వికసీత్ భారత్ రోజ్ గార్ గ్యారెంటీ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ) చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో, దీర్ఘకాలంగా తీసుకురావాల్సిన సవరణలు పొందుపరిచిన గొప్ప చట్టమని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
ఈ చట్టంలో ఉపాధి హక్కును న్యాయపరమైన హక్కుగా మార్చడం ఒక ముఖ్యమైన పరిణామం.
జాతీయ ఉపాధి హామీ పథకం రైతు వ్యతిరేక పథకంగా మారిందని ఈ ప్రభుత్వం భావిస్తుంది.
వ్యవసాయానికి కావలసిన శ్రమశక్తి అందుబాటులో లేకుండా పోతుందని, ఫలితంగా గ్రామీణ వేతనాలు పెరిగిపోతున్నాయని కీలకమైన వ్యవసాయపు పనులు ఉన్న సీజన్లలో వ్యవసాయ కార్మికులు అందుబాటులో లేకుండా పోతున్నారని వాదిస్తుంది.
ఇదేదో పాలన యంత్రణ నోటి నుంచి వచ్చిన మాట కాదు. ప్రభుత్వం ఈ అవగాహనను చట్టంలోనే ఇమిడ్చింది.
కొత్తగా ఆమోదించిన చట్టంలో సెక్షన్ 6 రూపంలో ప్రభుత్వం ఈ నిషేధానికి చట్టబద్ధత కలిగించింది.
వ్యవసాయంలో పనులు ఎక్కువగా ఉండే 60 రోజులలో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ రోజ్ గార్ గ్యారెంటీ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ) చట్టం అమలుపై నిషేధం విధించాలని చట్టం ఆదేశిస్తోంది.
పాత ఉపాధి హామీ చట్టానికి, తాజాగా మోదీ ప్రభుత్వం ఆమోదించిన చట్టడానికి మధ్య ఉన్న మౌలికమైన తేడా ఏంటి? ఉపాధి హామీ చట్టంలో ఏ ఏ పనులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి? ఏ పనులు చట్టం పరిధిలోకి రావనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
సంవత్సరం మొత్తం మీద కనీసం వంద రోజుల పని గ్యారంటీ కల్పించాలని పాత చట్టం ఆదేశిస్తోంది.
కానీ తాజా చట్టంలో సంవత్సరంలో ఎన్ని రోజులు చట్టం వర్తించదో స్పష్టంగా చెప్పారు.
ఉపాధి హామీ చట్టం కూడా వ్యవసాయ అనుబంధ పనులు, చెరువుల అభివృద్ధి, భూమి చదును వంట పనులను పథకం పరిధిలోకి తెచ్చింది.
వ్యవసాయపు పనులకు అవసరమైన శ్రమ శక్తిని సమీకరించడంలో చట్టం నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.
ఈ చట్టాన్ని చేయడం ద్వారా తాము రైతాంగానికి ఏదో మేలు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఈ విధంగా చెప్పుకోవడానికి ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది.
వ్యవసాయ రంగానికి అవసరమైన శ్రమ శక్తి అందుబాటులో లేకపోవడం వలన వ్యవసాయరంగం దివాళా తీసిందన్నప్రభుత్వ వాదన తప్పుడు అవగాహనపై ఆధారపడి ఉంది.
పెరిగిన ధరల నడుమ పెరుగుతున్న వేతనాలు వ్యవసాయంలో ఖర్చులు పెంచుతున్నాయి అన్న వాస్తవాన్ని గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.
ప్రభుత్వపు ఈ అవగాహన రైతులకు మేలు చేయాలన్న పేరు చెబుతూనే గ్రామీణ కార్మికుల హక్కులను వెసులుబాటులను నిర్వీర్యం చేయడానికి వీలుగా ఒక కృత్రిమ అనివార్యతను సృష్టిస్తోంది.
ఉపాధి హామీ చట్టం వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా అమలులో ఉంటే, వ్యవసాయ కార్మికులు మెరుగైన వేతనాలను డిమాండ్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
చిన్నసన్నకారు రైతులకు బేరసారాలు ఆడే వెసులుబాటు ఉండేది.
కానీ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన చట్టం కారణంగా ప్రస్తుతం వ్యవసాయ కార్మికులు అటువంటి బేరసారాలు ఆడే వెసులుబాటు కోల్పోతున్నారు, కోల్పోయారు.
