డెమోక్రటిక్ పార్టీ అఖండ విజయంతో, ట్రంప్, మితవాద, శ్వేతజాతీయవాద శక్తులకు లెక్కలు సరిచేసే రోజు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ శక్తులు క్రూరత్వాన్ని ఒక పాలనా సూత్రంగా, ద్వేషాన్ని రాజకీయ భాషగా మార్చాయి. అటువంటి లోపభూయిష్టమైన భయానక వాతావరణం ఈ ఎన్నికల్లో ఒక మేరకు సరిదిద్దబడింది.
పాత ఫాసిస్ట్ భావాలు, జాతి ద్వేష రాజకీయాలు, మానవ గౌరవంపై నిరంతరం సాగిన దాడులు గట్టి ప్రతిఘటనను చవిచూశాయి.
బాధ, క్షోభ, నిరంకుశ హింస పెద్ద ఎత్తున సాగాయి. వీధుల్లో చాలా రక్తం చిందింది; అనేక మరణాలు, నిస్సహాయుల రోదనలు, కేకలు, మౌనం చోటుచేసుకున్నాయి. ఇక చాలు, కనీసం ప్రస్తుతానికైతే ఇది ముగిసింది.
రాజ్యం హింసను మహిమపరచడం, జాతి ప్రక్షాళనకు పాల్పడటం, అసమ్మతిని అణచివేయడం, వ్యవస్థీకృత క్రూరత్వం ఎక్కడికి దారితీస్తాయో మనకు ట్రంప్ పాలనా యంత్రాంగం మళ్లీ గుర్తుచేసింది.
దాని వారసత్వం కారాగార వ్యవస్థ విస్తరణలో, జైళ్లు, శిక్షలపై భారీ పెట్టుబడుల్లో, దేశవ్యాప్తంగా అణచివేత ముసుగు వేసుకున్న ఏజెంట్లను వదలడంలో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే జాతి ప్రక్షాళన భాషను ఎలాంటి మొహమాటం లేకుండా కౌగిలించుకోవడం ద్వారా ప్రజా జీవితంలో మానవత్వాన్ని హరించి, జీవితాలను, పౌర స్వేచ్ఛను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
వేడుకల మాటున చారిత్రక మరుపు ప్రమాదం
అయినప్పటికీ ఉదారవాద, ప్రధానస్రవంతి మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్న వేడుకలు ఈ ఎన్నికల విజయాన్ని చారిత్రక జ్ఞాపకశక్తి లోపంగా మార్చే ప్రమాదం ఉంది. ట్రంప్ ఓటమిని మితవాద శక్తులకు ఎదురుదెబ్బగా కొనియాడుతున్నారు.
అయితే, ఆయన ఎదుగుదలకు కారణమైన రాజకీయ పరిస్థితులు అకస్మాత్తుగా మాయమైపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విజయగర్వపు కథనంలో, ఆ పరిస్థితులను సృష్టించడంలో డెమోక్రటిక్ పార్టీ స్వీయ తప్పిదాల భాగస్వామ్యంపై తీవ్రమైన విమర్శ లేదు.
క్లింటన్ నుంచి ఒబామా వరకు, డెమోక్రటిక్ ప్రభుత్వాలు నయా-ఉదారవాద విధానాలను అవలంబించాయి. ఇవి ఆర్థిక అసమానతలను తీవ్రతరం చేశాయి, కార్పొరేట్ ఆధిపత్యాన్ని బలపరిచాయి, కార్మిక సంఘాలను బలహీనపరిచాయి. నిరంకుశత్వం పురోగమించడానికి కావాల్సిన సామాజిక, రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో ఇతోధికంగా సహాయపడ్డాయి.
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న నరమేధ యుద్ధానికి మద్దతుగా నిలబడటం, విధ్వంసకర సైనిక ఆయుధాలను ఎగుమతి చేయడం, హింస, విస్థాపన ద్వారా కొనసాగుతున్న వలసరాజ్యాల నిరంకుశ వ్యవస్థకు అండగా నిలబడటం వంటి ఘోర తప్పిదాల నుంచి పార్టీ నాయకత్వం తప్పించుకోలేదు.
నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానపు యంత్రాంగంలో ఇంతగా కూరుకుపోయిన పార్టీకి, అది స్వయంగా చట్టబద్ధం చేసి పరిరక్షించిన అధికార నిర్మాణాలను కూల్చివేసే బాధ్యతను అప్పగించలేం.
ఎన్నికల ఓటమితో అంతం కాని వ్యవస్థ
క్షణం పాటు, ప్రజాస్వామ్యం మళ్లీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఊపిరి పీల్చుకోవడం అంటే విముక్తి కాదు. ఎన్నికల విజయం అనేది నిరంకుశత్వాన్ని పెంచిపోషిస్తున్న, మానవ ఈతిబాధలపై ఆధారపడే, జీవితంలోని ప్రతి అంశాన్ని సరుకుగా మార్చే ఫాసిజం ఎప్పటికీ నిలదొక్కుకునేలా చేసే గ్యాంగ్‌స్టర్ పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చివేయడానికి ప్రత్యామ్నాయం కాలేదు.
ట్రంప్‌ను సృష్టించిన శక్తులు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కావు, ఎన్నికల ఓటమితో మాయం కూడా కావు. అవి సంపదను కేంద్రీకరించే, భయాలను సృష్టించే, అసమానతలను సాధారణం చేసే, మానవ దుస్థితిని లాభంగా, రాజకీయ శక్తిగా మార్చే సంస్థల్లో అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి.
బ్యాలెట్ బాక్స్ వద్ద ట్రంప్ ఓడిపోవచ్చు, కానీ దురాశను పుణ్యంగా, క్రూరత్వాన్ని విధానంగా, జాతివిద్వేషాన్ని గౌరవ చిహ్నంగా, అమానవీయతను పాలనా సూత్రంగా మార్చే వ్యవస్థ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులను పెకిలించకుండా ట్రంపిజాన్ని ఓడించలేం.
ఆ పునాదులను కూల్చివేయకపోతే, బహుశా వేరే ముసుగు వేసుకుని ఈ పీడకల మళ్లీ వస్తుంది. ఇంగ్మార్ బెర్గ్మాన్ ప్రదర్శించిన భయానక రూపకం వివరించినట్లు రాజకీయ ప్రతినిధులు ఓడిపోయినంత మాత్రాన ఫాసిజం పూర్తిగా మాయం కాదనే హెచ్చరిక మన గమనంలో ఉండాలి.
ఇది ప్రజాస్వామ్య సమాజాల ముసుగు కింద అంతర్గతంగా దాగి ఉంటుంది. అసమానత, నిరంకుశత్వం, వ్యవస్థీకృత క్రూరత్వాన్ని పెంచే పెట్టుబడిదారీ వ్యవస్థలో అలగా శక్తుల ద్వారా ఇది పోషించబడుతుంది.
ఫాసిజానికి దారితీసే పెట్టుబడిదారీ ఆధిపత్య సంబంధాలను బట్టబయలు చేయకుండా దానిని ఎదుర్కోలేమని బ్రెక్ట్ అర్థం చేసుకున్నారు. దాని విషపూరిత విత్తనాలు గ్యాంగ్‌స్టర్ పెట్టుబడిదారీ విధానపు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థల్లో ఇంకా నిక్షిప్తమై ఉన్నాయి, అవి మళ్లీ తలెత్తే పరిస్థితుల కోసం ఎదురుచూస్తుంటాయి.
ఫాసిజం ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ దానికి ఊపిరిపోసిన వ్యవస్థ ద్వారానే ఆ విషసర్పం బతికి బట్టకడుతుంది.
