ప్రధాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సుమారు 600 జిల్లాల్లో సర్వే నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు 250 జిల్లాల్లో 25 శాతానికి పైగా(15-29) మధ్య వయస్సులో ఉన్న యువత ఎలాంటి ఉత్పత్తి పనిలో లేదా విద్యాభ్యాసం కొనసాగింపులో, పని కోసం శిక్షణలో నిమగ్నమై లేరని, 2025 కోసం జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలియజేసింది.
స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 18న విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మూడింట రెండు వంతుల జిల్లాల్లో పావు వంతు యువ జనాభాను నీట్(నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్)గా వర్గీకరించారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం, తెలంగాణలోని సగం జిల్లాల్లో 25 శాతం యువ జనాభాను నీట్(నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్)గా వర్గీకరించారు.
ప్రధాన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 600 జిల్లాలలో ఉన్న పరిస్థితులను మంత్రిత్వ శాఖ నివేదిక పరిగణనలోకి తీసుకుంది, కొన్ని సందర్భాల్లో సరిహద్దు జిల్లాలను కూడా కలుపుకొని వాటిని ఒకే యూనిట్‌గా పరిగణించింది.
సర్వే ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్, రాజ్‌నంద్‌గావ్, ఉత్తర్ బస్తర్ కంకర్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఛాంబా, కేరళలోని ఎర్నాకులం, మధ్యప్రదేశ్‌లోని మాండ్లాతో సహా 25 జిల్లాల్లో నీట్ 10 శాతం కంటే తక్కువగా ఉంది.
ఒడిశాలోని నబారంగ్పూర్లో నీట్ అతి తక్కువగా సగటున 4.1 శాతం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
నీట్ పరిధిలోకి ఎవరెవరు వస్తారు?
ఏ విద్యా సంస్థలో నమోదు లేనివారు, శ్రమ శక్తి నుంచి పూర్తిగా వైదొలగిన వారు దీని కిందికి వస్తారు. మహిళల విషయంలో వేతన చెల్లింపు లేని గృహ పనులు, బాగోగులు చూసుకోవడం లేదా తమకు తగ్గట్టుగా పని అందుబాటులో లేకపోవడంతో పని కోసం వెతకడం మానేసిన వారు కూడా ఇందులో ఉంటారు.
మరికొన్ని సందర్భాల్లో పరీక్షలకు సిద్ధం అవుతున్న వారితో పాటు ఖాళీగా గడిపే వారు నీట్ పరిధిలోకి వస్తారు.
మొత్తం జిల్లాల్లో చేసిన సర్వే రికార్డులో నాలుగింట మూడు వంతుల జిల్లాల్లో 25 శాతానికి మించి యువ మహిళలు సగటు నీట్లో ఉన్నారు.
వీరు వేతనాలు లేని గృహ పనుల భారాన్ని, సామాజిక అంచనాలను మోస్తున్నారు.
నీతి ఆయోగ్, ఇతర నివేదికల వెల్లడి
దేశంలో సుమారు 8.7 కోట్ల మంది 15 నుంచి 29 మధ్య వయస్సు గల యువకులు చదవడం లేదని, పని చేయడం లేదని లేదా శిక్షణ పొందడం లేదని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.
“రీ ఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047” టైటిల్‌తో ఉన్న ఈ నివేదికను 2021లో నిర్వహించిన 78వ నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా రూపొందించారు.
అయితే ఈ ప్రజలను నిరుద్యోగులుగా పిలవరాదని తర్వాత కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
కాగా సుమారు 40 శాతం 15-25 వయస్సులో ఉన్న యువకులు నిరుద్యోగులుగా ఉన్నట్లు 2026 మార్చిలో “స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026” పేరుతో అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక తెలియజేసింది.
గ్రాడ్యుయేట్లలో కేవలం 7 శాతం మంది మాత్రమే సంవత్సరం లోపు శాశ్వత వేతనంతో కూడుకున్న ఉపాధిని కనుగొనడం జరుగుతుందని కూడా ఈ నివేదిక పేర్కొంది.
అనువాదం: గంట రాజు,సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
