ఏపీలో జరిగిందని చెబుతున్న ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్’ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్ళీ ఆ అరెస్ట్‌కు ఈ సెప్టెంబర్ తొమ్మిదికి మూడేళ్లు అంటూ తొమ్మిది/పదకొండు అమెరికా జంట భవనాల తరహాలో మన సోషల్ మీడియాలో కథనాలు చూస్తే, వాటిలో ఉండే ప్రజాప్రయోజనం ఏమిటో తెలియదు.
విభజనే ఆంధ్రులకు ఒక శిక్ష అనుకుంటే, పైగా “మేము మీ పాల పడ్డావేమి” అని ఏపీ ప్రజలు ఆ రెండు ప్రాంతీయ పార్టీల తీరు చూసి విస్తుపోవాల్సి వస్తున్నది.
ఆ పార్టీల ధోరణి చూసి, అసలు రాష్ట్ర ప్రజల మానసిక పరిపక్వతను, ఏ స్థాయిలో ఉంచాలని మీరు అనుకుంటున్నారని అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ ఇద్దరినీ బహిరంగంగా నిలదీయక తప్పడం లేదు.
అంతేనా.. మేలు చేస్తున్నాము అనుకుని, అటువంటి వార్తా కథనాలతో మీడియా ఆ పార్టీలకు చేస్తున్న హాని విషయం వారికే అర్థం కాకపోవడం ఇందులో అత్యంత విషాదం.
ఈ పార్టీల ప్రభుత్వాలు, వారిని సమర్థించే మీడియా కూడా అలాగే ఉన్నాయి, వీరికి తగినట్టుగానే ప్రజలు ఉంటున్నారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో, “మీరు పౌరసమాజం అని రాస్తుంటారు, అసలు ఏపీలో పౌర సమాజం ఎక్కడ ఉంది” అని బెంగళూరులో స్థిరపడిన తెలుగు సాహితీ ప్రముఖుడు ఒకరు అడిగారు.
ఇదే మాటను పదిహేను ఏళ్ల తర్వాత కూడా వినాల్సి వచ్చింది.
ఏ ఎనభై దశకంలోనో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళి స్థిరపడి ఇండాలజీ పై పలు గ్రంథ రచనలు చేస్తున్న మరో ప్రముఖుడు 2026 సెప్టెంబర్‌లో కూడా ఇదే మాట అడిగారు.
ఏపీలో మీడియా ప్రభావం చాలా ఎక్కువ అనేది నిజమే కావొచ్చు.
విభజన తర్వాత ఏపీలో మిగిలినవి ఈ రెండు పార్టీలు, వాటికి వారి ఎలక్షన్ రాజకీయాలే ముఖ్యం కావొచ్చు. కానీ వాటితో ప్రత్యక్ష సంబంధం లేని పౌర సమాజం అంటూ ఒకటి ఉండాలి కదా.
మంచీ-చెడు విచక్షణ తెలిసిన మధ్యతరగతి ఆలోచనపరులు కూడా అందులో ఉంటారు కదా.
వాళ్ళకు అయినా ఈ స్కాములతోనూ, అరెస్ట్తోనూ పనిలేని వాస్తవిక దృష్టి అంటూ ఒకటి ఉండాలి కదా.
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకు కొత్తగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు వచ్చింది, ఈ పదేళ్ళలో దానితో ఏమయింది, కాకపోతే ఎందుకు కాలేదు, ప్రస్తుత దాని స్టేటస్ ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి.
ఇటువంటి సమాచార స్పృహను ప్రజలకు కలిగించాల్సిన మీడియా ఆ అరెస్టుకు మూడేళ్లు అని ప్రోగ్రామ్స్ చేస్తూ; ఆ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనే తూకం వద్ద ఈ మొత్తం చర్చను, ప్రజల ఆలోచనను అక్కడే ఆపడం అంటే; అది మన సమాజ భావదారిద్ర్యం పట్ల ఈ మీడియాకు ఉన్న చిన్నచూపు అనే చెప్పాలి.
నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మార్పులు
అసలు జరిగింది ఏమిటంటే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నకాలంలో 1985లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పడడంతో, విద్యను ఉపాధి కేంద్రిత దృష్టితో చూడడం మొదలయింది.
