భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తి మేధస్సు, ఈ దేశ గమనాన్ని, గమ్యాన్ని మార్చడమే కాకుండా, దాని సామాజిక అంతరాత్మను తట్టి లేపిన సందర్భాలు అరుదు.
అటువంటి అరుదైన మహోన్నత వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్‌జీ అంబేద్కర్.
నేడు ఆయన 135వ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో, ఆయనను కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడిగా కాకుండా, ఒక నవ సమాజ రూపశిల్పిగా గుర్తించాలి.
దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఆయన అందించిన తాత్విక పరిష్కారాలను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ తాత్విక పునాదిగా నేడు భారత సమాజాన్ని కట్టి ఒక మహోజ్వలమైన మానవ సమాజాన్ని నిర్మించడానికి ఆచరణాత్మకమైన రాజకీయ జ్ఞాన యుద్ధాన్ని నిర్మించవలసిన ఒక చారిత్రక అనివార్యత ఆయన అనుచరుల మీద ఇప్పటికీ ఉంది.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, స్త్రీ విముక్తి పునాదులపై ఒక ఆధునిక భారతాన్ని నిర్మించాలని ఆయన కలలు గన్నారు.
సామాజిక-సాంస్కృతిక సమస్యలు: కుల నిర్మూలన ఒక తాత్విక మార్గం..
అంబేద్కర్ దృష్టిలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘కులం’. ఇది కేవలం పని విభజన కాదు, పని చేసేవారి మధ్య విభజన కూడా.
ఆయన తన సుప్రసిద్ధ రచన “Annihilation of Caste -1936″లో, “Caste is not a physical object like a wall of bricks or a line of barbed wire which prevents the Hindus from co-mingling and which has, therefore, to be pulled down. Caste is a notion; it is a state of the mind”అని పేర్కొన్నారు.
అంటే కులం అనేది ఇటుకలతో కట్టిన గోడ కాదు, అది ఒక మానసిక స్థితి.
అందుకే ఆయన అగ్రకుల సంఘసంస్కర్తలు చేపట్టిన ఉపరితల సంస్కరణల కంటే మనుషులలో మనస్తత్వ మార్పుకు, శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యత ఇచ్చారు.
భారతీయ సమాజంలో అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించకుండా రాజకీయ స్వాతంత్ర్యం వస్తే, అది కేవలం పాలకులు మారడమే తప్ప సామాన్యుడి జీవితం మారదని ఆయన హెచ్చరించారు.
ఆయన ప్రతిపాదించిన ‘సౌభ్రాతృత్వం’ కేవలం మనుషుల మధ్య స్నేహం కాదు, అది మానవ గౌరవంపై ఆధారపడిన సామాజిక జీవన విధానం.
సామాజిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం నిలబడదని ఆయన స్పష్టం చేశారు.
గేయిల్ ఓంవెద్త్(1941-2021), ఎలీనార్ జెల్లియట్(1926-2016) వంటి సామాజికవేత్తల అధ్యయనాలు స్పష్టం చేసినట్టు అంబేద్కర్ తాత్వికత ప్రధాన లక్ష్యం కేవలం ఆదివాసి, దళిత, బహుజనులకు కనీస సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, మొత్తం హిందూ సమాజ నిర్మాణాన్ని ప్రజాస్వామికరించడం.
ఆ ప్రయత్నంలో భాగంగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించారు.
చరిత్రలో జరిగిన అన్యాయాలను సరిదిద్దే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ల ద్వారా ప్రాతినిధ్యాన్ని పొందే వెసులుబాటును పొందుపరిచారు. ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛను కల్పించారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ఆధిపత్య సమూహాల నుంచి అన్ని విధాల రక్షణను కల్పించే నిమిత్తం ప్రభుత్వపరంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెంటివ్ యాక్ట్ -1989 వంటి కఠినమైన చట్టాలు ఏర్పరచుకునే వెసులుబాటును కల్పించారు.
ఇన్ని రకాల ఏర్పాట్లు ఉన్నప్పటికీ పౌర సమాజంలో కుల వివక్షత నేటికీ తన రూపాన్ని మార్చుకొని కొనసాగుతూనే ఉంది.
ఎస్సీ, ఎస్టీలకు ఇండ్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడం నుంచి వారి ఆస్తులను, ఇండ్లను ధ్వంసం చేయడం, వారికున్న కొద్దిపాటి వ్యవసాయ భూములను ప్రజాప్రయోజనాల పేరుతో ఆక్రమించడం వంటివి ఆధిపత్య వర్గాల నుంచి ప్రభుత్వాల వరకు నిరాభ్యంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి.
