ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నంతకాలం వారి శక్తినంత ప్రభుత్వ సేవలకు అంకితం చేస్తారు.
సర్వీసులో ఉన్నంతకాలం కుటుంబ పోషణ, పిల్లల చదువులు, తల్లిదండ్రుల పోషణకే వారి జీతం దాదాపు సరిపోదు.
అలాంటివారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బ్రతకడం ఎలా అనేది ప్రధాన సమస్య.
దీనికి తోడు వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సామాజిక బాధ్యతలు అదనంగా భరించాల్సి ఉంటుంది.
ఇది అత్యంత భారంతో కూడిన ఒక పెద్ద సమస్య. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పథకం అమలులో ఉంది.
అయితే సోవియెట్ యూనియన్, తూర్పు యూరోప్ దేశాలలో సోషలిస్టు వ్యవస్థలు పతనమైన తర్వాత ఏకధ్రువ ప్రపంచం పేరుతో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అమల్లోకి వచ్చాయి.
భారతదేశంలో 1990 సంవత్సరంలో ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో, సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి తెచ్చారు.
తన ప్రజా సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగి, మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం సరళీకరణ విధానాలలో అత్యంత కీలకమైనది.
ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఉద్యోగులపై పని భారం పెంపుదల, శాశ్వత ఉద్యోగ నియామకాల స్థానంలో ఎలాంటి భద్రతా లేని నాన్ పర్మినెంట్ ఉద్యోగాల కల్పన, సదుపాయాలు కుదింపు మొదలైయ్యాయి.
నేడు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ నేపథ్యం నుంచి ఉద్భవించినవే.
ఆ సమస్యలు ఏమిటి?
2004 జనవరి కంటే ముందు కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పథకం అమల్లో ఉంది.
సాధారణంగా ఈ పెన్షన్‌ను “ఓల్డ్ పెన్షన్ స్కీం” అని పిలుస్తారు.
ఈ పెన్షన్ కోసం ఉద్యోగులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగ విరమణ తర్వాత చివరి నెల వేతనంలో 50% పెన్షన్ వస్తుంది.
దానిపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ వస్తుంది. పెన్షనర్‌పై ఆధారపడిన అవివాహిత, వితంతువులైన ఆడపిల్లలకు, వికలాంగులైన పిల్లలకు కూడా పెన్షన్ వస్తుంది.
వైద్య సదుపాయాలు కుటుంబంలో అందరికీ అందుతాయి. వయసు పెరిగే కొద్దీ తదనగుణంగా పెన్షన్ పెరుగుతుంది. మరణిస్తే అంత్యక్రియలు ఖర్చులు వస్తాయి.
వేతన కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వాటి ప్రయోజనాలలో కొన్ని ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా లభిస్తాయి.
సరళీకరణ ప్రభావం..
రిటైరైన ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది, పెన్షన్ల భారం తడిసి మోపెడవుతున్నదని ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోనీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం మొదలు పెట్టింది.
రాజకీయంగా కాంగ్రెస్‌ను తూర్పార పట్టిన బీజేపీ, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రారంభించిన సరళీకృత విధానాల జోరును పెంచింది.
2003 డిసెంబర్ 22న “నేషనల్ పెన్షన్ సిస్టమ్” పేరున కొత్త పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకువచ్చింది. క్రమంగా అనేక రాష్ట్రాలు ఈ కొత్త పెన్షన్ స్కీము అమలు ప్రారంభించాయి.
ఎన్పీఎస్ నష్టాలు..
గత పెన్షన్ స్కీముకు భిన్నంగా ఉద్యోగులు తమ జీవితంలో 10% పెన్షన్ నిధికి చెల్లించాలి. అంటే ఉద్యోగులు తమకు పెన్షన్ కావాలంటే తామే పెట్టుబడి పెట్టి కొనుక్కోవాలి.
అలా చెల్లించిన పెన్షన్ నిధి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.
దీనిని కేంద్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 23న ఏర్పాటు చేసింది.
ఈ సంస్థ పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్‌లాంటి వివిధ రూపాలలో పెట్టుబడులు పెట్టి దాని నుంచి వచ్చే ఆదాయాల ఆధారంగా పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి.
దీంతో పెన్షన్ ఎంత వస్తుందో గ్యారెంటీ లేదు.
పాత పెన్షన్ పథకంలోని వితంతు ఆడపిల్ల పెన్షన్, వయసు పెరిగే కొద్దీ పెన్షన్ పెరుగుదల, వైద్య సదుపాయాలు, అంత్యక్రియ ఖర్చులు, 6 నెలలకొకసారి పెరిగే డీఏలకు ఎగనాం పెట్టారు.
