భారత రాజ్యాంగానికి, భారత జాతీయవాదానికి ప్రాధాన్యతనిచ్చి – కేవలం ఆర్ఎస్ఎస్నే కాకుండా విరాళాలు స్వీకరించి భారీగా ఖర్చు చేసే అలాంటి అన్ని సంస్థలను రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
దేశం అన్ని మతాల ప్రజలకు చెందుతుందని ‘జాతిపిత’ మహాత్మా గాంధీ భావించినందున, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షణ పొందిన ప్రచారక్ నాథూరామ్ గాడ్సే ఆయన సన్నని ఛాతీలోకి మూడు తూటాలు దించాడు. ఆ తరువాత గాడ్సే, అతని మాతృ సంస్థలైన ఆర్ఎస్ఎస్-హిందూ మహాసభ దేశం కేవలం హిందువులదేనని వాదించాయి.
భారత జాతీయ ఉద్యమానికి, గాంధీకి వ్యతిరేకంగా విద్వేష ప్రచారం వ్యాప్తి చెంది, ఆయన అతి సమీపం నుంచి హత్యకు గురయ్యారు.
దీని కారణంగా ఉప ప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారు.
1948లో సంఘ్‌ను నిషేధించిన తర్వాత, “వారి ప్రసంగాలన్నీ మత విద్వేష విషంతో నిండి ఉన్నాయి” అని ఆయన రాశారు.
ఈ విషం తుది ఫలితంగా “దేశం గాంధీజీ అమూల్యమైన జీవిత త్యాగాన్ని భరించవలసి వచ్చింది” అని వ్యాఖ్యానించారు.
సంస్కృతి ముసుగులో ‘రాజకీయ అతీత’ సంస్థ..
ఆర్ఎస్ఎస్కు ఒక లిఖిత రాజ్యాంగం ఉంటుందని, కేవలం ఒక సాంస్కృతిక సంస్థగా మాత్రమే పనిచేస్తుందని హామీ ఇచ్చిన తర్వాతనే దానిపై నిషేధాన్ని ఎత్తివేశారు.
వాస్తవానికి, ఆర్ఎస్ఎస్ సంస్కృతి ముసుగులో ఒక “రాజకీయ అతీత” సంస్థగా మారింది. అది అప్పటికే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌ను(ఏబీవీపీ) స్థాపించింది.
ఆ తర్వాత ప్రస్తుతం కేంద్రంలోనూ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదా బీజేపీకి పూర్వగామి అయిన భారతీయ జనసంఘ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది.
దసరా పండుగ రోజున వసూలు చేసే ‘గురుదక్షిణ’ డబ్బుతోనే తమ కార్యకలాపాలు నడుస్తున్నాయని ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది.
ఆదాయపు పన్ను ట్రిబ్యునల్ ఈ ఆదాయ వనరుకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది.
అయినప్పటికీ, ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలకు అపరిమితంగా డబ్బు ఖర్చు చేస్తూ ప్రభుత్వ భూముల్లో కూడా శాఖలను నడుపుతోంది. దాని “రూట్ మార్చ్”లకు అయ్యే ఖర్చులను బయటపెట్టడం లేదు.
ప్రభుత్వ పర్యవేక్షణకు అతీతంగా భారీ వ్యయాలు..
ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం విలువ రూ 100 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ భారీ వ్యయాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణకు అతీతంగా ఉన్నాయి.
ఈ ‘సాంస్కృతిక సంస్థ ముసుగు’ను ప్రభుత్వం, ప్రజలు యథాతథంగా అంగీకరించారు. అది లక్షలాది శాఖలకు, లక్షలాది స్వయంసేవకులకు ఉత్సాహంగా విస్తరిస్తూ వస్తోంది.
నెహ్రూ ఆర్ఎస్ఎస్ స్వరూపాన్ని చాలా ముందుగానే అర్థం చేసుకున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారత జాతీయ కాంగ్రెస్‌తో(ఐఎన్‌సీ) సహా ఏ రాజకీయ పార్టీ కూడా “ఈ సంస్థ రాష్ట్ర చట్టాలను, నైతికతను విస్మరించి ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతోంది?” వంటి విషయాలపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదు.
కానీ ఆలస్యంగానైనా పర్వాలేదు, గత కొన్ని సంవత్సరాలుగా ఐఎన్‌సీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్పై తార్కిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వాళ్లే చంపారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి గాను ఆయన ఒక చట్టపరమైన కేసును ఎదుర్కొంటున్నారు.
సంస్థ కార్యకలాపాల వివరాలను కోరిన కర్ణాటక హోంమంత్రి..
ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనే క్రమంలో ఇప్పుడు కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఆర్ఎస్ఎస్ను రిజిస్టర్ చేయించుకుని భారత ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని కోరారు.
మోహన్ భగవత్‌కు రాసిన లేఖలో (2026 జూన్ 13న), ఖర్గే ఆ సంస్థ చట్టపరమైన హోదా, ఆర్థిక వనరులు, కార్యనిర్వాహకులు, పన్నుల చెల్లింపుపై వివరాలను కోరారు.
ఆర్ఎస్ఎస్ అధికారికంగా భారతదేశం, విదేశాలలో 60,000కు పైగా శాఖలు, కోట్లాది మంది స్వయంసేవకులు ఉన్నారని ప్రకటించుకుంది.
కర్ణాటక హోంమంత్రి ఆ సంస్థ కార్యకలాపాల వివరాలు, రకాలను కూడా కోరారు.
