ఐడీబీఐ విక్రయం తర్వాత, నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను తగ్గించాలని ప్రతిపాదించిన తీరు, కేంద్ర ప్రభుత్వ వాటాల ఉపసంహరణ వ్యూహంపై, భారతదేశంలో ప్రభుత్వ బ్యాంకింగ్ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను తగ్గించాలనే, మరొక రెండింటిని ప్రైవేట్ కొనుగోలుదారులకు అప్పగించాలనే ప్రతిపాదిత ప్రణాళికను రెగ్యులేటరీ నిబంధనల అమలుగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ గణాంకాలు ఒక ఆర్థిక సర్దుబాటు వ్యూహాన్ని సూచిస్తున్నాయి, దీని భారం తమ హక్కుల కోసం బేరమాడే శక్తి లేని బలహీన వర్గాలపై పడుతుంది.
అక్టోబర్ 14న, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCEA) ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) 60.72 శాతం వాటాను కెనడియన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్(Fairfax Financial Holdings) అనుబంధ సంస్థకు ₹52,878 కోట్లకు విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.
తొమ్మిది రోజుల తర్వాత, కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు బ్యాంకుల్లో — సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్(UCO Bank), పంజాబ్ & సింధ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) — తన వాటాను 75 శాతానికి తగ్గించడాన్ని పరిశీలిస్తోందని, అలాగే రెండు బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు మరో విలీనం/సంస్కరణల రౌండ్‌ను సిద్ధం చేస్తోందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ (IOB) నీతి ఆయోగ్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.
కచ్చితంగా చెప్పాలంటే, ప్రస్తుత ప్రతిపాదన ఇంకా ఈ నాలుగు బ్యాంకుల పూర్తి విక్రయం కాదు. 75 శాతం వాటా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుంది.
అయితే, ఒక బ్యాంకులో నియంత్రణ వాటాను విదేశీ సంస్థకు విక్రయించిన కొన్ని రోజులకే ఈ స్థాయిలో వాటాల తగ్గింపును ప్రకటించడం, దీనిని ఒక పెద్ద ప్రక్రియలో మొదటి విడత (ఇన్స్టాల్మెంట్)గా భావించవచ్చు.
నిబంధనలను పాటించడమనేది ఒక నెపమే
లిస్టెడ్ కంపెనీలు తమ ఈక్విటీలో కనీసం 25 శాతాన్ని ప్రజా యాజమాన్యంలో (పబ్లిక్ హోల్డింగ్) ఉంచాలనే మార్కెట్ రెగ్యులేటర్ (SEBI) నిబంధనను అధికారిక వివరణగా చెబుతున్నారు.
అయితే ఈ నిబంధన ప్రభుత్వాన్ని ఎన్నడూ కట్టడి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 2013 నుంచి ఈ గడువును పదేపదే పొడిగించింది, 2021లో మినహాయింపులు ఇచ్చే అధికారాన్ని స్వయంగా కల్పించుకుంది. తాజా పొడిగింపు 2026 ఆగస్టు 1 వరకు అమల్లో ఉంది.
నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా దాదాపు 8 శాతం వాటాను విక్రయించింది.
వాటాల తగ్గింపుకు ఎంచుకున్న విధానం అనేక విషయాలను వెల్లడిస్తోంది. ఒక బ్యాంక్ సంస్థాగత పెట్టుబడిదారులకు కొత్త షేర్లను జారీ చేసినప్పుడు, ఆ డబ్బు బ్యాంకుకు చేరుతుంది, అక్కడ అది రుణాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆఫర్ ఫర్ సేల్(OFS)లో, కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తుంది, ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది.
ప్రభుత్వం OFS మార్గాన్నే కోరుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి, అయినప్పటికీ ఈ నాలుగు బ్యాంకులకు మూలధన కొరత ఏమీ లేదు: మార్చి 2026 నాటికి, బఫర్‌తో సహా 11.5 శాతం నిబంధనతో పోలిస్తే, వీటి మూలధన పర్యాప్తత నిష్పత్తులు(Capital Adequacy Ratios) 17.4 నుండి 19.8 శాతంగా ఉన్నాయి.
ఈ కసరత్తు ద్వారా ప్రభుత్వానికి లభించేది రాబడి మాత్రమే గానీ, రుణాల విస్తరణ కాదు. జాతీయీకరణ చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కనీసం 51 శాతం వాటాను కలిగి ఉండాలి, అందుకే ప్రైవేటీకరణకు కొత్త చట్టం అవసరం; 75 శాతం వాటా అనేది ఆ మార్గంలో ఒక తాత్కాలిక దశ మాత్రమే.