అంతేకాకుండా, పెన్షన్ చెల్లింపులో ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఇది అత్యంత ప్రమాదకర పథకం. “కార్పొరేట్లకు సిరి-ఉద్యోగులకు ఉరి” అన్న చందంగా ఈ పథకం తయారయింది. ఈ స్కీము కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళనలు, పోరాటాలు జరిగాయి. “కొత్త పెన్షన్ స్కీము వద్దు-పాత పెన్షన్ స్కీము ముద్దు” నినాదంతో ఈ ఆందోళనలు సాగాయి.
కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది..
కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో యూనిఫైడ్ పెన్షన్ స్కీం తీసుకొచ్చింది. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ కంటే మెరుగైనదని, జీతంలో 50% పెన్షన్ వస్తుందని, పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామికి ఒరిజినల్ పెన్షన్‌లో 60% వస్తుందని ఇంకా అనేక రకాలైన భ్రమలు ప్రభుత్వం కల్పించింది.
మొదట్లో కొందరు ప్రభుత్వ ప్రకటనల భ్రమలలో పడి ఈ స్కీము మంచిదని భావించారు. దాంతో ఉద్యోగ సంఘాలు దీన్ని ఆమోదించాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసింది.
నోటిఫికేషన్ విడుదలై, అమలు ప్రారంభమైన తర్వాత మోసపూరితమైన యూపీఎస్ అసలు రంగు బయటపడింది.
ఎన్ని కుట్రలు చేసినా నేటికీ కేవలం 5% లోపు ఉద్యోగులు మాత్రమే యుపీఎస్ను అంగీకరిస్తూ ఆప్షన్స్ ఇచ్చారు.
ఇందులో కూడా ఉద్యోగులు తమ వేతనంలో 10% పెన్షన్ నిధికి చెల్లించాలి.
సర్వీస్ చివరి 12 నెలల జీతం సగటులో 50% పెన్షన్ వస్తుంది. పాత స్కీంలో చివరి నెల జీతంలో 50% శాతం వచ్చేది. 12 నెలల సగటు లెక్కించడంతో పెన్షన్ తగ్గుతుంది.
50% పెన్షన్ రావాలంటే ఇండివిడ్యువల్ కార్పస్, బెంచ్ మార్క్ కార్పస్, పూల్ కార్పస్ పేరుతో అనేక ఆంక్షలు ఉన్నాయి.
ఈ పెన్షన్ పథకంలో ఉన్న లొసుగులు, ప్రమాదాలు అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలు దీన్ని వ్యతిరేకించాయి. పాత పెన్షన్ స్కీం అమలు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
వృద్ధుల పోషణ బాధ్యత ప్రభుత్వాలు స్వీకరించాల్సి ఉండగా, తమకేమీ సంబంధం లేదని ఉద్యోగ విరమణ చేసిన వారిని ప్రభుత్వం నానా అవస్థలకు గురి చేయటం అత్యంత దుర్మార్గం.
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం
పారిశ్రామిక కార్మికులు, కార్మిక సంఘాలు పీఎఫ్, గ్రాట్యూటీకి అదనంగా మూడవ బెనిఫిట్‌గా పెన్షన్ అమలు చేయాలని అనేక దశాబ్దాలుగా ఆందోళనలు, పోరాటాలు చేశాయి.
చివరికి 1995లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం-1995ని తీసుకొచ్చింది.
ఇది కార్మికులు, కార్మిక సంఘాలు కోరిన మూడవ బెనిఫిట్ కాదు. కార్మికులు తమ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ప్రతినెల 8.33% పెన్షన్ నిధికి చెల్లించాలి.
దీనికి కేంద్ర ప్రభుత్వం 1.67%చెల్లిస్తుంది.
ఇందులో కనీస పెన్షన్ నిర్దిష్టంగా ఎంత వస్తుందనే గ్యారెంటీ లేదు.
పైగా ప్రావిడెంట్ ఫండ్ నిధులలో 8.33% వడ్డీతో సహా కోల్పోతున్నారు.
వేతన సీలింగ్ రద్దుచేసి వాస్తవ వేతనాలు కనుగుణంగా పెన్షన్ లెక్కించాలి.
ఈపీఎస్‌లో ఆ అవకాశం లేని కారణంగా పెద్ద సంఖ్యలో కార్మికులు నష్టపోతున్నారు.
ఈ దగాకోరు పెన్షన్ స్కీముకు వ్యతిరేకంగా సీఐటీయూ ఒకరోజు దేశవ్యాప్త నిరసన సమ్మెకు పిలుపునిచ్చింది.
కార్మికులు పెద్ద ఎత్తున స్పందించి సమ్మెలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల కోర్టులలో కేసులు నమోదై చివరికి సుప్రీంకోర్టుకు చేరాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం సమీక్ష చేస్తామని ఇచ్చిన హామీతో సుప్రీంకోర్టు కేసును కొట్టివేసింది.
కానీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించింది. సంవత్సరాల తరబడి పెన్షన్ సవరణ జరగలేదు.
మొదట ఈ పెన్షన్ స్కీంను సమర్థించిన కార్మిక సంఘాలు కూడా ఆచరణలో అనుభవం తర్వాత పెన్షన్ స్కీం ఎంత దగాకోరో గుర్తించాయి.
పెన్షన్ సవరణకు దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, పోరాటాలు జరిగాయి.
చివరికి 2013లో యూపీఏ-2 ప్రభుత్వం కనీస పెన్షన్ రూ 1000కి పెంచాలని నిర్ణయించింది. కానీ ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. 2014 మార్చితో ఆ ప్రభుత్వ గడువు ముగిసింది.
కాంగ్రెస్ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చిన ఎన్డీఏ
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
ఇది తానే చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అయినా నేటికీ చాలామంది వెయ్యి రూపాయలలోపే పెన్షన్ పొందుతున్నారు.
కనీస పెన్షన్ పెంచాలని కరువు భత్యం కూడా జోడించాలని ఉద్యోగ విరమణ చేసిన వారు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
ఈ పూర్వ రంగంలో 2014 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమును అభివృద్ధి చేయడానికి బదులుగా ఉన్న కొన్ని ప్రయోజనాలను కూడా రద్దు చేసింది.
ఉదాహరణకు పెన్షన్ నిర్ణయించే పద్ధతిని అంతకముందున్న 12 నెలల సగటు కాకుండా చివరి 60 నెలల సగటు జీతం ఆధారంగా నిర్ణయించాలని మార్పు చేసింది.
దీంతో కార్మికులకి తీవ్రమైన నష్టం జరిగింది.
పైగా పెన్షన్ కమ్యుకేషన్ పద్ధతి రద్దు చేసింది. హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌కు గడువు విధించి వివాదాస్పదం చేసింది.
చివరికి సుప్రీంకోర్టు తిరిగి ఆప్షన్లు అనుమతించాలని చెబుతూ గడువును పెంచింది.
నేటికీ సుప్రీంకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసి కార్మికులకు వాస్తవంగా రావలసిన బెనిఫిట్ రాకుండా దీర్ఘకాలంగా కాలయాపన చేస్తున్నారు.
లక్షల సంఖ్యలో దరఖాస్తులు నిరాకరించడం, పెండింగ్‌లో పెట్టడం, దామాషా పద్ధతిలో పెన్షన్ నిర్ణయించడంలాంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వం వడిగట్టింది.
ప్రభుత్వ ఈ చర్యలకు వ్యతిరేకంగా పెన్షనర్లు దేశవ్యాప్తంగా విధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.
వీరిలో చీలిక తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వమే ఒక తొత్తు సంస్థని ఏర్పాటు చేసింది.
ఆ సంస్థ ప్రధానమంత్రితో, కార్మిక శాఖ మంత్రితో మాట్లాడామని, కనీస పెన్షన్ 7,500 ఇవ్వడానికి, డీఏ కూడా తోడు చేయడానికి అంగీకరించారని ప్రచారం చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా 2025 అక్టోబర్ 2 నుంచి ఇది అమలు చేయబోతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఫేక్ వీడియో వైరల్ అయింది.
ఈ ఫేక్ వీడియోను చాలా మంది నమ్మారు, ఆ తర్వాత అది అబద్ధమఅని నిర్ధారణ అయింది.
మళ్లీ జనవరి ఒకటి నుంచి అమలు చేయబోతున్నట్టుగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫేక్ వీడియో వైరల్ అయింది.
ఇది కూడా మోసమని రుజువు అయింది.
ఆ విధంగా కార్మికుల డిమాండ్‌ను పరిష్కరించకుండా వారిలో చీలిక తెచ్చి ప్రభుత్వం పెన్షనర్లకు తీరని ద్రోహం చేస్తున్నది.
పరిష్కారం..
కేంద్ర ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలకు వేశారనే సామెతను కూడా అధిగమించింది.
సాధారణ ప్రజలు, కార్మికుల ఓట్లతో గెలిచి, అధికార పీఠాన్ని ఎక్కారు. ఇప్పుడు వారి రక్తాన్ని పిండి బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీల రూపంలో లక్షల కోట్లు ధారాదత్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు ఈ సమ్మెను బలపరుస్తున్నాయి.
పెన్షనర్లు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.
ప్రభుత్వ విధానాలు మారకుండా పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావని అర్థం చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాన్ఫెడరేషన్ నాయకులు వీ నాగేశ్వరరావు, అజీజ్ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
