ఆయన సమర్థించిన భారతదేశ భావన— అది మరేదో కాదు, “భారత రాజ్యాంగం ప్రతిపాదించిన భారతదేశమే” అని ఆయన పదేపదే నొక్కిచెప్పారు. ఆ భారతదేశం కోసం పోరాడాల్సిన బాధ్యత ఇప్పటికీ మనదే.
మూడు సంవత్సరాల క్రితం ఒక రికార్డర్ ప్రశ్నల జాబితా చేతిలో పట్టుకుని భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిని తొలిసారి ఇంటర్వ్యూ చేయబోతున్న యువ జర్నలిస్టుగా కొంత ఆందోళనతో కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఎదురుగా కూర్చున్నాను.
ఆయన నుంచి నాకు లభించింది కేవలం సమాధానాలు మాత్రమే కాదు —ఒక రాజకీయ పాఠశాల.
భారతదేశ రాజకీయ చరిత్రలోని వందేళ్ల ప్రయాణాన్ని ఒకే మధ్యాహ్నంలో ఆయన నా ముందుంచారు. ఒక ఉపాధ్యాయుడి ఆప్యాయతతో, ఒక పండితుడి కచ్చితత్వంతో ఆయన మాట్లాడారు.
నేడు ఆయన మరణించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంభాషణ ఒక ఇంటర్వ్యూలా అనిపించడం లేదు. ఆయన మన కోసం వదిలివెళ్లిన విలువైన కానుకలా అనిపిస్తోంది.
ఐదు దశాబ్దాల పాటు ఆయన నడిచిన మార్గంలో ఇంకా ప్రయాణిస్తున్న మనలాంటి వారికి అది ఒక దిక్సూచిలా నిలిచింది.
స్వాతంత్ర్య భారత స్వభావంపై మూడు దృక్పథాలు
ఆయన ఎప్పుడూ ఎక్కడి నుంచి ప్రారంభించేవారో అక్కడి నుంచే ప్రారంభించారు —చరిత్రతో.
భారత రాజకీయ వ్యవస్థ మితవాదం వైపు మళ్లిందాని నేను ఆయనను అడిగాను. అందుకు సమాధానాన్ని ఆయన ఏకంగా ఒక శతాబ్దం వెనక్కి తీసుకెళ్లారు.
స్వతంత్ర భారతదేశ స్వభావం ఎలా ఉండాలి? అన్నదే అసలు ప్రశ్న. దీనిపై మూడు భిన్నమైన దృక్పథాలు ముందుకొచ్చాయని ఆయన అన్నారు.
ఆ మూడు దృక్పథాల గురించి ఆయన నాకు వివరంగా వివరిస్తూ వెళ్లారు.
కాంగ్రెస్ ప్రతిపాదించిన లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం ఒక దృక్పథం. రాజకీయ స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోదని అది సామ్యవాదం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం వైపు పయనించాలని కమ్యూనిస్టులు పట్టుబట్టినది రెండో దృక్పథం.
ఇక మూడో దృక్పథం ఏమిటంటే— స్వతంత్ర భారతదేశ స్వభావాన్ని దాని ప్రజల మతపరమైన అనుబంధమే నిర్ణయిస్తుందన్న వాదన.
ఆ మూడో దృక్పథం నుంచే కవల సోదరులు పుట్టారని ఆయన నాకు గుర్తుచేశారు.
ఒకటి—రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రతిపాదించిన హిందూ రాష్ట్రం అయితే మరొకటి—జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ ప్రతిపాదించిన ఇస్లామిక్ రిపబ్లిక్.
జాతీయోద్యమం, మితవాద శక్తులు..జాతీయోద్యమం ఆ మూడో దృక్పథాన్ని తిరస్కరించింది. ఆ తిరస్కరణపై నెలకొన్న ఆగ్రహమే ఆయన తనకు అలవాటు ప్రకారం ముక్కు సూటిగా చెప్పినట్లు “మహాత్మా గాంధీ హత్యకు దారితీసింది.”
“ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని విధించింది మరెవరో కాదు ఈరోజు వారు తమ హీరోగా చెప్పుకుంటున్న సర్దార్ పటేల్” అని ఆయన గుర్తుచేశారు.
దీంతో ఆ ప్రమాదం తొలగిపోయిందని చాలామంది భావించారు. కానీ అదే పెద్ద పొరపాటని కామ్రేడ్ ఏచూరి అన్నారు.
అప్పటి నుంచి నేటి వరకు ఈ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని హిందుత్వ రాష్ట్రంగా మార్చే ప్రయత్నమే కొనసాగుతోంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పోరాటం అదే.
భారతదేశంలో చోటుచేసుకుంటున్న ఈ రాజకీయ మళ్లింపును ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో ముడిపెట్టి వివరించారు.
“ప్రపంచవ్యాప్తంగా మితవాద రాజకీయాల వైపు జరుగుతున్న మళ్లింపు నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితమే” అని ఆయన వివరించారు.
లాభాలు పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చివరికి మొత్తం వ్యవస్థకే ముప్పుగా మారుతుంది.
అప్పుడు పాలకవర్గాలు భావోద్వేగ ఉద్రేకాలను రెచ్చగొట్టడం ద్వారా దానికి ప్రతిస్పందిస్తాయని ఆయన చెప్పారు.
ఎక్కడో అది జాత్యహంకారం(రేసిజం), మరెక్కడో వలసవాద వ్యతిరేకత లేదా విదేశీయులపై ద్వేషభావం(జెనోఫోబియా). మన దేశంలో మాత్రం అది మతతత్వం.
రాజ్యాంగ పునాదులపై దాడులు
అయితే “భారతదేశానికి అదనంగా మరో అంశం కూడా ఉంది” అని ఆయన ప్రత్యేకంగా నొక్కిచెప్పారు.
“అది భారతదేశ ఆత్మపై శతాబ్ద కాలంగా కొనసాగుతున్న అంతర్గత పోరాటం. ఆ పోరాటంలో మన రాజ్యాంగానికి పునాదిగా ఉన్న ప్రతి ఒక్క స్తంభంపైనా దాడి జరుగుతోంది” అని ఆయన అన్నారు.
లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ—ఈ నాలుగు పునాది స్తంభాలూ దాడికి గురవుతున్నాయి. ఈ నాలుగింటినీ దెబ్బతీస్తున్నారు.
ఇది ఎటు దారితీస్తుందని, సంస్థలపై జరుగుతున్న ఈ దాడులు ఎప్పటికైనా ఆగుతాయా అని నేను ఆయనను అడిగినప్పుడు ఆయన ఏమాత్రం తడబడలేదు.
అలాగే ఏదో అస్పష్టమైన సిద్ధాంతపరమైన సమాధానంతో తప్పించుకోలేదు.
“ఆ ప్రశ్నకు సమాధానం ప్రజల చేతుల్లోనే ఉంది” అని ఆయన అన్నారు.
భారతదేశాన్ని ఫాసిస్టు స్వభావం గల హిందుత్వ రాష్ట్రం వైపు నడిపిస్తున్న ఈ మితవాద మళ్లింపును అడ్డుకోవడానికి ప్రజల ప్రతిఘటన ఎంత బలంగా ఉంటుంది అన్నదే అసలు విషయం.
ఆయనకు రాజకీయాలు ఎప్పుడూ అధికార కేంద్రాల చుట్టూ తిరిగే వ్యవహారం కాదు. “ప్రభుత్వంపై నియంత్రణ నుంచి వారిని తప్పించడమే కీలకమైన విషయం. ఇవన్నీ చేయడానికి వారు వినియోగిస్తున్నది ప్రభుత్వంపై ఉన్న నియంత్రణే” అని ఆయన అన్నారు.
