ఆధునిక పెట్టుబడిదారీ విధానం 19వ శతాబ్దపు మధ్య కాలంలో ఉద్భవించిన తరువాత ఈ రెండు శతాబ్దాలలో ఆధునిక పెట్టుబడిదారీ విధానం అనేక మార్పులకు, కుదుపులకు లోనైన పరిస్థితిని చరిత్ర చూసింది.
పెట్టుబడిదారీ విధానం మొదట్లో భూస్వామ్య విధానానికి లోబడి, తర్వాత అంటకాగి అనంతరం భూస్వామ్య వ్యవస్థనే అంతమొందించిన పరిణామం మనం చరిత్రలో చూశాం.
ఏ వ్యవస్థ అయినా పూర్తిగా అంతర్ధానం కాకపోవచ్చు, పరిణామ క్రమంలో పాత వ్యవస్థ అవశేషాలు కొన్ని తర్వాతి సమాజాలలో కనపడతాయి. కొన్ని సార్లు అంతరించిందనుకున్న వ్యవస్థ మళ్లీ నూతన రూపం తీసుకొని ప్రస్తుత వ్యవస్థపై ఆధిపత్యం సాధిస్తుంది.
ఏది ఏమైనా గతితార్కిక సూత్రాల ప్రకారం ఏ వ్యవస్థలో అయినా వర్గ వైరుధ్యాల కారణంగా జరిగే పోరాటమే అంతిమంగా సమాజ పరిణామ క్రమాన్ని నిర్దేశిస్తుందనేది చరిత్ర నిరూపించిన సత్యం.
వర్తమానంలో నిల్చొని, “నాకు వర్గ పోరాటం కనపడటం లేదు”అని అనుకునే కొందరు ఉంటారు. ఒక పరిమాణాత్మక మార్పు కనిపించటానికి అవసరమయ్యే కాలంతో పోలిస్తే అతి చిన్నదైన మానవుని జీవిత కాలంలో పరిణామ క్రమంలో ఒక పెద్ద ముందడుగుకు కారణమయ్యే పోరాటం తీవ్రమైన దశ చూడటం అందరికీ సాధ్యపడకపోవచ్చు.
కొందరు చూసినా వర్గ పోరాటం తీసుకురాబోతున్న మార్పులను తమ జీవిత కాలంలో చూడలేకపోవచ్చు, కానీ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి.
పెట్టుబడిదారీ విధానంలో మార్పులు..
ఆది నుంచి సమాజంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి, అలాగే ఆధునిక లేదా పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం కూడా అనేక మార్పులకు గురై ప్రస్తుత స్థితికి చేరుకున్నది.
అదే సమయంలో ప్రస్తుతం కూడా మార్పుకు గురవుతూనే ఉంది. ఈ రెండు శతాబ్దాలలో పారిశ్రామిక విప్లవంతో మొదలయిన ఆధునిక పెట్టుబడిదారీ విధానం అనేక దేశాలను వలసదేశాలుగా మార్చింది.
లాభాల కోసం జరిగిన వేటలో అనేక మంది ప్రజలను నరకయాతనకు గురిచేసింది, కొన్ని జాతులను అంతర్ధానం చేసింది, ప్రపంచ యుద్ధాలను సృష్టించింది. వీటితో పాటు ప్రగతిని కూడా సాధించింది.
రెండవ ప్రపంచయుద్ధం అనంతరం ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పోటీగా వచ్చిన సోషలిజం వల్ల, ఈ యుద్ధాల వల్ల జరిగిన నష్టాల వల్ల, ప్రపంచవ్యాప్తంగా దోపిడీకి గురవుతున్న వర్గాల నుంచి ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి వచ్చిన ప్రతిఘటన వలన ఆధునిక పెట్టుబడిదారీ విధానం కొంత వెనక్కు తగ్గి తన రూపును మార్చుకోవలసి వచ్చింది.
ప్రత్యక్ష వలసలకు బదులు నయా వలస విధానం, అలాగే భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి మార్పులు చేసుకుంది.