అలా తొలి మానవ వనరుల శాఖ మంత్రి పీవీ నరసింహా రావు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక, 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలలో మన మానవ వనరుల దృష్టికి ద్రవరూపం ఏర్పడి, అన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లోకి అది ప్రవహించడం మొదలయింది.
ఇప్పటి మాదిరిగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని గానీ, ప్రతిదాని ముందు ప్రధాన్ మంత్రి అంటూ పబ్లిసిటీ ఫోకస్ ఏమీ లేకుండానే అప్పట్లో ఈ పని మొదలయింది.
ఈ దశలోనే పట్టణాభివృద్ధి, విద్యుత్తు, కమ్యూనికేషన్స్, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో ఇంజనీరింగ్ విద్య అవసరం బాగా పెరిగింది.
దాంతో మానవ వనరుల అవసరాన్ని డిమాండ్ – సప్లయ్ దృష్టితో చూడడం మొదలయింది.
దాంతో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి అవి లాభసాటి వ్యాపారంగా మారడంతో ఆ కోర్సుల్లోకి ప్రవేశం ఖరీదు అయింది. దాంతో 2000 నాటికి ఇంజనీరింగ్ కాలేజీలను గ్రేడింగ్‌ను బట్టి ఎంపిక చేసుకుని పిల్లల్ని చేర్చడం మొదలయింది.
తెలుగువాళ్లకు ఇది తెలుసు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక రాజకీయంగా తనవాళ్లకు పునరావాసం ఇవ్వలేకపోతే, ఒక ఇంజనీరింగ్ కాలేజికి పర్మిషన్ ఇచ్చేవారు.
అలా వాటి సంఖ్య పెరిగితే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజ్ రీ-ఎంబర్స్మెంట్ ఇచ్చి, ఆ కాలేజీలకు డిమాండ్ పెంచారు.
అయితే, దానివల్ల పెద్ద ఎత్తున అన్ని ఆర్థిక స్థాయిల్లోని పిల్లలు ఇంజనీరింగ్ చదివి అప్పట్లో దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందారు.
సంస్కరణలు, ఇంజనీరింగ్ విద్య
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యాక, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అంటే ఆర్థిక సంస్కరణల ఫలాలు మాత్రమే మావి అంటే కుదరదని, ఉపాధి కల్పనలో ప్రైవేట్ సెక్టార్ సింహభాగం బాధ్యతను తీసుకోవాల్సిందే అనే లైన్ తీసుకున్నారు.
కలకత్తాలో 2005 జనవరి 12న జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్య వేదికపై ప్రధాని సింగ్ దాన్ని బహిరంగంగా చెప్పారు.
కానీ సాంకేతిక విద్య మార్కెట్ ప్రాతిపదికగా మారాక, ఉద్యోగ అవకాశాలు ఫస్ట్-కమ్-ఫస్ట్ వడ్డన అయింది. డిగ్రీ ప్లస్ స్కిల్ ప్రాధాన్యం అయింది.
ఇంజనీరింగ్ డిగ్రీ చాలదు ఎంబీఏ, ఎంటెక్ తప్పనిసరి అని, కాదు అమెరికా ఎం.ఎస్ ఉండాలి అనే డిమాండ్లు ఉద్యోగ మార్కెట్లో పెరిగాయి.
అది అందరికీ సాధ్యమయ్యేది కాక, ఈ పోటీలోకి ఆలస్యంగా వచ్చిన అంతంత మాత్రపు చదువులున్న పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
ఉపాధి హామీ చట్టంతో మొదలుపెట్టి, పలు హక్కుల చట్టాలు తెచ్చిన యూపీఏ ప్రభుత్వం 2008లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)ను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్తో కంపెనీస్ చట్టం 1956లోని సెక్షన్ 25 ప్రకారం, భారత ప్రభుత్వం 49 శాతం ప్రైవేట్ సెక్టార్ 51 శాతం షేర్ హోల్డింగ్ భాగస్వామ్యంతో ఉనికిలోకి తెచ్చింది.
వీరిద్దరూ కలిసి జాబ్ మార్కెట్ అవసరాలకు తగిన స్కిల్ బ్యాంక్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రభుత్వం తరపున నోడల్ ఏజెన్సీగా ఈ సంస్థ ప్రైవేట్ సెక్టార్ ద్వారా స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది.
