పశ్చిమ బెంగాల్, బంకురా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 8న సీజేపీ ధర్నా చేసింది. దీనికి ఆగస్ట్ 13న జరిగిన ఘటన కారణం. ఇందస్ బ్లాక్‌లోని కరిసుంద గ్రామానికి చెందిన ఒక యువకుడికి సంబంధించిన వివాదం అతడి తండ్రి మరణానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఉద్యమానికి దారితీసింది.
బంకురా: సెప్టెంబరు 8న కుండపోత వర్షంలోనూ బంకురా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వెలుపల దాదాపు ఏడు గంటల పాటు శాంతియుతంగా ధర్నా నిర్వహించిన అనంతరం, జిల్లా యంత్రాంగం కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక హామీ ఇచ్చింది.
సీజేపీ కార్యకర్త అబ్దుల్ హఫీజ్ తండ్రి షేక్ మహమ్మద్ మాఫిక్ జ్ఞాపకార్థం పశ్చిమ బెంగాల్ బంకురా జిల్లా కరిసుంద గ్రామంలో ప్రపంచ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేయడానికి రెండున్నర నెలల వ్యవధిలో చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.
హఫీజ్‌కు, ఆయన కుటుంబ భద్రత కల్పించే బాధ్యత మాదేనని కూడా యంత్రాంగం నిరసనకారులకు హామీ ఇచ్చింది.
మహమ్మద్ హఫీజ్ విద్యా పరిరక్షణ లక్ష్యం కోసం ప్రచారం చేస్తున్నందున ఆయనపై స్థానిక బీజేపీ గూండాలు ఆయన తండ్రి మాఫిక్పై దాడి చేయడంతో మాఫిక్ ప్రాణాలు కోల్పోయినట్లు సీజేపీ ఆరోపించింది. వారిని అరెస్టు చేయాలని సీజేపీ నిరసనకారులు డిమాండ్ చేశారు.
నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని జిల్లా అధికారులు సీజేపీకి హామీ ఇచ్చారు.
ఆగస్టు 13న హఫీజ్, ఆయన తండ్రిపై బీజేపీ కార్యకర్తలు క్రూరంగా దాడి చేసిన ఘటన రిటైర్డ్ న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జిల్లా యంత్రాంగం తెలిపింది. పది రోజుల్లోగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, కలకత్తా వీధుల్లో తమ ఉద్యమాన్ని చేపడతామని సీజేపీ కార్యకర్తలు హెచ్చరించారు.
సెప్టెంబరు 8న విద్యార్థులు, యువత నేతృత్వంలో జరిగిన ఒక పెద్ద ఉద్యమం ప్రజల దృష్టిని ఆకర్షించింది. బెదిరింపులు, జోరున వాన, అధికార యంత్రాంగం ఆంక్షలను లెక్క చేయక తమ నిరసనను యథావిధిగా కొనసాగించడానికి సీజేపీ నిర్ణయించింది. చివరకు ఉద్యమం విజయం సాధించింది.
సీజేపీ నిరసన నేపథ్యం..
ఆగస్టు 13న జరిగిన ఘటన బంకురా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వెలుపల సీజేపీ ధర్నాకు దారితీసింది. ఇందస్ బ్లాక్, కరిసుంద గ్రామానికి చెందిన ఒక యువకుడు హఫీజ్‌కు సంబంధించిన వివాదం అతడి తండ్రి మాఫిక్ మరణానికి దారితీసి, రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద నిరసన ఉద్యమానికి దారితీసింది.
ఆగస్టు 13న, కరిసుంద నివాసి హఫీజ్ తన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి, దాని ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్ దేను కలిశారు.
పాఠశాల విద్య నాణ్యత, విద్యార్థుల హాజరు, విద్యార్థులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించడంతో సహా పాఠశాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు హఫీజ్ తెలియజేశారు.
గ్రామంలో విద్య సర్వతోముఖాభివృద్ధికి అవసరమైతే తాను కూడా తోడ్పాటునందించడానికి సిద్ధంగా ఉన్నానని హెడ్మాస్టర్కు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే హెడ్మాస్టర్ పాఠశాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని తెలియజేయకుండా, తర్వాత రమ్మని చెప్పారని హఫీజ్ ఆరోపించారు.