అయితే అంతటితో ప్రమాదం తొలగిపోదని ఆయన హెచ్చరించారు. “ప్రభుత్వంపై నియంత్రణ లేకపోయినా వారు ఆ విషపూరితమైన మనస్తత్వాన్ని సమాజంలో సృష్టిస్తున్నారు” అని ఆయన అన్నారు.
వామపక్షాల పోరాటాలు, సాధించిన హక్కులు
నేను ఆయనను మరింత కఠినమైన ఒక ప్రశ్నపై నిలదీశాను. తరతరాలుగా యువ వామపక్షవాదులను వేధిస్తున్న ప్రశ్న అది. కమ్యూనిస్టు పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండూ దాదాపు ఒకే కాలంలో ఆవిర్భవించాయి.
ప్రజలు ఇప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా జీవిస్తున్నారు. అలాంటప్పుడు కమ్యూనిస్టు దృక్పథం ఎందుకు వెనుకబడుతుండగా, ఫాసిస్టు దృక్పథం ఎందుకు పుంజుకుంది?
ఆ ప్రశ్నలోనే ఉన్న నా ప్రాథమిక భావనను ఆయన సమాధానం పూర్తిగా పక్కనపెట్టింది.
ఇది విఫలమయ్యారనే ప్రశ్నే కాదు. ఈ మొత్తం శతాబ్ద కాలంలో చాలా వరకు వామ పక్షాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేశారు.
ప్రభుత్వ రంగం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల హక్కులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కార్మిక సంఘాల హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని ప్రగతిశీల చర్యలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇవన్నీ కమ్యూనిస్టు భావజాలం చూపిన ప్రభావం నుంచే వచ్చాయి.
భూ సంస్కరణలు ప్రభుత్వ విధానాల అజెండాలోకి వచ్చిందీ తెలంగాణ వంటి వామపక్ష నాయకత్వంలోని పోరాటాల కారణంగానే అని ఆయన గుర్తుచేశారు.
అలాగే కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలో వామపక్షం సాగించిన ఉద్యమాల కారణంగానే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశం ముందుకొచ్చిందని ఆయన అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార హక్కు— ఇవన్నీ కూడా వామపక్షం ముందుకు తీసుకొచ్చిన హక్కుల పోరాటాల ఫలితాలేనని ఆయన వివరించారు.
మనం సాధించేందుకు పోరాడిన ఈ హక్కులన్నీ—కులవివక్ష, మతతత్వం, పితృస్వామ్యం వంటి ప్రతికూల శక్తులతో కూడిన ఈ సామాజిక వ్యవస్థను ఎదుర్కొని, దానిపై పోరాడేందుకు ఉపయోగపడే సాధనాలే.
“మన పోరాటం మరింత కఠినమైనద”ని ఆయన వివరించారు.
వాళ్లు ఎదుగుతున్నది దోపిడీకి సంబంధించిన ఈ లక్షణాలన్నింటికీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి. మనం మాత్రం సమాజంలో పాతుకుపోయిన నిర్మాణాలనే సవాలు చేస్తూ పోరాడుతున్నాం.
హిందుత్వ మనువాదాన్ని సమర్థిస్తుందని, కుల అణచివేతతో పాటు లింగ వివక్ష, అణచివేతకు కూడా అతిపెద్ద సమర్థకమని ఆయన అన్నారు. అంతేకాక అది మతపరమైన ద్వేషానికి కూడా తావిస్తుంది అని వివరించారు.
వారు స్వార్థ ప్రయోజనాలను కాపాడే శక్తులతో కలిసి ముందుకు సాగుతారు. మనం మాత్రం ఆ శక్తులనే సవాలు చేస్తూ పోరాడుతాం.
యువత భవితవ్యంపై ఆవేదన
యువత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనలోని ఆవేదన ఎంత స్పష్టంగా కనిపించేదో అంతే స్పష్టంగా ఆయనలోని ఉద్వేగం కూడా కనిపించేది.
ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశం మనది. కానీ అత్యధిక నిరుద్యోగం, అత్యధిక పేదరికం ఉన్న దేశాల్లో కూడా మనదే ప్రథమ స్థానం. అంటే మన దేశంలో మన యువత సామర్థ్యాన్ని వృథా చేస్తున్నాం.
భారతదేశం తన జనాభా పరమైన ప్రయోజనాన్ని కోల్పోతుందా అని నేను అడిగినప్పుడు ఆయన వెంటనే నా ప్రశ్నను సరిదిద్దారు.
“ఇది కేవలం ఒక అవకాశాన్ని కోల్పోవడం మాత్రమే కాదు. మీరు బస్సును మిస్ చేసుకోవడం గురించి మాట్లాడటం లేదు—మన యువతను వృథా చేస్తున్నారు. వాస్తవానికి మన దేశ సామర్థ్యాన్నే నాశనం చేస్తున్నారు.”
అయితే దీనికి పరిష్కారం “మన కళ్ల ముందే ఉంది” అని ఆయన అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాలు కలిగి ఉన్న సంపన్నులు తీసుకున్న రూ 11 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడానికి బదులుగా “ఆ మొత్తంతో గ్రామీణ రహదారులు నిర్మించవచ్చు, తాగునీటి బావులు తవ్వించవచ్చు, సాగునీటి కాలువలు నిర్మించవచ్చ”ని ఆయన వివరించారు.
కోట్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు. యువతకు ఆదాయం రావడం మొదలై వారు ఖర్చు చేయడం ప్రారంభించినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది.
యువతకు ఆయన ఇచ్చిన సందేశం ఒక పిలుపులా ఉంది.
“రండి, సంఘటితం కండి. సంపన్నులకు రాయితీలు ఇవ్వడం ఆపి, ఆ డబ్బును ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా మన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి వినియోగించేలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, ఒత్తిడి తీసుకువద్దాం. ఈ విధానాలను ప్రభుత్వం అమలు చేసేలా చేయడానికి మనం ఒక శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించాలి.”
అడ్డంకుల గురించి ఆయనకు ఎలాంటి భ్రమలూ లేవు.
మతపరమైన ధ్రువీకరణను రెచ్చగొట్టడం ద్వారా వారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి చూస్తారు. కాబట్టి ఒక స్థాయిలో మనం ఎదుర్కోవాల్సిన పోరాటం ఇదే.
అయితే ఈ పోరాటంలో మనం తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఎందుకంటే— మనం ఆ దిశగా వెళ్తున్నామా లేదా అన్న మీ ప్రశ్నకు సమాధానం ప్రజలే నిర్ణయించాలి. ఇక్కడే మనందరి పాత్ర ముందుకు వస్తుంది—భారతదేశాన్ని, అలాగే మనం భావించే భారతదేశ భావనను నాశనం చేయకుండా అడ్డుకునేందుకు ప్రజలను సమీకరించడం.
సామ్రాజ్యవాదం, మితవాద శక్తుల బంధం
ప్రపంచ రాజకీయాల విషయానికి వచ్చినా ఆయన విశ్లేషణలో అదే స్పష్టత కనిపించింది. “ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న ప్రయత్నంలో భాగం”గా ఆయన అభివర్ణించారు.
మోదీ గురించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని సూటిగానే వ్యక్తం చేశారు. “గత తొమ్మిదేళ్లలో మోదీ భారతదేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి ఒక అధీన మిత్రదేశంగా మార్చేశారు” అని అన్నారు.
ఆయన దృష్టిలో ఈ వ్యవహారం ఒక పరస్పర ప్రయోజనాల ఒప్పందంలా ఉంది- అయితే దాని ఫలితం అత్యంత ప్రమాదకరమైనదని ఆయన భావించారు.
“నేను నీకు నీ లాభాలను అందిస్తాను. ప్రపంచవ్యాప్తంగా నీ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సహకరిస్తాను. దానికి బదులుగా నా ఫాసిస్టు ప్రాజెక్టును నువ్వు నాకు అమలు చేసుకునే అవకాశం ఇవ్వాలి.”