ఇది కేవలం రైతులను ఉద్దేశించిన పని మాత్రం కాదు. శ్రమశక్తిని ఉపయోగించే యజమానులకు వెసులుబాటు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం.
ఉపాధి హామీ చట్టమే వ్యవసాయానికి సహకరించే కార్యక్రమం
బయట జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఉత్పాదకతను పెంపొందించడానికి అవసరమైన నిధులను కేటాయిస్తూనే, వ్యవసాయ కార్మికులకు చేయూతనిచ్చే విధంగా రూపొందించిన కార్యక్రమం ఉపాధి హామీ చట్టం.
2014 తర్వాత కాలంలో కూడా ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులలో కనీసం 60 శాతం పనులు వ్యవసాయ రంగానికి సంబంధించినవే ఉండాలన్న షరతు అమలు జరిగింది.
ఇది ప్రాధాన్యత కాదు, చట్టబద్ధమైన పరిమితి.
ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఉపాధి హామీ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండే పనులపై 60% కంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టిన రాష్ట్రాలకు కేంద్రం తిరిగి చెల్లించడం లేదు.
ప్రభుత్వం జారీ చేసిన అధికారిక లేఖలే ఈ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాయి.
ఉపాధి హామీ చట్టం కింద మొత్తం 266 రకాల పనులు చేయటానికి అవకాశం ఉంటే, అందులో 150 రకాల పనులు వ్యవసాయం దాని అనుబంధం కార్యక్రమాలకు సంబంధించినవి.
ఇందులో జలవనరులను మెరుగుపరచడం మొదలు చెక్ డ్యాంల నిర్మాణం వరకు ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలలో ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు దళితులు, ఆదివాసీలు, అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలు, చిన్న సన్నకారు రైతంగానికి చెందిన భూములను అభివృద్ధి చేయడానికి, ఆ భూముల్లో ఉత్పాదకత పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలనే షరతు ఉన్నది.
అటవీ భూములపై పట్టా హక్కులను పొందిన ఆదివాసీలు ఈ ప్రాంతంలో భూమిని చదును చేసి వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేయడానికి ఈ చట్టం కింద 150 రోజులు పని చేయవచ్చు.
కొండ సానువుల్లో ఉండే భూములను సేద్యానికి సిద్ధం చేయటానికి భారీ ఎత్తున శారీరక శ్రమ అవసరం అవుతుందనే విషయం అందరికీ తెలిసింది.
ఇటువంటి విషయాలు గమనించినప్పుడు ఉపాధి హామీ చట్టం వ్యవసాయ రంగ ప్రయోజనాలకు విరుద్ధమైనది, భిన్నమైనదనే వాదనలోని బండారం బట్టబయలు అవుతుంది.
ఉపాధి హామీ చట్టం వలన గ్రామీణ వేతనాలు పెరిగాయి
ఉపాధి హామీ చట్టం గురించి నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాలి, గుర్తించాలి.
ఈ చట్టం కారణంగా గ్రామీణ వేతనాలు పెరిగాయి. ఉపాధి హామీ చట్టం వలన వేతన మార్కెట్ శ్రమశక్తి మార్కెట్ నిలకడగా ఉందని క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్ధారించాయి.
కార్మికుల బేరసాలాడే శక్తి పెరిగింది. ప్రత్యేకించి క్యాజువల్ వ్యవసాయ కార్మికుల స్థితిగతులు కొంచెం మెరుగుపడ్డాయి.
ఈ పరిణామాలు అనూహ్యమైన వైవిధ్యాలకు, ఉద్యోగాలకు దారి తీస్తున్నాయని నిరాకరించడమంటే- ఉపాధి హామీ చట్టం ఏ లక్ష్యంతో తెరమీదకు వచ్చిందో గుర్తించలేకపోవడమే.
మిగులు శ్రమ శక్తికి పని చూపించే లక్ష్యంతో ఉపాధి హామీ చట్టం ఉనికిలోకి రాలేదు.
గ్రామీణ వేతనాలు నిర్ధిష్ట మోతాదుకు మించి పడిపోకూడదన్న లక్ష్యాన్ని సాధించడం కోసం రూపొందించిన చట్టమే ఇది.
ఆ విధంగా గ్రామీణ వేతనాలు నిర్దిష్ట మోతాదుని మించి పడిపోకుండా ఉండాలంటే, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన అవసరాన్ని గుర్తించినందు వల్ల ఈ చట్టం ఉనికిలోకి వచ్చింది.