ఎనభైవ దశకంలోకి వచ్చేసరికి స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని పూర్తిగా ముందుకు తీసుకువచ్చి తన మనుగడను కొనసాగించింది.
“మార్కెట్ స్వేచ్ఛ ఉంటే చాలు ప్రపంచ ప్రజలంతా స్వేచ్ఛగా ఉంటారు” అనే వాదన, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎదిగితే సమాజం దానంతట అదే ఎదుగుతుందని, పెట్టుబడి ప్రవాహానికి హద్దులు గీయకూడదు(కానీ శ్రమశక్తి ప్రవాహానికి మాత్రం అడ్డుకట్టలు ఉండాలి) వంటి అనేక మార్పులు రాజ్యం ద్వారా తీసుకొని వచ్చి తన రూపును మార్చుకుంది.
తమ మనుగడకు గట్టిగా పోటీ ఇస్తున్న వర్గ పోరాటాలను అనేక ఎత్తుల ద్వారా బలహీనపరిచి తన మనుగడను కొనసాగించింది.
నయా ఉదారవాద విధానం నుంచి మార్పు..
సరిహద్దులు మాయం చేసి విశ్వవ్యాప్తమైన పెట్టుబడి తనకు ఎదురులేదు అనుకుంటున్న వేళ 2008 ఆర్థిక సంక్షోభం అమెరికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కాలంలో సప్లై చైన్(సరఫరా గొలుసు)లో ఉన్న ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది.
సంక్షోభం నుంచి బయట పడటానికి రాజ్యం ద్వారా నగదును మరింత ముద్రించి పెట్టుబడిదారులకు ఇవ్వటం ప్రారంభించారు.
ఇది రెండు పరిణామాలకు దారి తీసింది. ఒకటి నగదు అందుకున్న పెట్టుబడిదారుడు ఉత్పత్తి చేయటానికి బదులు(సంక్షోభ సమయంలో రిస్క్ తీసుకోవటానికి నిరాకరించి) సురక్షితం అనుకున్న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టటం ప్రారంభించాడు.
రెండో వైపు కొందరు పెట్టుబడిదారులు రాజ్యం ద్వారా తమకు వచ్చిన నగదును కొత్త టెక్నాలజీల(స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి కూడా ఇక్కడికే వచ్చి చేరింది) ఆవిష్కరణ మీద పెట్టారు.
ఈ కొత్త ఆవిష్కరణల మీద పెట్టుబడులు పెట్టిన అనేక పరిశ్రమలు లాభాలతో నిమిత్తం లేకుండా కేవలం మార్కెట్(మనుషుల మీద) మీద ఆధిపత్యం సాధించాయి, వాస్తవానికి ఈ పరిశ్రమలు చాలా వరకు నష్టాలలోనే నడుస్తున్నాయి.
లాభం అనే చోదక సూత్రం మీద నడిచే పెట్టుబడిదారీ విధానం నేడు భూస్వామ్య విధానం నుంచి వచ్చిన ఆధిపత్యం అనే సూత్రం మీద తన ప్రయాణం కొనసాగిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఉదాహరణకు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళజాతి పెట్టుబడి సంస్థలైన బ్లాక్ రాక్, వాంగార్డ్ కూడా 2008 సంక్షోభం తరువాత నూతన టెక్నాలజీ ఆవిష్కరించటానికి పనిచేస్తున్న పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాయి.
ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ ఈరోజు మానవ జీవితంలో, పెట్టుబడిదారీ విధానంలో విడదీయరాని బంధాలుగా మారాయి. ఈ క్లౌడ్, ఏఐ సంస్థలు లాభాలకంటే కూడా మార్కెట్ మీద పట్టు సాధించటం మీదనే కేంద్రీకరించాయి.
ఉదాహరణకు యూట్యూబ్, ఉబెర్, బైజూస్ వంటి అనేక క్లౌడ్ సంస్థలు పూర్తిగా నష్టాలలో నడుస్తున్నా కానీ వాటి షేర్ల విలువలు పెరుగుతూ ఉన్నాయి.
