బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, భూస్వామ్య దోపిడీకి, గిరిజనులపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన మహా ఆదివాసీ విప్లవ వీరుడు బిర్సా ముండా. ఆయన పోరాటం కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకమైన తిరుగుబాటు మాత్రమే కాదు. అది భూమి కోసం, అడవి కోసం, నీటి వనరుల కోసం, గిరిజనుల సంస్కృతి, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం సాగిన పోరాటం.
నాడు బిర్సా ముండా ఏ లక్ష్యాల కోసం పోరాడారో, నేడు కూడా దేశంలోని లక్షలాది ఆదివాసీ కుటుంబాలు అదే తరహా సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
అభివృద్ధి పేరుతో అడవులు నరికివేయడం, గనుల తవ్వకాలు, భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం గిరిజనులను వారి నివాస ప్రాంతాల నుంచి తరలించడం, వారికి జీవనాధారమైన సహజ వనరులను దూరం చేయడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ క్రమంలో బిర్సా ముండా జీవిత చరిత్రతో పాటు ఆయన పోరాట నేపథ్యం, సాధించిన విజయాలు, నేటి భారతదేశంలో అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజనుల నిర్వాసితత్వం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న అడవుల విధ్వంసం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాధాన్యాన్ని పురస్కరించుకుని అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15న నల్లగొండలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 15న దేశవ్యాప్తంగా జెండాలు ఆవిష్కరించాలని అఖిల భారత కిసాన్ సభ పిలుపునిచ్చింది.

బిర్సా ముండా జననం – బాల్యం – సామాజిక నేపథ్యం
బిర్సా ముండా 1875 నవంబర్ 15న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని చోటానాగ్పూర్ ప్రాంతంలో ఉన్న ఉలిహాతు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సుగ్నా ముండా, తల్లి కర్మీ హాతు.
ముండా ఆదివాసీ కుటుంబంలో పుట్టిన బిర్సా చిన్నతనం నుంచే గిరిజన సమాజం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశారు.
ఆ కాలంలో చోటానాగ్పూర్ ప్రాంతంలోని ముండా, ఉరావ్, ఖారియా తదితర ఆదివాసీ తెగలు ప్రధానంగా వ్యవసాయం, అడవులపై ఆధారపడి జీవించేవారు. అడవులు వారికి కేవలం చెట్ల సముదాయం కాదు. అవే వారి ఆహారం, ఔషధాలు, పశువుల మేత, ఇంధనం, నివాసం, సంస్కృతి, జీవన విధానానికి ఆధారం.
కానీ బ్రిటిష్ పాలన విస్తరించిన తరువాత ఈ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చాయి. సంప్రదాయంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారి హక్కులు బలహీనపడ్డాయి.
బయటి నుంచి వచ్చిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, అధికార యంత్రాంగం గిరిజనుల భూములను ఆక్రమించడం ప్రారంభించారు. ఈ పరిస్థితి బిర్సా ముండా ఆలోచనలపై బలమైన ప్రభావం చూపింది.
బ్రిటిష్ పాలనలో గిరిజనుల దుస్థితి
గిరిజనుల భూములపై సంప్రదాయ సామూహిక హక్కులను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించకుండా, వాటిని తన రెవెన్యూ వ్యవస్థకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించింది.
ముండా తెగలో భూమి యాజమాన్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వ్యవస్థ ఉండేది. దానిని ఖుంట్‌కట్టి అని పిలిచేవారు.
ఒక ప్రాంతాన్ని తొలిసారిగా అడవిగా ఉన్న స్థితి నుంచి సాగుభూమిగా మార్చిన కుటుంబాలు, వారి వంశాలు ఆ భూమిపై సంప్రదాయ హక్కులను కలిగి ఉండేవి. కానీ బ్రిటిష్ పాలనలో ఈ హక్కులు దెబ్బతిన్నాయి. బయటి భూస్వాములు, జమీందార్లు గిరిజన భూములపై ఆధిపత్యం సంపాదించారు.
గిరిజనులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు
సంప్రదాయ భూముల నుంచి బలవంతంగా తొలగించడం. అధిక భూమి పన్నులు, అక్రమ వసూళ్లు. వడ్డీ వ్యాపారుల రుణాల ఉచ్చులో చిక్కుకోవడం. వెట్టిచాకిరీ, బలవంతపు శ్రమ. అడవుల్లో వేట, పశువుల మేత, కలప సేకరణ వంటి సంప్రదాయ హక్కులపై ఆంక్షలు. గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలపై బయటి ఆధిపత్యం.
ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా గిరిజనుల్లో అసంతృప్తి పెరిగింది. ఈ అసంతృప్తికి బిర్సా ముండా నాయకత్వం ఒక సంఘటిత రూపాన్ని ఇచ్చింది.
బిర్సా ముండా సామాజిక, మతపరమైన సంస్కరణలు
బిర్సా ముండా కేవలం రాజకీయ తిరుగుబాటు నాయకుడు మాత్రమే కాదు. గిరిజన సమాజంలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి కూడా కృషి చేశారు. ఆయన గిరిజనులు తమ సంప్రదాయ సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని బోధించారు.
ఆయన బోధనలు ప్రజల్లో విస్తృత ప్రభావాన్ని చూపాయి. అనుచరులు ఆయనను ఆధ్యాత్మిక నాయకుడిగా కూడా భావించారు.
బిర్సా ఉపదేశాల ఆధారంగా ఒక ప్రత్యేకమైన మత, సామాజిక ఉద్యమం రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఐక్యతను, తమ భూమి మీద తమకే హక్కు ఉండాలనే భావనను బలపరిచింది.
ఉల్గులాన్ – మహా గిరిజన తిరుగుబాటు
బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని చరిత్రలో ఉల్గులాన్ అని పిలుస్తారు. ముండా భాషలో దీనికి మహా కల్లోలం లేదా మహా తిరుగుబాటు అనే అర్థం ఉంది.
1890వ దశకం చివరలో ఈ ఉద్యమం మరింత బలపడింది. 1899లో తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. గిరిజన భూములను గిరిజనులకు తిరిగి అప్పగించడం.
భూస్వాములు, వడ్డీ వ్యాపారుల దోపిడీని అంతం చేయడం. వెట్టిచాకిరీని నిర్మూలించడం. బ్రిటిష్ అధికారుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం. గిరిజనుల సంప్రదాయ స్వయంపాలనను పునరుద్ధరించడం. అడవులు, భూమి, నీటి వనరులపై గిరిజనుల హక్కులను కాపాడటం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యాలు.
బిర్సా ముండా తన అనుచరులను సంఘటితం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించారు. ఈ పోరాటం బ్రిటిష్ పాలకులను తీవ్రంగా కలవరపరిచింది.
బిర్సా ముండా అరెస్ట్ – మరణం
బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండా ఉద్యమాన్ని అణచివేయడానికి సైనిక చర్యలకు దిగింది. అనేకమంది గిరిజనులను అరెస్ట్ చేసింది. ఉద్యమకారులపై తీవ్ర నిర్బంధం కొనసాగించింది. 1900 ఫిబ్రవరిలో బిర్సా ముండా అరెస్టయ్యారు. ఆయనను రాంచీ జైలులో నిర్బంధించారు.
1900 జూన్ 9న కేవలం 25 సంవత్సరాల వయసులోనే జైలులో మరణించారు. ఆయన మరణానికి కారణం కలరా అని అప్పటి బ్రిటిష్ అధికారిక రికార్డులు పేర్కొన్నప్పటికీ, ఆయన మరణ పరిస్థితులపై చారిత్రకంగా ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక యువకుడి జీవితం ముగిసిపోయినా ఆయన ప్రారంభించిన పోరాటం మాత్రం ఆగిపోలేదు.

బిర్సా ముండా పోరాట ఫలితాలు – చారిత్రక ప్రాధాన్యం
బిర్సా ముండా ఉద్యమం బ్రిటిష్ పాలనను వెంటనే అంతం చేయలేకపోయినా, చోటానాగ్పూర్ ప్రాంతంలో గిరిజన భూముల సమస్యను దేశవ్యాప్త చర్చకు తీసుకువచ్చింది.
ఈ ఉద్యమం తరువాత గిరిజన భూముల బదిలీపై ఆంక్షలు విధించే చట్టపరమైన చర్యలకు రాజకీయ, సామాజిక ఒత్తిడి పెరిగింది.
1908లో అమల్లోకి వచ్చిన చోటానాగ్పూర్ టెనెన్సీ చట్టం గిరిజన భూముల బదిలీపై ముఖ్యమైన రక్షణలను కల్పించింది.
