మా నాన్నగారు సంజీవ్ భట్ అక్రమంగా జైలు పాలయ్యి నేటితో 8 సంవత్సరాలు – 2,923 రోజులు – పూర్తయ్యాయి.
ఈ రోజు, సెప్టెంబర్ 5వ తేదీ, ఈ ప్రభుత్వం మా ఇంట్లోకి జొరబడి సత్యం కోసం కట్టుబడిన మా నాన్నగారి గొంతు నొక్కివేసేందుకు తప్పుడు ఆరోపణలతో ఆయన్ను మా నుండి వేరుచేసి, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 8 సంవత్సరాలు పూర్తయిన రోజు. ఒక కుటుంబ జీవితాన్ని కొలవడానికి ఎనిమిదేళ్లు అనేది చాలా సుదీర్ఘమైన కాలం. కానీ కాలం కూడా తన ప్రాముఖ్యత కోల్పోయే క్షణాలు కొన్ని ఉంటాయి. ఎనిమిదేళ్లు గడిచాయని క్యాలెండర్ చెబుతున్నప్పటికీ, మా హృదయాలు, ఆత్మలు మాత్రం మా ప్రపంచం తలక్రిందులై ముక్కలైన ఆ సెప్టెంబర్ ఉదయంలోనే నిలిచిపోయాయి.
గడిచిన ఈ సంవత్సరాలను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, మా నాన్నగారు ఏ విలువల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నిటికీ ప్రాధాన్యత కల్పించిన ఆ విలువల గురించే మేము తరచుగా ఆలోచిస్తుంటాము. తన మనస్సాక్షిని కుదువపెట్టి మౌనంగా ఉండే సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవాలా వద్దా అని ఒక వ్యక్తి నిర్ణయించుకోవాల్సిన క్షణాలు ఉంటాయని మేము ఆయన నుండే నేర్చుకున్నాము. ప్రశ్నించబడటానికి సహించలేని అధికారానికి ఎదురొడ్డి నిలబడటం అంటే ఏమిటో నిజంగా మేము ఆయన ద్వారానే గ్రహించాము. తన ముందున్న పోరాటం అసమానమైనది, అత్యంత కష్టతరమైనది, ఒంటరిదని మా నాన్నగారికి తెలుసు. సమాజాన్ని రక్షించగల వ్యవస్థలు, అధికారం చేతిలో చిక్కి తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయినప్పుడు, అవి ఆ సమాజాన్ని నాశనం చేయగల ప్రాణాంతక ఆయుధాలుగా మారతాయనీ ఆయనకు తెలుసు. ఈ నియంతృత్వ ప్రభుత్వపు డిమాండ్లకు తలొగ్గ నిరాకరిస్తే వచ్చే పరిణామాల గురించి ఆయనకు అవగాహన ఉంది, అయినప్పటికీ ఆయన లొంగలేదు, ఇప్పటికీ తన సర్వశక్తులతో ఆ నియంతృత్వం పై పోరాడుతూనే ఉన్నారు.
సంజీవ్ భట్ అంటే అది పత్రికల్లో తరచూ వచ్చే ఒక పేరు మాత్రమే కాదు, ఒక గొప్ప పోరాటానికి సంకేతంగా మారిన ఒక ఐపీఎస్ అధికారి మాత్రమే కాదు, ఆయన మా కన్నతండ్రి. తన వ్యక్తిగత సౌకర్యం, కెరీర్, స్వేచ్ఛను కాపాడుకోవడం కంటే కొన్ని సిద్ధాంతాలు, విలువలు చాలా ముఖ్యమైనవని నమ్మి, తనను నిలువునా దహించివేస్తుందని తెలిసినా పోరాటాన్ని కొనసాగించగల అసాధారణమైన శక్తి, సహనం కలిగిన వ్యక్తి ఆయన.
ఆయన తన స్వార్థం కోసం చేసుకున్న త్యాగాలు కావివి. కేవలం ఒకే ఒక వ్యక్తి రాజకీయ ఆకాంక్ష కోసం ద్వేషం, అమానవీయమైన హింసను అనుభవించిన ప్రజల కోసం ఆయన పోరాడారు. మౌనం వహించడం అన్నిందాలా క్షేమం అని తెలిసి కూడా ఆయన తన గొంతు విప్పారు. అధికారంలో ఉన్నవారు జవాబుదారీతనానికి అత్యున్నత ప్రమాణాలను పాటించాలని నమ్మి ఆయన తన కెరీర్ను ప్రతిష్టను, స్వేచ్ఛను చివరికి తన జీవితంలో కీలకమైన సంవత్సరాలను పణంగా పెట్టారు.
