర్దేశించని కొత్త అర్హత ప్రమాణాలను ఏ ఓటరిపైనా విధించే అధికారాన్ని ఆ తీర్పు ఎన్నికల కమిషన్‌కు ఇవ్వదు. ఇవ్వలేదు కూడా. అంటే SIR ప్రక్రియ చట్టబద్ధమైనదే. కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో లెగసీ లింకేజ్ పేరుతో చేస్తున్న డిమాండ్ మాత్రం చట్టబద్ధమైనది కాదు.
II. ప్రజా ప్రతినిధుల చట్టం ఏమి చెబుతోంది
1950 నాటి ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఓటరుగా నమోదు కావడానికి కేవలం రెండు అర్హతలు మాత్రమే ఉన్నాయి.
1. నిర్దేశించిన అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.
2. సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసి అయి ఉండాలి.
అంటే చట్టం నిర్దేశించిన అర్హతలు ఇవి రెండే. అంతకు మించి మరే ఇతర షరతును చట్టం విధించలేదు.
సెక్షన్ 20లో సాధారణ నివాసం అంటే ఏమిటో నిర్వచించారు. సెక్షన్ 20(1A) ప్రకారం ఒక వ్యక్తి తన సాధారణ నివాసం నుంచి తాత్కాలికంగా వేరే చోట ఉన్నంత మాత్రాన ఆ నివాస ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉన్న హోదా కోల్పోడు.
అలాగే సెక్షన్ 20(3) ప్రకారం, సాయుధ దళాలు మరియు పారామిలిటరీ బలగాలకు చెందిన సేవా సిబ్బంది తమ ఉద్యోగం కారణంగా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారు సేవలో లేకపోతే ఎక్కడ నివసించి ఉండేవారో ఆ నియోజకవర్గానికే సాధారణ నివాసులుగా పరిగణించాలి.
ఈ నిబంధనే పటియాలా కుటుంబానికి నేరుగా వర్తిస్తుంది. ఆ కుటుంబంలోని తండ్రి ఉద్యోగం కారణంగా వివిధ పోస్టింగ్ ప్రాంతాల్లో ఓటరుగా నమోదవడం చట్టబద్ధమైన పరిణామమే. దాన్ని బట్టి వారి కుటుంబం పటియాలాలోని ఇంటిలో నివసించలేదని చెప్పడానికి వీల్లేదు.
సెక్షన్ 22లోని ప్రొవైజో (మినహాయింపు నిబంధన) కూడా అంతే కీలకమైనది. ఒక వ్యక్తి ఇకపై సాధారణ నివాసి కాదని లేదా ఓటరుగా నమోదు అయ్యే అర్హత లేదని భావించి అతని పేరును ఓటరు జాబితా నుంచి తొలగించే ముందు ఎన్నికల నమోదు అధికారి ఆ వ్యక్తికి తన వాదన వినిపించుకునేందుకు తగిన అవకాశం కల్పించాల్సిందే.
ఇది అధికారి ఇష్టానుసారం చేయాల్సిన విషయం కాదు. చట్టం కల్పించిన ఒక స్పష్టమైన హక్కు మాత్రమే కాదు చట్టబద్ధమైన హామీ కూడా.
ఈ విచారణకు అవకాశం ఇవ్వకుండా ఓటరు పేరును జాబితా నుంచి తొలగిస్తే అది చట్టవిరుద్ధమైన చర్య అవుతుంది. 1960 నాటి ఓటర్ల నమోదు నియమాలలోని రూల్ 13, రూల్ 21లు ఓటర్లను చేర్చడం, అభ్యంతరాలను పరిశీలించే విధానాన్ని నిర్దేశిస్తాయి.
అయితే ఈ నియమాల్లో ఎక్కడా కూడా ఓటరుగా కొనసాగాలంటే 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల ఓటరు నమోదు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని బూత్ లెవల్ అధికారి లేదా ఎన్నికల నమోదు అధికారి కోరవచ్చని పేర్కొనలేదు.
III. 2003 ప్రామాణిక ఓటరు జాబితా (Baseline)
లెగసీ లింకేజ్ నిబంధన అనేది రికార్డులను కంప్యూటర్ ద్వారా సరిపోల్చేందుకు ఎన్నికల కమిషన్ ఎంచుకున్న ఒక పరిపాలనా విధానం మాత్రమే. ఇది చట్టం నిర్దేశించిన తప్పనిసరి నిబంధన కాదు.అయితే 2025–26లో చేపట్టిన SIR ప్రక్రియ 2003లో అమలు చేసిన SIR రూపకల్పన నుంచి కీలకమైన మార్పులతో అమలు చేయబడుతోంది.