గిరిజనుల అభివృద్ధి అంటే వారిని వారి భూముల నుంచి తొలగించడం కాదు. వారి భూమి, అడవి, సంస్కృతి, జీవనాధారాలను కాపాడుతూ వారికి సమాన హక్కులు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ముండా పోరాటం తెలియజేస్తుంది.
భారతదేశంలో అటవీ హక్కుల చట్టం – గిరిజనులకు కల్పించిన హక్కులు
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గిరిజనుల భూమి, అడవి సమస్యలు పరిష్కారం కాలేదు. బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన అటవీ చట్టాలు, భూసేకరణ విధానాలు స్వతంత్ర భారతదేశంలోనూ కొనసాగాయి.
ఫలితంగా అనేక తరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు తమ సంప్రదాయ హక్కులను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి 2006లో యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంటు ఒక ముఖ్యమైన చట్టాన్ని తీసుకువచ్చింది.
కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగానే యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని వామపక్షాలు తేల్చిచెప్పాయి. అందులో భాగంగా షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం – 2006ను భారత ప్రభుత్వం తెచ్చింది.
దీనినే సాధారణంగా Forest Rights Act (FRA), 2006 లేదా అటవీ హక్కుల చట్టం అంటారు. ఇది 2006 డిసెంబర్ 29న చట్ట రూపం దాల్చి, 2007 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది.
తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు, ఇతర సంప్రదాయ అటవీ నివాసులకు వారి హక్కులను గుర్తించి చట్టబద్ధం చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.
ఈ చట్టం ద్వారా కల్పించిన ముఖ్యమైన హక్కులు:
1. వ్యక్తిగత అటవీ భూముల హక్కులు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూములపై అర్హులైన కుటుంబాలకు హక్కులు కల్పించడం.
2. సామూహిక అటవీ హక్కులు. గిరిజన గ్రామాలకు అడవుల్లోని సంప్రదాయ వనరులను ఉపయోగించుకునే హక్కులు కల్పించడం.
3. చిన్న అటవీ ఉత్పత్తులపై హక్కులు. వెదురు, తేనె, చింతపండు, గింజలు, ఆకులు, ఔషధ మొక్కలు వంటి అటవీ ఉత్పత్తులను సేకరించడం, వినియోగించడం, విక్రయించడం వంటి హక్కులు. 4. మేత, చేపల వేట, నీటి వనరుల వినియోగం. సంప్రదాయ జీవన విధానంలో భాగంగా ఉన్న హక్కులను గుర్తించడం.
5. సముదాయ అటవీ వనరుల నిర్వహణ. గ్రామసభలు తమ సంప్రదాయ అటవీ ప్రాంతాలను సంరక్షించడం, పునరుద్ధరించడం, నిర్వహించడం వంటి హక్కులు కలిగి ఉండటం.
6. ప్రత్యేకంగా బలహీన ఆదివాసీ తెగల నివాస హక్కులు. వారి సంప్రదాయ నివాస ప్రాంతాలు, జీవనాధారాలను గుర్తించడం.
7. బలవంతపు తొలగింపుపై రక్షణ. అటవీ హక్కుల గుర్తింపు, పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే వరకు అర్హులైన అటవీ నివాసులను వారి ఆక్రమణలో ఉన్న భూముల నుంచి తొలగించరాదని సెక్షన్ 4(5) స్పష్టం చేస్తుంది.
ఈ చట్టంలో మరో అత్యంత ముఖ్యమైన అంశం గ్రామసభలకు కల్పించిన అధికారం. అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియలో గ్రామసభే ప్రాథమిక సంస్థ. గ్రామసభల భాగస్వామ్యం లేకుండా గిరిజనుల హక్కులను నిర్ణయించడం ఈ చట్ట స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల ఈ చట్టం అడవులపై ప్రభుత్వానికి మాత్రమే సంపూర్ణ అధికారం ఉండాలనే పాత విధానానికి భిన్నంగా, అడవులతో సహజీవనం చేస్తున్న ప్రజలకు హక్కులు కల్పించే ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తెచ్చింది.
అటవీ హక్కుల చట్టం ఉన్నప్పటికీ గిరిజనులకు ఎందుకు అన్యాయం జరుగుతోంది?
