ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో ఉన్న ఒక పేపర్ ప్లేట్ తయారీ కర్మాగారంలో జరిగిన ఘోర కలి వెలుగులోకి వచ్చింది. 21వ శతాబ్దం, విశ్వ గురువు, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదాలతో మారు మోగుతున్న కాలంలో ఇది జరిగింది. అందునా డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో జరిగింది.
వివరాల్లోకి వెళితే ముజఫర్ నగర్ జిల్లాలో ఒక పేపర్ ప్లేట్ తయారీ ఫ్యాక్టరీలో, నెలకు ₹10,000 ఇస్తామనే వాగ్దానంతో 13 మంది పురుషులను ప్రలోభపెట్టి తీసుకొచ్చారు. కానీ జరిగింది ఘోరాతి ఘోరం. మాటల్లో వర్ణించలేని కిరాతకపు సంఘటన. ఫ్యాక్టరీ పనికి తీసుకువచ్చిన 13 మందిని లోపల వేసి తాళం పెట్టారు. వారి ఆధార్ కార్డులను తగులబెట్టారు. ఫోన్లను లాక్కున్నారు. వారు ఉదయం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు పనిచేశారు. ఎండు రొట్టె, ఉప్పు తింటూ బతికారు. ఇనుప రాడ్లు, ఈటెలతో దెబ్బలు తిన్నారు. ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నిస్తే పిట్‌బుల్ కుక్కలతో వెంటాడించారు. ఒక వ్యక్తి తన కుటుంబంతో మాట్లాడకుండా దాదాపు రెండేళ్లు గడిపాడు. మరొకరి చెయ్యి విరిగింది. ఒక నేపాలీ కార్మికుడు హింస కారణంగా మరణించినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని ఒక సంచిలో వేసి పడేశారు. ఈ ఘోరం వెలుగులోకి రావడానికి ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి ఫ్యాక్టరీ గోడ దూకి పారిపోవాల్సి వచ్చింది.
ఇది ఏదో ఒక వివిక్త సంఘటన కాదు. భారతదేశం 1976 లోనే వెట్టిచాకిరీని చట్టం ద్వారా నిషేధించింది. అయినప్పటికీ, నేడు దేశవ్యాప్తంగా ఇటుక బట్టీలు, పొలాలు, గనులు, ఫ్యాక్టరీ లలో సుమారు 18 మిలియన్ల( ఒక కోటి 80 లక్షలు) మంది ప్రజలు ఇప్పటికీ అప్పుల ఊబిలో, వెట్టిచాకిరీలో చిక్కుకుని ఉన్నారు. 2030 నాటికి వారందరినీ విముక్తి చేసి, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గత ఏడాది, అది కేవలం 468 మందిని మాత్రమే విముక్తి చేయగలిగింది. కేవలం ప్రచారం కోసం, అంతర్జాతీయ వేదికల మీద ఘనంగా ప్రకటించుకోవడానికి మాత్రమే ప్రభుత్వం చెప్తున్న మాటలు, ప్రకటనలు అని దీనినిబట్టి రుజువు చేస్తున్నాయి.
ఒక్క గోడను మాత్రమే దాటగలిగారు. ఇంకా మిలియన్ల కొద్దీ గోడలు మిగిలే ఉన్నాయి.
సేకరణ: సి.ఐ.టి.యు అఖిలభారత కేంద్రం.
అనువాదం: ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
