పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ నేతృత్వంలో జరుగుతున్న యుద్ధం, అమెరికా కవ్వింపు చర్యలతో సెప్టెంబర్ 14న ముడి చమురు ధరలు మళ్లీ పెరిగి బ్యారెల్ 128.70 అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి.
ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 అమెరికన్ డాలర్లకు పైగా, అమెరికా బాండ్స్ లాభాలు 5 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
సెప్టెంబర్ 15న భారత దేశ ఈక్విటీల భారీ అమ్మకాలు జరిగాయి. దీనివల్ల బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్), 5 ట్రిలియన్ డాలర్ల కంటే కిందకు(మూడు నెలల కనిష్ట స్థాయికి) పడిపోయినట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి రిపోర్ట్ ఆధారంగా ఎకనామిక్ టైమ్స్ ఒక వార్త ప్రచురించింది.
తగ్గిన గ్లోబల్ వాటా..
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి రిపోర్ట్ ప్రకారం, లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.
జూన్ 11 తర్వాత నమోదైన అతి తక్కువ స్థాయి ఇదే. ఏడాది ప్రారంభంలో 5.3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ విలువ, దాదాపు 380 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పడిపోయింది.
ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలతో, సెప్టెంబర్ 15న బెంచ్ మార్క్ 10 సంవత్సరాల యూఎస్ ట్రెజరీ లాభాలు 5.041 శాతానికి పెరిగాయి.
2007 తర్వాత ఇదే అత్యధికం. గ్లోబల్ మార్కెట్ క్యాప్‌లో భారతదేశం వాటా 2.95 శాతానికి పడిపోయింది. జూన్ 3 తర్వాత ఇదే అతి తక్కువ.
కుదేలైన సెన్సెక్స్, నిఫ్టీ..
మంగళవారం సెన్సెక్స్ 778 పాయింట్లు పడిపోయి 74,003.81 వద్ద ముగిసింది. జూన్ 11 తర్వాత ఇదే అతి తక్కువ కాగా, నిఫ్టీ 280 పాయింట్లు పడిపోయి(1.2 శాతం) 23,118.60 వద్ద ముగిసింది. ఏప్రిల్ 6 తర్వాత ఇంత తక్కువకు ఇప్పుడు పడిపోయింది.
పెట్టుబడిదారుల ఆందోళన..
చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు మళ్ళీ మొదలైనాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు భారీగా రుణాలు తీసుకోవడం వల్ల బాండ్స్ పై లాభాలు పెరుగుతున్నాయని ‘స్టెప్ ట్రేడ్ క్యాపిటల్’ డైరెక్టర్, ఫండ్ మేనేజర్ క్రిషా గుప్తా పత్రికకు తెలియజేశారు.
రూపాయి విలువ పడిపోవడం, రెపో రేటు పెరుగుతుందనే అంచనాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో భారీ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
రికార్డు స్థాయిలో క్రూడ్ ధరలు..
సెప్టెంబర్‌లో క్రూడ్ ఆయిల్ ధర సగటున బ్యారెల్‌కు 109.76 అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొన్నది.
జులైలో 82.04 డాలర్లు ఉండగా, ఆగస్టులో 90.19 డాలర్లకు పెరిగింది. దాని కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ధర జులై సగటుతో పోలిస్తే 43 శాతం ఎక్కువ.
మరో వైపు, భారతదేశ ఈక్విటీలు కొంతకాలం బలహీనంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
కొనసాగనున్న అనిశ్చితి..
“క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్ట స్థాయిలో ఉండటం, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయానికి ముందు ఉన్న అనిశ్చితి కారణంగా భారతీయ ఈక్విటీలు బలహీనంగా ఉండే అవకాశం ఉంది” అని ‘మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ఎకనమిక్ టైమ్స్ తో చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.
ది వైర్ ఇంగ్లీష్ వ్యాసానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