అటవీ హక్కుల చట్టం అడవులను ధ్వంసం చేయడానికి తీసుకొచ్చిన చట్టం కాదు. దీనికి విరుద్ధంగా, అటవీ సంరక్షణలో గిరిజనుల హక్కులను గుర్తించి, వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి రూపొందించిన చట్టం.
అయితే ఈ చట్టం అమలులో తీవ్రమైన లోపాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అర్హులైన గిరిజన కుటుంబాలకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం. రెండవది, సామూహిక అటవీ హక్కుల గుర్తింపులో నిర్లక్ష్యం. వ్యక్తిగత భూములకు పట్టాలు ఇచ్చినప్పటికీ, మొత్తం గ్రామం ఆధారపడే అడవులపై సామూహిక హక్కులను గుర్తించడంలో అనేక ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉంది.
మూడవది, గ్రామసభల అధికారాలను కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవడం. నాలుగవది, అటవీ భూములను గనుల తవ్వకాలు, పరిశ్రమలు, భారీ ప్రాజెక్టులకు మళ్లించేటప్పుడు గిరిజనుల హక్కులు, గ్రామసభల నిర్ణయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, గ్రామసభల నిర్వహణనే గాలికి వదిలివేయడం.
ఐదవది గిరిజనులు తమ హక్కులను నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలు, రికార్డులు అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యలన్నీ కలిపి చూస్తే చట్టం కల్పించిన హక్కులకు, వాస్తవ జీవితంలో గిరిజనులు అనుభవిస్తున్న పరిస్థితులకు మధ్య పెద్ద అంతరం కనిపిస్తుంది.
అభివృద్ధి పేరుతో అడవుల విధ్వంసం – గిరిజనుల నిర్వాసితత్వం
నేడు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అభివృద్ధి పేరుతో అడవుల విధ్వంసం.
దేశ ఆర్థిక అభివృద్ధికి పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారులు, గనులు అవసరమే. కానీ వాటి కోసం ఎవరి భూములు తీసుకుంటున్నారు? ఎవరి జీవనాధారాలు నాశనం అవుతున్నాయి? అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి? నష్టాన్ని ఎవరు భరిస్తున్నారు? అనే ప్రశ్నలు కూడా అంతే ముఖ్యమైనవి.
దేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, ఇతర ఖనిజాల తవ్వకాల కోసం అడవులను తొలగిస్తున్నారు.
ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అరణ్య ప్రాంతం. హస్దేవ్ అరణ్యం జీవవైవిధ్యానికి, అనేక ఆదివాసీ గ్రామాల జీవనానికి కీలకమైనది. ఇక్కడ బొగ్గు గనుల విస్తరణ కోసం అడవులను నరికివేయడంపై గిరిజనులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అక్కడి ప్రజలకు అడవి అంటే కేవలం భూమి కాదు. అది వారి ఆహారం, ఆదాయం, పశువుల మేత, ఔషధాలు, నీటి వనరులు, సాంస్కృతిక జీవనానికి ఆధారం. అడవులు నాశనమైతే వారు కేవలం చెట్లను మాత్రమే కోల్పోయినట్లు కాదు. వారి సంపూర్ణ జీవన వ్యవస్థ దెబ్బతింటుంది.
ఇదే పరిస్థితి ఒడిశాలోని ఖనిజ సంపద కలిగిన ప్రాంతాల్లోనూ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ వివిధ రూపాల్లో కనిపిస్తుంది.
అడవులను కోల్పోయిన గిరిజన కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఎక్కువ సందర్భాల్లో వారు కోల్పోయిన జీవనాధారాలకు సమానంగా ఉండదు.
ఒక కుటుంబానికి కొంత డబ్బు ఇవ్వవచ్చు. కానీ తరతరాలుగా జీవించిన అడవి, వారి సంస్కృతి, సామూహిక జీవనం, సహజ వనరులపై ఆధారపడిన ఉపాధిని డబ్బుతో తిరిగి సృష్టించలేం.
నిర్వాసితులైన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా, అందరికీ శాశ్వత ఉపాధి లభించడం లేదు. కొందరు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలకు పనిచేయాల్సి వస్తోంది.
మహిళలు, పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల అభివృద్ధి అంటే జాతీయ ఆదాయం పెరగడమే కాదు. అభివృద్ధి ఫలితాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. వారి హక్కులు కాపాడబడాలి.
