ట్రాన్స్జెండర్ వ్యక్తుల(హక్కుల పరిరక్షణ) సవరణ చట్టం, 2026ను అత్యంత వేగంగా ఆమోదించడాన్ని ఐక్యరాజ్యసమితి విమర్శించింది.
తప్పనిసరి వైద్య ధృవీకరణ ప్రక్రియ స్వీయ గుర్తింపును దెబ్బతీస్తుందని, ట్రాన్స్జెండర్ వ్యక్తులను మరింతగా వివక్షకు గురిచేస్తుందని పేర్కొంది.
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ వ్యక్తుల(హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు, 2026ను అత్యంత వేగంగా ఆమోదించడాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం గురువారం(ఏప్రిల్ 2) ఖండించింది.
ఇది భారతదేశంలోని ట్రాన్స్జెండర్ వ్యక్తులు ‘కష్టపడి సాధించుకున్న హక్కులను’ వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంది.
‘సంబంధిత వ్యక్తులు లేదా వర్గాలతో(స్టేక్హోల్డర్స్) తగిన సంప్రదింపులు జరపకుండానే ట్రాన్స్జెండర్ వ్యక్తుల(హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు, 2026ను వేగంగా ఆమోదించడం పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాము.
ఈ సవరణలు స్వీయ గుర్తింపు స్థానంలో తప్పనిసరి వైద్య ధృవీకరణ ప్రక్రియలను తీసుకురావడం ద్వారా, ట్రాన్స్జెండర్లు పోరాడి సాధించుకున్న హక్కులకు భంగం కలిగించే ముప్పు ఉంది’ అని ఈ అంతర్జాతీయ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.
తీవ్ర నిరసనల మధ్య బిల్లు ఆమోదం- వివిధ సంస్థల ఖండన..
ట్రాన్స్జెండర్, లింగ వైవిధ్యంతో ఉన్న వ్యక్తుల హక్కుల విషయంలో భారతదేశం ఒక మార్గదర్శిగా ఉందని గుర్తుచేస్తూ, “ఈ బిల్లు గోప్యతా హక్కుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ట్రాన్స్జెండర్ వ్యక్తులను వివక్షకు గురిచేసే ప్రమాదం ఉందని” ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
దేశవ్యాప్తంగా నిరసనలు, విమర్శల మధ్య మార్చి 30న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బిల్లుకు ఆమోదం తెలిపిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గెజిట్ ప్రకటన ప్రకారం, సవరించిన ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారి దాదాపు తక్షణమే అమల్లోకి వచ్చింది.
దీనికంటే ముందు మార్చి 31న, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడాన్ని ఖండించింది.
ఇది ‘ట్రాన్స్జెండర్, లింగ వైవిధ్యంతో ఉన్న వ్యక్తుల స్వీయ-గుర్తింపు హక్కును నిరాకరిస్తుందని’, ‘భారతదేశంలో మానవ హక్కులకు ఇది ఒక తీవ్రమైన విఘాతమని’ పేర్కొంది.
ఆ సంస్థ భారత విభాగాధిపతి ఆకార్ పటేల్ మాట్లాడుతూ, “ఈ తిరోగమన చట్టం రక్షణలను బలహీనపరుస్తుందని, ట్రాన్స్జెండర్ల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని మరింత పెంచుతుందని” అన్నారు.
మరోవైపు, రాజస్థాన్ హైకోర్టు రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సమాంతర రిజర్వేషన్లపై జరిపిన ఒక ప్రత్యేక విచారణలో, ఎవరికి వారు తమ జెండర్ను గుర్తించడం అన్నది ‘ప్రాథమిక హక్కు’ అని స్పష్టం చేసింది.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు, ఈ హక్కును ‘ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో, షరతులతో కూడిన వెసులుబాటు’గా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వ తొందరపాటును తప్పుబడుతూ, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ లోక్సభ, రాజ్యసభలు అతి తక్కువ చర్చతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించాయి.
2014లో వచ్చిన నాల్సా తీర్పు ద్వారా లభించిన స్వీయ గుర్తింపు హక్కును ఈ బిల్లు లాగేసుకుంటోందని, అలాగే 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) చట్టంలో అంతర్భాగంగా ఉన్న హక్కులను కూడా ఇది హరిస్తోందని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు.
2026 చట్టం “ట్రాన్స్జెండర్” అనే పదాన్ని “కిన్నర్, హిజ్రా, అరవాణి, జోగ్తా లేదా యూనుక్ వంటి సామాజిక-సాంస్కృతిక గుర్తింపులు కలిగిన వ్యక్తి”గా, లేదా నిర్దిష్ట “ఇంటర్సెక్స్ వైవిధ్యాలు” కలిగిన వ్యక్తిగా పునర్నిర్వచించడానికి ప్రయత్నిస్తోంది.
అలాగే, పుట్టుకతోనే పురుష లేదా స్త్రీ అభివృద్ధికి భిన్నంగా “ప్రాథమిక లైంగిక లక్షణాలు, బాహ్య జననేంద్రియాలు, క్రోమోజోమ్ నమూనాలు, గోనాడల్ అభివృద్ధి, ఎండోజీనస్ హార్మోన్ ఉత్పత్తి లేదా ప్రతిస్పందన లేదా ఇతర వైద్య పరిస్థితుల”లో పుట్టుకతోనే వచ్చే వైవిధ్యం ఉన్న వ్యక్తులను కూడా ఇందులో చేర్చుతోంది.
అత్యంత వివాదాస్పదంగా, ఈ చట్టం ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తుల నిర్వచనంలో “భిన్నమైన లైంగిక ధోరణులు, స్వీయంగా భావించే లైంగిక గుర్తింపులు కలిగిన వ్యక్తులు ఉండరని, ఎప్పటికీ చేర్చబడరని” స్పష్టం చేస్తోంది.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

