Lula da Silva waves the Brazilian flag at a rally.
అల్ జజీరా ప్రత్యేక కథనం
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో తొలి రౌండ్లో బాగా వెనుకంజలో ఉన్న లూలా డిసిల్వ, మలి రౌండ్ కౌంటింగ్‌లో అనూహ్యమైన గెలుపు ఆ దేశంలో ఫాసిస్టు శక్తులకు శరాఘాతంగా మారింది.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలో ఫాసిస్టు స్రవంతికి ప్రాతినిధ్యం వహించే ఫ్లావియో బోల్సనారోపై, వామపక్ష శక్తులకు ప్రాతినిధ్యం వహించే లూయిస్ ఇనాసియో లూలా డి సిల్వా అనూహ్య విజయం సాధించారు. తొలి దఫా కౌంటింగ్‌లో భారీ స్థాయిలో ముందంజలో ఉన్న బోల్సనారో, మలి రౌండ్లో గెలుపుకు కావాల్సిన 50 శాతం ఓట్ల మైలురాయి దాటలేకపోయారు.
బ్రెసిల్లా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు బ్రెజిల్ జాతీయ ఎన్నికల సంఘం లూలాను విజేతగా ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు లూలాకు మొత్తం పోలైన ఓట్లలో 51 శాతం ఓట్లు (6.4 కోట్ల ఓట్లు) దక్కాయి. ప్రత్యర్థి బొల్సనారో 48 శాతం ఓట్లకు పరిమితం అయ్యారు.
సోమవారం నాటికి ఎన్నికల ఫలితాలు అంగీకరిస్తున్నట్టు మితవాద లిబరల్ పార్టీ అధ్యక్షుడు కోస్టా నేతొ ప్రకటిస్తూనే, ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరు గురించి లేవనెత్తిన అనేక అంశాలపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. మరోవైపున దేశంలోని ప్రతిపక్షంలో చీలికలు రాకుండా ఐక్యంగా ఉంచటానికి రానున్న కాలంలో కృషి చేస్తానని బోలసనారో ప్రకటించారు. దీనికి ముందు లిబరల్ పార్టీ న్యాయ నిపుణులు, శ్రేయోభిలాషులు ఇరు పక్షాలకు పోలైన ఓట్లలో భారీ వ్యత్యాసం ఉన్నందున ఈ ఎన్నికలు రద్దు కోరుతూ కోర్టుకు వెళ్ళాలన్న ఆలోచన విరమించుకోవాల్సిందిగా ఆయన్ను ఒప్పించారని బ్రెజిలియన్ వార్తా సంస్థ ఫోల్హా డి పౌలో వెల్లడించింది.
బొంగురు గొంతుతో విజయోత్సవ సభలో మాట్లాడుతూ లూలా, రానున్న కాలం మరిన్ని పోరాటాలకు సిద్ధం అవ్వాల్సిన సమయమన్నారు. చట్టసభలో తాము ప్రతిపాదించే ఎజెండాను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతాయని ఆయన హెచ్చరించారు.
చట్టసభను తాము ఎన్నుకోలేదని, ప్రజలే ఎన్నుకున్నారని, అందువలన వాళ్ళతో కలిసి పని చేసి పని చేయించుకోవాలని లూలా గుర్తు చేశారు. బ్రెజిల్ పార్లమెంట్లో మితవాద శక్తుల ఆధిపత్యం పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు గమనార్హం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటువేసిన అందరికీ లూలా కృతజ్ఞతలు చెప్పారు.
తొలి రౌండ్లో ఓడిపోయి మలి రౌండ్లో గెలిచిన లూలా దేశ ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించారు.
లూలా ప్రాతినిధ్యం వహిస్తున్న వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు ఎథినో సిల్వా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌లో లూలా విజయం ప్రజాస్వామ్యానికి ఒక మూలమలుపు అని ప్రశంసించారు.
అయితే బోల్సనారో మాత్రం తన ఓటమిని అంగీకరించలేదు. లూలా గెలుపును కోర్టులో సవాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఓటింగ్ గడువును రెండు గంటల పాటు పొడిగించడం గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణ విధివిధానాలను, నిబంధనలను మార్చేసిందని, అటువంటి మార్పుల మద్దతుతో గెలిచిన ఈ గెలుపును గుర్తించలేమని ఆదివారం రాత్రి ఇచ్చిన ఉపన్యాసంలో అన్నారు.
సంక్లిష్టమైన ఓటింగ్ విధానం
పశ్చిమ దేశాలలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రత్యేకించి వామపక్ష స్రవంతికి చెందిన రాజకీయ నాయకులు లూలా విజయాన్ని స్వాగతించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ప్రజాస్వామ్యం విజయానికి జేజేలు పలికారు. అధ్యక్షుడు లూలాకు అభినందనలు తెలిపారు.