అంటే ఏచూరి విశ్లేషణలో ఆర్థిక ప్రయోజనాలు, ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు, దేశీయ హిందుత్వ రాజకీయ ప్రాజెక్టు— ఈ మూడింటి మధ్య పరస్పర సంబంధం ఉంది. భారత విదేశాంగ విధానంలో స్వతంత్రత తగ్గి అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలతో సన్నిహిత సంబంధం పెరుగుతోందని ఆయన గతంలోనూ విమర్శించారు.
ఆశ, ఆచరణల కలయిక
భారతదేశ శ్రామిక ప్రజలకు తాను ఎలాంటి ఆశను అందించగలనని నేను అడగడంతో ఆ ఇంటర్వ్యూను ముగించాను.
ఆయన ఇచ్చిన సమాధానం అప్పటి నుంచి ప్రతిరోజూ నా మనసులో నిలిచిపోయింది:
ఆశ మాత్రమే కాదు, బలమైన అవకాశం కూడా ఉంది. ఇవన్నీ జరుగుతున్నది వారికి ప్రభుత్వ అధికారంపై నియంత్రణ ఉండటం వల్లే. వారు ప్రభుత్వంలో ఉండటం వల్లే. ఒకసారి వారిని ప్రభుత్వం నుంచి తప్పిస్తే, పరిస్థితులు తిరిగి మారడం మీరు చూస్తారు. ప్రస్తుతం మనం చేయాల్సిన లక్ష్యం అదే.
ఆయన మరణించి రెండేళ్లు గడిచిన తర్వాత ఆ మాటలు ఆయన చివరి వీడ్కోలు సందేశంలా అనిపిస్తున్నాయి.
కామ్రేడ్ ఏచూరి తన జీవితమంతా ఒక విషయాన్ని నిరూపిస్తూ గడిపారు— రాజకీయాలు సూత్రబద్ధంగా ఉండవచ్చని, మేధస్సు ప్రజల సేవకు ఉపయోగపడవచ్చని, ఆశ అనేది కేవలం భావోద్వేగం కాకుండా ఒక క్రమశిక్షణతో కూడిన ఆచరణగా ఉండవచ్చని.
రాజ్యాంగం కేవలం కాగితంపై రాసిన అక్షరాలు కాకుండా, ప్రజల జీవితాల్లో ఆచరణలో కనిపించే విలువగా ఉండే భారతదేశం కోసం ఆయన పోరాడారు.
రాజకీయంగా లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం. సామాజికంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం—రాజ్యాంగ పీఠిక కోరినట్టుగా “అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం” లభించే భారతదేశం కోసం ఆయన పోరాడారు.
ఆయన మన మధ్య లేరు. కానీ ఆయన సమర్థించిన “భారతదేశ భావన”—అది మరేదో కాదు భారత రాజ్యాంగం ప్రతిపాదించిన భారతదేశమే అని ఆయన పదేపదే నొక్కిచెప్పిన ఆ భావన—ఇప్పటికీ మనమంతా కాపాడుకోవాల్సినది, దాని కోసం పోరాడాల్సినదే.
ఆయన మనకు వదిలివెళ్లిన ప్రశ్న ఒక్కటే. అనేక పోరాటాల్లో, వందలాది సందర్భాల్లో ఆయన తన కార్యాచరణ ద్వారా దానికి సమాధానం చెప్పిన ప్రశ్న:
ప్రజలు ప్రతిఘటిస్తారా?
కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఇవ్వగలిగే అత్యుత్తమ నివాళి ఈ వ్యాసం కాదు. ఆయన మనకు వదిలిన ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానమే నిజమైన నివాళి.
రెడ్ సెల్యూట్ కామ్రేడ్.
ఇర్ఫాన్ గుల్, యూత్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రొవిన్షియల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