పైగా గ్రామానికి ఒక “కాక్రోచ్ పార్టీ” వచ్చిందని, వీలైతే వారిని అడ్డుకోవాలని స్థానిక బీజేపీ నాయకులకు హెడ్మాస్టర్ సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ ఉద్యమం, స్థానిక బెదిరింపులు..
జూలై నెల ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో పాల్గొనడానికి హఫీజ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి నిరసన వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“నేను ఢిల్లీ నుంచి ఆ ఉద్యమం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. పాఠశాలల విద్యాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగించాలని సీజేపీ నిర్ణయించింది” అని హఫీజ్ ‘ది వైర్’తో చెప్పారు.
కరిసుందకు తిరిగి వచ్చిన తర్వాత, సీజేపీ ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీకి ఎందుకు వెళ్లావని స్థానిక బీజేపీ కార్యకర్తలు తనను బెదిరించినట్లు హఫీజ్ తెలిపారు.
తాను ఆ బెదిరింపులను పట్టించుకోకుండా, తన గ్రామంలో విద్యా పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నాలను కొనసాగించానని, అదే తన తండ్రిపై దాడికి దారితీసిందని ఆయన చెప్పారు.
“ఆ రాత్రి(ఆగస్ట్ 13), సుమారు 15 మంది బీజేపీ కార్యకర్తల బృందం మా ఇంటికి వచ్చింది. వారు విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేసి నాపై దాడి చేశారు. నన్ను కాపాడటానికి మా తండ్రి ప్రయత్నించినప్పుడు, ఆయనపై కూడా దాడి చేశారు” అని హఫీజ్ ఆరోపించారు.
ఆసుపత్రిలో నిరాకరణ, మార్గమధ్యలో మళ్లీ దాడి..
తాను, తన తండ్రి మహమ్మద్ మాఫిక్ ఇందస్ ఆసుపత్రికి వెళ్లినప్పుడు, బీజేపీ దాడి చేస్తుందనే భయంతో వైద్యులు వారికి వైద్యం చేయడానికి వెనుకాడారని ఆయన చెప్పారు. వారిద్దరికీ కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి డిశ్చార్జ్ చేశారని హఫీజ్ ఆరోపించారు.
“మేము తిరిగి వస్తున్నప్పుడు, ఖోస్బాగ్ గ్రామంలో బీజేపీ గూండాలు మళ్లీ మాపై దాడి చేశారు. మా తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 15న మా తండ్రిని బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది, అదే రోజు ఆయన మరణించారు” అని హఫీజ్ చెప్పారు.
బీజేపీ గూండాల దాడి, మాఫిక్ మరణం పశ్చిమ బెంగాల్ అంతటా నిరసనలకు దారితీసింది. వామపక్ష అనుబంధ విద్యార్థి, యువజన, మహిళా, ఉపాధ్యాయ, రైతు సంఘాలు కరిసుందకు వెళ్లి హఫీజ్, ఆయన కుటుంబానికి మద్దతును ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా అనేకమంది సీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఐక్యతను, సంఘీభావాన్ని తెలియజేయడానికి ఆ గ్రామానికి వచ్చారు. ఇలా పెరిగిన ఒత్తిడితో, పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు.
సాధారణ కుటుంబం, పరిహారం వద్దు పాఠశాల కావాలి..
అయితే, దీని వెనుక బతుకు పోరాటం సాగిస్తున్న ఒక కుటుంబ చరిత్ర ఉంది. హఫీజ్ తండ్రి మహమ్మద్ మాఫిక్ బర్ధమాన్(బర్ద్వాన్)లో రొట్టెలు అమ్ముకుని జీవనం సాగించే వీధి వ్యాపారి. ఆ కుటుంబానికి వ్యవసాయ భూమి లేదు. పొలాల మధ్యలో ఒక సాధారణ రెండు గదుల ఇల్లు నిర్మించుకోవడానికి మహమ్మద్ మాఫిక్ అప్పులు చేశారు. ఆ కుటుంబానికి ఆయనే ఏకైక సంపాదనాపరుడు.
తండ్రి మరణించిన మరుసటి రోజే “తనకు ఎలాంటి పరిహారం వద్దు. దానికి బదులుగా తన తండ్రి పేరు మీద కరిసుందలో ప్రభుత్వం ఒక ప్రపంచ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేయాలి” అని హఫీజ్ డిమాండ్ చేశారు. దాడితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లతో, హఫీజ్ సీజేపీ నాయకులతో కలిసి ఆగస్టు 21న బంకురా జిల్లా మేజిస్ట్రేట్ అనీష్ దాస్‌గుప్తాకు వినతిపత్రం సమర్పించారు.
తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి పది రోజుల సమయం ఇచ్చారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అపాయింట్మెంట్ కోరినా తమకు అవకాశం ఇవ్వలేదని సీజేపీ నాయకుడు ప్రేమ్ ఆకాష్ గులు ‘ది వైర్’కు తెలిపారు. ఈ సందర్భంగా, సెప్టెంబరు 8న జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి కొత్త వినతిపత్రాన్ని సమర్పిస్తామని సీజేపీ బంకురా జిల్లా యంత్రాంగానికి ముందుగానే సమాచారం ఇచ్చారు.
అయితే సీజేపీ నిరసనకారులు డీఎం కార్యాలయానికి చేరుకున్నప్పుడు జిల్లా మేజిస్ట్రేట్ వారిని కలవలేదు. దాంతో జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వెలుపల ఏడు గంటల పాటు ధర్నా చేయాల్సి వచ్చింది.
బంకురాలో వేగం పుంజుకున్న సీజేపీ నిరసన..
“ఆగస్టు 21న మేము బంకురా జిల్లా మేజిస్ట్రేట్‌కు మా డిమాండ్లను వివరించాము. చర్యలు తీసుకోవడానికి యంత్రాంగానికి పది రోజుల సమయం ఇచ్చాము. కానీ ఏమీ జరగలేదు. అందుకే మేము ఈ రోజు(సెప్టెంబర్ 8) మళ్లీ బంకురాకు వచ్చి జిల్లా మేజిస్ట్రేట్ ముందు మా డిమాండ్స్ ఉంచుతున్నాము” అని సీజేపీ వెస్ట్ బెంగాల్ ఈస్ట్ జోన్ కోఆర్డినేటర్ దేదీప్యో గంగూలీ తెలిపారు.
పోలీసుల అడ్డంకులు, శాంతియుత ధర్నా..
సీజేపీ నిరసనకు ఏర్పాట్లు చేస్తుండగా, సెప్టెంబరు 8 ఉదయం నుంచే బంకురా పట్టణం భారీ భద్రతా వలయంగా మారిపోయింది.
నగరం నలు మూలలా పోలీసులను మోహరించారు. వాటర్ కానన్లు, టియర్ గ్యాస్ షెల్స్ సిద్ధంగా ఉంచారు. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇనుము, వెదురుతో పొడవైన బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఈ భారీ భద్రత స్థానికులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.
“మేము కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని చూడటానికి వచ్చాము. వారి ఉద్యమ ఒత్తిడి వల్లే దేశ విద్యాశాఖ మంత్రి [ధర్మేంద్ర ప్రధాన్] రాజీనామా చేయాల్సి వచ్చింది” అని బంకురా పట్టణంలోని లాల్ బజార్ నివాసి ఒకరు చెప్పారు.
స్కూల్‌కు చెందిన సుమంత బాసుతో సహా పలువురు స్థానికులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ నిరసన శాంతియుతంగానే ఉంటుందని సీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
“యంత్రాంగం మమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటే అక్కడే కూర్చుని నిరసన తెలుపుతాం” అని సీజేపీ ప్రకటించింది.
తమిళీ బంధ్ ప్రాంతం నుండి ప్రారంభమైన ర్యాలీ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వైపు సాగింది. నిరసనకారులు కార్యాలయానికి చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బారికేడ్లను తోసుకుని వెళ్ళడానికి ప్రయత్నించకుండా, సీజేపీ కార్యకర్తలు అక్కడే కూర్చుని తమ ధర్నాను ప్రారంభించారు.
“నా తండ్రిపై దాడి చేసిన వారిని అందరినీ అరెస్టు చేయలేదు. బీజేపీ స్థానిక యూనిట్ అధ్యక్షుడు సౌరవ్ బైరాగి, ఉజ్జల్ చక్రవర్తి తదితరులు బహిరంగంగా తిరుగుతున్నారు. నా ఇంటికి దాడి చేసేవారిని పంపారని ఆరోపిస్తున్న కరిసుంద పాఠశాల హెడ్మాస్టర్ను కూడా ఇంకా అరెస్టు చేయలేదు” అని డీఎం కార్యాలయం వెలుపల పోలీసుల బందోబస్తు మధ్య కూర్చుని హఫీజ్ మీడియా ముందు ఈ ఆరోపణలు చేశారు.
