భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి(యూఎన్) కోరింది.
కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ మొత్తం 17 అంశాలతో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’(ఎస్డీజీస్)ను యూఎన్ ప్రపంచ దేశాలకు నిర్దేశించింది.
దాదాపు రెండు వందల దేశాలు దీన్ని అంగీకరించి, సంతకాలు చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టి ముందడుగు వేస్తున్నాయి.
అందులో ‘భారత్’ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం పుష్కర కాలం కిందటే పేదల ఆకలి తీర్చే ఒక ప్రయత్నం చేపట్టింది.
ఆకలి లేని వ్యవస్థ కోసం 2014లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించగా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించింది.
నామ మాత్రపు ఖర్చు, అయిదు రూపాయలకే ఓ పూట భోజనం పెట్టి కడు నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది. అధిక మొత్తం సబ్సిడీతో దీన్ని చేపట్టింది.
మార్పులు, చేర్పులు..
మొదట 8 సెంటర్లతో మొదలైనా- ఇప్పుడు పేరు మారి, ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ పేరిట జీహెచ్ఎంసీ పరిధిలో, జంట నగరాల శివార్లలో కలిపి ఆ సెంటర్ల సంఖ్య 150కి చేరింది.
మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు, ఉదయం 5 రూపాయలకే టిఫిన్(కొన్ని చోట్ల) అందించే సౌకర్యాన్ని ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
పరిమితంగా కొన్ని చోట్ల(ముఖ్యంగా ఆసుపత్రుల వద్ద) రాత్రి పూట భోజనం కూడా పెడుతున్నారు.
అన్నపూర్ణ క్యాంటీన్లు ఇదివరకున్న డబ్బాల స్థానంలో పలు సౌకర్యాలతో ‘కంటెయినర్ల’ను సమకూర్చే నిర్ణయాన్ని 2025లో ప్రభుత్వం తీసుకొని పథకాన్ని కొంత విస్తరించింది.
డబ్బాలకు బదులు ‘కంటెయినర్లు’ వచ్చాక ఆంబియెన్స్ కొంచెం మెరుగయి, భోజనానికి వచ్చే వారి సంఖ్య పెరిగినట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
డబ్బాల స్థానంలో కంటెయినర్లు ఏర్పాటు చేసిన తరువాత అన్నపూర్ణ క్యాంటీన్ పేరును ఇందిరమ్మ క్యాంటీన్‌గా మార్చి రాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ చేస్తోంది.
ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ నిర్వహణ ఎలా ఉంది? టిఫిన్లు-భోజనాల నాణ్యత, ఆహారంలో పోషకాలు, క్యాంటీన్లలో వసతులు, పరిసరాల శుచి-శుభ్రత, సిబ్బంది శ్రద్ధ-నిబద్ధత, తినేవాళ్లలో సంతృప్తి స్థాయి, వారేం కోరుకుంటున్నారు- అసలేం లభిస్తోంది, ఈ పథకం మెరుగుకు వారేం సూచిస్తున్నారు లాంటి తదితర విషయాలను లోతుగా తెలుసుకునేందుకు ‘పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ’ ఒక సమగ్ర సర్వే నిర్వహించింది.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 30 వరకు, దాదాపు నెలరోజులపాటు జీహెచ్ఎంసీ పరిధిలో, జంట నగరాల శివార్లలో నలువైపులా విస్తరించిన సగానికి పైగా క్యాంటీన్లను(శాస్త్రీయ శాంపిల్ 76/150) సర్వే బృందాలు ప్రత్యక్షంగా సందర్శించాయి. ‘మెనూ’ను పాటిస్తున్నారా తెలుసుకోవడానికి నికరంగా నెలరోజులపాటు గమనించడం జరిగింది..
అక్కడి పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించడమే కాకుండా క్యాంటీన్ల నిర్వాహకులు, టిఫిన్-భోజనాలు పెట్టే సిబ్బంది, సెంటర్లకు వచ్చి తింటున్నవారు, బాక్సుల్లో తీసుకుపోతున్నవారు.