వేర్వేరు కులాల యువతీ యువకులు ప్రేమించుకున్నప్పుడు, ధైర్యం చేసి వివాహం చేసుకున్నప్పుడు వారిలో తక్కువ కులం వారిని పరువు హత్యల పేర క్రూరంగా చంపేయడం జరుగుతుంది.
అంటే, ఇప్పటికీ దేశంలో కులాంతర వివాహాల పట్ల వ్యతిరేకత ఇంకా పాతుకుపోయి ఉన్నదని చెప్పవచ్చు.
ఎస్సీ, ఎస్టీలను హిందూ, క్రైస్తవం వంటి ఇతర మతాలలో అంతర్భాగంగా ఉండాలని కోరుకుంటున్న ఆధిపత్య కులాలు ఆ మతాల సంస్థాగత వ్యవహారాలలో వారికి స్వేచ్ఛను, సమానత్వాన్ని నిరంతరం నిరాకరిస్తున్నారు.
విచక్షణారహితంగా వారిపై దాడులు చేస్తున్నారు. ఇది ఆధునిక కాలంలో ఒక విచిత్రమైన విపరీత బుద్ధికి తార్కాణం.
ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వస్తున్న డిజిటల్ రంగంలోని కృత్రిమ మేధ, ఆల్గారిథమ్స్ నియామకాల్లో ఆధిపత్య కులాల భాషను, అలవాట్లను, సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిభా పాటవాలకు గీటురాయిగా గుర్తించి, తరాలుగా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీ సమూహాల సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, భాషను, అలవాట్లను పక్కన పెట్టడం లేదా స్టిగ్మాటైజ్ చేసి చూపడం వంటి డిజిటల్ డివైడ్ చాలా వేగంగా సమాజంలో విస్తరిస్తోంది.
ఇప్పటికీ రాజ్యాంగం కల్పించిన రక్షణలు కొంతమేరకు అణగారిన ప్రజల జీవించే హక్కును కాపాడుతున్నప్పటికీ, వారికి సంపూర్ణ స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించలేకపోతున్నాయి.
రిజర్వేషన్ల వల్ల దిగువ కులాలకు విద్యా, ఉద్యోగ రంగాలలో కొంతమేరకు అవకాశాలు దక్కుతున్నాయి, కానీ నిర్ణయాధికారంలో వారి భాగస్వామ్య లేమి స్పష్టంగా కనిపిస్తుంది.
ఆర్థిక దార్శనికత: రాజ్య సామ్యవాదం, అభివృద్ధి..
అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిపుణుడు మాత్రమే కాదు, గొప్ప ఆర్థికవేత్త కూడా. భారతదేశ ఆర్థిక సమస్యలకు ‘స్టేట్ సోషలిజం’ పరిష్కారమని తన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’లో సవివరంగా వివరించారు.
భూమి, కీలక పరిశ్రమలు, బీమా వంటి రంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. “States and Minorities”లో ఆయన ప్రతిపాదించిన ఆర్థిక ప్రణాళికలు అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేవిగా ఉన్నాయి.
సామాజిక అణచివేతకు ఆర్థిక వెనుకబాటుతనం ఒక ముఖ్య కారణమని గుర్తించి, ఉపాధిలో అణగారిన జాతులకు సమాన అవకాశాలు, కార్మిక హక్కుల కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. కార్మికులకు ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనం వంటి హక్కులు, వారికి ఆరోగ్య భద్రత కల్పించడం అంబేద్కర్ కృషి ఫలితమే.
దేశంలోని అణగారిన ప్రజారాశుల కేంద్రంగా అంబేద్కర్ ప్రతిపాదించిన ఆర్థిక సమానత్వ ప్రతిపాదనలలో చాలా మేరకు నిరాకరించిన అగ్రకుల పాలకవర్గాలు 1960-70 దశాబ్దాలలో నామమాత్రంగా భూ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ అవి ఆచరణలో చాలా మేరకు విఫలమైనాయి.
ఏ సమాజంలోనైనా సామాజిక హోదాకు భూమి ప్రధాన ప్రాతిపదిక. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ చేపట్టిన అధ్యయనాల వివరాల ప్రకారం స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా భూ పంపిణీలో అసమానతలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి.
ఎస్సీలు జనాభాలో దాదాపు 16.6% ఉన్నప్పటికీ వీరి వద్ద ఉన్న సాగుభూమి కేవలం 9 శాతం మాత్రమే.
వీరిలో 71% మంది భూమిలేని వ్యవసాయ కూలీలు. దేశంలోని ఎస్టీల వద్ద 11 నుంచి 12 శాతం భూమి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉండడం, సాగుకు యోగ్యంగా లేకపోవడం గమనార్హం.
