దుర్గా పూజ సందర్భంగా అశేష జనం దుర్గాదేవి దర్శనార్థం కోల్కతా చేరుకుంటారు. దీన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కాషాయం చేయ నిర్ణయించింది. ఆ పూజా పర్వదినాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ పేరుతో 20 వేల మందిని వాలంటీర్లుగా పోలీసు శాఖ నియమించబోతున్నది. వారికి కాషాయ రంగు టీ షర్టు, టోపీ యూనిఫారంగా ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించింది.
ఇందుకుగాను 89 లక్షల రూపాయలకు టెండర్లను పిలిచింది. కోల్కతా నగరంలో మొదటిసారి దుర్గా పూజని కూడా కాషాయమయం చేయడానికి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి.
ప్రజలలో భక్తి భావాలు ఉండటం సహజం. ఆ సందర్భంగా వివిధ తీర్థయాత్రలకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.
ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పన కోసం, భక్తుల రక్షణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వమే ఇప్పుడు వాలంటీర్ల పేరుతో కాషాయ దండును భక్తజన సమూహంలోకి దింపనున్నది. ఇందుకు పావుగా పోలీసు శాఖను వినియోగిస్తున్నది.
యూనిఫాం నెపంతో కాషాయ వస్త్ర సప్లై కోసం 89 లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది.
గుర్తింపు పేరుతో పచ్చి మోసం..
ఈ మేరకు పోలీస్ శాఖ టెండర్లను కూడా పిలిచింది. పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక పోలీస్ అధికారి చెప్పేది ఏమంటే భక్త జనసమూహం వాలంటీర్లను సులభంగా గుర్తించడం కోసం ఈ యూనిఫాం తెప్పిస్తున్నామని చెప్పారు.
ఇది పచ్చి మోసం. అనేక రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో స్కూలు, కాలేజీ విద్యార్థులను స్కౌట్ డ్రెస్లలో వినియోగించుకునే ఒక సంప్రదాయం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు కాషాయ దండుని రంగంలోకి దింపి, వారికి కాషాయ వస్త్రాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అత్యంత ప్రమాదకరం.
లౌకిక విలువలకు విరుద్ధం..
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం, రాజ్యాంగంలో నిర్దేశించిన లౌకిక విలువలకు సమాధి కట్టి, ఒక మతాన్ని ప్రోత్సహించే దుష్ట సంస్కృతికి ఒడిగట్టడం రాజ్యాంగ విరుద్ధం.
వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కూడా నవరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున జరిగేవి. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. కానీ 30 సంవత్సరాల పాలనలో ఏనాడు వామపక్ష ప్రభుత్వం దసరా ఉత్సవాలను తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక మత కార్యకర్తల ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని ప్రజాతంత్ర వాదులు అందరూ ప్రతిఘటించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
