భారత ఆర్థిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థలు విశిష్ట పాత్రను పోషించాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో కూడా ఇవి కీలక పాత్రను పోషించాయి.
ఉపాధి కల్పన, ప్రభుత్వ సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో పీఎస్‌యూలు అద్భుతమైన పాత్ర పోషించాయి.
భారత ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించడంలో ప్రభుత్వ రంగ సంస్థల కృషి ప్రశంసనీయం.
పీఎస్‌యూలు అందించే ఉత్పత్తులు,సేవలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి అవకాశాలను సృష్టించడంలో; ప్రత్యక్ష/పరోక్ష ఉపాధిని కల్పించడంలో, కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని అందించడంలో, సాంకేతిక పురోగతి- ఆవిష్కరణలలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సొంతంగా పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉన్న పాలక వర్గాలు, కీలకమైన ప్రాథమిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ప్రారంభించారు.
దీని ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపంలో పారిశ్రామిక పునాది ఏర్పడింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఆర్థికంగా బలంగా ఉన్న సామ్యవాద యూఎస్ఎస్ఆర్, తూర్పు యూరప్ సోషలిస్ట్ దేశాల ప్రభావం వల్ల ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలు కీన్సియన్ ఆర్థిక సిద్ధాంతంతోపాటు సంక్షేమ ఆర్థిక విధానాలను అమలు చేయక తప్పనిసరి ఏర్పడింది.
సోవియట్ యూనియన్, తూర్పు యూరోప్లోనీ సోషలిస్టు వ్యవస్థలు పతనమైన తర్వాత సంక్షోభంలో ఉన్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉదారవాద విధానాల వైపు మళ్ళింది.
ఫలితంగా, భారత పాలక వర్గాలు ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభంతో కలిసి భారత ప్రభుత్వాన్ని కూడా నయా ఉదారవాద విధానాల వైపు నడిపించారు.
దీంతో ప్రభుత్వ రంగం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు బలి అయింది.
ప్రభుత్వ రంగ వృద్ధి
1951లో కేవలం 5గా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 1969 నాటికి 84కు, 2024-25 నాటికి 475కు పెరిగింది.
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే 2024-25 ప్రకారం, ప్రస్తుతం 291 సీపీఎస్ఈలు పనిచేస్తుండగా- 81 నిర్మాణ దశలో ఉన్నాయి.
వీటిలో 28 విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ మార్గదర్శకాల ప్రకారం బదిలీ ప్రక్రియలో ఉన్నాయి. 75 సంస్థలు మూసివేత/లిక్విడేషన్ దశలో ఉండగా, 66 సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయబడ్డాయి.
291 సీపీఎష్ఈలలో 14 ‘మహారత్న’, 26 ‘నవరత్న’, 49 ‘మినీరత్న-I’; 9 ‘మినీరత్న-II’గా వర్గీకరించబడ్డాయి.
పనిచేస్తున్న 291 CPSEలు రూ 37.01 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించాయి.
వీటిలో 9 సంస్థలు ఒక్కొక్కటి రూ లక్ష కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తూ, మొత్తం ఆదాయంలో 71.4% వాటాను కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్నికిలో ఉన్న 291 ప్రభుత్వ రంగ పరిశ్రమలు నాలుగు రకాలుగా విభజించబడ్డాయి.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రెండు, గనులు- వెలికితీత రంగంలో 26, ఉత్పత్తి ప్రాసెసింగ్- జనరేషన్ కింద 97, సర్వీస్ రంగం 166.
సీపీఎస్ఈల పనితీరు..
మొత్తం అన్ని పీఎస్‌యూలు కలసి దేశానికి రూ 37.12 లక్షల కోట్లు(గత ఏడాది కంటే 11.4% పెరుగుదల); ఆర్థిక పెట్టుబడి రూ 31.65 లక్షల కోట్లు(14.1% పెరుగుదల) అందించాయి.
2024-25లో అన్ని సీపీఎస్ఈల ద్వారా జరిగిన మొత్తం విలువ జోడింపు(Value addition) రూ 9.24 లక్షల కోట్లు.
గత 5 ఏళ్లలో సీపీఎస్ఈలు పన్నులు, సుంకాలు, డివిడెండ్ల రూపంలో కేంద్ర ఖజానాకు రూ 24.03 లక్షల కోట్లు అందించాయి. రూ 6.95 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాయి.