అటవీ సంరక్షణ చట్టాల మార్పులు – గ్రామసభల హక్కులపై ఆందోళనలు
2023లో కేంద్ర ప్రభుత్వం Forest (Conservation) Amendment Act, 2023ను తీసుకొచ్చింది. దీని ద్వారా అటవీ భూముల నిర్వచనం, అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించే నిబంధనల్లో మార్పులు జరిగాయి.
ప్రభుత్వం ఈ మార్పుల వెనుక జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్నాయని అబద్ధాలు చెప్పి గిరిజనులను మోసం చేసింది.
పర్యావరణవేత్తలు, గిరిజన హక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఈ మార్పుల వల్ల కొన్ని అటవీ ప్రాంతాల రక్షణ బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే చట్టంలో హక్కులు ఉన్నాయనే కారణంతో క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నాయని భావించలేం. గ్రామసభల సమ్మతి నిజంగా స్వేచ్ఛగా, సమాచారంతో కూడిన నిర్ణయంగా తీసుకున్నారా? అటవీ హక్కుల గుర్తింపు పూర్తయిందా? ప్రజలకు ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రభావాలు వివరించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం.
ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. గిరిజనుల అభ్యంతరాలను అభివృద్ధికి వ్యతిరేకతగా చూడకూడదు.

అటవీ హక్కుల చట్టం అమలుపై గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రభుత్వం 2025 జూలై 31 నాటికి పార్లమెంటుకు అందించిన గణాంకాలను పరిశీలిస్తే, గ్రామసభల స్థాయిలో మొత్తం 51,23,104 వ్యక్తిగత, సామూహిక హక్కుల దరఖాస్తులు నమోదయ్యాయి.
25,11,375 హక్కుల పట్టాలు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో 23,89,670 వ్యక్తిగత హక్కుల పట్టాలు, 1,21,705 సామూహిక హక్కుల పట్టాలు. ఇవి 2025 మే 31 వరకు అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా వెల్లడించిన గణాంకాలు.
ఈ గణాంకాల్లో ఒక ముఖ్యమైన అంశం- వ్యక్తిగత హక్కులతో పోలిస్తే సామూహిక హక్కుల పట్టాల సంఖ్య చాలా తక్కువ.
ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే గిరిజనుల జీవనం వ్యక్తిగత భూమి మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మొత్తం గ్రామం ఆధారపడే అడవి, నీటి వనరులు, చిన్న అటవీ ఉత్పత్తులు, మేత భూములు వారి జీవన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సామూహిక హక్కుల గుర్తింపుకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమివ్వాలి.
పంచాయతీలకు విస్తరించిన అధికారాలు – PESA చట్టం ప్రాధాన్యం
గిరిజనుల స్వయంపాలనకు సంబంధించి మరో ముఖ్యమైన చట్టం 1996లో తీసుకొచ్చిన Panchayats (Extension to Scheduled Areas) Act – PESA.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం గిరిజన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని కాపాడాలి. గ్రామస్థాయి వనరుల నిర్వహణలో గ్రామసభకు అధికారం ఉండాలి. భూమి అన్యాక్రాంతం కాకుండా రక్షించాలి. చిన్న అటవీ ఉత్పత్తులపై గిరిజనుల హక్కులను గుర్తించాలి.
గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ, పునరావాసం వంటి అంశాల్లో గ్రామసభల పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. గిరిజనుల సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలి. అయితే PESA చట్టం అమలులో కూడా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.
చట్టం రూపొందించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామసభలకు పూర్తి అధికారాలు కల్పించడంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. FRA, PESA చట్టాలను సమర్థమంతంగా అమలు చేస్తే గిరిజనుల భూమి, అడవి, స్వయంపాలన హక్కులకు బలమైన రక్షణ లభిస్తుంది.
బిర్సా ముండా పోరాటం – నేటి గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తి
బిర్సా ముండా పోరాటం జరిగి 125 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి. భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్యం ఏర్పడింది.
గిరిజనుల హక్కుల కోసం ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు వచ్చాయి. అయినప్పటికీ నేడు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తే బిర్సా ముండా పోరాటం ఇంకా ఎందుకు ప్రాసంగికంగా ఉందో అర్థమవుతుంది.