ఈ సరికొత్త పరిణామం పెట్టుబడిదారీ విధానం మౌలిక సూత్రం అయిన లాభం అనే దాని వదిలిపెట్టి భూస్వామ్య విధానం నుంచి వచ్చిన ఆధిపత్యం అనే సూత్రం ద్వారా ముందుకు వెళ్తుందని అర్థం అవుతుంది.
భూస్వామ్య విధానంలో రాజ్యం కొంతమంది భూస్వాములను నియమిస్తుంది వారికి కట్టబెట్టిన భూమి నుంచి పన్నులు వసూలు చేసి రాజ్యానికి కొంత చెల్లించి తనకు మిగిలిన దానిలో కొంత తమకు సంక్రమించిన భూమిలో పని చేస్తున్న వారిని అణచివేయటానికి, ఆధిపత్య భావాలను సాంస్కృతికంగా వ్యాపింపచేయటానికి వాడేవారు.
అదే సమయంలో రాజ్యం పాలనా వ్యవస్థను కొనసాగించేలా చూడటం తిరుగుబాట్లను అణిచివేయటం బాధ్యతగా చూసేది. మారిన పెట్టుబడి పరిణామ క్రమాన్ని ఇప్పుడు చూసినట్లైతే ఆధిపత్యం అనే సూత్రం ద్వారా ప్రయాణం కొనసాగిస్తున్నది కానీ హింస జరగకుండా తమకు కావలసిన పనిని చేయించుకుంటుంది.
ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లో ప్రజలు గడిపే సమయం అది వినోదం కోసం అయినా తమ వృత్తి కోసం(సాధారణ కార్మికుల నుంచి కోడింగ్ చేసే కార్మికుల వరకు) అయినా తమకు తెలియకుండా వారు ఈ క్లౌడ్ యజమానులకు ఉచితంగా శ్రమ చేస్తున్నారు.
అలా ఉచితంగా పొందిన శ్రమ ద్వారా సాంకేతికత మరింత దృఢంగా మారి తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటుంది. వినటానికి ఆశ్చర్యంగా (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో లాగా) అనిపించినా ఇది యథార్థం.
ఉదాహరణకు మన స్మార్ట్ ఫోన్లో ఉన్న సిరి, అలెక్సా(వీటిని తయారు చేయటానికి అయిన ఖర్చు దానికంటే తక్కువ ధరకే అమ్ముతారు లేదా ఉచితంగా అందిస్తారు) వంటి డిజిటల్ అసిస్టెంట్లనే చూసుకోండి మొదట మన రోజువారీ పనిలో సహాయం కోసం మన జీవితంలో జరిగే అన్ని విషయాలను దానికి అందిస్తాం(అది మన రోజువారీ షెడ్యూల్ కావచ్చు, మనకు అవసరం అయిన వస్తువులను మార్కెట్ నుంచి కొనటం, ప్రయాణాలను బుక్ చేసుకోవటం వంటివి, అంతర్జాలంలో శోధించటం). ముందుగా మన గురించి తెలుసుకొని తర్వాత మనకు సాయం చేస్తున్నాయనే నెపంతో మన అభిప్రాయాలను, అభిరుచులను తన యజమానులకు అనుగుణంగా మారుస్తాయి.
లాభం అనే చోదక సూత్రం ద్వారా తమ ప్రయాణం కొనసాగిస్తున్న సాంప్రదాయ పెట్టుబడిదారులు కూడా ఈ టెక్నాలజీని తమ ఉత్పత్తుల కోసం ముడి సరుకుల కొనుగోళ్లు, అమ్మకాలు, శ్రమ శక్తి, మార్కెటింగ్, సర్వీసింగ్ కొరకు తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ టెక్నాలజీ గుత్తాధిపత్యాన్ని వాడుకొని లాభ సూత్రానికి అనుగుణంగా ఉండే పెట్టుబడిదారులు కూడా లాభపడ్డారు కానీ వాస్తవానికి వారు మార్కెట్ మీద తమ గుత్తాధిపత్యాన్ని కోల్పోయి టెక్నాలజీ మీద గుత్తాధిపత్యం పొందిన వారి దగ్గర తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.