అమెరికా సేనటర్ బెర్నీ శాండర్స్ లూలా గెలుపు అద్భుతమైన సందర్భం అని కొనియాడారు. లూలా బ్రెజిల్లో కార్మికులు, ప్రజల కోసం నిలబడ్డారని గుర్తు చేస్తూ, రానున్న నాలుగేళ్లలో కూడా ఆయన ఈ కృషిని కొనసాగించాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.
మరోవైపున పోలింగ్ కేంద్రాలకు ప్రజలు రావడానికి అవకాశం లేకుండా ప్రజా రవాణాపై నియంత్రణలు విధించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా లూలా అనుయాయులు, కార్మిక శ్రేణులు ఓటింగ్‌లో పాల్గొనకుండా రవాణా సౌకర్యాలకు బోల్సనారో శ్రేణులు అవరోధాలు కల్పించాయని ఆరోపించారు. ఈ ఆరోపణలతో సాల్వడార్ నగరంలో రవాణా శాఖ ఉన్నతాధికారిని అరెస్టు చేశారు.
బోల్సనారోకు పట్టు కలిగిన దక్షిణాది రాష్ట్రాల్లో భారీ తుఫాను కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ రాష్ట్రాలలో తక్కువ మంది ఓటర్లు బయటకు వచ్చారు. ఆ మేరకు బోల్సనారోకు వచ్చే ఓట్లు కూడా తగ్గిపోయాయి.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పోలింగ్ గడువు మరో రెండు గంటలపాటు పొడిగించాలని ఇరుపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దాంతో సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన ఓటింగ్‌ను బ్రెజిల్ సుప్రీంకోర్టు రాత్రి ఏడు గంటలవరకు పొడిగించింది. ఈ నిర్ణయం వెనక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రిస్టియానో జానిన్కు, అధ్యక్షుడు లూలాకు ఉన్న పూర్వ సంబంధాలే కారణమని బోల్సనారో ఆరోపించారు. అయితే రెండు గంటలు పాటు ఓటింగ్ సమయం పొడిగించిన కారణంగా కేవలం దేశవ్యాప్తంగా పోలైన అదనపు ఓట్లు 35000 మాత్రమే అని బ్రెజిల్ విద్యా సంస్థ ఇన్స్పర్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పెడ్రో బుర్గో అన్నారు.
మరోవైపున సరైన సమయానికి కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రారంభం కాకపోవడంతో తనకు వచ్చే ఓట్లు తగ్గిపోయాయని ప్రతిపక్ష నేత బోల్సనారో ఆరోపించారు.
వామపక్ష విజయం
ఆదివారం ఫలితాలకు అమెరికా ఉపఖండ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత ఉన్నది. దక్షిణ అమెరికాలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో వామపక్ష శక్తులు మరోమారు ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోవడంతో మితవాద శక్తులను నిలువరించారు.
ఈ మధ్యకాలంలో దక్షిణ అమెరికా ఖండంలో అనేక దేశాల్లో మితవాద శక్తులు రాజ్యాధికారాన్ని చేపట్టాయి. పెరు, బొలీవియా, అర్జెంటీనా, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పునాదిగా గెలిచిన ఈ ప్రభుత్వాలకు, 2025లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆశీర్వాదాలు ఉన్నాయి.
లోహ కార్మికుల నాయకుడు అయినా లూలా తన 81వ ఏట 2027 జనవరి 5న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రెజిల్ నిరంకుశత్వ నీడనుండి బయటపడి ప్రజాస్వామ్య ప్రస్థానం పునఃప్రారంభించిన తర్వాత ఎన్నికైన అధ్యక్షుల్లో లూలా అత్యంత వృద్ధుడు. ఈ గెలుపుతో లూలా నాలుగోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అక్టోబర్‌లో జరిగిన ప్రాథమిక దఫా పోలింగ్‌లో లూలా వెనుకంజలో ఉండటంతో ఈ సారి బోల్సనారో గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. మొదటి దఫా పోలింగ్‌లో మితవాద నాయకుడు బోల్సనారోకు 47 శాతం, లూలాకు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ప్రధాన అభ్యర్థుల్లో ఎవరూ 50 శాతం ఓట్లు సంపాదించుకోకపోతే దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ జరగాలి.
ప్రాథమిక దశ పోలింగ్‌లో వెనుకంజలో ఉన్న లూలా, అక్టోబర్ రెండోవారం నుండి ప్రజల దైనందిన సమస్యలు, పెరుగుతున్న ధరలు వంటి సమస్యలను ప్రచారాస్త్రాలుగా మలచుకున్నారు. ఓటర్లకు చేరువయ్యారు. కార్మికుల పనిగంటలు తగ్గిస్తూ ఆమోదించిన రాజ్యాంగ సవరణ గురించి వర్కర్స్ పార్టీ పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. దాంతోపాటు వారాంత సెలవుల్లో ఉచిత ప్రజా రవాణా సదుపాయాలు అందుబాటులోకి తేవడం గురించి కూడా ఆలోచిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
1980 దశకంలో దేశంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంతో పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రవేశించిన లూలా ఇప్పటివరకు ఏడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. నాలుగుసార్లు గెలిచారు.