మెరుగైన వేతనాలు ఈ చట్టం పర్యవసానం కాదు. చట్టం ఆశించిన ఫలితమే.
అసలు ఉపాధి హామీ చట్టం లక్ష్యం ఏంటి?
భూమిలేని కార్మికులు దళితులు ఆదివాసీలు మహిళలు వంటి వారికి గ్రామీణ వేతనాలు పెరగటం అంటే ఆ మేరకు వేతన బానిసత్వం నుంచి వారికి విముక్తి కలగటమే.
దారుణమైన దోపిడీతో కూడిన పరిస్థితులను తిరస్కరించడానికి కావలసిన వెసులుబాటును వ్యవసాయ కార్మికులకు అందించడమే ఉపాధి హామీ చట్టం లక్ష్యం.
ఈ నేపథ్యంలో మెరుగైన వేతనాలతో పాటు పనులు లేని సమయంలో కూడా ఎన్నో కొన్ని రోజులు పనులు సాధించుకోవటానికి, వేతనాలు పొందటానికి ఈ చట్టం అవకాశం కల్పించింది.
ప్రభుత్వ పరిభాషలో పొలం పనికి కూలీలు దొరకడం లేదంటే ఆచరణలో తక్కువ వేతనాలకు కూలీలు దొరకటం లేదని అర్థం.
అంటే అణిగిమణిగి పనిచేసే కూలీలు దొరకటం లేదని అర్థం. ఈ ప్రమాదాన్ని 2018 జూలై 4న ప్రచురించిన వ్యాసంలో ది వైర్ హెచ్చరించింది.
ఉపాధి హామీ చట్టం వల్ల ఒక వ్యవసాయరంగానికి అవసరమైన కార్మికులు అందుబాటులో లేకుండా పోతున్నారన్న వాదన క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా ఉంటుంది.
క్షేత్రస్థాయిలో చిన్న సన్నకారు రైతుల కూడా సంవత్సరంలో ఎక్కువ రోజులుపాటు వ్యవసాయ కూలీలుగా పనికి వెళ్తూ ఉంటారు.
నాట్లు వేయటం విత్తనాలు వేయటం మొదలు, ముఖ్యమైన పనులు ఉన్న రోజులలో సొంత పొలంలో పనికి ప్రాధాన్యత ఇస్తూనే మిగిలిన రోజుల్లో కూలీ పనులకు వెళ్తారు.
పొలం పనులు లేని సమయంలో ఈ చిన్నసన్నకారు రైతుల కూడా వ్యవసాయ కూలీలతో కలిసి- ఇంకా చెప్పాలంటే, భూమి లేని పేదలతో కలిసి ఉపాధి హామీ చట్టం పనులకు వెళ్తారు.
పొలం పనులు ముమ్మరంగా ఉన్న సమయంలో ఈ రైతులే సొంత పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు.
కనుక కూలీల కొరత అన్న సమస్య తలెత్తదు. ఉపాధి హామీ చట్టం వ్యవసాయ పనులకు ప్రత్యామ్నాయంగా కాదు. వేతన భద్రత కల్పించే చట్టం.
తద్వారా సేద్యానికి అయ్యే ఖర్చులను ఎంతోకొంత సమకూర్చుకోవడం, కష్ట కాలంలో ఎక్కువ వడ్డీకి అప్పులు చేసే పరిస్థితి నుంచి ఊపిరి తీసుకోవడం వంటి ప్రయోజనాలు గ్రామీణ పేదలకు సమకూరాయంటే అది ఉపాధి హామీ చట్టం ఫలితమే.
ఇటువంటి సమయంలో ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం అంటే సన్నకారు రైతుల పేరు చెప్పి వాళ్ళ కడుపు కొట్టడమే.
శ్రమ స్వేచ్ఛ- రోజు వారి అధికారం
నిరంతరం కరువు సీమగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో కొద్దిపాటి భూమి కలిగిన ఒక దళిత మహిళ ఉపాధి హామీ చట్టం తమ జీవితాలను ఎలా మార్చిందో అనుభవం ద్వారా చెప్పింది.
ఉపాధి హామీ చట్టం అమల్లోకి రాకముందు ఊళ్లోని కామందు పొలంలోనే కట్టుబానిసల్లాగా పని చేయాల్సి వచ్చేది.