భూస్వామ్య విధానంలో భూముల మీద పని చేసే వారు ఎలాగైతే పన్నులు భూస్వాములకు చెల్లించే వారో ఇప్పుడు ప్రజలు, పెట్టుబడిదారులు ఈ నయా టెక్నాలజీ స్వాములకు దీనిని వాడుకున్నందుకు అద్దె చెల్లించాల్సి వస్తుంది.
భూస్వామ్య విధానంలో పన్నులు చెల్లించటానికి నిరాకరిస్తే భౌతికంగా శిక్షలు ఎదుర్కోవలసి వచ్చేది ఇప్పుడు అయితే ఆ టెక్నాలజీ వాడుకోకుండా అడ్డగించి సాంప్రదాయ పెట్టుబడిదారులను తమ కస్టమర్లను చేరుకోకుండా చేయగలరు.
ఇటీవల కాలంలో చైనాకి సంబంధించిన హువావే కంపెనీని గూగుల్ వారు తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం(ప్లే స్టోర్)ని వాడకుండా నిరోధించటం దీనికి పెద్ద ఉదాహరణ.
రాజ్యం కూడా తప్పక ఈ నయా టెక్నాలజీ స్వాములకు తలవంచక తప్పని పరిస్థితి దాపురించింది. ప్రజలు, పెట్టుబడిదారుల మీద పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ నూతన విధానం రాజ్యం మీద కూడా పట్టు సాధించగలిగింది.
తనుకుంటే రాజ్యం రూపురేఖలను కూడా పూర్తిగా మార్చగలదు. ప్రజలను ఏమార్చి ఇష్టపూర్వకంగా ఆధునిక బానిసల్లా(పూర్వం వర్ణాశ్రమ ధర్మాలు, కర్మ సిద్ధాంతం మనుషులకు ఎక్కించి తామంత తామే స్వచ్ఛందంగా దోపిడీకి, వివక్షకి తాము అర్హులం అది న్యాయం అని నమ్మేలా చేసిన విధంగా) ఉచితంగా తనకు పనిచేయించుకోగలదు కూడా.
పారిశ్రామిక విప్లవ పెట్టుబడిదారులకు, టెక్ పెట్టుబడిదారులకు తేడా ఏమిటి?..
ఆధునిక పెట్టుబడిదారీ విధానంలో పెద్ద పెట్టుబడిదారులు తమ సరుకులు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకునే వారు కనుక వారు స్వేచ్ఛా మార్కెట్ ఉండాలని తద్వారా తమ ఉత్పత్తులను అత్యధికంగా అమ్ముకొని అత్యధిక లాభాలు సాధించొచ్చని భావించేవారు.
అదే నయా టెక్ పెట్టుబడిదారులు మార్కెట్ మొత్తాన్నే తమ కబంధ హస్తాల మధ్య బంధించారు. వారి కట్టడిలో ఉన్న మార్కెట్లో తాము నిర్దేశించిన పద్ధతిలో, తాము నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగానే వస్తువు అమ్మకాలు కొనుగోళ్లు, ఉత్పత్తులు జరిగేలా చూడగలరు.
ఎవరైనా తాము నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా నడుచుకోకపోతే వారిని మార్కెట్ నుంచి బహిష్కరించగలిగిన సామర్థ్యం వారికి వచ్చింది.