ఇలా అందరినీ పలకరించి, వారి నుంచి పలు వివరాలు సేకరించి, ఆ డేటాను విశ్లేషించింది.
అన్ని క్యాంటీన్లకు ఒకేచోట ఆహారం వండి, అందిస్తున్న ‘హెచ్‌కేఎం’కు సంబంధించిన సిబ్బందితో మాట్లాడి- వంట ప్రదేశాన్ని, వంటకం ప్రక్రియను పరిశీలించడానికి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ‘హెచ్‌కేఎం’ సంస్థ అనుమతి కోరగా, జీహెచ్ఎంసీ అధికారుల ద్వారా అనుమతి తీసుకొని వస్తేనే కిచెన్, ఇతర అంశాలను పరిశీలించడానికి అవకాశం ఇస్తామని తెలిపారు.
నెలరోజుల పాటు సమగ్ర సర్వే..
ఇందిరమ్మ క్యాంటీన్లపై నెలరోజులపాటు సమగ్ర సర్వేను పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, సమాచార హక్కు మాజీ కమిషనర్ ఆర్ దిలీప్‌రెడ్డి మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది.
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థకు చెందిన సీనియర్ రీసెర్చర్లు జీ మురళీకృష్ణ, అఖిల, ప్రదీప్ తదితరులు ఈ సర్వే నిర్వహించారు.
గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఓ విధానపత్రమే లేకపోవడం, ఏ స్థాయిలో ఎవరి విధులు-బాధ్యతలు ఏమిటనే స్పష్టత ఇవ్వకపోవడం ఓ పెద్ద లోపంగా కనిపిస్తోంది. దానికి తోడు అన్ని స్థాయిల్లో శ్రద్ధాసక్తులు లోపించడం, అందించే ఆహారం విషయంలో రుచి, నాణ్యత, పోషక విలువలు ఏవీ పట్టించుకోకపోవడం, శుచి-శుభ్రత సమయపాలన వంటివి గాలికి వదిలేయడం, భయంకరమైన నిర్వహణా వైఫల్యం, పై నుంచి నిఘా-తనిఖీలు మందగించడం- వెరసి ఇదొక దండుగలమారిన వ్యవహారంగా తయారయింది.
ప్రధాన లోపం ఈ పథకాన్ని చూసే దృష్టికోణంలోనే ఉంది. ‘అయిదు రూపాయలకు ఇంతకన్నా ఇంకేం పెడతాం?’ అన్న నిర్లక్ష్యం పెట్టే వాళ్లలో, ‘ఇంతకన్నా ఎవరైనా ఏం పెడుతారులే అయిదు రూపాయలకు’ అన్న క్షమ, ఉదాసీనత తినేవాళ్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దాంతో ఉన్నత లక్ష్యం నిలువునా నీరుగారిపోతోంది.
ఇదొక తప్పుడు భావన, ఎందుకంటే పేరుకు ‘అయిదు’ రూపాయలే అయినా, ప్రతి టిఫిన్-భోజనానికి అంతకు నాలుగయిదు రెట్ల అధిక మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పథకం నిర్వాహకులకు చెల్లిస్తోంది. ఇది అన్నం తినే అత్యధికులకు(80 శాతం మందికి) తెలియదు.
ఆశించిందొకటి-జరుగుతున్నదొకటి..
సంక్లిష్ట, వ్యయభరితమైన నగర జీవితంలో నిరుపేదలు, బడుగులు, బలహీనులకు అయిదు రూపాయలకే భోజనం అందించే ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను 2014 మార్చిలో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రాజధాని హైదరాబాద్‌లో 8 సెంటర్లతో ఇది మొదలైంది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) మొత్తం వ్యయం భరిస్తుండగా ‘హెచ్‌కేఎం’ స్వచ్ఛంద సంస్థ అవసరమైన ఆహారం వండి, వేర్వేరు సెంటర్లకు చేరవేసి, పంపిణీ చేయిస్తోంది.
