న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలంటూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 1992నాటి సుప్రీంకోర్టు ఇంద్రాసాహ్నీ కేసులో ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తుందంటూ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్నది ఆ తీర్పులోని సారాంశం.
తెలంగాణ రాష్ట్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మొత్తం రిజర్వేషన్లు 67శాతానికి పెరగనున్నాయి. ఇది విధానపరమైన నిర్ణయం. “రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. అటువంటి నిర్ణయంపై విచారణ లేకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎలా జారీచేస్తుంది? ఉత్తర్వులో మొదటి కొన్ని పేజీలు మినహా స్టే విధించడానికి గల కారణాలు ఏమిటో హైకోర్టు ప్రస్థావించలేదు.” అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ అన్నారు.
“శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించిన విషయాన్ని కాదనడానికి వీరెవరు?” అంటూ జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టీస్ సందీప్ మెహతాల ధర్మాసనం ముందు అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ రిజర్వేషన్ల అమలు వలన మొత్తం రిజర్వ్డ్ స్థానాల సంఖ్య 50శాతానికి మించి పోతుందన్న వాదనలను ప్రస్థావిస్తూ, ఇందిరా సాహ్నీ కేసు తీర్పును తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అభిషేక్ సింఘ్వీ అన్నారు. 1992నాటి తీర్పులోనే ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు రిజర్వేషన్లు 50శాతాన్ని మించి అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణన్ ఈ విషయంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక ఉత్తర్వులను ప్రస్థావించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2010నాటి కే కృష్ణమూర్తి తీర్పులో కూడా 50శాతం కోటా సీలింగ్‌ను సమర్థించిందని శంకర్నారాయణన్ గుర్తుచేశారు. తాజా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కూడా కోటా సీలింగ్‌ను 60శాతానికి పైగా పెంచుతున్నందున కే కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తాజా నిర్ణయానికి కూడా వర్తిస్తుందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరపాలంటూ ఇచ్చిన జీఓను, ఈ 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన విధివిధాల గురించిన మరో రెండు జీవోలను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహినుద్దీన్‌ల నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలను ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదనే సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కిరించేలా ఉన్నాయని హైకోర్టు ధర్మాసం అభిప్రాయపడింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్ల సీలింగ్ 50శాతానికి మించొచ్చని, అయితే ఏమేరకు రిజర్వేషన్లు పెంచాలో నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను నియమించి అధ్యయం జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని 1992నాటి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనే విషయాన్ని కూడా హైకోర్టు ధర్మాసనం ప్రస్థావించింది. ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మౌలిక పరీక్షను అధిగమించలేకపోయిందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