బిహార్ SIR కేసులో సుప్రీంకోర్టు ముందు సమర్పించిన పత్రాలు ఏమి చెబుతున్నాయంటే 2003లో అమలైన SIR మార్గదర్శకాల ప్రకారం అప్పటికే ఉన్న ఓటరు జాబితా మరియు ఓటరు గుర్తింపు కార్డునే ధ్రువీకరణకు ప్రాథమిక ఆధారాలుగా ఉపయోగించారు. అంటే ఒక ఓటరు తన స్వంత EPIC కార్డును చూపించడం ద్వారా తన ఓటరు నమోదును కొనసాగుతున్నదని నిరూపించుకునే అవకాశం ఉండేది.
కానీ ప్రస్తుత SIR ప్రక్రియలో మొదట 2003 తర్వాత ఓటరుగా నమోదైన వారి కోసం చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుంచి EPICను తొలగించారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల కమిషన్ గతంలో అనుసరించిన విధానాన్నే ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా మార్చింది. అనంతరం సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల తర్వాత మాత్రమే ఆ లోపాన్ని సరిచేశారు.
2003లో SIR నిర్వహించినప్పుడు ఎన్నికల కమిషన్‌కు దాదాపు ఆరు నెలల సమయం ఉంది. అంతేకాదు అది రాష్ట్ర ఎన్నికలకు చాలా ముందే పూర్తిచేశారు. అందువల్ల ఓటర్లకు పత్రాలు సమర్పించడానికి పొరపాట్లు సరిదిద్దుకోవడానికి తగిన సమయం దొరికింది.
ఇప్పుడు (2025–26) SIR మాత్రం కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. అదీ ఎన్నికలకు చాలా దగ్గరగా నిర్వహిస్తున్నారు. దీంతో ఓటర్లపై ఒత్తిడి పెరిగింది. తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువైంది.
అంతేకాదు ఎన్నికల కమిషన్ మేము 2003లో చేసినట్లే ఇప్పుడు కూడా చేస్తున్నాం అని చెబుతోంది. కానీ 2003లో ఓటర్లకు ఉన్న ముఖ్యమైన రక్షణలు, సౌకర్యాలు (ఎక్కువ సమయం ఇవ్వడం, EPICను ఆధారంగా అంగీకరించడం వంటివి) ఇప్పుడు పాటించడం లేదు.
2008, 2012 లేదా 2018లో చట్టబద్ధంగా ఓటరుగా నమోదైన వ్యక్తిని—ఆ నమోదు అప్పట్లో ధ్రువీకరించబడి, చట్టానికి అనుగుణంగా జరిగి, EPIC ఆధారంగా మద్దతు పొందినప్పటికీ ఎన్నికల కమిషన్ రెండు దశాబ్దాల తర్వాత తన విధానాన్ని మార్చిందనే కారణంతో ఇప్పుడు గతానికి వర్తించేలా అతని నమోదును తాత్కాలికంగా ధ్రువీకరించని నమోదుగా పరిగణించలేరు.
IV. తల్లిదండ్రుల ఓటరు నమోదుతో అనుసంధానం కోరడం
అర్హత కలిగిన కుటుంబ సభ్యులుగా తండ్రి, తల్లి, తాత లేదా అమ్మమ్మను పరిగణించే విస్తృత నిర్వచనం ఫారంలో ఉన్నప్పటికీ లెగసీ లింకేజ్ నిబంధన వల్ల మూడు తరాల పౌరులు వ్యవస్థాపరంగా నష్టపోతున్నారు.
మొదటిది 2003లో మైనర్లుగా ఉన్న ఓటర్లు మరియు చట్టబద్ధమైన కారణాల వల్ల ఆ సమయంలో వారి అర్హత కలిగిన కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదు కానివారు. ఉదాహరణకు కుటుంబ ఇంటి చిరునామా వద్ద కాకుండా ఉద్యోగ నియామక ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన సైనిక సిబ్బంది, ఇంకా కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకోని అంతర్గత వలసదారులు, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారిన వ్యక్తులు.