స్వచ్ఛంద సంస్థగా ‘హెచ్‌కేఎం’కు మంచి పేరే ఉన్నా ఆహార నాణ్యత విషయంలో పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.
ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నా క్యాంటీన్ల’కు ఆహారం అందిస్తున్నా, అక్కడి కన్నా ఇక్కడ నాణ్యతలో రాజీపడుతున్నట్టు, అందుకు ఎప్పటికప్పుడు సరైన తనిఖీలు లేకపోవడమే ముఖ్య కారణమైనట్టు నిర్దిష్ట ఆరోపణలున్నాయి.
“ఇందిరమ్మ క్యాంటీన్ల”కు ఆహార రవాణా, క్యాంటీన్ల నిర్వహణ కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా ‘హెచ్‌కేఎం’ సంస్థ నిర్వహిస్తోంది.
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వివిధ క్యాంటీన్లలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 150 క్యాంటీన్లను ప్రధానంగా ముగ్గురు కాంట్రాక్టర్లు సిబ్బందిని సమకూర్చడం, వారి ద్వారా సెంటర్ల నిర్వహణ బాధ్యతలు జరిపిస్తున్నారు.
ఇందిరమ్మ క్యాంటీన్లలో ప్రధానంగా దిన కూలీలు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వలస కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు ఉద్యోగులు, పరిమితంగా విద్యార్థులు, ఇతరులు తింటున్నారు. మహిళలు చాలా తక్కువ.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సెంటర్ల సంఖ్య పెరుగుదల తప్ప పెద్ద మార్పేమీ లేకుండా పథకం యధాతథంగా నడిచింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
అప్పటివరకు ‘పాన్‌షాప్’ నమూనాలో ఉండే డబ్బాల ద్వారా జరుగుతున్న క్యాంటీన్ల నిర్వహణను ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కంటెయినర్ల’కు మార్చింది.
కంటెయినర్లలో ఆహారం డిష్‌లు, ప్లేట్లు పెట్టుకోవడానికి బేస్, హ్యాండ్ వాష్ బేసిన్, ఆర్వో వాటర్ పాయింట్, ఫ్యాన్లు-లైట్లు తదితర సదుపాయాలను ఏర్పాటు చేసింది.
అయితే ఈ కంటెయినర్లలో ఇవేమీ పనిచేయడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఇందిరమ్మ కంటెయినర్ల కోసం రూ 11.43 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది.
2025 నుంచే, మరో సదుపాయం పెరిగింది. మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు ఉదయం పూట రూ 5 కే టిఫిన్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. మూడో వంతు సెంటర్లలో ఇది అందుబాటులో ఉంది.
రాత్రిపూట రూ 5 కే భోజనం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్ తదితర ఆసుపత్రుల వద్ద క్యాంటీన్లలో ఇస్తున్నారు. వసతుల లేమి, నిర్వహణ లోపం అంతటా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డస్ట్బిన్లు లేక తిన్న విస్తర్లని సెంటర్లలోనో, రోడ్ల మీదో పడేస్తున్న సంఘటనలున్నాయి. పారిశుద్ధ్య లోపం ఒక ప్రధాన సమస్యగా ఉంది.
చిరునామా కరువైన శుభ్రత, నాణ్యత
మెజారిటీ ఇందిరమ్మ క్యాంటీన్లు పరిశుభ్రతకు ఆమడ దూరంలో ఉన్నాయి. కాస్తో, కూస్తో నిలువదగ్గ పారిశుద్ధ్యం ఉన్న క్యాంటీన్లు నాలుగోవంతు కూడా ఉండవేమో! వడ్డించే వారే తప్ప ఒకరు తినిపోయిన తర్వాత ఆ పరిసరాల్ని శుభ్రపరిచే సిబ్బంది లేరు. కూర్చొని తినే వ్యవస్థ(దాతలు వ్యవస్థ సమకూర్చిన ‘హైటెక్‌సిటీ’ వంటి ఒకటి, రెండు చోట్ల తప్ప) ఎక్కడా లేదు.