వీటి నికర లాభం 2020-21లో రూ 1.66 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి రూ 2.91 లక్షల కోట్లకు పెరిగింది.
గత ఐదు సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం లాభం 12.46 లక్షల కోట్లు.
పరిశోధన మరియు అభివృద్ధి(R&D) కోసం రూ 9691 కోట్లు ఖర్చు చేశాయి. అదే సందర్భంలో 2024-25లో 63 సీపీఎస్ఈలు రూ 18,054 కోట్ల నష్టాల్లో ఉన్నాయి.
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)..
అన్ని సీపీఎస్ఈలు కలసి గత 5 ఏళ్లలో రూ 24,520 కోట్లను ఆకలి- పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, విపత్తు నిర్వహణ, పర్యావరణ సుస్థిరత, మహిళా సాధికారత, క్రీడలు- కళా సంస్కృతుల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వెచ్చించాయి.
సీపీఎస్ఈలు- ఉపాధి..
1990ల నుంచి రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2024-25లో వీరి సంఖ్య 7,83,728(50.81%) కాగా, క్యాజువల్/డైలీ రేటెడ్/కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 7,58,611 (49.19%)కు పెరిగింది.
నియామకాల్లో రోస్టర్ విధానం ద్వారా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అందాల్సిన సామాజిక న్యాయం, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరగడం వల్ల దెబ్బ తిన్నది.
మహిళలు, దివ్యాంగుల ఉద్యోగ అవకాశాలు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ విధానాల వల్ల నీరుగారి పోయాయి.
అయినప్పటికీ 2023-24 వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం, నికర విలువ జోడింపులో వేతనాల వాటా సీపీఎస్ఈలలో 18% ఉండగా- జాతీయ సగటు 15.97% మాత్రమే.
అలాగే ప్రభుత్వ రంగ సంస్థల లాభాల వాటా మొత్తం విలువ జోడింపులో 47% ఉండగా- జాతీయ సగటు 51.01%గా ఉంది.
ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు..
భారతదేశంలో ప్రభుత్వ రంగానికి పునాదులు వేయడంలో, పంచవర్ష ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైన ఈ ప్రక్రియ, రెండో ప్రణాళికలో వేగవంతమైంది.
సామ్యవాద తరహా సమాజ నిర్మాణమే పంచవర్ష ప్రణాళికల లక్ష్యంగా ఉండేది. వ్యక్తిగత లాభం కంటే సామాజిక ప్రయోజనమే ముఖ్య ఉద్దేశ్యంగా ఉండేది.
కేవలం సంపద సృష్టి, ఉపాధి కల్పన మాత్రమే కాకుండా సంపద సమాన పంపిణీ కూడా ప్రణాళికల లక్ష్యంగా ఉండేది. లాభాలు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రయోజనానికి ఉపయోగపడేవి.
2015 నుంచి ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ను తీసుకువచ్చారు. ఇది నయా ఉదారవాద విధానాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే వ్యూహాలను రూపొందిస్తోంది.
పారిశ్రామిక విధానం, ప్రభుత్వ రంగం..
ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక విధానం ప్రభుత్వ రంగ పరిశ్రమల నిర్మాణం అభివృద్ధి దిశగా సాగాయి. 1948 పారిశ్రామిక విధానం భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించింది. 1956 విధానం భారతదేశ ఆర్థిక రాజ్యంగా పిలువబడింది.
1977 విధానం వికేంద్రీకరణ పద్ధతిలో చిన్న పరిశ్రమల స్థాపన ద్వారా పేదలకు ఉపాధిపై దృష్టి సారించి బహుళ జాతి సంస్థల ఆవిర్భావానికి కొన్ని ఆంక్షలు విధించింది.
1980 విధానం పోటీ దేశీయ మార్కెట్, ఆధునీకరణ, సాంకేతిక మెరుగుదల ఎంపిక చేసిన పద్ధతులలో సరళీకరణకు; ఎంఆర్టీపీ, ఎఫ్ఈఆర్ఏ చట్టాలతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన పరిశ్రమలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ప్రాధాన్యతలుగా మారాయి.
మౌలిక మార్పు- నయా ఉదారవాద దాడి..