అందుకే ఆయన తన స్వేచ్ఛ ను, జీవితంలో విలువైన
ఈ ఎనిమిదేళ్ల కాలాన్ని కోల్పోయారు. దీని మూలంగా మాకు ఒక విషయం మరింత స్పష్టంగా అర్థమయ్యింది. అణచివేత అతిపెద్ద విజయం ఏంటంటే అది లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిని మానసికంగా కుంగదీయడం కాదు, జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికీ తాము ఏమీ చేయలేమని, నిస్సహాయులమని నమ్మించడమే.
ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒకే ఒక్క నాటకీయ క్షణంలో అదృశ్యమవ్వదు. అధికారాన్ని నియంత్రించడానికి ఏర్పడిన వ్యవస్థలు దానికి సేవ చేయడం ప్రారంభించినప్పుడు, బాధితులకు చివరి దిక్కుగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ వారిని రక్షించడంలో విఫలమైనప్పుడు, చట్టబద్ధమైన ప్రక్రియలు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోబడినప్పుడు, నిజం అసౌకర్యంగా, ప్రమాదకరంగా మారినప్పుడు, బహుశా వీటన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, అన్యాయాలు జరుగుతున్నప్పుడు సాధారణ పౌరులు తమ స్వరం పెంచడానికి బదులు, కళ్లు మూసుకోవడమే సురక్షితమని భావించినప్పుడు ప్రజాస్వామ్య పునాదులు నిశ్శబ్దంగా కదలబారిపోతాయి. ఏం జరుగుతుందో పౌరులకు తెలియక కాదు, కానీ కళ్ళు ఉండి చూడనట్లు నటించడమే సురక్షితం, క్షేమదాయకం అని భావించడం వల్లే ప్రజాస్వామ్య స్తంభాలు ఒకటొకటిగా కూలిపోవడం మొదలవుతుంది.
ఎనిమిది సుదీర్ఘ సంవత్సరాలుగా, మా నాన్నగారి విషయంలో జరిగింది ఇదే. ఒక వ్యక్తిపై ఆధిపత్య అధికార యంత్రాంగం దాడి చేయడం చూశాము, పౌరుడికి – ప్రభుత్వానికి మధ్య అడ్డుగోడగా నిలవాల్సిన వ్యవస్థలు, తమ ఉనికి లక్ష్యాన్ని నెరవేర్చడంలో పదే పదే విఫలమవ్వడాన్ని మేము కళ్ళారా చూశాము.
అయినప్పటికీ, మా నాన్నగారు పోరాడుతూనే ఉన్నారు
అదే ఆయన అసమాన ధైర్యానికి, ఆయన వారసత్వానికి కొలమానం. ప్రపంచం వింటున్నప్పుడు ఒకరు ఎంత బిగ్గరగా మాట్లాడతారనే దాని ఆధారంగా ధైర్యం అనేది కొలవలేం. ప్రపంచం వినడం మానేసినప్పుడు కూడా వాళ్ళు దేన్నయినా భరించడానికి సిద్ధపడి సత్యాన్ని వినిపించడానికి సిద్ధపడతారు అనేదే ధైర్యానికి అసలైన కొలమానం.
మా నాన్నగారు ఓపికగా అన్నీ భరిస్తూనే ఉన్నారు.
తన స్వేచ్ఛ కోల్పోవడాన్ని, తన కెరీర్ నాశనమవ్వడాన్ని, తన కుటుంబాన్ని ఎడబాసిన సంవత్సరాలను, తనను సర్వనాశనం చేయాలని నిశ్చయించుకున్న వ్యవస్థ పెడుతున్న అపారమైన ఒత్తిడిని ఆయన భరించారు.
అయినప్పటికీ, ఎనిమిదేళ్ల తర్వాత కూడా, ఈ ప్రభుత్వం ఒకే ఒక్క విషయంలో ఆయనను లొంగదీసుకోలేక పోయింది. మొదటి నుండి వారికి ప్రమాదకరంగా పరిణమించిన ఆ అంశమే… తన మనస్సాక్షిని తాకట్టు పెట్టడానికి ఆయన నిరాకరించడం.
