♦ శాంతి చర్చల వైఫల్యం నుంచి ఓడరేవుల పూర్తి దిగ్బంధనం వరకు
గ్లోబల్ మార్కెట్లను తీవ్రంగా కుదుపేసి, వేలాది మంది మరణాలకు కారణమైన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం ఏడవ వారంలోకి ప్రవేశించింది.
ఒక పక్క దాడులు, మరో పక్క చర్చల వైఫల్యాలు, దిగ్బంధనాలతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
లెబనాన్‌పై దాడులు.. లక్ష్యంగా ఐరాస శాంతి పరిరక్షకులు..
ఇజ్రాయిల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై తన దాడులతో మరింత ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలో లెబనాన్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులను కూడా ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంది.
2026 ఏప్రిల్ 11న లెబనాన్ తీరప్రాంత నగరమైన సిడాన్లో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 13 మంది రాష్ట్ర భద్రతా అధికారులు మరణించగా, వారి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇస్లామాబాద్‌లో విఫలమైన శాంతి చర్చలు..
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య 21 గంటల పాటు జరిగిన ముఖాముఖి కాల్పుల విరమణ చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి.
ఎలాంటి పురోగతి లేకుండానే ఈ చర్చలు ముగియడంతో అప్పటికే రెండు వారాలుగా కొనసాగుతున్న సున్నితమైన కాల్పుల విరమణ భవితవ్యం అయోమయంలో పడింది.
ఈ తరుణంలో పాకిస్థాన్ మరిన్ని చర్చలకు ప్రతిపాదనలు చేసింది.
అనంతరం, తాను ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నానని సూచిస్తూ- తాను “అవతలి పక్షంతో మాట్లాడాన”ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
పోప్‌పై ట్రంప్ ఆగ్రహం.. ఏసుక్రీస్తు రూపంలో పోస్ట్..
శాంతి గురించి పోప్ లియో ఇటీవల తీసుకున్న వైఖరిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. పోప్‌పై ఆయన ఆవేశం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ సామాజిక మాధ్యమ ఖాతాలో తనను తాను ఏసుక్రీస్తుగా చూపుతున్న ఒక చిత్రాన్ని అప్లోడ్ చేయడం గమనార్హం.
ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం ప్రారంభం..
పాకిస్థాన్‌లో చర్చలు విఫలమైన తర్వాత, హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటామని ట్రంప్ ముందే ప్రతిజ్ఞ చేశారు.
ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల లేదా ఇరాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి ఇరాన్‌లోని అన్ని నౌకాశ్రయాలు, తీర ప్రాంతాల దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం ప్రారంభించిందని ట్రంప్ సోమవారం వెల్లడించారు.
ఈ దిగ్బంధన ప్రాంత దరిదాపుల్లోకి ఇరాన్ యుద్ధ నౌకలు ఏవి వచ్చినా వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన సోషల్ మీడియా ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పూర్తిస్థాయిలో అమలైన దిగ్బంధనం.. నిలిచిపోయిన వాణిజ్యం..
బుధవారం ఏప్రిల్ 15 నాటికి ఈ యుద్ధం 47వ రోజుకు చేరుకుంది.
ఇరాన్ రేవుల దిగ్బంధనాన్ని తాము “పూర్తిగా అమలు చేశామని” అమెరికా సెంట్రల్ కమాండ్ బుధవారం అధికారికంగా ప్రకటించింది.
“పశ్చిమ ఆసియాలో సముద్రయానంపై అమెరికా దళాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటంతో ఇరాన్ రేవుల దిగ్బంధనం పూర్తిగా అమలైంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 90% అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపైనే ఆధారపడి నడుస్తుంది. ఈ దిగ్బంధనాన్ని అమలు చేసిన 36 గంటల వ్యవధిలోనే.. సముద్ర మార్గం ద్వారా ఇరాన్‌కు వచ్చే, వెళ్లే ఆర్థిక వాణిజ్య లావాదేవీలన్నింటినీ అమెరికా దళాలు పూర్తిగా నిలిపివేశాయి” అని సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు.
యుద్ధ పరిస్థితులు ఇలా ఉండగా- ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, రస్తుత సుప్రీం లీడర్ ఆయన కుమారుడు ఆయతుల్లా మొజ్తబా ఖమేనీ చిత్రాలతో ఉన్న పోస్టర్‌ను ఏప్రిల్ 13న టెహ్రాన్‌లో ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