సాగు భూమిలో బీసీల వద్ద సుమారు 45 శాతం ఉన్నప్పటికీ, ఇందులో అధిక భాగం చిన్న, సన్నకారు రైతులు. మహిళలు వ్యవసాయ రంగంలో 60 నుంచి 70 శాతం శ్రమించే వారే. అయినప్పటికీ, కేవలం 13 శాతం మాత్రమే మహిళల పేరు మీద భూమి రికార్డులు ఉన్నాయి.
ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత కార్పొరేట్ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం ఒక రకమైన అదృశ్య అడ్డంకిని ఎదుర్కొంటుంది. ఉదాహరణకు దేశంలోని ఎంఎస్ఎంఈల యాజమాన్యంలో ఎస్సీలు 12.4%, ఎస్టీలు 4.1%, బీసీలు 40.8% భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, 10 శాతం జనాభా కలిగిన అగ్రకులాలు మాత్రం 42.7% యాజమాన్య హక్కులను కలిగి ఉన్నారు.
కార్పొరేట్ బోర్డుల్లో ప్రాతినిధ్యం ఎస్సీల నుంచి 2 శాతం, ఎస్టీల నుంచి 1 శాతం, బీసీల నుంచి 15 శాతం కలిగి ఉండగా, అగ్రకులాల నుంచి 80% పైగా నిర్ణయాధికార శక్తిని కలిగి ఉన్నారు. అంటే నేటికీ అత్యధిక శాతం దళితులు, గిరిజనులు భూమిలేని వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు.
1990ల తర్వాత వచ్చిన ప్రైవేటీకరణ సరళీకృత ఆర్థిక విధానాల వలన ప్రభుత్వ రంగం కుంచించుకుపోయి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
నిత్యావసర వస్తువులను సరఫరా చేసే గల్లీ స్థాయి మార్కెట్ వ్యవస్థ నుంచి బడా పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న కార్పొరేట్ కంపెనీల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల భాగస్వామ్యం నిర్దాక్షిణ్యంగా నిరాకరించబడుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో వారికి దక్కిన వాటా 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నామమాత్రమేనని స్పష్టమవుతుంది.
విద్య, వైద్యం, ఉపాధి స్థితిగతులు..
స్వతంత్ర భారతంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నమోదు శాతం పెరుగుతున్నప్పటికీ నాణ్యమైన విద్య ఇంకా పేద వర్గాలకు దూరంగానే ఉంది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021-22 నివేదిక ప్రకారం ఎస్సీలు 27.2%, ఎస్టీలు 21.2%, ముస్లిం మైనారిటీలు 4.6%గా ఉన్నత విద్యలో స్థానాన్ని కలిగి ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. మహిళలు ఉన్నత విద్యలో 32 శాతంగా నమోదు అవుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో విపరీతమైన డ్రాప్ అవుట్ రేటు కూడా నమోదవుతుంది. ప్రభుత్వ రంగాల విస్తరణ క్రమేణా తగ్గిపోతుండడంతో రిజర్వేషన్లు లేని ప్రైవేటు రంగంలో వివక్షత కొత్త రూపం దాల్చుతుంది.
క్యాజువలైజేషన్, అవుట్ సోర్సింగ్ వంటి ఉద్యోగ వ్యవస్థలలో ఎస్సీలు 40 శాతం సాధారణ కూలీలుగా పనిచేస్తున్నారు. అదే ఉన్నత కులాలవారు కేవలం 15% మాత్రమే ఈ రంగాలలో ఉన్నారు. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే- 2023 డేటా ప్రకారం ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ దళిత, ముస్లిం, మహిళలకు వారి వారి సామాజిక నేపథ్యాన్ని బట్టి వేతనాలలో 20 నుంచి 30% వ్యత్యాసం పాటిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రైవేటు రంగాలలో ఒకే రకమైన మెరిట్ ఉన్నప్పటికీ ఇంటిపేరు ఆధారంగా దళిత, ముస్లిం అభ్యర్థులకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం 30 నుంచి 60 శాతం తక్కువగా ఉంటుందని సబాల్టర్న్ ఆర్థికవేత్తలు చేపట్టిన ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నివేదిస్తున్నాయి.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- 5 గణాంకాలు ఆరోగ్య రంగంలో అసమానతలను స్పష్టం చేస్తున్నాయి. శిశు మరణాల రేటు విషయములో ఎస్సీలలో ప్రతి 1000 మందికి 40.7% ఉంది. ఉన్నత కులాలలో అది 27 గా నమోదయింది. పోషకాహార లోపం విషయంలో కూడా వివక్షత కొనసాగుతుంది.
