ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎస్ఐఆర్ కింద ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది.
ఆమె దేశ రాజధానిలో చట్టబద్ధమైన ఓటరునని నిరూపించుకోవడానికి గాను తన పూర్వీకుల పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి వచ్చింది.
ఇంతకు ముందు మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ ఉన్నత అధికారిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
నోటీసులు అందుకున్న రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు.
ఎన్నికల అధికారుల స్పందన, సందేహాలు
సెప్టెంబర్ 19, శనివారం రేఖా గుప్తాకు నోటీసు జారీ అయిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఎన్నికల అధికారులు స్పందించారు. ఆమె పత్రాలను పరిశీలించి ధ్రువీకరించామని, ఢిల్లీ తుది ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చేందుకు ఆమోదించామని తెలియజేశారు. అయితే, లక్షలాది మంది సాధారణ ఢిల్లీ ఓటర్లకు కూడా ఎన్నికల సంఘం అదే విధంగా స్పందిస్తుందా? ముఖ్యమంత్రి విషయంలో మాత్రమే అనుసరించిందా? అనే సందేహం వస్తుంది.
వెలుగులోకి తెచ్చిన ఫాక్ట్ ఫైండర్
ఢిల్లీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసినట్లు నిజ నిర్ధారణ చేసే వ్యక్తి(ఫాక్ట్ ఫైండర్), ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ఈ విషయాన్ని గుర్తించి వెలుగులోకి తెచ్చాడు.
ఢిల్లీలోని మొత్తం 97.5 లక్షల ఓటర్లలో సుమారు 33 లక్షల మంది ఓటర్లకి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తున్నది.
ముఖ్యమంత్రి పేరు కూడా నోటీసుల జాబితాలో కనిపించింది.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో “షాలిమార్ బాగ్” నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రేఖా గుప్తా, ఎన్నికల అఫిడవిట్లో అదే నియోజకవర్గంలోని ఏపీ బ్లాక్ ప్రాంతాన్ని తన నివాస చిరునామాగా పేర్కొన్నారు.
వయసు వ్యత్యాసమే కారణమా?
ఆ ప్రాంతంలో నోటీసులు ఇవ్వవలసిన వ్యక్తుల జాబితాను పరిశీలించగా, షాలిమార్ బాగ్ నియోజకవర్గంలోని పార్ట్ నంబర్ 123లో నివసిస్తున్న 51 ఏళ్ల “రేఖా గుప్తా” పేరు కనిపించింది.
ఏపీ బ్లాక్‌లోని మరి కొన్ని ప్రాంతాలు కూడా ఈ పోలింగ్ పరిధిలోకి వస్తాయి.
ఆమె వయస్సు తన తల్లిదండ్రుల్లో ఒకరి లేదా ఇద్దరి వయసు కంటే కనీసం 15 సంవత్సరాల వ్యత్యాసం లేదని గుర్తించిన కారణంగా ఆమెకు నోటీసు ఇచ్చినట్లు తెలుస్తున్నది.
ఎన్నికల అధికారి ఓటరు పరిశీలన పోర్టల్‌లో ఎపిక్ నంబర్‌ను వెతకగా, ఆమె పేరు మనీష్ గుప్తా అనే బంధువుతో అనుసంధానమై ఉన్నట్లు కనిపించింది.
ముఖ్యమంత్రి రేఖా గుప్తా భర్త పేరు కూడా మనీష్ గుప్తానే. రేఖా గుప్తా 1974 జూలై 19న జన్మించారు.
ఢిల్లీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఆమె వయస్సు 51 సంవత్సరాలు.
అధికారుల వివరణ, ధ్రువీకరణ
షాలిమార్ బాగ్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్ఓ) ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రేఖా గుప్తా తన ఎన్యూమరేషన్ ఫారమ్‌లో ఇచ్చిన వివరాల్లో ‘పొంతన లేకపోవడం’ (లాజికల్ డిస్క్రిపెన్సీ) గుర్తించి ఆమెకు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.
బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ) క్షేత్రస్థాయిలో పరిశీలించి, తర్వాత రేఖా గుప్తా వివరాలను ధ్రువీకరించుకొని, నవంబర్ 4న ప్రచురించబోయే నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చేందుకు ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.
“అర్హులైన ఏ పౌరుడిని ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా, అనర్హులైన ఏ వ్యక్తిని జాబితాలో చేరకుండా చూసే ప్రక్రియలో ఎన్నికల సంఘం తన నిబద్ధతను పాటిస్తుంది” అని ఈఆర్ఓ పేర్కొన్నారు.
నోటీసులకు ప్రధాన కారణాలు
రెండు కారణాలతో ఎస్ఐఆర్ కింద ఓటర్లు నోటీసులు అందుకుంటున్నారు.
1) గతంలో ఉన్న ఓటర్ల జాబితాతో(2002) వారి వివరాలతో సరిపోకపోవడం.
2) వారిచ్చిన సమాచారం పొంతన లేకుండా ఉన్నట్లు గుర్తించడం. నోటీసులు అందుకున్న వ్యక్తులు, ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించాలి. ఆ పత్రాలతో అధికారులు సంతృప్తి చెందితే, వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో కొనసాగిస్తారు.