నాడు బ్రిటిష్ పాలకులు అడవులను తమ ఆదాయ వనరులుగా, వాణిజ్య ప్రయోజనాల సాధనంగా చూశారు. గిరిజనుల సంప్రదాయ హక్కులను పట్టించుకోలేదు.
నేడు కార్పొరేట్ సంస్థల ఖనిజ తవ్వకాలు, భారీ పరిశ్రమలు, వాణిజ్య ప్రాజెక్టుల కోసం అడవులను మళ్లించే సందర్భాల్లో కూడా గిరిజనుల జీవన హక్కులకు భంగం వాటిల్లుతోంది.
నాడు బిర్సా ముండా భూమి కోసం పోరాడారు. నేడు కూడా గిరిజనులు తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. నాడు ఆయన అడవులపై గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. నేడు కూడా అటవీ హక్కుల చట్టాన్ని సమర్థమంతంగా అమలు చేయాలని గిరిజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి.
నాడు ఆయన గిరిజనుల ఆత్మగౌరవం కోసం పోరాడారు. నేడు కూడా అభివృద్ధి పేరుతో తమను రెండో తరగతి పౌరులుగా చూడకూడదని గిరిజనులు కోరుతున్నారు. ఇదే బిర్సా ముండా పోరాటానికి, నేటి గిరిజన ఉద్యమాలకు మధ్య ఉన్న చారిత్రక సంబంధం.
అభివృద్ధి ఎవరికి? ఎవరి మూల్యంతో?
భారతదేశం అభివృద్ధి చెందాలి. పారిశ్రామికీకరణ జరగాలి. విద్యుత్ ఉత్పత్తి పెరగాలి. రహదారులు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మించాలి. వీటిపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అభివృద్ధి అంటే ప్రకృతి విధ్వంసం కావాలా? అభివృద్ధి అంటే ఆదివాసీలను వారి పూర్వీకుల భూముల నుంచి తరిమివేయడమా? అభివృద్ధి అంటే లక్షలాది ప్రజల జీవనాధారాలను ధ్వంసం చేసి కొన్ని కార్పొరేట్ సంస్థలకు అపారమైన లాభాలు చేకూర్చడమా? ఇక్కడే ప్రస్తుత అభివృద్ధి నమూనాపై మౌలికమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రకృతి వనరులు దేశ సంపద. వాటిని ఉపయోగించుకోవడంలో భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అడవులను నాశనం చేయడం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుంది. వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతాయి. నదులు, వాగులు, నీటి వనరులపై ప్రభావం పడుతుంది.
గిరిజనులు అడవులను కేవలం వినియోగించుకునే ప్రజలు మాత్రమే కాదు. అనేక ప్రాంతాల్లో తరతరాలుగా వాటిని సంరక్షిస్తూ వచ్చిన సమాజాలు కూడా. అందువల్ల అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు ఈ అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
1. గ్రామసభల స్వేచ్ఛాయుతమైన, ముందస్తు, సమాచారంతో కూడిన నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి.
2. అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలి.
3. ప్రజల నిర్వాసితత్వాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలి.
4. తప్పనిసరిగా పునరావాసం అవసరమైనప్పుడు భూమికి భూమి, జీవనాధారానికి తగిన ప్రత్యామ్నాయం కల్పించాలి.
5. గిరిజన కుటుంబాలకు కేవలం నగదు పరిహారం కాకుండా శాశ్వత ఉపాధి, విద్య, ఆరోగ్యం, నివాస సదుపాయాలు కల్పించాలి.
6. సామూహిక అటవీ హక్కులను గుర్తించి గ్రామసభలకు అటవీ నిర్వహణలో నిజమైన అధికారం ఇవ్వాలి. 7. పర్యావరణ ప్రభావాలపై స్వతంత్ర, పారదర్శక పరిశీలన జరపాలి.
ప్రకృతిని కాపాడుతూ ప్రజలను అభివృద్ధి చేయాలి. ప్రజలను నిర్వాసితులను చేసి ప్రకృతిని, సమాజాన్ని నాశనం చేసే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు.
నవంబర్ 16 నుండి 18 వరకు నల్లగొండలో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు గిరిజనుల సమస్యలతో పాటు వ్యవసాయ రంగం, చిన్న, మధ్యతరగతి రైతాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలను చర్చించి వాటి పరిష్కారానికి కార్యాచరణను రూపొందించనున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