మనం ఉబెర్ టెక్నాలజీస్ సంస్థనే తీసుకుంటే ఇది ప్రయాణ సేవలు, ఫుడ్ డెలివరీ, సరుకు రవాణా లాంటి రంగాల్లో పనిచేసే బహుళజాతి సంస్థ. మొదట విడివిడిగా ఉన్న సేవలు అందించేవారిని, సేవలు పొందేవారిని ఒక దగ్గరకు చేర్చింది. తదుపరి తమ ప్లాట్ ఫారం వాడుకున్నందుకు ప్రయాణికులు, సేవలు అందించే వారి దగ్గర నుంచి కొద్దిగా అద్దె వసూలు చేయటం నుంచి మొదలు పెట్టి తమ ప్లాట్ ఫారం వాడుకోవాలంటే తమ ఆదేశాలు లేదా తాము నిర్దేశించిన పద్ధతులను అనుసరించాలని ఆదేశించటం మొదలు పెట్టింది.
ఇలా ప్రయాణ సేవల మార్కెట్‌ని మొత్తం తమ ఆదేశాల కిందకు తెచ్చుకుంది. ఇదే సమాచారాన్ని క్లౌడ్‌కి అనుసంధానం చేసిన తరువాత ప్రయాణికుల అభిరుచులు, గతంలో చేసిన ప్రయాణాల ఆధారంగా ఎక్కడెక్కడికి ప్రయాణించాలో సూచనలు ఇవ్వటం మొదలు పెట్టి చివరికి ప్రయాణికుల ప్రయాణ అభిరుచులను మార్చగల స్థాయికి పెరుగుతుంది.
బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ల ముందు ఆటో, టాక్సీ వాలాలు ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా కస్టమర్లు ఉబెర్‌లో తమ ప్రయాణాన్ని బుక్ చేసుకోవటం చూస్తున్నాం.
ఒకవేళ అలా బుక్ చేసుకోకుండా ఆటో డ్రైవర్ని “ధర ఎంత” అని అడిగిన వెంటనే ప్రయాణికుడు ఉబెర్‌లో ఎంత చూయిస్తుందో పోల్చి చూసి వెంటనే డ్రైవర్‌తో “ఏంటయ్యా.. ఇక్కడ ఇంతే చూయిస్తుంది, నువ్వేంటి అంత చెప్తున్నావు” అని అంటాడు.
ఇక్కడ ప్రయాణ ధర ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది ప్రభుత్వమో లేక ప్రయాణికుడో కాదు టెక్నో బాస్ (వ్యక్తులు కాదు తమ క్లౌడ్‌లో ఉన్న మొత్తం సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయిస్తున్నాము అనొచ్చు కానీ అవి పూర్తిగా వీరి నియంత్రణలోనే ఉంటాయి) నిర్ణయిస్తున్నాడు.
ముందు తరం పెట్టుబడిదారులు కొంత స్థాయిలో కస్టమర్ అభిప్రాయాలను మార్కెటింగ్ ద్వారా మార్చగలిగితే ఇప్పుడున్న టెక్ అధినేతలు కస్టమర్ల అభిప్రాయాలతో పాటు ఉత్పత్తిదారులను కూడా ఏవి ఉత్పత్తి చేయాలో నిర్దేశించగలరు.
ప్రస్తుతం దుస్తులు, అలంకరణ వస్తువులు చేసే సంస్థలనే తీసుకోండి మార్కెట్ లో ఏమి అమ్మాలో నిర్దేశిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద టెక్ క్లౌడ్‌లను వాడుకోకుండా లేదా వీరి ఆదేశాలు పాటించకుండా తమ ఉత్పత్తులను అమ్ముకోగలరా?
ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా తమ ప్రస్తుత అమ్మకాలతో పోలిస్తే చాలా తక్కువ అమ్మకాలు జరుగుతాయి, చిన్నగా వారి బ్రాండ్లు అంతర్ధానం అయ్యే అవకాశం ఉంది.
వర్గపోరాటాలకు కాలం చెల్లిందా?..