2002, 2006లో వరుసగా రెండుసార్లు గెలిచిన లూలా, 2022లో మూడోసారి గెలిచాడు. ఆధునిక బ్రెజిల్ చరిత్రలో 2022 అధ్యక్ష ఎన్నికలు జరిగినంత హోరాహోరీగా మరే ఎన్నిక జరగలేదు.
2022 ఎన్నికల్లో లూలా అప్పటి మితవాద ఫాసిస్టు నాయకుడు జైరే బోల్సనారోతో తలపడారు. ప్రస్తుతం బరిలో ఉన్న బోల్సనారోకి ఈయన తండ్రి. ఆవిధంగా చూసినపుడు తండ్రి, కొడుకులను ఓడించిన ఘనత లూలాకి దక్కుతుంది.
గత ఎన్నికలలో లూలా చేతిలో ఓడిపోయిన జైరే బోల్సనారో, లూలా ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి కుట్రపన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో 27 ఏళ్ల పాటు జైలు శిక్షకు గురయ్యారు. దాంతో ఈసారి ఆయన కొడుకు ఎన్నికల బరిలోకి దిగాడు.
లూలా మూడవసారి అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో పేదరికం, నిరుద్యోగం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆయన వృద్ధాప్యం, నేరాలను కట్టడి చేయలేకపోవడం, దేశంలో పెరుగుతున్న మితవాద సమీకరణల నేపథ్యంలో అనేక సవాళ్లు తలెత్తాయి.
కుటుంబ రుణ భారం విపరీతంగా పెరిగిపోవడంతో బ్రెజిలియన్ పౌరుల ఆర్థిక స్థితిగతులు సంక్షోభ స్థాయికి చేరుకుంటున్నాయి.
కుటుంబ ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడటానికి పలువురు ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడటంతో, ఈ లాటరీ తరహా వ్యవహారంతో ఆ కుటుంబాలు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ఆన్లైన్ బెట్టింగ్‌లపై బ్రెజిల్ ప్రభుత్వం ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో నిషేధం విధించింది.
ముందున్నది అనిశ్చితి
తాజా విజయంతో ఆధునిక బ్రెజిల్ చరిత్రలో లూలా అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా రికార్డు సృష్టించినప్పటికీ, 2027 తర్వాత లూలా ప్రభుత్వం చేపట్టదలుచుకున్న సంస్కరణలు, ఆమోదింపదలుచుకున్న చట్టాల విషయానికొస్తే పరిస్థితి అంత సులువుగా ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో అనేక ప్రగతిశీల దృక్పథం కలిగిన చట్టాలను ఆమోదించనీయకుండా మితవాద ప్రతిపక్షం అడ్డుకున్న తీరు కళ్ళముందు ఉన్నది.
లూలా మరోసారి దేశ అధ్యక్షుడు కావటంపట్ల దేశంలో బోల్సనారో నేతృత్వంలోని మితవాదం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా స్పందించనున్నారు అన్నది కూడా కీలకం కానున్నది.
ఇప్పటికే లూలా ఎన్నికకు వ్యతిరేకంగా కోర్టుకెక్కనున్నట్లు బోల్సనారో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ కూడా బ్రెజిల్ ఎన్నికల ప్రక్రియలో న్యాయపరమైన లోపాలు చోటుచేసుకున్నాయంటూ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
“బ్రెజిల్లో మితవాద ప్రభుత్వం అధికారంలో ఉండి ఇటువంటి పొరపాటు జరిగితే, అమెరికాలోని పత్రికలన్నీ నిద్రమానుకొని మరీ గగ్గోలు పెట్టేవి. కానీ తాజా పరిణామాలపై అమెరికా పత్రికలన్నీ మౌనాన్ని పాటించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది” అని ట్రంప్ జూనియర్ వ్యాఖ్యానించాడు.
బోల్సనారో కుటుంబానికి ట్రంప్ మద్దతు బహిరంగమే. దేశంలో బోల్సనారోపట్ల సానుకూల వ్యక్తం కావడానికి, బ్రెజిల్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని సరుకులపై 50 శాతం సుంకాలు విధించింది ట్రంపు ప్రభుత్వం.
రాజద్రోహం కుట్రలో విచారణ జరిపి శిక్షలు విధించిన బ్రెజిల్ న్యాయమూర్తులపై కూడా అమెరికా పలు ఆంక్షలు విధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రంపు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అమెరికా ప్రతినిధి రో ఖన్నా కూడా వ్యాఖ్యానించారు.
రో ఖన్నా, బ్రెజిల్లో లూలా ఎన్నికను తీవ్రవాదులకు, ఉగ్రవాదానికి దక్కిన విజయంతో పోల్చారు.
బ్రెజిల్లో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మితవాద రాజకీయ పక్షాలు, మేధావులు నడుపుతున్న చర్చను చూస్తే, రానున్న కాలంలో బ్రెజిల్లో వామపక్ష ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేయనివ్వకుండా ఉండటానికి కసరత్తు మొదలైనట్లుగా అర్థమవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
