పార్లమెంట్ ఆవరణలో మహాత్మా జ్యోతీరావ్ ఫూలే 200వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా పలకరించడం ఆసక్తికరంగా మారింది.
నివాళులు అర్పించిన అనంతరం మోదీ ఇతర నేతలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. కానీ, మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో కొద్దిసేపు ముచ్చటించారు.
“అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది?” అని ప్రధాని మోదీ ఆత్మీయంగా రాహుల్‌ను అడగటం.. ఈ సందర్భంగా వారి మధ్య కొద్దిసేపు జరిగిన సంభాషణ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఇలాంటి పలకరింపులు సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత కలుషిత రాజకీయ వాతావరణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
జాతీయ రాజకీయాల్లో కనీస మర్యాదలు నానాటికీ కనుమరుగవుతున్న ఈ తరుణంలో, ఈ చిన్న ఘటన భారతీయుల్లో ఒక ఆశను కలిగించింది.
దిగజారుతున్న రాజకీయ విమర్శలు – కక్షసాధింపులు..
ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాల ఎన్నికల ప్రచార శైలిని గమనిస్తే రాజకీయాలు ఎంత దిగజారాయో స్పష్టమవుతుంది.
సిద్ధాంతాలు, విధానాలపై జరగాల్సిన విమర్శలు కాస్తా వ్యక్తిగత దూషణలు, అవాంఛనీయ ఆరోపణలకు దారితీస్తున్నాయి.
రాజకీయ విమర్శలను ఎన్నికల వరకే పరిమితం చేయాలన్న కనీస అవగాహన నేతలకు లేకుండా పోతోంది.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన ఆరోపణలకు ప్రతిగా అసోం పోలీసులను ఢిల్లీ పంపి ఖేరాను అరెస్టు చేయించేందుకు సీఎం ప్రయత్నించడం రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతోంది.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను వ్యక్తిగత కక్షసాధింపులకు వాడుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
గతకాలపు రాజకీయ హుందాతనం – ఆదర్శప్రాయమైన సంప్రదాయాలు..
గతంలో మన పార్లమెంటరీ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో మంచి సంప్రదాయాలు కనిపిస్తాయి.
నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్య ఉన్న రాజకీయ వైరం- వారి వ్యక్తిగత సంబంధాలపై ఎన్నడూ ప్రభావం చూపలేదు.
వాజ్‌పేయి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు, రాజీవ్ గాంధీ చొరవ తీసుకుని ప్రభుత్వ ఖర్చులతో ఆయనను ఐక్యరాజ్యసమితి అధికారిక బృందంతో అమెరికా పంపి వైద్యం చేయించిన విషయం ఒక చారిత్రక సత్యం.
అలాగే ఇందిరా గాంధీ సైతం దేశ భద్రత, 1971 బంగ్లాదేశ్ యుద్ధం వంటి క్లిష్ట సమయాల్లో ప్రతిపక్షాలను కలుపుకొని పోయారు.
జాతీయ ప్రయోజనాల ముందు రాజకీయాలు ఉండకూడదని వారు నమ్మారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో ఎంతటి వాడివేడి చర్చలు జరిగినా- సభ బయట సెంట్రల్ హాల్లో మాత్రం నేతలంతా ఒకే వేదికపై కూర్చుని స్నేహంగా మాట్లాడుకునేవారు.
ఆ హుందాతనం నేటి రాజకీయాల్లో లోపించింది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి – బద్ధశత్రుత్వంగా మారిన రాజకీయాలు..
జాతీయ రాజకీయాల పరిస్థితి ఇలా ఉంటే- తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
తెలంగాణలో రాజకీయ పక్షాల మధ్య తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, కనీస స్థాయి మర్యాదలు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరం కాస్తా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా బద్ధశత్రుత్వంగా మారింది.
అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరి ముఖం ఒకరు చూసుకునేందుకు సైతం ఇష్టపడని అప్రజాస్వామిక వాతావరణం అక్కడ నెలకొంది.
అధికార మార్పిడి జరిగిన ప్రతిసారీ ప్రత్యర్థులపై కేసులు బనాయించడం, కక్షసాధింపు చర్యలకు దిగడం పరిపాటిగా మారింది.
ప్రజాస్వామ్యానికి పునాది – సహనం, సామరస్యం..
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ప్రత్యామ్నాయ పక్షమే తప్ప, శత్రుపక్షం కాదు. నాయకుల మధ్య సహనం, సామరస్యం లోపించినప్పుడు ఆ ప్రభావం నేరుగా సమాజంపై పడుతుంది.
నాయకులు నిత్యం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటే- అవే విద్వేషాలు కింది స్థాయిలో ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య కూడా వ్యాపించి శాంతిభద్రతల సమస్యలకు, సామాజిక ఘర్షణలకు దారితీస్తాయి.
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల మధ్య జరిగిన ఈ చిన్న పలకరింపు- గతకాలపు ఆరోగ్యకరమైన రాజకీయ సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఒక నాంది కావాలి.
విధానాలపై రాజీలేని పోరాటం చేస్తూనే, వ్యక్తిగత స్థాయిలో హుందాతనాన్ని ప్రదర్శించినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం, పరమార్థం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