2021 బడ్జెట్లో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించారు, ఆ మార్చిలో బ్యాంక్ యూనియన్లు దీనికి నిరసనగా సమ్మె చేశాయి. ఐదేళ్ల తర్వాత, ఐడీబీఐ విక్రయం దీనికి ఒక నమూనాగా మారింది.
అలాగే ఇది సుదీర్ఘ చర్చల ఫలితం కూడా కాదు. బడ్జెట్లో ‘వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్ ఉన్నత స్థాయి కమిటీ’ ఏర్పాటుపై హామీ ఇచ్చినప్పటికీ, సంస్కరణలకు సంబంధించి ఎటువంటి రోడ్‌మ్యాప్ తన వద్ద లేదని ఆర్థిక మంత్రి ఫిబ్రవరిలో చెప్పారు. ఆగస్టులో దానిని “త్వరలో” ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ కమిటీ నివేదిక రాకముందే ముగింపులు వచ్చేస్తున్నాయి.
బాగుచేసి, ఆపై విక్రయించడం
ప్రైవేట్ యాజమాన్య అనుకూల వాదన గత దశాబ్దపు మొండి బకాయిల సంక్షోభాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (Gross NPAs) 2017-18లో గరిష్ఠంగా 14.58 శాతానికి చేరగా, ఇప్పుడు అవి 1.93 శాతానికి తగ్గాయి.
ఈ నాలుగు బ్యాంకులు ఆ చరిత్రలోనూ, దాని పునరుద్ధరణలోనూ భాగమే. ఏప్రిల్ 2021లో కేంద్ర ప్రభుత్వం ₹11,500 కోట్లు అందించినప్పుడు ఈ నాలుగింటిలో మూడు బ్యాంకులు — సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ, యూకో బ్యాంక్ — ఆర్బీఐ ‘ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్’ (PCA) పరిధిలో ఉన్నాయి; పంజాబ్ & సింధ్ బ్యాంక్ అంతకుముందు నవంబర్‌లో ₹5,500 కోట్లను పొందింది.
2025-26లో, ఈ నాలుగు బ్యాంకులు కలిసి ₹13,667 కోట్లు ఆర్జించాయి. ఐఓబీలో 1.42 శాతం, యూకో బ్యాంక్‌లో 2.17 శాతం, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 2.40 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 2.67 శాతం నిరర్థక ఆస్తులతో లాభాల బాట పట్టాయి.
ఈ సంక్షోభం ప్రభుత్వ యాజమాన్య వైఫల్యం వల్ల వచ్చిందనే వాదనను సమర్థించడం కష్టం. 2000ల మధ్యకాలంలో రుణాల విచ్చలవిడి పంపిణీ ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా జరిగింది.
2020లో రెగ్యులేటర్ యెస్ బ్యాంక్ (Yes Bank) రక్షణకు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ (Lakshmi Vilas Bank) విలీనానికి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ బ్యాంకులను బాగుచేసింది మూలధనం, కఠినమైన పరిష్కార వ్యవస్థ మాత్రమే, వీటికి యాజమాన్య మార్పు అవసరం పడలేదు. అయినప్పటికీ, నష్టాలను సమాజం భరించడం, పునరుద్ధరణ ఖర్చులను ప్రజలు చెల్లించడం, పుంజుకున్నాక యాజమాన్యాన్ని విక్రయించడం అనే క్రమం ప్రజలపై రెట్టింపు భారాన్ని మోపుతోంది.
ఐడీబీఐ విక్రయం ద్వారా అర్థమయ్యే విషయాలు
ఐడీబీఐ విక్రయ ధర ఇటువంటి అమ్మకాలు ఎలా జరుగుతాయో చూపుతోంది. ఫెయిర్‌ఫాక్స్ ఆఫర్ చేసిన ₹81 షేరు ధర, ప్రభుత్వం నిర్ణయించిన రెండు స్వతంత్ర మూల్యాంకనాల సగటు ధర ₹75.99 కంటే ఎక్కువ. కానీ అక్టోబర్ 14 నాటికి, ఐడీబీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹97,191 కోట్లుగా ఉండగా, 60.72 శాతం వాటా విలువ దాదాపు ₹59,000 కోట్లుగా ఉంటుంది.