న్యూరెంబర్గ్ స్ఫూర్తితో జవాబుదారీతనం
ఎన్నికల విజయోత్సవాల కింద కప్పిపెట్టలేని మరో చారిత్రక పాఠం ఉంది— అదే న్యూరెంబర్గ్ విచారణల స్ఫూర్తిని పునరుద్ధరించడం.
ప్రభుత్వ అధికారం మాటున లేదా ఆదేశాలను అనుసరిస్తున్నామనే సాకుతో రాజ్య నేరాలకు పాల్పడినవారు, ఆదేశాలు ఇచ్చినవారు, అమలు చేసేవారు తప్పించుకోలేరని న్యూరెంబర్గ్ ఒక న్యాయసూత్రాన్ని రూపొందించింది.
అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న పడవలపై ఉన్న వ్యక్తులను చంపడం(ఇది యుద్ధ నేరాల కిందకు వస్తుందని నిపుణులు హెచ్చరించారు), ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి ప్రజలను అపహరించడం, నిర్బంధించడం, దేశం నుంచి బహిష్కరించడం వంటి నేర విచారణ జరపాల్సిన చర్యలకు ట్రంప్ పాలనా యంత్రాంగం పాల్పడింది.
ఈ అధికార దుర్వినియోగాలపై దర్యాప్తు జరిగేలా చూసే బాధ్యత డెమోక్రటిక్ పార్టీపై ఉంది. అటువంటి విధానాలను నిర్దేశించిన లేదా ప్రోత్సహించిన పీట్ హెగ్సెత్ నుండి స్టీఫెన్ మిల్లర్ల వరకు వారు ఎవరైనా సరే, నేరస్థులుగా తేలిన వారిని బాధ్యులను చేయాలి.
న్యాయాన్ని బలిచ్చి చేసే సయోధ్య ఉండకూడదు, వ్యవస్థీకృత మరపుపై నిర్మించిన జాతీయ పునరుజ్జీవనం ఉండకూడదు, రాజ్య యంత్రాంగాన్ని ఉగ్రవాద సాధనంగా మార్చిన వారికి శిక్ష నుండి మినహాయింపునిచ్చే ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉండకూడదు.
చరిత్ర అదే రూపంలో పునరావృతం కాదనేదే న్యూరెంబర్గ్ పాఠం. రాజ్యాధికార ముసుగులో జరిగే నేరాలను చట్టబద్ధమైన పాలన ద్వారా బహిర్గతం చేయాలి, విచారించాలి, శిక్షించాలి. ఈ బాధ్యత నిర్వర్తించకపోతే, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ పేరిట సాధించిన ఎన్నికల విజయం మరో బోలు నినాదంగా మారిపోతుంది, నిరంకుశ హింసాత్మక శక్తులు తిరిగి తలెత్తడానికి అవకాశం లభిస్తుంది.
అసలైన పరివర్తనకు నిరంతర ప్రజా పోరాటమే మార్గం
ఇది ఒక చారిత్రక రాజకీయ నిరాకరణ అని చెప్పడంలో నేను దాని పరిమాణాన్ని తక్కువ చేసి చూడదలచుకోలేదు. రయాన్ బోర్ట్ అన్నట్లుగా డెమోక్రాట్లు హౌస్, సెనేట్లను కైవసం చేసుకున్నారు, ఒకప్పుడు తమకు అసాధ్యమని భావించిన గవర్నర్‌షిప్‌లను దక్కించుకున్నారు, ట్రంప్, రిపబ్లికన్ పార్టీలను ఘోర ఓటమి పాల్జేశారు.
జెఫ్రీ సెయింట్ క్లైర్ ఇమెయిల్‌లో గుర్తుచేసినట్లుగా, “గ్రహం మీద అత్యంత నీచమైన కొంతమంది వ్యక్తుల ఘోర ఓటమిని” క్షణం పాటు వేడుక చేసుకోవడంలో సిగ్గుపడనక్కర్లేదు.