రెండోది కొత్తగా వివాహమైన మహిళలు. వివాహిత మహిళలు తమ భర్త ఇంటి ఆధారంగా కాకుండా తమ సొంత తల్లిదండ్రుల కుటుంబ వివరాల ఆధారంగానే లెగసీని చూపించాలని రాజస్థాన్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రత్యేకంగా స్పష్టీకరణ ఇచ్చారు. అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో బూత్ లెవల్ అధికారులు మహిళలను తమ మామగారి లేదా భర్త 2002 నాటి ఓటరు నమోదు వివరాలను సమర్పించాలని కోరుతున్నారు. ఇది విధానపరంగా తప్పు మాత్రమే కాకుండా ఎన్నికల కమిషన్ ఫారంలోని సూచనలకు కూడా విరుద్ధం.
మూడోది అనాథలు, దత్తత తీసుకున్న వ్యక్తులు, అలాగే నిర్బంధ వలసలు, ప్రకృతి విపత్తులు లేదా దేశ విభజన కాలంలో జరిగిన వలసల కారణంగా కుటుంబ రికార్డులు కోల్పోయిన వారు.
ఈ వర్గాల్లో ఏ ఒక్కరి విషయంలోనూ 2003 నాటి అర్హత కలిగిన కుటుంబ సభ్యుడి ఓటరు నమోదు రికార్డును సమర్పించలేకపోవడం ఆ వ్యక్తి భారత పౌరసత్వానికి గానీ లేదా అతని సాధారణ నివాసానికి గానీ ఎలాంటి సంబంధం లేదు.
పటియాలా ఘటనలోని మాజీ సైనిక ఉద్యోగి అయిన తండ్రి ఉదాహరణ సెక్షన్ 20(3) కింద జరుగుతున్న ఒక ప్రత్యేకమైన అన్యాయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆ సెక్షన్ ప్రకారం ఒక సేవా సిబ్బంది ఉద్యోగం కారణంగా వేరే చోట ఉన్నప్పటికీ ఉద్యోగం లేకపోతే ఎక్కడ సాధారణంగా నివసించి ఉండేవారో ఆ నియోజకవర్గానికే ఆయనను సాధారణ నివాసిగా పరిగణించాలి.
అందువల్ల ఆయన ఓటరు నమోదు కూడా చట్టం ప్రకారం ఊహించిన నివాసాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది. ఏ సమయంలో ఆయన భౌతికంగా ఎక్కడ ఉన్నారో దానిని కాదు. ఆయన EPICలో ఒక చిరునామా ఉండవచ్చు. సేవా రికార్డుల్లో మరో చిరునామా ఉండవచ్చు. పదవీ విరమణ తర్వాత నివాస చిరునామా ఇంకొకటి కావచ్చు.
ఈ విధంగా కనిపించే వ్యత్యాసాలు అనేవి సేవా సిబ్బంది మరియు వారి కుటుంబాలను రక్షించేందుకు పార్లమెంట్ చట్టంలో ప్రత్యేకంగా చేసిన నిబంధనల ప్రత్యక్ష చట్టపరమైన ఫలితమే.
ఉద్యోగరీత్యా తండ్రి వివిధ ప్రాంతాల్లో ఓటరుగా నమోదై ఉండటాన్ని కారణంగా చూపి ఇప్పుడు ఆయన కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఓటరు జాబితా ప్రక్షాళన కాదు. దేశానికి సేవ చేసిన సిబ్బందిని రక్షించేందుకు పార్లమెంట్ కల్పించిన చట్టబద్ధమైన వెసులుబాటునే SIRలో అమలు చేస్తున్న విధానం (అల్గారిథమ్) ఇప్పుడు శిక్షిస్తున్నట్టుగా మారింది.
V. SIR మరియు చట్టం
SIR ప్రక్రియ ద్వారా సెక్షన్ 19లో పేర్కొన్న రెండు అర్హతలు అంటే అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు ఉండటం మరియు సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండటం. ప్రతి ఓటరు నెరవేర్చుతున్నాడా లేదా అనే విషయాన్ని చట్టబద్ధంగా ధ్రువీకరించవచ్చు.
అలాగే బూత్ లెవల్ అధికారులను ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించాలని, ఏవైనా వ్యత్యాసాలను నమోదు చేయాలని, సందేహాస్పద నమోదులను మరింత పరిశీలన కోసం గుర్తించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించవచ్చు.