అందుకే ఆయన చేస్తున్న పోరాటం మునుపటికన్నా ఇప్పుడు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఏళ్ల తరబడి, చాలా మంది తమ స్వరం పెంచకుండా ఉండడానికి అలవాటు పడిపోయారు. ప్రశ్నించడానికి బదులు మౌనం వహించడం , ఆగ్రహం స్థానంలో ఉదాసీనత, ధైర్యం స్థానంలో పిరికితనం వచ్చి చేరాయి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటానికి తెగించిన ఆదర్శవంతమైన వ్యక్తులకు ఏం గతి పడుతుందో ఉదాహరణగా చూపించి, ఆ వేధింపులను చూసి ఒక తరం సురక్షితంగా జీవించడానికి మౌనాన్ని ఆశ్రయించడమే ఏకైక మార్గమని నమ్మడం ప్రారంభించింది.కానీ ఆ మౌనానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ప్రజలు అధికారాన్ని ప్రశ్నించడానికి భయపడినప్పుడు ఒక దేశం స్వేచ్ఛగా ఉండలేదు. పౌరులు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం మానేసినప్పుడు వ్యవస్థలు స్వతంత్రంగా ఉండలేవు. పౌరులకు న్యాయస్థానం ఒక రక్షణ కవచంగా ఉండటం మానేసి, విభేదించే వారిపై ఒక ఆయుధంగా మారినప్పుడు న్యాయం గెలవలేదు. ఏ అధికారమూ జవాబుదారీతనానికి అతీతం కాదని, సురక్షితంగా ఉండటానికి ఏ పౌరుడూ తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని , తన వాణిని త్యాగం చేయాల్సిన అవసరం లేదని ప్రజలు నమ్మి ఆ విలువలను పరిరక్షించుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మనగలదు.
ఆశావహమైన పరిణామం ఏంటంటే, అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలకాలి అనే ఆ సంకల్పం మళ్లీ చిగురిస్తా ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశ్నించడానికి తమ గొంతులు సవరించుకుంటున్నారు. గుడ్డిగా అంగీకరించే కంటే, తమ స్వంత విచక్షణాధికారాన్ని ఉపయోగించి పరిశీలించడానికి, ఓటి కబుర్లకు అతీతంగా, డాంబికమైన బడాయి ప్రచారానికి అతీతంగా, జాగ్రత్తగా అల్లిన కథనాలకు అతీతంగా వాస్తవాలను గమనించడం మొదలయ్యింది. తలదించుకుని బతకాలని నేర్పిన ఒక తరం క్రమంగా, ధైర్యంగా తిరుగుబాటుతనంతో తలెత్తడం మొదలయ్యింది.
ఏదో ఒక అద్భుతం జరగాలని ఎదురు చూడడం కాకుండా , లక్షలాది మంది సాధారణ ప్రజలు ప్రశ్నించే తమ గుణాన్ని ఇకపై వదులుకోకూడదని తమ సొంత మార్గంలో నిర్ణయించుకోవడం ద్వారానే ఈ అనంతమైన కాళ రాత్రి చివరకు ఒక కొత్త వేకువజాముకు దారితీస్తుంది.
ఈ సంవత్సరాలన్నింటిలో మా నాన్నగారిని చూసి మేము నేర్చుకున్న విషయం ఏమిటంటే – “ధైర్యం అనేది అంటువ్యాధి వంటిది”.
మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి నిలబడటం చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. అపారమైన అధికార యంత్రాంగం ముందు ఒక స్వరం పీలదిగా అనిపించవచ్చు. కానీ లొంగడానికి నిరాకరించిన వారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది, ఒక వ్యక్తి ప్రదర్శించిన ధైర్యం లక్షలాది మందిలో ధైర్యాన్ని ఎలా రగిలిస్తుందో చూపిస్తుంది.