ఐదేళ్ల లోపు ఎస్టీ పిల్లల్లో 40% పైగా ఎదుగుదల లోపం కలిగి ఉన్నారు. ప్రైవేటు కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేక దేశంలో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీలు అప్పుల పాలవుతున్నారు.
రాజకీయ చైతన్యం, రాజ్యాంగ నైతికత..
అంబేద్కర్ “ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ” అనే సూత్రాన్ని భారత రాజకీయాలకు అందించారు. అలాగే భారత రాజ్యాంగం ద్వారా ఆయన మనకు అందించిన అత్యున్నత విలువ ‘రాజ్యాంగ నైతికత’.
1949 నవంబర్ 25న రాజ్యాంగ పరిషత్తులో చేసిన చివరి ప్రసంగంలో ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు: “On the 26th of January 1950, we are going to enter into a life of contradictions. In politics we will have equality and in social and economic life we will have inequality.”
ఈ వైరుధ్యాన్ని ఎంత త్వరగా తొలగిస్తే దేశం అంత త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. అలాగే రాజకీయాల్లో ‘వ్యక్తి ఆరాధన’ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని చెప్పారు.
చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని ఆయన అత్యంత ప్రాధాన్యతతో ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో, బీసీ, మహిళలకు స్థానిక సంస్థలలో రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని చట్టబద్ధం చేస్తూ కల్పించిన రాజకీయ రిజర్వేషన్ల ద్వారా వారికి సీట్లు దక్కుతున్నాయి కానీ, నిజమైన నిర్ణయాధికారంలో వారి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇప్పటికీ నామమాత్రంగానే ఉండిపోతుంది.
రిజర్వుడ్ స్థానాల నుంచి గెలిచిన ఈ వర్గాల ప్రజాప్రతినిధులు పార్టీ విప్‌లకు లోబడి ఉండవలసి రావడం వలన తమ సామాజిక వర్గాల సమస్యలపై ధైర్యంగా, అంతఃకరణ శుద్ధితో గొంతెత్తలేకపోతున్నారనేది వాస్తవం.
స్త్రీ విముక్తి – లింగ సమానత్వం..
స్త్రీ సంక్షేమం లేని సమాజం అసంపూర్ణ సమాజమని అంబేద్కర్ భావించారు. ఒక సమాజం ఎంత పురోగమించింది అని చెప్పడానికి ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతియే కొలమానమని ఆయన భావించారు.
అందుకే ఆయన ఒక రాడికల్ ఫెమినిస్ట్ తాత్వికుడిగా ఈ కింది సైద్ధాంతిక విలువను ప్రతిపాదించారు- “I measure the progress of a community by the degree of progress which women have achieved.”
హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు, వారసత్వ హక్కులను కల్పించడానికి ఆయన తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్నారు.
లింగ వివక్షత లేని సమాజమే అసలైన ప్రజాస్వామ్య సమాజమని ఆయన సిద్ధాంతం.
దేశం చాలా గొప్ప స్థాయిలో డిజిటల్ ఆధునికతను సంతరించుకున్నదని భావించబడుతున్న నేటి సమాజంలో ఆడబిడ్డ అని తెలిస్తే ఇప్పటికీ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.
బాలికల చదువుల్లో వివక్ష చూపుతున్నారు. వివాహ నిర్ణయాలలో స్త్రీల అభిప్రాయాలకు ఇప్పటికీ సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వటం లేదు. ఉద్యోగ రంగాలలో వివక్షత, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.
గృహహింసలు, వరకట్న వేధింపులు, హత్యలు నిత్యకృత్యంగా కొనసాగుతూనే ఉన్నాయి.
చట్టబద్ధంగా వారసత్వ ఆస్తి హక్కు వారికి కల్పించబడినప్పటికీ ఆచరణలో అది నామమాత్రంగానే అమలవుతుంది. స్థానిక సంస్థలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించబడినప్పటికీ నిరంతరం కుటుంబ పురుషులే వారి అధికారాన్ని చెలాయిస్తున్నారు.
అంబేద్కర్ వారసుల చారిత్రిక కర్తవ్యం..
ఆయన నిజమైన అనుచరులు చేయవలసినది కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాదు, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే. ఆయన విజన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని అత్యవసరమైన పనులు చేపట్టవలసి ఉంది.
1. అంబేద్కర్ కలలు గన్నట్టుగా అట్టడుగు వర్గాల వారు అత్యున్నత విద్యను అభ్యసించాలి.