రాజకీయ శక్తిని కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడాన్ని, ఓటింగ్ హక్కులపై జరిగిన దాడిని, సుప్రీంకోర్టు కల్పించిన జెర్రిమ్యాండరింగ్ ద్వారా ఓటర్ల జాబితాను తారుమారు చేసిన తీరును అధిగమించడాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు.
ఎల్ సయ్యద్ పాలస్తీనా అనుకూల ప్రచారంతో AIPAC, ఇస్లాం విద్వేషకులను ఎదుర్కొని విజయం సాధించడం కూడా అభినందనీయం. ఇవన్నీ కలిపి జాతి విద్వేషం, బిలియనీర్ ఆధిపత్యం, నిరంకుశ పాలనా యంత్రాంగాన్ని శక్తిమంతంగా తిరస్కరించడాన్ని సూచిస్తాయి. అయినప్పటికీ, వేడుకలు రాజకీయ విమర్శకు ప్రత్యామ్నాయం కాకూడదు.
బ్యాలెట్ బాక్స్ వద్ద ట్రంపిజం ఓడిపోయినంత మాత్రాన, దానికి కారణమైన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక శక్తులు తుడిచిపెట్టుకుపోయాయని అర్థం కాదు.
తాము సేవ చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థతో తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడని, నిస్తేజమైపోయిన డెమోక్రటిక్ పార్టీ పాత నాయకత్వం నుండి అసలైన పరివర్తన ఆశించలేం. అది వీధుల నుండి, సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం నుండి, చరిత్ర నుండి తమను తుడిచిపెట్టాలనే ప్రయత్నాలను తిరస్కరించే యువత నుండి— పొదుపు చర్యలు, భయం, జాతి విద్వేష రాజకీయాలను తిరస్కరించే సమిష్టి పోరాటాల నుండి వస్తుంది.
ఎన్నికలు నిరంకుశత్వం వైపు సాగే పయనాన్ని అడ్డుకోవచ్చు— ఇది ఒక కీలకమైన విధి— కానీ ఫాసిజాన్ని సాధ్యం చేసే అసంఖ్యాక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను అవి రద్దు చేయలేవు.
ప్రజాస్వామ్యాన్ని సంపద, సైనికవాదం, కార్పొరేట్ ఆధిపత్యానికి లొంగేలా చేసిన అధికార నిర్మాణాలకు వ్యతిరేకంగా ఈ ప్రతిఘటనను నిరంతర పోరాటంగా మార్చడమే ఇప్పుడున్న కర్తవ్యం.
భవిష్యత్తును సూట్లు వేసుకున్న రాజకీయ ఉన్నతవర్గాలకు అప్పగించలేం. వారు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని వాగ్దానం చేస్తూనే దానిని నాశనం చేస్తున్న ఆర్థిక వ్యవస్థను సంరక్షిస్తారు.
ఈ పోరాటం కేవలం ఒక నిరంకుశ నాయకుడిని ఓడించడం కోసం కాదు, నిరంకుశత్వాన్ని సాధ్యం చేసే వ్యవస్థను కూల్చివేయడానికి, న్యాయం, సమానత్వం, సమిష్టి స్వేచ్ఛ, మానవ గౌరవం ప్రజాస్వామ్య జీవితానికి పునాదులుగా ఉండే ప్రపంచాన్ని నిర్మించడానికి జరగాలి.
( వ్యాస రచయిత హెన్రీ ఎ జిరూక్స్ ప్రస్తుతం ఇంగ్లీష్ అండ్ కల్చరల్ స్టడీస్ విభాగంలో పబ్లిక్ ఇంటరెస్ట్ స్కాలర్షిప్ కోసం మెక్‌మాస్టర్ యూనివర్సిటీ చైర్‌గా పని చేస్తున్నారు. పాలో ఫ్రీరే క్రిటికల్ పెడగాజీలో విశిష్ట ఆచార్యులు.)
(కౌంటర్ పంచ్ వెబ్ పత్రిక సౌజన్యంతో) అనువాదం: కె. సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