రిజిస్ట్రేషన్ అనేది కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదని, అది ఒక నైతిక అంశం కూడా అని ఖర్గే తాను బహిరంగంగా విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
“ఈ స్థాయి, ప్రభావం, విస్తృతి కారణంగానే ఆర్ఎస్ఎస్ను అత్యున్నత స్థాయి పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ అనుగుణ్యతకు కట్టుబడి ఉండేలా చూడాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఈ లేఖకు ప్రతిస్పందనగా, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్, తాను ఆ లేఖను పట్టించుకోవడం లేదని, దానికి సమాధానం ఇవ్వబోనని అన్నారు.
దీనిని బట్టి భగవత్ తాను, తన సంస్థ చట్టానికి, భారత రాజ్యాంగానికి అతీతులమని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆర్ఎస్ఎస్ అధిపతి రాజేంద్ర సింగ్ ప్రతిపాదన..
అందువల్ల ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని విశ్వసించదు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన మూడు రోజుల తర్వాత, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ తన సంపాదకీయంలో, భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ చేత రూపొందించబడిన ఈ రాజ్యాంగంలో భారత పవిత్ర గ్రంథాలలోని గొప్ప విలువలు లేనందున ఇది మన దేశానికి తగినది కాదని పేర్కొంది. దీనిని రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ అధిపతి రాజేంద్ర సింగ్ అన్నారు.
మరో ఆర్ఎస్ఎస్ అధిపతి అయిన కే సుదర్శన్ మాట్లాడుతూ, ఈ రాజ్యాంగం పాశ్చాత్య విలువలపై ఆధారపడి ఉందని, అందువల్ల దీని స్థానంలో భారత పవిత్ర గ్రంథం ఆధారంగా రూపొందించిన రాజ్యాంగాన్ని తీసుకురావాలని అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ‘400 పార్’ నినాదంలోని అంతర్లీన లక్ష్యాలలో భారత రాజ్యాంగాన్ని సవరించడం ఒకటి.
భగవత్ భారత ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవిలో లేనప్పటికీ, ప్రధానమంత్రితో సమానమైన భద్రతను అనుభవిస్తున్నారనే వాస్తవం కూడా తన సంస్థ రాజ్యాంగానికి అతీతమైనదనే ఆయన భావనకు కారణమై ఉండవచ్చు.
ప్రియాంక్ ఖర్గే ప్రశ్నకు సమాధానంగా, “మేము రహస్యంగా ఏమీ చేయడం లేదు. మేము బహిరంగంగానే పనిచేస్తున్నాము. మేము ప్రజలకు ఫోన్ చేసి మా గురించి వారికి చెబుతున్నాము. ఇది రాజకీయం. అన్ని రకాల జిమ్మిక్కులు ప్రయోగించబడుతున్నాయి. హిందూ ధర్మం రిజిస్టర్ కాలేదు. ఇంకా అనేక ఇతర సంస్థలు కూడా రిజిస్టర్ కాలేదు” అని భగవత్ అన్నారు.
అయితే, వారు బాబ్రీ మసీదు కూల్చివేత గురించి బహిరంగంగా చర్చించారా?
సంస్కృతి పేరుతో రాజకీయ కార్యకలాపాలు..
ఆర్ఎస్ఎస్పై లక్షిత ఆంక్షలు విధించాలని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇటీవల అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
ప్రతిపాదిత చర్యలలో ఆ సంస్థ ఆస్తులను స్తంభింపజేయడం, దాని సభ్యులకు వీసాలను నిరాకరించడం వంటివి ఉన్నాయి.
నమోదు చేయకపోవడానికి భగవత్ చెప్పిన వాదనలలో ఒకటి ఏమిటంటే, హిందూ మతం కూడా నమోదు కాలేదు.
హిందూ మతాన్ని ఆర్ఎస్ఎస్తో సమానం చేసే ఈ వ్యాఖ్య ఒక విధంగా హిందూ మతాన్ని అవమానించడమే.
హిందూ మతంలో నాథ్, తంత్ర, శైవ, సిద్ధాంత, భక్తి వంటి అనేక ఆలోచనా స్రవంతులు ఉన్నాయి.
ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసే హిందూ మతం బ్రాహ్మణవాదం, అది కూడా కుల, లింగ వివక్షాపూరితమైనది. ఈ వాదనలో ఏమాత్రం పస లేదు.
ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ కోసం డిమాండ్ రావడం ఆశ్చర్యం కాదు. ఈ డిమాండ్ ఇంతకు ముందే ఎందుకు రాలేదనేదే ఆశ్చర్యం. ఆర్ఎస్ఎస్ను కాపాడటానికి హిందూ జాతీయవాద భావజాలం పట్ల సానుభూతి ఉన్న చాలా మంది అధికారులు ఉన్నారు. కానీ రిజిస్ట్రేషన్‌కు విరాళాలు, ఖర్చు అనే సాధారణ నియమమే ప్రధాన కారణంగా ఉండాలి.
అదేవిధంగా, సంస్కృతి పేరుతో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలను కూడా అంగీకరించాలి. అలాగే, నిషేధాన్ని ఎత్తివేయమని కోరుతూ ఇచ్చిన హామీలను ఆర్ఎస్ఎస్ ఎలా ఉల్లంఘిస్తోందో కూడా గుర్తుంచుకోవాలి.
భారత రాజ్యాంగానికి, భారత జాతీయవాదానికి ప్రాధాన్యతనిచ్చి, కేవలం ఆర్ఎస్ఎస్కే కాకుండా అటువంటి షరతులను నెరవేర్చే అన్ని ఇతర సంస్థలకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
(వ్యాస రచయిత రామ్ పునియాని, మానవ హక్కుల కార్యకర్త. ఈయన ఐఐటీ బొంబాయిలో బోధించారు. ఇందులోని అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