ఆ దొరికే పని కూడా అంతంత మాత్రమే. ఏదైనా అవాంతరం వచ్చి పనికి వెళ్లలేకపోతే చివాట్లు తప్పవు.
పొలం పనులు లేనప్పుడు కామందు చెప్పిన పని అంతా చేసి ఇచ్చిన దాంతో సరి పెట్టుకోవాల్సి వస్తుంది.
ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం ద్వారా సంవత్సరానికి వందరోజుల వేతన కూలికి వెళ్ళేది.
ఆ పనులు కూడా నివాస ప్రాంతానికి సమీపంలోని అందుబాటులో ఉండేవి. దూరభారం వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
ఆదాయం పరిమితమైన ఖచ్చితమైన ఆదాయం ఉండేది. అన్నిటికంటే మించి ఈ చట్టం వచ్చిన తర్వాత తన ప్రాధాన్యతలు మార్చుకోవటానికి అవకాశం వచ్చింది.
నచ్చిన పనికి వెళ్లడం, నచ్చిన కూలి ఇచ్చే పనికి వెళ్లడం వాటి నిర్ణయాలు తీసుకోగల స్థితికి ఆమె వచ్చింది.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే, పని కోసం ఒకరి ఇంటి ముందు వెళ్లి నిలబడాల్సిన పరిస్థితి నుంచి బయటపడింది.
భారతదేశంలోని వ్యవసాయ కార్మికులలో అత్యధికలు దళితులు, ఆదివాసీలే. భూయాజమాన్యం కూలీకి పెట్టుకునే స్థోమత ప్రధానంగా అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమైంది.
ఉపాధి హామీ చట్టం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించడంతో ఈ కులాధారిత ఆధిపత్య చట్రాల పట్టు గ్రామీణ పేదల జీవితంపై ఎంతో కొంత సడలింది.
బాధ్యత లేని కూలీలు, వ్యవసాయ కూలీల కొరత పేర్లతో జరుగుతున్న ప్రచారం నిజానికి పైన ప్రస్తావించిన మార్పులకు పాలకవర్గ స్పందన.
ఉపాధి చట్టం ద్వారా వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసిన రాష్ట్రాలు నష్టపోయాయి.
నిజానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి మద్దతు ఇవ్వటం కోసమే ఉపాధి హామీ చట్టం అన్న సూత్రాన్ని నిజాయితీగా నమ్మితే తాజాగా తీసుకున్న అనేక నిర్ణయాల అవసరమే తలెత్తేది కాదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కింద వచ్చే నిధులను ఉపయోగించి పంటలు ఎండబెట్టుకోవటానికి కావలసిన ప్లాట్‌ఫారాలు నిర్మించింది. వీటివలన చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి 152 కోట్ల రూపాయలు విడుదల చేయటానికి తిరస్కరించడంతో, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వచ్చింది. ఇక్కడ సమస్య తెలంగాణ ప్రభుత్వం చేసిన పని వ్యవసాయానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది కాదు. బడ్జెట్ వ్యయానికి సంబంధించి కేంద్రం రూపొందించిన కఠినతరమైన నిబంధనల కారణంగా, తెలంగాణ ఆ 152 కోట్ల రూపాయలు నిధులు నష్ట పోవాల్సి వచ్చింది.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో ఆదివాసీ నివాస ప్రాంతాల్లో గిరిజనులు పెంచే తేయాకు తోటలు పర్యావరణ ప్రయోజనకరమైనవి అన్నది వాస్తవం.
కానీ కేంద్రం రూపొందించిన జాబితాలో ఈ సేద్యం మినహాయించబడింది.
అంటే ఆ ప్రాంతంలోని ఆదివాసీ రైతాంగానికి ఈ కొత్త చట్టం వలన ఏమీ ప్రయోజనం ఉండదు.
ఇటువంటి తోటల పెంపకం వల్ల ఆయా కుటుంబాలకు పని దొరుకుతుంది, వేతనం దొరుకుతుంది. దీర్ఘకాలిక భద్రత కూడా దక్కుతుంది.
అటువంటి పనిని చట్టం పరిధి నుంచి తొలగించడం అంటే వారిని వలస కూలీలుగా మార్చడమే అవుతుంది.
ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్రానికి ఎదురైన సమస్య రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వ్యవసాయానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది కాదు.
ఆయా కార్యక్రమాలు కేంద్రం గీతలకు లోబడి ఉన్నాయా లేవా అన్నదే సమస్య.