సెక్షన్ 22 ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాల్సిన విచారణ అనంతరం అర్హత లేదని స్పష్టంగా తేలిన వారి పేర్లను ఉదాహరణకు మరణించిన ఓటర్లు, సంబంధిత నియోజకవర్గంలో ఇక సాధారణ నివాసులుగా లేని వారు, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన వారు, భారత పౌరులు కానివారు ఓటరు జాబితా నుంచి తొలగించవచ్చు. ఇవన్నీ ఆర్టికల్ 324 మరియు ప్రజా ప్రతినిధుల చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాల పరిధిలోనే వస్తాయి.
కానీ 2003 నాటి ఓటరు జాబితాలో తన పేరు లేదా తన తల్లిదండ్రుల పేరు లేదనే కారణంతో ఏ ఓటరునైనా అర్హత లేనివారిగా ముందుగానే భావించడం ఆ తర్వాత చట్టంలో గానీ, ఓటర్ల నమోదు నియమాల్లో గానీ ఎక్కడా పేర్కొనని పత్రాలను సమర్పించి తన అర్హతను నిరూపించుకోవాలని ఆ ఓటరుపై భారం మోపడం మాత్రం SIR చట్టబద్ధంగా చేయలేదు.
ఒక ఓటరు పేరును జాబితా నుంచి తొలగించడానికి అవసరమైన రుజువు భారం ఓటరుపై కాకుండా ఎన్నికల నమోదు అధికారి పైనే ఉంటుంది.
బిహార్ SIR కేసులో 2025 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశంలో ఆధార్ మరియు EPICను చెల్లుబాటు అయ్యే పత్రాలుగా స్వీకరించాలని ఆదేశించింది. దీని ద్వారా మొదట రూపొందించిన లెగసీ లింకేజ్ నిబంధన చట్టం అనుమతించని రుజువు భారాన్ని ఓటర్లపై మోపిందని సుప్రీంకోర్టు పరోక్షంగా అంగీకరించినట్టే.
ఈ వ్యాసం ప్రస్తావిస్తున్నది కూడా ఆ చట్టవిరుద్ధమైన రుజువు భారం గురించే.
VI. పౌరులు ఏమి చేయాలి
మీ బూత్ లెవల్ అధికారి 2003 నాటి మీ తల్లిదండ్రుల ఓటరు నమోదు పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలని కోరితే మీ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.
మొదటిగా అధికారులతో సహకరించడానికి నిరాకరించవద్దు. ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపండి. మీ స్వంత EPIC, ఆధార్ కార్డులను సమర్పించండి. అలాగే ఫారంలో స్పష్టంగా ఇలా రాయండి.
ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఉండటంతో తల్లిదండ్రుల 2003 నాటి ఓటరు నమోదు వివరాలు గుర్తించడం సాధ్యం కాలేదు. నేను చట్టబద్ధమైన విధానంలో ఓటరుగా నమోదయ్యాను. నా EPIC, ఆధార్ కార్డులను జతపరుస్తున్నాను. నేను నమోదైన చిరునామాలోనే సాధారణ నివాసిగా ఉన్నాను.
ఇలా రాయడం వల్ల మీరు అధికారులతో పూర్తిగా సహకరించారని అలాగే చట్టం అనుమతించని ఒక డిమాండ్‌ను నెరవేర్చలేకపోయిన విషయాన్ని లిఖితపూర్వకంగా నమోదు చేసినట్లవుతుంది.
రెండవది జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన వెంటనే మీ పేరు అందులో ఉందో లేదో తప్పకుండా పరిశీలించండి. ఆలస్యం చేయవద్దు.
మీ పేరు తొలగించబడినా లేదా సందేహాస్పదంగా గుర్తించిన వెంటనే ఫారం 6 లేదా ఫారం 8 ద్వారా దరఖాస్తు చేయండి. అందులో ఈ అంశాలను స్పష్టంగా పేర్కొనండి.
(a) సెక్షన్ 19 ప్రకారం ఓటరుగా నమోదు కావడానికి కేవలం రెండు అర్హతలే ఉన్నాయి. 18 సంవత్సరాల వయస్సు మరియు సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండటం.
ప్రజా ప్రతినిధుల చట్టం లోని సెక్షన్ 20(3) ప్రకారం సేవా సిబ్బంది కుటుంబాలు ఇలాంటి పత్రాల ఆధారిత ఇబ్బందులు ఎదుర్కోకుండా చట్టపరమైన రక్షణ కల్పించబడింది.
(c) సెక్షన్ 22లోని ప్రొవైజో ప్రకారం ఓటరు పేరును తొలగించే ముందు తప్పనిసరిగా విచారణ నిర్వహించి సంబంధిత వ్యక్తికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. అలాంటి విచారణ లేకుండా పేరు తొలగించడం చట్టవిరుద్ధం.