1991 నుంచి ప్రభుత్వం అనుసరించిన నూతన ఆర్థిక విధానం వల్ల ప్రభుత్వ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. లైసెన్సింగ్ రద్దు, పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతికి పునాదులు వేసింది.
ఈ సరళీకరణ విధానంతో ప్రభుత్వ పరిశ్రమల మీద దాడి ప్రారంభమైంది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలపై సరళీకృత విధానం ఆధారపడింది. దీనికి ప్రత్యామ్నాయం లేదనే భావన ముందుకు తెచ్చింది.
బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ చెప్పినట్టు, “ప్రభుత్వ పని వ్యాపారం చేయడం కాదు” అనే థాచరిజమనే సిద్ధాంతం బలపడింది. నాటి అమెరికా అధ్యక్షుడు రీగన్ పేరుతో(రిగనిజం) సంక్షేమ చర్యల కుదింపుతోడైంది.
సోవియట్ యూనియన్, తూర్పు యూరోప్‌లోని సోషలిస్ట్ వ్యవస్థల పతనం తర్వాత ఫుకి యమా(జపాన్) ప్రతిపాదించిన పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే మానవజాతి నాగరికత అనే సిద్ధాంతం ముందుకొచ్చింది.
దీంతో 1991 నుంచి ప్రభుత్వ రంగ పరిశ్రమల మనుగడ సాధ్యం కాదనే పేర ప్రైవేటీకరణ వేగవంతమైంది.
ప్రైవేటీకరణ – పెట్టుబడుల ఉపసంహరణ-నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్..
1991 నుంచి ప్రారంభమైన ప్రైవేటీకరణతో ఇప్పటి వరకు మొత్తం రూ 5,99,816 కోట్ల విలువైన పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో 9,962 కోట్లు; యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ కాలంలో 6,661కోట్లు; వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో 24,619 కోట్లు; కాంగ్రెస్ నేతృత్వంలోనే యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఆలయన్స్-1 ప్రభుత్వ కాలంలో 8,516కోట్లు; యూపీఏ- 2 ప్రభుత్వ కాలంలో 9,529 కోట్లు; నరేంద్ర మోదీ ప్రభుత్వ(2014-2026)కాలంలో రూ 4,44,528 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
అత్యధికంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ కాలంలో రూ 4,44,528 కోట్లు (అంటే మొత్తం ఉపసంహరణలో 77.11%) జరిగింది.
వాజ్‌పేయి, మోదీ నేతృత్వాలలోని ఎన్డీఏ ప్రభుత్వాల కాలంలో 78.21% ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులో ఉపసంహరణ జరిగింది.
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ వామపక్షాల మీద ఆధారపడి ఏర్పడటంతో పెట్టుబడుల ఉపసంహరణ తక్కువగా జరిగిందని గమనించాలి.
దీనికి అదనంగా ‘నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్’పేరుతో ప్రజాధనంతో నిర్మితమైన మౌలిక సదుపాయాలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. ఎన్ఎంపీ-1 కింద రూ 6 లక్షల కోట్లు (2022-2025 సంవత్సరాలలో) లక్ష్యంగా పెట్టుకోగా- 5.29కోట్లు పూర్తి చేశారు.
నమో-2(2025-30) కింద రూ 10 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇటీవల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ పైప్ లైన్ కింద మూడు సంవత్సరాల(2026-2030)కాలంలో 17.7 9 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
మొత్తంగా చూసినప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, మానీటైజేషన్ ఇంకా ఇతర పేర్లతో మొత్తం ప్రజల ఆస్తిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు.
లేబర్ కోడ్ల ప్రభావం..
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ సవాళ్లను ఎదుర్కొంటుండగా, ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికులు, మొత్తంగానే కార్మిక వర్గం లేబర్ కోడ్ల రూపంలో మరో తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నారు.
కార్మికులను బానిసలుగా తయారు చేసేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల చట్టాలను 2019, 2020 సంవత్సరాలలో చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గ ఐక్య ప్రతిఘటన, పోరాటాలతో ఈ కోడ్లను 2025 అక్టోబర్ వరకు ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. కానీ 2026 ఏప్రిల్ నుంచి అమలయ్యేలా 2025 నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పురాతన స్మృతుల ఆధారిత మోసపూరిత ‘శ్రమ శక్తి నీతి’..