దేశమంతా వ్యవసాయంలో ఒకే సీజన్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయనే భ్రమ
దేశమంతా వ్యవసాయ ఋతువు ఒకే రకంగా ఉంటుందని; ఒకే నెలల్లో పనులు మొదలవుతాయి, ఒకే నెలలో ముగుస్తాయనే తప్పుడు అభిప్రాయంపై ఆధారపడి- ఎడారిలో రెండు నెలల పాటు ఈ చట్టం కింద పనులు చేయకూడదని నిషేధం విధించింది. ఇది పూర్తిగా తప్పుడు అవగాహన.
సాగునీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో ఇది సాధ్యం అయితే కావచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఇలానే జరుగుతుందని ప్రచారం చేయటం సరైనది కాదు.
వర్షాభావ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలలో రెగ్యులర్ సీజన్లో కూడా కూలీ పనులు సరిగ్గా దొరకటం లేదు.
అటువంటి ప్రాంతాలలో భూమిలేని పేదలు- ఆదివాసీలకు పనులు దొరికే రోజులు నామత్రమే.
వివిధ ప్రాంతాలలో వివిధ విస్తీర్ణంలో ఉన్న కమతాలలో వివిధ మోతాదుల్లో ఉన్న కుటుంబ శ్రమతో సాగే వ్యవసాయం ఉన్న దేశంలో అన్నీ ఒకె మూసలో పోసినట్టు జరిగితాయని చెప్పడం ఆ అవగాహన ఆధారంగా నిర్ణయం చేయటం అవుతుంది. క్షేత్రస్థాయి వాస్తవాల గురించి ఏ మాత్రం అవగాహన లేకపోతేనే జరుగుతుంది.
అటువంటి విలక్షణ వాతావరణంలో ఉపాధి హామీ పనులు నిలిపివేసినంత మాత్రాన వాళ్ళందరూ వ్యవసాయానికి మళ్ళుతారనే భరోసా ఏమీ లేదు. పైగా ఈ కుటుంబాలన్ని తిరిగి అప్పుల ఊబిలో కూరుకు పోయే ప్రమాదం ఉన్నది. లేదా వలస కార్మికులుగా మారాల్సి ఉంటుంది.
వివిధ రాష్ట్రాలు వేర్వేరు పీక్ సీజన్లను నిర్ధారించవచ్చనే వెసులుబాటు ఇచ్చినట్టు చట్టంలో కనిపిస్తుంది. కానీ వ్యవసాయక పర్యావరణ పరిస్థితులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి రావు పోవు. దీంతో చట్టం అమలు పేరుతో అర్హులైన కోట్లాదిమంది చట్టం ద్వారా ప్రయోజనం పొందలేని దుస్థితికి నెట్టబడతారు.
ఆధిపత్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యం తప్ప వ్యవసాయాన్ని బతికించడం కాదు
ఉపాధి హామీ చట్టం ద్వారా తమ సేద్యం భూములు బాగుచేసుకోవడానికి కష్టపడే చిన్న సన్నకారు రైతులు, ఆదివాసీ రైతులు ఇపుడు తాజా చట్టం కింద అటువంటి ప్రయోజనాన్ని పొందలేరు. గ్రామీణ పెత్తందార్ల పట్టు నుంచి విముక్తి పొంది, మెరుగైన వేతనాలు కోసం గొంతెత్త కలిగిన వ్యవసాయ కార్మికులు, భూమి లేని పేదల గొంతులు కొత్త చట్టం కింద మూగబోతాయి.
వ్యవసాయాన్ని బతికించడమే లక్ష్యమయితే- సాగునీరు, నిలకడైన ధరలు, ఉత్పాదకాలు సమకూర్చడం వంటి విషయాలపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఉండాలి. దీనికి భిన్నంగా తాజా చట్టం గ్రామీణ శ్రమ శక్తి మార్కెట్‌ను నియంత్రించి, కట్టడి చేయబోతోంది.
ఇటువంటి జోక్యం ద్వారా గ్రామీణ పేదలు కూలీలకు ఆదాయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వటానికి బదులు యజమానులకు అవసరమైనప్పుడు అడ్డామీద కూలీలు అందుబాటులో ఉండేలా చేయటమే లక్ష్యంగా ఈ చట్టం పని చేయనున్నది.
అనువాదం: కొండూరు వీరయ్య
రచయితలు లిబ్ టెక్ ఇండియా సంస్థలో పని చేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