ప్రభుత్వాలు కేవలం డిగ్రీల కోసమే కాకుండా, వివేచనతో కూడిన శాస్త్రీయ విద్యను ప్రోత్సహించాలి.
అజ్ఞానమే బానిసత్వానికి పునాది అని గుర్తించి, విద్యావంతులు సమాజ సేవకు కట్టుబడి ముందుండి పని చేయాలి.
2. బాబాసాహెబ్ దృష్టిలో అజిటేషన్ అంటే కేవలం ఆందోళన కాదు, అది అన్యాయం పట్ల నిరంతర చైతన్యాన్ని కలిగి ఉండడం.
సమాజంలో జరుగుతున్న లింగ వివక్ష, కుల దాడులు, ఆర్థిక అసమానతలపై రాజ్యాంగబద్ధంగా గొంతెత్తాలి. సామాజిక మాధ్యమాలు, ప్రజా వేదికల ద్వారా అంబేద్కర్ ఆలోచనలను బాధితులకు చేరవేయాలి.
3. ఆధిపత్య శక్తులు సృష్టించిన సామాజిక చీలిక, మత మౌఢ్యాల వలన విడిపోయిన సహ బాధిత సమూహాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలి.
బాధిత సమూహాలు కేవలం నామమాత్రపు అధికారం కోసం కాకుండా, హక్కుల రక్షణ కోసం, నైతిక సమాజ నిర్మాణం కోసం సంఘటితం కావాలి.
చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి, ‘సమూహ భారతీయత శక్తి’ అనే గొడుగు కింద అందరూ సమానత్వం, సహనశీలతతో మెలగాలి.
4. నేడు రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి అంబేద్కర్ వారసుడిపై ఉంది.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూనే, బాధ్యతలను విస్మరించకూడదు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి.
5. మహిళలను నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారానే అంబేద్కర్ కలలు గన్న లింగ సమానత్వం సాధ్యమవుతుంది.
ఇంట్లో, సమాజంలో మహిళలకు గౌరవం, సమానత్వం కల్పించడం ఆయన ప్రతి అనుచరుడి ప్రథమ కర్తవ్యం కావాలి.
ఈ సామాజిక పరివర్తన మహాకార్యాన్ని బాబాసాహెబ్ అనంతరం దేశంలో మాన్యశ్రీ కాన్షీరామ్ క్రియాశీలకంగా, ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్లు కొంత పాసివ్గానైనా 1980-90వ దశకంలో నెరవేర్చారు.
ఈ ప్రయత్నాల పరంపరనే క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ అనే సామాజికవేత్త “సైలెంట్ రెవల్యూషన్” అని పేర్కొన్నారు.
ఇప్పుడు దేశంలో విద్యావంతులైన ఆదివాసి, దళిత, బహుజన యువత, మేధావులు వారి వారి స్థాయిలో ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అది ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోతున్నది.
ఈ చారిత్రిక అవసరాన్ని గత 15 సంవత్సరాల క్రితమే గుర్తించిన డా విశారదన్ మహరాజ్ తెలంగాణలో పూలే, అంబేడ్కర్, కాన్షీరాంల జ్ఞాన సిద్ధాంతాలతో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ జ్ఞాన యుద్ధాన్ని ప్రారంభించారు.
అది క్రమేణా విస్తరించి నేడు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య సంఘటనగా ఏర్పడి బాధిత సమూహాలను రాజ్యాంగ విలువల కేంద్రంగా సంఘటిత శక్తిగా రూపుదిద్దే అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నది.
ఈ సంకల్పం అంబేద్కర్ ఆశించిన బాధిత సమూహాల సంపూర్ణ విముక్తిగా మారాలంటే నైతిక నిబద్ధత, రాజనీతిజ్ఞతతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీల నుండి ఎదిగి, విశారదన్ మహారాజ్ వంటి నాయకత్వాన్ని బలపరచాలి.
అణగారిన ప్రజల పక్షాన ప్రారంభమైన ఈ జ్ఞాన యుద్ధం దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా దేశమంతా విస్తరించి మొత్తంగా దేశాన్నే అగ్రకుల ఆధిపత్య విలువలు, అధికార వ్యవస్థల నుంచి విముక్తి పరిచే మహాశక్తిగా ఎదిగే విధంగా బాధిత సమూహాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు తమ సర్వశక్తులను ఒడ్డి పని చేయాలి.
అదే భావి భారత భాగ్య విధాత అయిన అంబేడ్కర్‌కి ఆయన వారసులిచ్చే నిజమైన జన్మదిన కానుక.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
