చెన్నై డివిజన్లో జూన్ 28, 2026 రాత్రి వేరే గమ్య స్థానానికి తప్పు మార్గంలో వెళ్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలును లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ఆపడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని నివారించారు.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, గత ఆదివారం రాత్రి ట్రైన్ నంబర్ 17654 (పుదుచ్చేరి – కాచిగూడ ఎక్స్‌ప్రెస్) అరక్కోణం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ రైలు రేణిగుంట వైపు వెళ్లేందుకు సిగ్నల్ క్లియర్ అయినప్పటికీ, పాయింట్ (ట్రాక్ మారే వ్యవస్థ) మాత్రం కాట్పాడి లైన్‌కు సెట్ అయి ఉంది.
దాదాపు 900 మంది ప్రయాణికులతో ఉన్న ఈ రైలు తప్పు దిశలో వెళ్తోందని గ్రహించిన లోకో పైలట్లు వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపేశారు. రైలు తప్పు ట్రాక్‌లోకి ప్రవేశించినట్లు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత లోకో పైలట్లు స్టేషన్ మేనేజర్‌ను అప్రమత్తం చేసి, రైలును తిరిగి వెనక్కి అరక్కోణం వైపునకు నడిపించారని సమాచారం.
దక్షిణ రైల్వే అరక్కోణం యార్డ్‌ను కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునీకరించే పనులను పూర్తి చేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆ సెక్షన్లో పనులు జరుగుతుండటం వల్ల సిగ్నల్స్, పాయింట్లను మాన్యువల్‌గా ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. రైలు అరక్కోణం వైపు వెళ్లేందుకు సిగ్నల్ క్లియర్ అయినప్పటికీ, పాయింట్ మాత్రం కాట్పాడి వైపు వెళ్లే ట్రాక్‌కు సెట్ చేయబడింది.
ఒకవేళ లోకో పైలట్లు ఈ సమస్యను గుర్తించకుండా, రైలును ఆపక పోయి ఉంటే అతి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే, ఈ ఘటన పై రైల్వే శాఖ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ది హిందూ సౌజన్యంతో
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