వివరాలు వెల్లడించాలని డిమాండ్
ఈఆర్ఓ ఇచ్చిన వివరణను జుబైర్ స్వాగతిస్తూ, ముఖ్యమంత్రికి ఎప్పుడు నోటీసు జారీ చేశారు?
ఆమె పత్రాలను ఎప్పుడు ధ్రువీకరించారు? ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చడానికి ఎప్పుడు ఆమోదం తెలిపారు?
అనే వివరాలను కూడా వెల్లడించాలని జుబైర్ డిమాండ్ చేశారు. “ఈ కేసును మాత్రమే అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించారా?” అని ఆయన ఎక్స్ వేదికలో ప్రశ్నించారు.
కేజ్రీవాల్, కపిల్ సిబల్‌కు సైతం నోటీసులు
“సుమారు 33 లక్షల మంది సాధారణ ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసులు అందాయి. వారి విషయంలోనూ ఇదే అత్యవసర ప్రాతిపదికన, అదే ధ్రువీకరణ ప్రక్రియతో, అలాంటి విధానపరమైన ప్రమాణాలను పాటిస్తారా?” అని ప్రశ్నించారు.
నోటీసులు అందుకున్న వారిలో అరవింద్ కేజ్రీవాల్, కపిల్ సిబల్ కూడా ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఎస్ఐఆర్ కింద నోటీసు జారీ అయిందని, ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురికి కూడా నోటీసులు అందాయని ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబైర్ వెల్లడించారు.
2002 నాటి ఓటర్ల జాబితాతో వారి వివరాలు సరిపోకపోవడమే ఇందుకు కారణంగా నోటీసులో పేర్కొన్నారు.
ఆప్ నేతల ఆగ్రహం
న్యూఢిల్లీ నియోజకవర్గంలోని పార్ట్ నంబర్ 51లో ఓటర్లుగా నమోదైన కేజ్రీవాల్, ఆయన భార్య సునీత, తల్లి గీతా దేవి, తండ్రి గోవింద్ రామ్, కుమారుడు పుల్కిత్ పేర్లు, 2002 ఓటర్ల జాబితాతో సరిపోని కారణంగా నోటీసులు జారీ అయినట్లు చూపించారు.
రేఖా గుప్తా విషయంలో జరిగిన దానికి భిన్నంగా, కేజ్రీవాల్ నియోజకవర్గానికి చెందిన ఈఆర్ఓ ఒక ప్రకటన విడుదల చేశారు.
వారి పత్రాలను పరిశీలించి ధ్రువీకరించలేదని, తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లను చేర్చడానికి ఆమోదం ఇంకా తెలపలేదని పేర్కొన్నారు.
“ఈ దేశంలో అగ్ర నాయకుడిని(సర్వోన్నత ప్రభువును) సంతోష పెట్టడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయా?” అని ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది.
అసంబద్ధతపై న్యాయవాదుల విమర్శలు
పాలనలో పారదర్శకత ఉండాలనే న్యాయవాది అంజలి భరద్వాజ్ ఎక్స్ వేదికపై స్పందిస్తూ, రేఖా గుప్తా, అరవింద్ కేజ్రీవాల్‌లకు నోటీసులు జారీ కావడం “ఎస్ఐఆర్ ఎంత అసంబద్ధంగా మారిందో చూపిస్తోంది” అని అన్నారు.
“వారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. కానీ, నేడు వారు ఓటర్లుగా ఉండటానికి అర్హులా కాదా అనే ప్రశ్న తలెత్తింది” అని అన్నారు.
“ఢిల్లీలో ఎస్ఐఆర్ కింద నోటీసులు జారీ చేస్తున్న ఓటర్ల జాబితాను ఈసీఐ ఎందుకు ప్రచురించడం లేదో ఇప్పుడు అర్థమవుతోందా?” అని ఆమె ప్రశ్నించారు.
ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 31న ప్రచురించినప్పటికీ, నోటీసులు జారీ అవుతున్న వారి జాబితా 18 రోజుల తర్వాత వెలువడిందనే వాస్తవాన్ని ఆమె ప్రస్తావించారు.
స్వతంత్ర ఎంపీ కపిల్ సిబాల్‌కు నోటీసు
దేశ రాజధాని ఢిల్లీలో స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌కు కూడా నోటీసు జారీ అయినట్లు జుబైర్ గుర్తించారు.
న్యూఢిల్లీ నియోజకవర్గంలోని పార్ట్ నంబర్ 40కు సంబంధించి, 2002 ఓటర్ల జాబితాతో సరిపోని వ్యక్తిగా కపిల్ సిబాల్ పేరును గుర్తించారు.
లోపభూయిష్టంగా సవరణల ప్రక్రియ
ఎస్ఐఆర్ మూడో దశలో సవరణలు చేపట్టిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది.
ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్ల జాబితాతో పోలిస్తే, ముసాయిదా జాబితాలో చోటు లేని వారి శాతం ఢిల్లీలో సుమారు 33 శాతంగా ఉంది.
ఈ వాస్తవాలు ఎస్ఐఆర్ అసలు ఉద్దేశాన్ని, దానిలోని లోపభూయిష్ట విధానాన్ని తెలియజేస్తున్నాయి.
(ది వైర్ ఇంగ్లీష్‌లో ప్రచురితమైన వ్యాసానికి తెలుగు అనువాదం: జే నాగేశ్వర రావు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
