Representative image of currency notes. Photo: Unsplash
పోలీసు కేసు నమోదు – అసలు ఏం జరిగింది?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న తమ సెటిల్మెంట్ ఖాతా నుంచి రూ.13.97 కోట్లు అక్రమంగా బదిలీ అయ్యాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఈ డబ్బును ఎవరు తీసుకున్నారో ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బ్యాంకు ఫిర్యాదు ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోని స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (SFMS) సర్వర్ ద్వారా, RBIకి చెందిన సంస్థ అయిన ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (IFTAS) కేంద్ర SFMS సర్వర్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా మొత్తం 187 లావాదేవీల ద్వారా డబ్బును బదిలీ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఈ లావాదేవీలు 2026 అక్టోబర్ 15 నుంచి 17 మధ్య జరిగాయని Hindustan Times వార్తా కథనం పేర్కొంది.
187 అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి?
బ్యాంకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు (FIR) ప్రకారం, డబ్బు మొత్తం 36 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయింది. అక్టోబర్ 15న 6 సార్లు, అక్టోబర్ 16న 88 సార్లు, అక్టోబర్ 17న 93 సార్లు మొత్తం 187 ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఈ 187 లావాదేవీల్లో చెల్లింపు దారులుగా చూపించిన ఖాతాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినవి కావని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాక, బ్యాంకు అంతర్గత బృందం ఈ 187 లావాదేవీలకు సంబంధించిన వివరాలను తమ శాఖల్లోనూ, ఇంటర్నెట్ బ్యాంకింగ్లోనూ, మొబైల్ బ్యాంకింగ్లోనూ, ఇతర ఏ బ్యాంకింగ్ మార్గాల్లోనూ గుర్తించలేక పోయింది.
డబ్బు ఎలా మాయమయింది తెలియడం లేదెందుకు?
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇప్పటివరకు లావాదేవీల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు Hindustan Times తెలిపింది. ఆ లావాదేవీల గురించి స్పష్టమైన వివరాలు లేకపోవడం వల్ల డబ్బును ఏ విధంగా అక్రమంగా బదిలీ చేశారో గుర్తించడం చాలా కష్టంగా ఉందని ఆ అధికారి పేర్కొన్నారు.
SFMS అంటే ఏమిటి?
SFMS అంటే Structured Financial Messaging System. బ్యాంకులు RBI నిర్వహించే RTGS, NEFT వ్యవస్థల ద్వారా డబ్బు బదిలీ చేసేటప్పుడు, ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు చెల్లింపుల సందేశాలను పంపడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన సర్వర్లలోకి అక్రమంగా ప్రవేశించి లావాదేవీలు జరిపినట్లు బ్యాంకు ఆరోపిస్తోంది.
బ్యాంకు ఏ చర్యలు తీసుకుంది?
ఈ విషయం బ్యాంకు అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే, బ్యాంకు సంబంధిత సంస్థలకు – భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (IFTAS), DAKSH పోర్టల్ (RBI పర్యవేక్షణ, నియంత్రణ సంబంధిత కార్యకలాపాలకు ఉపయోగించే వేదిక), NCIIPC (దేశంలోని కీలక సమాచార మౌలిక సదుపాయాల రక్షణకు బాధ్యత వహించే జాతీయ కేంద్రం), CERT-In (భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం, సైబర్ భద్రతా ఘటనలపై స్పందించే సంస్థ) లకు సమాచారం ఇచ్చింది.
ఈ ఘటనపై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మోసం (Cheating), వేరొకరి గుర్తింపుతో వ్యవహరించడం (Personation) వంటి ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే, ఈ వార్త ప్రచురితమైన సమయానికి డబ్బును ఎవరు బదిలీ చేశారు, ఏ విధంగా సర్వర్లలోకి ప్రవేశించారు, డబ్బు తిరిగి లభించిందా అనే విషయాలపై స్పష్టమైన సమాచారం లేదు.
అనువాదం: డి. వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