అయితే అది ₹52,878 కోట్లకు విక్రయించారు, అంటే దాదాపు ₹6,100 కోట్లు (10 శాతం) తక్కువ ధరకు అమ్మారు. ప్రజా వాటా తక్కువగా ఉన్న ప్రభుత్వ బ్యాంక్ ధరను కొనుగోలుదారులు నిర్ణయిస్తారనేదే దీని పాఠం.
ఈ నాలుగు బ్యాంకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. పబ్లిక్ హోల్డింగ్ పంజాబ్ & సింద్ బ్యాంక్‌లో 6.15 శాతం, ఐఓబీలో 7.56 శాతం, యూకో బ్యాంక్‌లో 9.05 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 18.81 శాతం మాత్రమే ఉంది.
అక్టోబర్ 26 ధరల ప్రకారం, కేంద్ర వాటాను 75 శాతానికి తగ్గించడం అంటే దాదాపు ₹18,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించడమే.
మొదటి మూడు బ్యాంకుల్లో ఇది ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న ఈక్విటీ కంటే 1.8 నుండి 3.1 రెట్లు ఎక్కువ. అంత పెద్ద ఆఫర్ ముగియాలంటే రాయితీ అయినా ఇవ్వాలి, లేదా ప్రభుత్వ సంస్థలైనా కొనుగోలు చేయాలి: ఈ ఏడాది సెంట్రల్ బ్యాంక్ ఆఫర్ తెరిచినప్పుడు, ఎల్ఐసీ ఆ బ్యాంక్ షేర్లలో దాదాపు 2.9 శాతాన్ని కొనుగోలు చేసింది. అంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బు, పాక్షికంగా మరొక ప్రభుత్వ సంస్థ జేబు నుండే వస్తుంది.
ప్రభుత్వానికి కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. ఈ నాలుగు బ్యాంకుల వాటాల తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి వచ్చేది ఐడీబీఐ ద్వారా వచ్చిన దాంట్లో మూడింట రెండు వంతులు, ఈ సంవత్సరపు ₹80,000 కోట్ల లక్ష్యంలో నాలుగో వంతు కంటే తక్కువే. అసలు లక్ష్యం “నియంత్రణ మార్పు”. ఆ బదిలీ ఎలా ఉంటుందో ఐడీబీఐ నిరూపించింది: కేంద్రానికి 15 శాతం వాటా మాత్రమే మిగిలి బోర్డు సీటు లేకుండా పోయింది; ఒక విదేశీ ఆర్థిక పెట్టుబడిదారుడికి పూర్తి నియంత్రణ లభించింది.
ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటుందని పార్లమెంటుకు ఇచ్చిన హామీ విక్రయంలో నిలబడలేదు. సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలు నిజంగా ప్రైవేటీకరించే రెండు బ్యాంకులు అయితే, నిబంధన సిద్ధంగా ఉంది. 75 శాతానికి వాటా తగ్గించడమనేది మార్కెట్‌ను దానికి సిద్ధం చేసే ప్రక్రియే.
బడ్జెట్ లెక్కింపులు
అవసరం బ్యాంకుల కంటే బడ్జెట్లోనే ఎక్కువగా ఉంది. 2026-27 బడ్జెట్లో డిస్ఇన్వెస్ట్మెంట్, ఆస్తుల విక్రయం ద్వారా ₹80,000 కోట్ల రాబడిని అంచనా వేశారు, ఇది 2025-26 సవరించిన అంచనా కంటే 136 శాతం ఎక్కువ. ఆ సంవత్సరంలో డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ₹16,886 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆగస్టు నాటికి ₹59,083 కోట్లు వసూలయ్యాయి. ఐడీబీఐ విక్రయం పూర్తయితే, వచ్చే ₹26,544 కోట్లతో ఏడాది మొత్తం వసూళ్లు ₹85,000 కోట్లు దాటి లక్ష్యాన్ని చేరుకుంటాయి.
ఇంత మొత్తం కోసం కోల్పోతున్నది ఒక స్థిరమైన రాబడి మార్గాన్ని. నాలుగు బ్యాంకుల మొత్తం విలువ దాదాపు ₹1.21 లక్షల కోట్లు, ఇవి వాటి 2025-26 లాభానికి తొమ్మిది రెట్లు. కేంద్ర ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించడం వల్ల ₹18,000 కోట్ల తక్షణ రాబడి కోసం ప్రతి సంవత్సరం వచ్చే దాదాపు ₹1,900 కోట్ల లాభాల వాటాను వదులుకోవాల్సి వస్తుంది.