కార్మిక కోడ్ల అమలుకు ముందే, 2025 అక్టోబర్ 8న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో మోసపూరితమైన “శ్రమ శక్తి నీతి 2025” ముసాయిదాను విడుదల చేశారు.
ఇది మంత్రిత్వ శాఖను కార్మిక చట్టాలు అమలు చేసే యంత్రాంగం(Enforcement Machinery), సంరక్షకుడు (custodian)గా కాకుండా, కేవలం ఒక సహాయకారి(Facilitator)గా మార్చేలా రూపొందించబడింది.
ఈ ‘నీతి’ కార్మిక కోడ్లకు అనుగుణంగా ఉంటుందని భావిస్తూనే, ఇది పురాతన స్మృతి గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, శుక్ర నీతి, శుల్క న్యాయం, అర్థశాస్త్రం నుంచి ప్రేరణ పొందినట్టు ప్రకటించింది.
మనుస్మృతి రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం భావాలకు భిన్నంగా వర్ణాశ్రమ ధర్మం చెప్పే సామాజిక, ఆర్థిక, రాజకీయ పాలన దేశంలో అమలు చేయాలని దాని సారాంశం.
చట్టబద్ధం చేయబడిన ‘హైర్ అండ్ ఫైర్’..
పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం, 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఫ్యాక్టరీలు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే కార్మికుల లేఆఫ్, తొలగింపు పరిశ్రమల మూసివేత చేయడాన్ని అనుమతించింది.
రద్దు చేయబడిన ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం, 100 లోపు కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి అవసరం లేదు నేడు ఆ పరిమితిని 300కు పెంచారు.
పరిశ్రమల వార్షిక సర్వే నివేదిక 2023-24 ప్రకారం దేశంలో దాదాపు 90 శాతం పైగా పరిశ్రమలు 300 మందిలోపు కార్మికులు పనిచేసేవే. ఫలితంగా రానున్న కాలంలో భారీ సంఖ్యలో కార్మికులు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉపాధి నుంచి బయటకు గెంటి వేయబడతారు.
యజమానులు శాశ్వత ప్రాతిపదికన కార్మికులను నియమించుకోవడానికి బదులుగా ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేని నిర్దిష్ట కాల పరిమితిలోపు పనిచేసే విధంగా కార్మికులను నియమించుకోవడానికి ఈ కోడ్ అనుమతిస్తుంది. యజమానులు ఇష్టారాజ్యంగా హైర్ అండ్ ఫైర్ విధానాన్ని అమలు చేయడానికి అవకాశం కల్పించబడింది.
అలాగే, 250 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న ఫ్యాక్టరీలకు ‘స్టాండింగ్ ఆర్డర్స్’ ధృవీకరణ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల 85% ఫ్యాక్టరీలు కార్మికులతో లేదా యూనియన్లతో సంప్రదించకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో సొంతంగా నిబంధనలను మార్చుకునే అవకాశం ఈ కోడ్ కల్పించింది.
ప్రమాదంలో భద్రత ప్రశ్నార్ధకం..
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ ఫ్యాక్టరీ నిర్వచనాన్ని మార్చింది. విద్యుత్ ఉపయోగించే ఫ్యాక్టరీలలో కార్మికుల పరిమితిని 10 నుంచి 20కి, విద్యుత్ లేని చోట 20 నుంచి 40కి పెంచింది.
ఈ పరిమితి కంటే తక్కువ ఉన్న ఫ్యాక్టరీలకు చట్టబద్ధమైన తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఫలితంగా సుమారు 60% ఫ్యాక్టరీలు భద్రతా తనిఖీల పరిధి నుంచి బయటపడతాయి.
అలాగే, గతంలో 20 కంటే తక్కువ మంది కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 50కి పెంచారు. 50 కంటే తక్కువ మందిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు లైసెన్సింగ్ అవసరం లేదు.
అసంపూర్ణ సామాజిక భద్రత
పీఎఫ్, ఈఎస్ఐ, ఫ్యాక్టరీ,పేమెంట్ ఆఫ్ వేజెస్, గ్రాట్యుటీ వంటి చట్టాల వర్తింపుకు ఉన్న కార్మికుల సంఖ్య పరిధిని తగ్గించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండును ఈ కోడ్ పట్టించుకోలేదు. సామాజిక భద్రత అందరికీ వర్తిస్తుందనే వాదన కేవలం యజమానులకు పాదాభివందనం చేసి కార్మికులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు.