(d) ఆధార్, EPICలను గుర్తింపు మరియు నివాసానికి చెల్లుబాటు అయ్యే ఆధారాలుగా స్వీకరించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
ఈ దరఖాస్తుతో పాటు మీ ఆధార్, EPIC ప్రతులను కూడా జత చేయండి.
మూడవది మీకు విచారణ అవకాశం ఇవ్వకుండా మీ దరఖాస్తును తిరస్కరిస్తే ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేయండి. అదే సమయంలో జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించండి.
నాలుగవది ప్రధాన ఎన్నికల అధికారి నుంచి కూడా సంతృప్తికరమైన స్పందన రాకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం పంజాబ్–హర్యానా హైకోర్టును ఆశ్రయించండి. ఇందుకు అవసరమైన చట్టపరమైన వాదనలు మీకు అందుబాటులో ఉన్నాయి. చట్టపరమైన నిబంధనలు కూడా మీ పక్షాన ఉన్నాయి. అయితే ఆగస్టు చివరి వారం వరకు వేచి ఉండకుండా ఆగస్టు మొదటి వారంలోనే చర్యలు ప్రారంభించండి.
VII. రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు
ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ (BLA)ను జూన్ 25లోపే శిక్షణ ఇచ్చి లెగసీ లింకేజ్ పేరుతో ఇలాంటి డిమాండ్ చేసినప్పుడు దాన్ని గుర్తించేలా సిద్ధం చేయాలి. అలాగే బూత్ లెవల్ అధికారి నిర్వహించే ఎన్యూమరేషన్ రికార్డులో ఈ విధంగా లిఖితపూర్వకంగా నమోదు చేయాలి:
ఓటరు తన EPIC, ఆధార్ కార్డులను సమర్పించారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఉండటం వల్ల [లేదా వలస / కుటుంబ పరిస్థితుల కారణంగా] తల్లిదండ్రుల 2003 నాటి ఓటరు నమోదు వివరాలు గుర్తించడం సాధ్యం కాలేదు. 1950 ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం విచారణ నిర్వహించకుండా ఓటరు పేరును తొలగించడాన్ని పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ ఒక్క వ్యాఖ్యను సందేహాస్పదంగా గుర్తించిన ప్రతి ఓటరు విషయంలో ఒకే విధంగా నమోదు చేస్తే ఎన్నికల నమోదు అధికారి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా దానిని విస్మరించలేని విధంగా ఒక ఆధారపూర్వక రికార్డు ఏర్పడుతుంది.
అలాగే బూత్ లెవల్ ఏజెంట్ తన పాత్ర కేవలం బూత్ లెవల్ అధికారి చేస్తున్న పనిని చూసే సాక్షిగా ఉండటమే కాదని అర్థం చేసుకోవాలి. ఓటరు ఓటు హక్కు రక్షించబడుతుందా లేదా దెబ్బతింటుందా అనే కీలక దశలో ఆయన తన రాజకీయ పార్టీ తరఫున చట్టపరంగా చురుకుగా వ్యవహరించే ప్రతినిధి.
ఇదే సమయంలో బూత్ స్థాయి సందర్శనలు ప్రారంభమయ్యేలోపే రాజకీయ పార్టీలు ఒక డేటా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాలి. పంజాబ్‌లోని 25,000 బూత్‌లకు సంబంధించిన ప్రస్తుత ఓటరు జాబితాలను డౌన్లోడ్ చేసి 2003 తర్వాత ఓటరుగా నమోదైన వారిని గుర్తించాలి. అలాగే వారు నమోదైన చిరునామాలోనే వారి EPIC, ఆధార్ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.
తమ స్వంత EPIC, ఆధార్ వంటి పత్రాలతో తమ వివరాలను నిరూపించగలిగే ఓటర్లకు, తల్లిదండ్రుల పాత ఓటరు నమోదు వివరాలను చూపలేకపోయినా చట్టపరంగా రక్షణ ఉంటుంది.
జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రతి పేరు తొలగింపుకు పేర్కొన్న కారణాలను తప్పనిసరిగా పరిశీలించాలి. బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కారణాలను ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా ప్రకటించాలి.
లెగసీ లింకేజ్ పరిష్కారం కాలే్ఉ అనే కారణంతో తొలగించిన ప్రతి ఓటరు విషయంలో ఒకే విధమైన చట్టపరమైన అభ్యర్థనను వెంటనే దాఖలు చేయాలి.
