♦ తొలుత ‘నక్సలిజం’ కోణం ప్రస్తావన, ఆ తర్వాత కనీస వేతనాలు పెంచిన ఆదిత్యనాథ్
వీధుల్లోకి రావడానికి దారి తీసిన కఠినమైన పని పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేసిన నిరసనకారులు.
న్యూఢిల్లీ: నోయిడా పారిశ్రామిక వాడవ్యాప్తంగా ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం(ఏప్రిల్ 13) చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం, కొన్నింటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలకు పాల్పడినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
హింసకు దారితీసిన పరిస్థితులు.. దర్యాప్తులో పోలీసులు..
సోమవారం నాటి హింసాత్మక ఘటనలకు ముందు, ఫ్యాక్టరీల వెలుపల కాంట్రాక్ట్ కార్మికులు రెండు రోజుల పాటు ధర్నాలు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం(ఏప్రిల్ 11) నాడు కార్మికుల సంక్షేమం కోసం సకాలంలో వేతనాలు చెల్లించడం, ఓవర్ టైమ్‌కి రెట్టింపు వేతనం తప్పనిసరి చేయడం వంటి పలు చర్యలను ప్రకటించింది.
అయితే, సోమవారం నాటి నిరసనలు ఎందుకు హింసాత్మకంగా మారాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ హింసలో పాల్గొన్న “రెచ్చగొట్టే శక్తులను”, “బయటి వ్యక్తులను” గుర్తిస్తున్నామని, వారి గుర్తింపు నిర్ధారణ అయిన వెంటనే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజీవ్ కృష్ణ తెలిపారు.
కార్మికులకు అండగా ఉంటాం: సీఎం యోగి
నిరసన తెలుపుతున్న కార్మికులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంఘీభావం తెలుపుతూనే, “అశాంతిని ప్రేరేపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని” కోరారు.
“రాష్ట్రం అభివృద్ధి, శాంతి దిశగా పురోగమిస్తున్న తరుణంలో, కొందరు అశాంతిని వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నుతున్నారు. పారిశ్రామిక అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి, వారిని విజయం సాధించనివ్వకండి. పారిశ్రామికవేత్తలందరూ కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నేను కోరుతున్నాను. మా ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తుంది. ఇది పారిశ్రామికవేత్తలకు భద్రతను, కార్మికులకు రక్షణను కల్పిస్తూనే వారికి న్యాయమైన వేతనాలు అందేలా చూస్తుంది” అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
కార్మికులు, పరిశ్రమల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

వీధుల్లోకి 40 వేల మంది.. కార్మికుల ఆవేదన ఇదీ..
నోయిడాలోని ఫేజ్-2; సెక్టార్ 60, 62, 84 పారిశ్రామిక ప్రాంతాలలోని 80కి పైగా ప్రదేశాలలో సోమవారం సాయంత్రం 40,000 నుంచి 45,000 మంది కార్మికులు వీధుల్లోకి పోటెత్తారని ఒక సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 60 మందికి పైగా అదుపులోకి తీసుకున్నామని ఆ అధికారి పత్రికకు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తమను వీధుల్లోకి నెట్టిన కఠినమైన పని పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల గురించి కార్మికులు వివరించారు.
“నా వేతనం కేవలం రూ 320 మాత్రమే పెరిగింది- రాత్రిపూట కూడా పని చేయాలని వారు బలవంతం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉంటే మళ్లీ పనికి రావొద్దంటారు. ఆదివారం పని చేయడానికి నిరాకరిస్తే, ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు” అని 18 ఏళ్ల అపెరల్ కార్మికుడు సురేంద్ర కశ్యప్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.
అదనపు పని గంటలు, తక్కువ వేతనాలు తమను నిస్సహాయులను చేశాయని ఇతర కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
“నేను నెలకు రూ 13,500 సంపాదిస్తాను – నేను ఏమీ పొదుపు చేయలేకపోతున్నాను, ఇంటికి డబ్బు పంపలేకపోతున్నాను. నా గదికి రూ 5,000 అద్దె చెల్లిస్తున్నాను, రేషన్ కోసం రూ 4,000 ఖర్చు చేస్తున్నాను. ఈ ఆదాయంతో నేను ఎలా నెట్టుకురావాలి? నా పిల్లలను స్కూల్‌కు ఎలా పంపాలి?” అని ఎగుమతుల కోసం దుస్తులు తయారు చేసే కంపెనీలో పనిచేసే 25 ఏళ్ల రాహుల్ వార్తాపత్రికతో తన ఆవేదన పంచుకున్నాడు.
దిగ్బంధనంలో నోయిడా.. కనీస వేతనాల పెంపు..
సోమవారం ఉదయం రద్దీ సమయంలో మొదలైన రాళ్లు రువ్వడం, విధ్వంసకాండ కారణంగా నోయిడాలోని అనేక ప్రధాన రహదారులు దిగ్బంధించబడ్డాయి.
సాయంత్రం వరకు ట్రాఫిక్ జామ్‌లు కొనసాగాయి. నోయిడాలో జరిగిన హింసాత్మక నిరసనల అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు కనీస వేతనాల పెంపును ఆమోదించినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
అయితే, నిరసనలకు ముందే(ఆదివారం రాత్రి) లక్నోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నక్సలిజం కోణాన్ని ప్రస్తావిస్తూ, కుట్ర జరిగిందని ఆరోపిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు.
“దేశంలో నక్సలిజం ఇప్పుడు దాదాపు ముగింపు దశలో ఉంది, కానీ దానిని పునర్జీవింపజేసే ప్రయత్నాలు ఒక పెద్ద కుట్రలో భాగం కావచ్చు. ఇటీవల జరిగిన కొన్ని నిరసనలలో ప్రజలను తప్పుదోవ పట్టించే, విచ్ఛిన్నకర శక్తులు పాల్గొనే అవకాశం లేకపోలేదు” అని ఆదివారం రాత్రి పొద్దుపోయాక జారీ చేసిన ప్రకటనలో ఆదిత్యనాథ్ పేర్కొన్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
హర్యానాలోనూ కార్మికుల ఆందోళన..
ఇదిలా ఉండగా, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రకటించిన కనీస వేతనాల పెంపుపై ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆరోపిస్తూ, సోమవారం పల్వాల్, ఫరీదాబాద్‌లలో వేలాది మంది కార్మికులు నిరసనకు దిగినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
జిల్లా యంత్రాంగం అధికారుల సమాచారం ప్రకారం, సుమారు 7,500 మంది కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
“రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల కార్మికుల ప్రయోజనార్థం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా కనీస వేతనాల పెంపునకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా వర్తించే ఈ రేట్లు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీనివల్ల జిల్లాలోని వేలాది మంది నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం గల, నైపుణ్యం గల కార్మికులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది”అని ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ మంగళవారం ‘ఎక్స్'(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