ఎక్కడి చెత్త అక్కడే రోజుల తరబడి ఉంటుంది. జీహెచ్ఎంసీ స్థానిక పారిశుద్ధ్య సిబ్బంది దయ తలిస్తే మూడు, నాలుగు రోజులకొకసారే క్లీనింగ్! కంటెయినర్లో ఏర్పరచిన ఆర్వో వాటర్ పాయింట్లు పనిచేయవు, ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోయినా బాగు చేసే వ్యవస్థ లేదు.
కొన్ని చోట్ల కంటెయినర్లు వచ్చి ఉన్నా, వాటిని వాడకుండా పాత డబ్బాలలోనే సెంటర్ నిర్వహిస్తున్నారు.
క్యాంటీన్‌కు ఆనుకొనే చెత్త డంప్‌లు, అతి సమీపంలోనే పబ్లిక్ యూరినల్స్ (అన్ఆథరైజ్డ్) ఉన్నాయి.
కోవిడ్ తర్వాత జనాల్లో ఆరోగ్య విషయంలో అవగాహన పెరిగింది. ఆహారం, పంపిణీ, ప్రాంగణం, పరిసరాలు- వీటన్నింటిలోనూ పరిశుభ్రత లోపించడం వల్ల తెలిసినవారు కూడా అటు వెళ్లడానికి ఇష్టం చూపటం లేదు.
ఇక ఇందిరమ్మ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార నాణ్యత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
భోజనంలో అన్నంతో పాటు ఒక కర్రీ, సాంబారు/రసం గానీ, పప్పు సాంబారు/రసం గానీ ఇవ్వాలి.
అడిగిన వారికి ఏదో ఒక చట్నీ ఇవ్వాలి. అది కూడా చాలా సార్లు ‘అయిపోయింది’ అనే చెబుతారు.
నీళ్ల కోసం ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేసినా అవి ప్రారంభించకపోవడంతో నీళ్ల ప్యాకెట్లే కొనసాగుతున్నాయి.
అవి కూడా సరిగా ఉండవు. పగిలిన ప్యాకెట్లు కూడా వస్తాయి, మరోమారు నీరు వాసన వస్తుంటుంది.
నీళ్లు బాగోవు, సరిపడా ఇవ్వరని 79 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు.
అన్నం ముద్దలాగా ఉంటోందని, మంచి బియ్యం వాడట్లేదనే ఆరోపణ ఉంది.
అనేక చోట్ల సన్న బియ్యాన్ని ప్రభుత్వం హెచ్‌కేఎం సంస్థకు అందించి ఆ బియ్యంతో అన్నం వండించి పంపిణీ చేయాలని కూడా అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు.
కర్రీ, సాంబార్ కూడా నీళ్లలాగా పలుచగా ఉంటోందని, ఒకోసారి రెండూ ఒక్కలాగే ఉండటమో, కలిపి అన్నంలో పోయడమో చేస్తున్నారని తినే వారంటున్నారు.
దానికి బదులు సాంబారు రైస్, కర్డ్ రైస్, పులిహోర, టమాటా రైస్, పుదీనా రైస్, జీరా రైస్, వెజిటేబుల్ బిర్యానీ- ఇలా ఏదో ఒకటిచ్చినా బాగుండు అని అత్యధికులు అంటున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇదే మాదిరిగా అందిస్తున్నారని అదేవిధంగా ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందని అధికశాతం మంది ప్రజలు తెలిపారు.
అలా ప్రత్యేక అన్నం ఒకటే ఇచ్చి, దాని అంచుకు చట్నీ ఇస్తే చాలన్నది వారి అభిప్రాయం.
పేరుకు అన్నం, కర్రీ, పప్పు, సాంబారు అన్నట్టుగా ఇస్తున్నా ఆహారం ఏ మాత్రం రుచి ఉండదు. ఆహారం రుచిగా ఉండటం లేదు అన్నవారు 70 శాతం మంది ఉన్నారు.