కొన్ని రోజుల క్రితం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇందస్ పోలీస్ స్టేషన్ వెలుపల జరిగిన రాఖీ పండుగ కార్యక్రమంలో బైరాగి పాల్గొన్నారని, అయితే పోలీసులు మౌనంగా ఉండిపోయారని ఆయన ఎత్తి చూపారు.
“కొన్నిసార్లు పోలీసులు మమ్మల్ని విచారణ కోసం రాత్రివేళల్లో పిలుస్తారు. కొన్నిసార్లు భారీ వర్షం పడుతున్నప్పుడు పిలుస్తారు. మేము ప్రతి విషయంలోనూ అధికార యంత్రాంగానికి సహకరించాము. కానీ యంత్రాంగం మా సమంజసమైన డిమాండ్లను ఆమోదించడానికి ఎందుకు నిరాకరిస్తోంది?” అని హఫీజ్ ప్రశ్నించారు.
నిరసన కొనసాగుతుండగా, ఈ ఉద్యమం ప్రాథమికంగా విద్యకు సంబంధించినదని సీజేపీ నాయకుడు ప్రేమ్ ఆకాష్ గులు అన్నారు.
“మేము విద్యాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము. పోలీసు అధికారులు, ఇతర అధికారులు, సమాజంలోని అన్ని తరగతుల ప్రజల పిల్లల భవిష్యత్తు విద్యతో ముడిపడి ఉంది. కేవలం విద్య గురించి మాట్లాడినందుకే అబ్దుల్ హఫీజ్ తండ్రిని చంపాలా?” అని ఆయన ప్రశ్నించారు.
ఈ సంఘటనపై పోలీసు విచారణ సరిగా జరగలేదని గులు ఆరోపించారు. రిటైర్డ్ న్యాయమూర్తిచే స్వతంత్ర విచారణ జరిపించాలనే సీజేపీ డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు.
యంత్రాంగం దిగిరాక, చివరకు సాధించిన విజయం..
“పోలీసులు ఈ వ్యవహారాన్ని సరిగ్గా విచారించడం లేదని మేము భావిస్తున్నాము. అందుకే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం” అని గులు చెప్పారు.
వాతావరణం దారుణంగా మారినప్పటికీ నిరసనకారులు అక్కడి నుండి కదలడానికి నిరాకరించారు. ఆ ప్రాంతమంతా కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులు వస్తున్నప్పటికీ సీజేపీ కార్యకర్తలు అక్కడే కూర్చున్నారు.
ఒకానొక దశలో, బిష్ణుపూర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజలి సుగు నిరసనకారులను కలిసి ధర్నాను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దానికి గులు స్పందిస్తూ, పాలనా యంత్రాంగం తమతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న తీరును ఎత్తి చూపారు.
“జిల్లా మేజిస్ట్రేట్ మమ్మల్ని కలవలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మమ్మల్ని కలవలేదు. దయచేసి చీఫ్ సెక్రటరీతో మాట్లాడండి” అని గులు ఎస్‌డీపీఓతో అన్నారు.
చివరకు జిల్లా యంత్రాంగం ముందుకొచ్చి హామీ ఇచ్చింది. బంకురా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (జనరల్) చిరంతన్ ప్రమాణిక్ నిరసనకారులను కలిసి హఫీజ్ తండ్రి మహమ్మద్ మాఫిక్ పేరిట పాఠశాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడానికి రెండున్నర నెలల సమయం కోరారు.
హఫీజ్, ఆయన కుటుంబానికి భద్రత కల్పిస్తామని, ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కూడా యంత్రాంగం నిరసనకారులకు హామీ ఇచ్చింది.
ఈ హామీల తర్వాత మాత్రమే నిరసనకారులు ధర్నాను విరమించడానికి అంగీకరించారు. నిరంతర, శాంతియుత ఒత్తిడి ద్వారా కూడా ఏమి సాధించవచ్చో ఈ అనుభవం నిరూపించింది.
మధుసూదన్ ఛటర్జీ ది వైర్ ఇంగ్లీషుకు రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