ఈఎస్ఐ చట్టం పదిమంది ఆపైన పనిచేసే వారికి వర్తిస్తుంది. పీఎఫ్ చట్టం 20 మంది అంతకంటే ఎక్కువ పని చేసే సంస్థలకి వర్తిస్తుంది. అంటే ఈఎస్ఐలో నమోదైన సభ్యుల కంటే పీఎఫ్‌లో నమోదైన సభ్యుల సంఖ్య తక్కువగా ఉండాలి. కానీ ఈఎస్ఐ కంటే పిఎఫ్ లోనే ఎక్కువ మంది కార్మికులు నమోదైనట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ చట్టాల అమలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతున్నది.
అసంఘటిత రంగం, భవన నిర్మాణ కార్మికుల కోసం బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేకుండానే సామాజిక భద్రత కోడ్‌ను రూపొందించారు. ఫలితంగా ప్రస్తుతం సంక్షేమ పథకాలకు ఉన్న నిధులు కూడా వివిధ రాష్ట్రాల సంక్షేమ బోర్డులు, ఇతర అవసరాలకు మళ్ళించబడి నిష్ప్రయోజనంగా మారే ప్రమాదం ఉంది. సార్వజనిన సామాజిక సంక్షేమం అందరికీ వర్తిస్తుందని చేసే ప్రచారం మోసపూరితమైనది.
వేతనాలను తగ్గించడం..
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ఫెయిర్ వేజ్, లివింగ్ వేజ్ గురించి వేతన కోడ్‌ను ప్రస్తావించలేదు. గౌరవ వేతనం పేరుతో పనిచేసే కోట్లాది మంది స్కీమ్ వర్కర్ల సమస్యలను పట్టించుకోకుండా, రోజుకు కేవలం రూ 176 గా జాతీయ Floor Level Minimum Wage పేర్కొంది.
ఒక పక్క కంపెనీల లాభాలు పెరుగుతుంటే, మొత్తం ఉత్పత్తి విలువలో కార్మికులకు దక్కే వేతనాల వాటా మాత్రం తగ్గుతోంది.
నయా ఉదారవాదం & మతపరమైన విభజన రాజకీయాలు..
1991లో ప్రారంభమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో పాటే మతపరమైన ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత, 2002 గుజరాత్ అల్లర్లు వంటి సంఘటనలు ‘హిందూ-హిందీ-హిందుస్థాన్’ అనే నినాదంతో మతపరమైన విభజన రాజకీయాలకు దారితీశాయి.
మనుధర్మ శాస్త్రం, వర్ణాశ్రమ ధర్మం ఆధారిత పాలనను ప్రోత్సహిస్తూ- ముస్లింలే లక్ష్యంగా హిందుత్వ పేరుతో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీవంటి అంశాల ద్వారా ప్రజలను విభజించి, నయా ఉదారవాద విధానాలను వేగంగా అమలు చేస్తున్నారు.
పరిష్కారం-ఐక్య పోరాటం- ప్రతిఘటన..
నేటి క్లిష్ట పరిస్థితులకు పరిష్కారం కార్మిక వర్గ నేతృత్వంలో బలమైన సోషలిస్ట్ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమే. అందుకు ఇప్పటివరకు మనం లేని ప్రాంతాలతోసహా మొత్తం ప్రజల వద్దకు వెళ్లి, ప్రభుత్వ విధానాల వెనుక ఉన్న అసలు రాజకీయాలను ఎండగట్టాలి.
విశాల ఐక్యత, పోరాటాల ద్వారా ప్రభుత్వ విధానాల మార్పు కోసం కృషి చేయాలి. అందుకుగాను ప్రతిఘటన, ఉల్లంఘనతో కూడిన వర్గ పోరాటాన్ని మరింత బలంగా నిర్వహించాలి.
సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను విధ్వంసం చేస్తున్న ప్రస్తుత కార్పొరేట్-మత రాజకీయ కూటమిని ఓడించి, ప్రభుత్వ రంగాన్ని, దేశాన్ని కాపాడు కోవాలి. దోపిడీ వ్యవస్థను మార్చే దిశగా ఉద్యమించాలి.
అందులో భాగంగా ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