పెట్టుబడిదారీ విధానం రూపు మార్చుకుందో లేక మార్క్స్, లెనిన్, మావో కాలంలో ఉన్న విధానం ఇప్పుడు జరగటం లేదు కనుక వర్గపోరాటాలకు కాలం చెల్లింది; ఇక శాశ్వతంగా పెట్టుబడిదే పై చేయి అని వాదించే వారి సంఖ్య ఈ మధ్య బాగా పెరగటం చూస్తున్నాము(అదే సమయంలో సమస్యలకు మూలం వెతికే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది, కాకపోతే ఇటువంటి వారు ఆర్గనైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది).
అలాగే మన రాజకీయాలు కూడా సంఘర్షణ స్వభావం నుంచి సంధి కాల రాజకీయాల వైపు మళ్లటం చూస్తూ ఉండొచ్చు.
దోపిడీ రూపు మారినంత మాత్రాన భిన్న వర్గాల మధ్య ఉన్న వైరుధ్యం ఉండకుండా పోదని గుర్తెరిగినంత కాలం పురోగామివాదులకు వర్గ పోరాటం మీద దాని ప్రాసంగికత మీద ఎటువంటి సందేహం ఉండదు, ఉండకూడదు.
ప్రతి వ్యవస్థ తన మనుగడ కోసం రూపు మార్చుకుంటూనే ఉంటుంది. తాను అంతం అవుతానని తెలిస్తే అలా అవ్వకుండా ఉండటానికి దానికి ఉన్న సర్వశక్తులను ఒడ్డుతుంది, ఓటమి ఎదురైనా ఎలాగోలా తనను తాను కాపాడుకొని మళ్లీ శక్తిని పెంచుకొని తన పాత ఆధిపత్య స్థానానికి రావాలని చూస్తుంది.
ప్రస్తుతం ఫాసిజం గురించి చూసినట్లైతే రెండవ ప్రపంచయుద్ధంలో నాజీలను, ఫాసిజాన్ని అంతమొందించామని అనుకున్న మిత్ర పక్షాలకు 7 దశాబ్దాల తరువాత యూరప్‌లో మళ్లీ అది పుంజుకొని యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో దాదాపు మెజారిటీ సాధించబోవటాన్ని చూస్తున్నాం.
నియో నాజీలు ఎలా కిరాయి సైన్యాలలో కలిసి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారో చూస్తున్నాం. భారతదేశంలో మత చాందసవాదులు ఒకరి మీద ఒకరికి ద్వేషాలు రెచ్చగొట్టి అధికారాన్ని మూడవసారి కూడా నిలబెట్టుకోవటం చూస్తున్నాం.
వర్గ పోరాటాన్ని నమ్మే వారు ఎప్పుడూ కూడా ఉదారవాదులు, మితవాదులు రెండింటి మీద సమాంతరంగా పోరాటం చేసి గెలవాల్సి ఉంటుంది.
పైన చెప్పినట్టు వాస్తవానికి పెట్టుబడిదారులు కూడా ఈ టెక్ పెట్టుబడిదారుల ఆధిపత్యంలోకి జారి మరింత కేంద్రీకృతంగా దోపిడీ జరుగుతుంది.
కొంచెం అటు ఇటుగా భూస్వామ్య విధానంలో ఉన్న అద్దె పెట్టుబడిదారీ విధాన చోదక శక్తి అయిన లాభాన్ని దాటేసి ముందుకు వచ్చినట్టుగా ఉంది.
పెట్టుబడిదారుల స్వేచ్ఛ కూడా కొందరి చేతుల్లో కేంద్రీకృతం అవ్వటం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వర్గపోరాటాలకు ప్రాసంగిగకత ఇంకా పెరిగింది అలాగే వర్గపోరాటం కూడా నిర్దిష్ట పరిస్థితులకు తగినట్లు తన రూపు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
సాంకేతిక మార్పుకు మార్పుకు మధ్య సమయం తగ్గుతున్నప్పుడు విప్లవానికి విప్లవానికి మధ్య కూడా సమయం తగ్గుతుందని గమనంలో ఉంచుకోవాలి.
- ఆంజనేయ రాజు , పల్నాడు జిల్లా డివైయఫ్ఐ కార్యదర్శి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
