డిజిటల్ వేదికలు, విద్యుత్, ఇన్పుట్స్, కార్మిక, మార్కెటింగ్, నియంత్రణ అవసరాలపై కంపెనీలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారత సేవా రంగ విస్తరణ రేటు ఆగస్టులో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు నెలవారీ సర్వే సెప్టెంబర్ 3న బట్టబయలు చేసినట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) కథనం వెల్లడించింది.
సీజన్లవారీగా సర్దుబాటు చేసుకునే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచిక జూలైలో 53.3 నుంచి ఆగస్టులో 54.1కు పెరిగింది.
ఇది సేవా రంగ కార్యకలాపాలలో విస్తరణను సూచిస్తున్నప్పటికీ, సేవా రంగ వృద్ధి వేగం మార్చి 2022 నాటి నుంచి రెండవ అతి తక్కువగా నమోదైంది.
బుకింగ్స్ మందగించడం, బలమైన పోటీ, రవాణా ఆపరేషన్ల తగ్గింపు వంటి కారణాల వల్ల ఈ వృద్ధి రేటు తగ్గుముఖం పట్టినట్లు పీటీఐ పేర్కొన్నది.
సూచిక నిర్ధారణ విధానం..
నెల రోజుల క్రితం కంటే ముందున్న పరిస్థితులతో పోలిస్తే వ్యాపార కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న ఏకైక ప్రశ్న ఆధారంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచికను నిర్ధారించడం జరిగింది.
“భారత సేవా కార్యకలాపాలు ఆగస్టులో వేగంగా విస్తరించాయి. ఈ వృద్ధికి బలమైన ఉత్పత్తి, కొత్త వ్యాపారాలు మద్దతు ఇచ్చినప్పటికీ, నాలుగు సంవత్సరాలలో మొత్తం మీద ఈ వేగం బలహీనంగా కనిపిస్తోంది. అందుకు పోటీ, బుకింగ్స్ మందగించడం, రవాణా ఆపరేషన్లను తగ్గించడం వంటి కారణాలని కొన్ని సంస్థలు చెబుతున్నాయి” అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి చెప్పారు.
సేవా రంగంలో ఉన్న దాదాపు 400 కంపెనీలకు పంపించిన ప్రశ్నావళికి వచ్చిన స్పందన ఆధారంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐని ఎస్ అండ్ పీ గ్లోబల్ సంకలనం చేసింది.
పెరిగిన నిర్వహణ వ్యయం..
డిజిటల్ వేదికలు, విద్యుత్, ఇన్పుట్, లేబర్, మార్కెటింగ్, నియంత్రణ అవసరాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు కంపెనీలు తెలియజేస్తున్నాయి.
నీతి ఆయోగ్ హెచ్చరికలు..
గత సంవత్సరం “ఇండియాస్ సర్వీస్ సెక్టార్: ఇన్సైట్స్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్” అనే టైటిల్‌తో ఉన్న తన నివేదికలో నీతి ఆయోగ్ పలు ఆందోళనలు వ్యక్తంచేసింది.
భారత జాతీయ ఉత్పత్తిలో సగానికి పైగా సేవలను ఈ రంగం అందిస్తున్నప్పటికీ, మొత్తం ఉద్యోగాలలో మూడింట ఒకటి కంటే తక్కువగా మాత్రమే ఉపాధి కల్పిస్తోందని, అందులోనూ ఎక్కువగా అనధికారిక, తక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలే ఉన్నట్లు నీతి ఆయోగ్ నొక్కి చెప్పింది.
“భారత ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బిందువుగా ఉన్న సేవా రంగంలో అనధికారిక ఉపాధి ఉన్నత స్థాయిలో కొనసాగుతోంది. మెజారిటీ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదా సామాజిక రక్షణ అందుబాటులో లేదు. ఆర్థిక వ్యవస్థలో అతి వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, తక్కువ వేతనాల ఉచ్చులో కూరుకుపోయే ప్రమాదం సేవా రంగానికి పొంచి ఉంది” అని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