రుచికోసమే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అనేది సామెత.
కానీ, హెచ్‌కేఎం వారు తమ పద్దతి ప్రకారం వంటకాల్లో ఉల్లిపాయలు వాడరు.
ఉప్పు, కారం కూడా సరిపోయినంత వాడరనేది తినేవారి అభిప్రాయం. ఆహారంలో సరైన పోషకాలు ఉన్నాయా? అసలు అందులో ఏది ఎంతమేర ఉండాలి? ఆ సంగతే ఎవరికీ పట్టదు. తగిన పోషక విలువలు లేని ఆహారం వల్ల ఉపయోగం లేదు.
పోషకాల విషయంలో దానికో లెక్కే లేదు. ‘భారత ఆహార భద్రత – ప్రమాణాల ప్రాధికార సంస్థ – ఎఫ్ఎస్ఎస్ఏఐ’ వారి ప్రమాణాలకు దరిదాపుల్లోనూ ఉండదు.
ఎప్పుడూ ఆహారం వేడిగా అందించరు. వేడిగానే అందిస్తారని 5శాతం మంది చెబితే, అప్పుడప్పుడు వేడిగా ఉంటుందని 12 శాతం మంది, వేడి ఆహారం చాలా అరుదని 83 శాతం మంది చెప్పారు.
కొన్ని చోట్ల బ్రేక్‌ఫాస్ట్-లంచ్ రెండూ ఒకేసారి తెచ్చి సెంటర్లో పెడుతున్నారు. ఫలితంగా బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమౌతోంది, లంచ్ ముందుగానే అందించే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
బ్రేక్‌ఫాస్ట్ పరిమాణంలో సిబ్బంది ‘చేతివాటం’ కూడా ఉంటోంది. మూడుకు బదులు రెండే ఇడ్లీలు ఇస్తున్నారు. చాలా చోట్ల బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమవుతున్న సందర్భాలున్నాయి. ఆలస్యం గురించి ఫిర్యాదు చేసిన వారిలో, సగటున 10 నిమిషాలు ఆలస్యంగా వస్తోందని 70 శాతం మంది చెబితే, 10 నుంచి 30 నిమిషాలు ఆలస్యమవుతోందన్న వారు 30 శాతం మంది ఉన్నారు. అది కూడా నాణ్యంగా ఉండదు. ఉప్మా నీళ్లలా పలుచగా ఉండటంతో తినడం కాకుండా ఉప్మాని తాగాల్సివస్తోందని కొందరు వినియోగదారులు వాపోయారు. ఇడ్లీలు గట్టిగా రాళ్లలా, చట్నీ పుల్లగా, బోండా నూనెలో ముంచి తేల్చినట్టు- ఇలా రకరకాలుగా విమర్శలున్నాయి.
ఇటు తినేవారి నుంచి, అటు ప్రభుత్వం నుంచి డబ్బు పొందుతూ కూడా అద్వాన్నమైన ఆహారం అందించడం ఎవరికీ మింగుడు పడటం లేదు.
ఆసుపత్రుల వద్ద, ఇంకా ఇతర చోట్ల ఇందిరమ్మ క్యాంటీన్లకు పక్కనే పలువురు వితరణశీలురు తమ దానధర్మాలలో పెట్టే ఉచిత భోజనం, ఇచ్చే ఆహారపు ఐటమ్స్ ఎంతో నాణ్యతతో ఉంటాయనే వ్యాఖ్యలు వినిపించాయి.
రూ 30 కి, పులిహోరనో, సాంబార్ రైసో, కర్డ్ రైసో- ఏదో రూపంలో అన్నం ఇంతకన్నా నాణ్యమైనది అందిస్తున్న ప్రైవేటు ఫుడ్ పాయింట్లు రోడ్ల పక్కన చాలానే ఉన్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. సర్కారిచ్చే డబ్బు గురించి తెలియట్లేదు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