మా నాన్నగారికి తాను ఏం ఫణంగా పెడుతున్నానో తెలుసు, అయినా ఆత్మరక్షణ కంటే ధైర్యాన్ని, మౌనం కంటే సత్యాన్ని, భయం కంటే మనస్సాక్షిని ఎంచుకున్నారు ఆయన. తను గెలవగలనని భావించి ఆయన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడలేదు. ఎంతటి మూల్యం చెల్లించయినా కొన్ని సూత్రాల కోసం కట్టుబడి పోరాడటం విలువైనదని నమ్మాడు కాబట్టి ప్రభుత్వాధికారాన్ని ధిక్కరించి నిలబడ్డారు.
ఈ రోజు, 2,923 రోజులుగా మేం విడిపోయాం అనే కాదు, న్యాయం కోసం గత 8 సంవత్సరాలుగా మేం సాగిస్తున్న నిరంతర పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ఇది చదివే ప్రతి ఒక్కరూ సంజీవ్ భట్ గారిని మరోసారి గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నాం.
అపారమైన వ్యక్తిగత , వృత్తిపరమైన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినా ఆయన అధికారాన్ని ధిక్కరించడానికి సాహసించిన వైనాన్ని గుర్తు చేసుకోండి.పౌరులను రక్షించడానికి సృష్టించబడిన వ్యవస్థలు వారిపైనే ఆయుధాలుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో గుర్తుంచుకోండి.న్యాయవ్యవస్థ స్వతంత్రత, వ్యవస్థల సమగ్రత , చట్టబద్ధమైన పాలన అనేవి కేవలం అమూర్తమైన రాజ్యాంగ పదాలు కావు; సాధారణ పౌరునికి – అపరిమితమైన రాజ్యాధికారానికి మధ్య నిలబడే రక్షణ కవచాలని గుర్తుంచుకోండి.ఆ కవచాలు కాపాడే ధైర్యం మనకు ఉన్నంత కాలం మాత్రమే అవి మనగలుగుతాయని గుర్తుంచుకోండి.
మా నాన్న గారి సత్య వాక్కును అణిచివెయ్యడానికి వారు ప్రయత్నించి ఎనిమిదేళ్లు గడిచాయి.ఎనిమిదేళ్లుగా
ఆయన స్వేచ్ఛను దొంగిలించారు, కానీ ఆయన ధైర్యాన్ని మాత్రం సడలించలేకపోయారు.ఎనిమిదేళ్లుగా ఆయన పట్టుదలను పాతిపెట్టడానికి ప్రయత్నించారు, కానీ ఆయన అజేయమైన స్ఫూర్తిని మాత్రం దెబ్బతీయలేకపోయారు.
ఆలస్యమైన న్యాయం అంటే కేవలం సమయం వృధా కావడం మాత్రమే కాదని, ఒక సమాజానికి ఇంకా న్యాయం డిమాండ్ చేసే ధైర్యం ఉందో లేదో తెలిపే పరీక్ష అని ఈ ఎనిమిదేళ్లు మాకు పదే పదే గుర్తుచేశాయి.
మా నాన్నగారు మన సమాజం, మన దేశ లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించడానికి తన జీవితాన్ని ఫణంగా పెట్టారు. ఆయన స్వరాన్ని ఒంటరిగా మిగిలిపోకుండా చెయ్యడమే మనం చేయగలిగిన కనిష్ట సహాయం.
మనమందరం కలిసికట్టుగా నిలబడి మన గొంతును విప్పాలి. కేవలం మా నాన్నగారు సంజీవ్ భట్ కోసం మాత్రమే కాదు, మన దేశంలోని ప్రతి పౌరునికి చెందే హక్కులు, స్వేచ్ఛలు, విలువలను కాపాడటానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వారందరి కోసం మనం మన గొంతులు విప్పాలి.
ఎనిమిదేళ్ల అక్రమ నిర్బంధం తర్వాత కూడా, మా నాన్నగారు నిటారుగా, సగర్వంగా, స్వచ్ఛమైన మనస్సాక్షితో, చెక్కుచెదరని సంకల్పంతో నిలబడ్డారు.
ఆయన మౌనంగా ఉండటానికి , లొంగిపోవడానికి నిరాకరిస్తున్నారు. మాదీ అదే దారి.న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది.మేము గాయపడి ఉన్నాం, దెబ్బతిని ఉన్నాం,కానీ మేము చెక్కుచెదరక, లొంగక, తలవంచక సగర్వంగా నిలబడతాము.
అనువాదం : కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