ఉమ్మడి ఏపీలో 2009 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఎటువంటివో తెలిసిందే.
విభజన తర్వాత విడుదల అయిన దేశ నైపుణ్యాభివృద్ధి పాలసీ-2015 ప్రకారం మనదేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్ల వయస్సు యువత.
అయితే, రాబోయే 20 ఏళ్లలో ప్రపంచ పారిశ్రామిక రంగంలో నైపుణ్య శ్రామికుల అవసరత 4 శాతం తగ్గుతుంది, కానీ ఇండియాలో అది 32 శాతం పెరుగుతుంది.
కనుక, రాబోయే పాతికేళ్లలో ఈ యువతకు ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాలు పెంచడానికి పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమం అవసరం అవుతుంది.
కీలకమైన 22 రంగాల్లో 2022 నాటికి 109.73 మిలియన్ల మంది స్కిల్డ్ లేబర్ అవసరం మనకు ఉంటుంది. అయితే, ఇండియాలో వారు ఉన్నది 4.69 శాతం మాత్రమే.
అదే యూకేలో 68 శాతం, జర్మనీలో 75 శాతం, అమెరికాలో 52 శాతం, జపాన్‌లో 80 శాతం, సౌత్ కొరియాలో 92 శాతంగా ఉన్నారు అంటూ, 9వ తరగతి నుంచి వీరికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మొదలుపెట్టి, శిక్షణ ఇస్తూ ఇందుకోసం నేషనల్ లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
స్కిల్ ఇండియా – మేక్ ఇండియా లక్ష్యంగా ఇది మొదలయింది.
ఏటా 3000 కోట్లతో మూడు అంచెలలో పనిచేసే విధంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ మొదలయింది.
అందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ పాలసీ 2015 పేరుతో ఒకటి జాతీయ స్థాయిలోను, రెండవది రాష్ట్రాల స్థాయిలోను, మూడు జిల్లాల స్థాయిలోను పనిచేయాలనేది సంకల్పం.
అయితే, ఈ కొత్త కార్పొరేషన్ పని ఏపీలో మొదలు అయ్యేనాటికి ఇక్కడ నెలకొన్న పరిస్థితులు పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నాయి.
రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల నిబద్ధత
ఏపీలో పదేళ్ళ విరామం తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.
అది ఉమ్మడి రాజధాని ప్రొవిజన్ మాకు వద్దని అకస్మాత్తుగా దాన్ని బెజవాడకు మార్చింది.
ఢిల్లీలో రాష్ట్ర విభజన నిర్ణయంతో సంబంధం లేని ఎన్డీఏ ప్రభుత్వంలో అనుభవం ఉన్న పాత వాజ్‌పేయి క్యాబినెట్ ప్రాతినిధ్యం కూడా నామమాత్రం అయింది.
పైగా భారత ప్రభుత్వం 49 శాతం అయితే, ప్రైవేట్ సెక్టార్ 51 శాతం షేర్ హోల్డింగ్ భాగస్వామ్యంతో అమలుకు జరిగిన ఒప్పందాన్ని, దానితో తొలి నుంచి ఎటువంటి ఆర్గానిక్ కనెక్ట్ లేని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సి వచ్చింది.
విభజిత ఏపీలో ఏర్పడిన తొలి టీడీపీ ప్రభుత్వం దీన్ని ఎలా అమలు చేసింది, దానిపై భారత ప్రభుత్వం ఫైండింగ్స్ ఏమిటి అనేది స్కిల్ స్కామ్ కేసు తర్వాత కూడా కేంద్రం అధికారికంగా వెల్లడించక పోవడం చూసినప్పుడు, ఈ విషయంలో దానికున్న నిబద్ధత కూడా మనకు అర్థం అవుతుంది.
అదలా ఉంటే గంతకు తగిన బొంత అన్నట్టుగా, ఇక్కడి మీడియా ఇదేదో ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న పల్నాటి యుద్ధం అన్నట్టుగా, జనం బుర్రల్ని అది తమ చేతుల్లోకి తీసుకుని, ప్రజలకు బుర్రకథ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