ఇలాంటి ప్రామాణిక నమూనాను రాజకీయ పార్టీలు ముందుగానే సిద్ధం చేసుకుంటే ప్రతిసారి కొత్తగా దరఖాస్తు తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక దరఖాస్తు తయారు చేయడానికి పట్టే సమయంలోనే వందలాది అభ్యర్థనలను దాఖలు చేయగలుగుతారు.
VIII. SIR దాటకూడని పరిమితి
2003లో జరిగిన SIRకు ఇప్పుడు 23 సంవత్సరాలు గడిచాయి. ఈ మధ్యకాలంలో చట్టబద్ధంగా ఓటరుగా నమోదైన ప్రతి వ్యక్తి చట్టం నిర్దేశించిన రెండు అర్హతలను—అంటే వయస్సు మరియు సాధారణ నివాసం —పూర్తి చేసిన తర్వాతే నమోదు అయ్యారు.
ఈ కాలంలో అనేక కుటుంబాలు నివాసం మార్చుకున్నాయి. మాజీ సైనిక ఉద్యోగులు తమ సేవా కాలంలో ఉన్న చిరునామాలకు భిన్నమైన చోట పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు. చాలా కాలంగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాల్లో జన్మించిన పిల్లలు పెద్దవారై, ఓటరుగా నమోదై, ఎన్నో ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. అయితే వారు పదేళ్ల వయస్సులో ఉన్న సమయంలో అంటే 2003లో తమ తల్లిదండ్రుల పేరు ఓటరు జాబితాలో ఉందని నిరూపించమని వారిని అప్పటివరకు ఎప్పుడూ ఎవరూ అడగలేదు.
ప్రజా ప్రతినిధుల చట్టం ఎప్పుడూ విధించని రుజువు భారాన్ని చట్టపరమైన అధికారం లేకుండా గతానికి వర్తించేలా ఇప్పుడు ఈ ఓటర్లపై SIR విధించలేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. కానీ అవి అపరిమితమైనవి కావు. రాజ్యాంగం, ప్రజా ప్రతినిధుల చట్టం ఎన్నికల కమిషన్ తన సౌలభ్యానికి అనుగుణంగా మార్చుకోగల పరిపాలనా మార్గదర్శకాలు కావు.
అవి ఎన్నికల కమిషన్ సహా ఏ సంస్థ అయినా తన అధికారాలను వినియోగించాల్సిన చట్టపరమైన హద్దులను నిర్ణయిస్తాయి. ఎంత చట్టబద్ధమైన ప్రక్రియ అయినప్పటికీ ఆ హద్దులలోనే ఉండాలి. ఆ హద్దులను దాటి అమలు చేసే ఏ విధానమైనా రాజ్యాంగబద్ధమైన అధికార వినియోగం కాదు. అది రాజ్యాంగం నిర్దేశించిన పరిమితుల నుంచి చేసిన ఒక విరుద్ధ చర్య.
పటియాలా ఓటరు గత 15 సంవత్సరాలుగా చట్టబద్ధంగా నమోదైన ఓటరుగా ఉన్నారు. ఆయన తల్లి కూడా అదే చిరునామాలో దశాబ్దాలుగా ఓటు వేస్తున్నారు. ఆయన తండ్రి ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 20(3) ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకునే విధంగా దేశ సేవలో పనిచేశారు.
ఆ చిరునామాలో వారి కుటుంబానికి ఉన్న మూలాలు ప్రతి ఇంటి వద్ద ఉన్న పత్రాల ద్వారా అలాగే తల్లి పేరు కనిపించిన ప్రతి ఓటరు జాబితా సవరణలో స్పష్టంగా నిర్ధారించబడుతున్నాయి.
2002 నాటి బేస్ రోల్‌పై ఆధారపడి 2025లో రూపొందించిన ఏ క్షేత్రస్థాయి అల్గోరిథమ్ కూడా విచారణ లేకుండా, చట్టపరమైన అధికారం లేకుండా మరియు అసలు లేని చట్టబద్ధమైన ఆధారం లేకుండా ఆ ఓటు హక్కును తీసివేయలేదు.
చట్టమే ఈ ఓటరుకు అతని నమోదు హక్కును ఇస్తుంది. చట్టమే ఆ నమోదును రక్షిస్తుంది. SIRలో అనుసరిస్తున్న విధానం చట్టాన్ని అధిగమించలేదు.
అనువాదం : మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