పునరావృత లోటును పూడ్చుకోవడానికి లాభదాయక ఆస్తులను విక్రయించే ప్రభుత్వం, నిరంతర రాబడిని ఒకేసారి తక్కువ ధరకు అమ్ముకుంటోంది.
ఈ లోటు సహజమైనది కాదు. 2019లో కార్పొరేట్ పన్ను రేట్ల కోత వల్ల ప్రభుత్వ అంచనా ప్రకారమే ₹1.45 లక్షల కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లింది. దానివల్ల లబ్ధి పొందినవారు వ్యవస్థీకృతంగా ఉన్నారు; ప్రభుత్వ బ్యాంకింగ్‌పై ఆధారపడేవారు అలా లేరు. ఈ కోణంలో చూస్తే, బ్యాంకుల విక్రయం అనేది కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు ఇచ్చి, ఆపై ప్రజా ఆస్తులను విక్రయించడం ద్వారా ఖజానాను నింపే నాణేనికి రెండో వైపు.
ఆర్థిక నివేదికలు చూపని విషయాలు
బ్యాంకుల ధర లేదా విక్రయ విలువ అవి చేసే సేవలను ప్రతిబింబించలేదు. సెంట్రల్ బ్యాంక్‌కు 4,585 శాఖలు ఉన్నాయి, వాటిలో దాదాపు 65 శాతం గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని జనవరిలో ఆ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
రిటైల్, వ్యవసాయం, MSME రుణాలు దాని మొత్తం రుణాల్లో 72 శాతంగా ఉన్నాయి, ఒక్క వ్యవసాయానికే 47 శాతం కేటాయించారు. యూకో బ్యాంక్‌కు 3,412 దేశీయ శాఖలు ఉన్నాయి. 2023-24లో, ఈ నాలుగు బ్యాంకులు 4.15 కోట్ల జన్ ధన్ ఖాతాలను కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 40 శాతం ప్రాధాన్య రంగానికి (Priority Sector) రుణాలు ఇవ్వడం సాధారణ విధి; ప్రైవేట్ యాజమాన్యంలో, ఇది అతితక్కువ వ్యయంతో పూర్తి చేయాల్సిన నిబంధనగా లేదా సర్టిఫికేట్ల వ్యాపారం ద్వారా భర్తీ చేసే ప్రక్రియగా మారిపోతుంది.
ప్రత్యామ్నాయ మార్గం
ప్రభుత్వమే మంచి బ్యాంకర్ అనే భావనపై ఇక్కడ ఏదీ ఆధారపడి లేదు. రుణాల పంపిణీపై రాజకీయ ఒత్తిడి, నిజమైన అధికారం లేని బోర్డుల వల్ల ఈ బ్యాంకులు దెబ్బతిన్నాయి. దానికి పరిష్కారం “జవాబుదారీతనం”: పరిపాలనా షరతులకు అనుగుణంగా ప్రజాధనాన్ని అనుసంధానించడం, మంత్రుల జోక్యం లేకుండా నియామకాలు జరపడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా బోర్డులను సాధికారపరచడం. 25 శాతం నిబంధనే సమస్య అయితే, మినహాయింపులు ఇచ్చే అధికారాన్ని కేంద్రం ఉపయోగించుకోవచ్చు, లేదా బ్యాంకులకు నిధులు చేరేలా కొత్త ఈక్విటీని సేకరించి తన వాటాను 51 శాతం కంటే ఎక్కువగానే ఉంచవచ్చు.
రెవెన్యూ పెంచుకోవడమే లక్ష్యమైతే, 2019 నుండి కార్పొరేట్లకు ఇచ్చిన మినహాయింపులను సమీక్షించాలి.
1969లో బ్యాంకుల జాతీయీకరణకు కారణం — ప్రజల పొదుపు మొత్తాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సంక్షేమ లక్ష్యాల కోసం ఉపయోగపడాలనేది. 2026 నాటి వాదన ఏమిటంటే — ప్రజల ఖర్చుతో బాగుపడిన బ్యాంకులు ఇప్పుడు మంచి ధరను తేగలవని. ఇది బడ్జెట్ లోటుకు సంబంధించిన అంశం, కాబట్టి షేర్లు చేతులు మారడానికి ముందే పార్లమెంటులో దీనిపై సమగ్ర చర్చ జరగాలి.
అనువాదం: ఆంజనేయ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
