బాలీవుడ్‌ను తన పాటలతో ఒక దశలో శాసించినంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గీత రచయిత షైలేంద్ర జీవితం మాత్రం కష్టాలతో నిండినదే. అయినప్పటికీ ఆయన రాసిన ప్రతి పాటలోనూ ఒకే సందేశాన్ని పదేపదే బలంగా వినిపిస్తాడు
నువ్వు బతికే ఉన్నావంటే జీవితం తప్పక గెలుస్తుందనే నమ్మకం ఉంచు.
నువ్వు జీవించి ఉన్నావంటే చాలు—జీవితాన్ని ఓడించలేరనే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండు.
గత వారం మీరు భయ్యా మేరే, రాఖీ కే బంధన్ కో నిభానా (ఓ అన్నా, రాఖీ బంధానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకో) అనే పాటను నేపథ్య సంగీతంగా పెట్టుకున్న రాఖీ రీల్స్‌ను చూస్తూ ఉండొచ్చు. లేదా సుహానా సఫర్ ఔర్ యే మౌసమ్ హసీన్ (ఎంత ఆహ్లాదకరమైన ప్రయాణం, ఎంత అందమైన వాతావరణం) అనే పాటతో రూపొందించిన అంతులేని వర్షాకాల రీల్స్‌ను స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు.
అయితే ఆ రెండు పాటలూ వందేళ్ల క్రితం ఇదే నెలలో జన్మించిన ఒకే వ్యక్తి కలం నుంచి జాలువారాయని మీకు తెలుసా?
ఆ గీత రచయిత షైలేంద్ర. దళిత కవి అయిన ఆయనకు కమ్యూనిస్టు భావజాలం పట్ల అనుబంధం ఉండేది. ఇష్టం లేకపోయినా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షైలేంద్ర, అక్కడి నుంచి మాత్రం ఎప్పటికీ మరచిపోలేని చిరస్మరణీయమైన పాటల వారసత్వాన్ని వదిలి వెళ్లారు.
సాధారణంగా ఈ శీర్షికలోని నా వ్యాసాలన్నీ ఆంగ్లంలో వెలువడిన కల్పిత సాహిత్యం గురించే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఒక మినహాయింపు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఒక కారణం ఆగస్టు 30న షైలేంద్ర 103వ జయంతి కావడం. మరో ముఖ్యమైన కారణం—గొప్ప సాహిత్యం చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆయన పాటలు కూడా అదే పని చేస్తాయి.
అదేమిటంటే ఈ అందవికారమైన-అందమైన, ఆకర్షణీయమైన-హృదయవిదారకమైన ప్రపంచాన్ని అనుభవించడంలో ఉన్న ఉమ్మడి మానవత్వంలో మనల్ని ఏకం చేయడం.
జీవితం అంటే ఇదే
విలియం షేక్స్పియర్కు ఏమాత్రం తీసిపోని విధంగా షైలేంద్ర రాసిన ఎన్నో పదబంధాలు, పాటల పంక్తులు తమకంటూ ఒక ప్రత్యేక జీవితాన్ని సంపాదించుకున్నాయి. ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ (అయినా మనసు మాత్రం హిందుస్తానీదే); *జీనా ఇసీకా నామ్ హై* (జీవితం అంటే ఇదే) వంటి పంక్తులు అందుకు ఉదాహరణలు.
ఇలా జరగడానికి కారణం ఒక్కటే—షేక్స్పియర్లాగే షైలేంద్ర కూడా అత్యంత లోతైన భావాలను ఎలాంటి సంక్లిష్టత లేకుండా, అతి సరళమైన మాటల్లో చెప్పగల అసాధారణమైన ప్రతిభను కలిగి ఉన్నాడు.
షైలేంద్ర సమకాలీన గీత రచయితలు—బాలీవుడ్ స్వర్ణయుగం* లో వెలుగొందిన సాహితీవేత్తలు—సాధారణ కవులె కాదు అసాధారణ ప్రతిభావంతులు. సాహిర్ లుధియాన్వీ, మజ్రూహ్ సుల్తాన్‌పురి, హస్రత్ జైపురి, కైఫీ ఆజ్మీ, రాజేంద్ర కృష్ణ, షకీల్ బదాయూనీ వంటి వారు అద్భుతమైన గీతాలను ఎంతో శ్రద్ధతో మలచిన సాహిత్యాన్ని అందించారు.
అయితే షైలేంద్ర కవిత్వంలో—ఈ వ్యాసంలో కొన్నింటిని మనం పరిశీలించబోతున్నాం—ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అవి సామాన్యుల మాటల్లో సహజంగా కలిసిపోయేంత సరళంగా ఉంటాయి. భావాలను మోసుకెళ్లేంత హృద్యంగా ఉంటాయి. సులభంగా గుర్తుండిపోయేంత లయాత్మకంగా, పునరుక్తితో కూడి ఉంటాయి.
అందుకే ఆయన పాటలు కేవలం వినిపించే పాటలుగా మిగిలిపోలేదు, ప్రజల నిత్య సంభాషణలో భాగమైపోయాయి.
జీవితాన్ని ఎవరూ ఓడించలేరన్న అచంచలమైన విశ్వాసం ఆయనకు ఉండేది.
ఆయన అసలు పేరు శంకర్‌దాస్ కేసరిలాల్. పని కోసం వలస వెళ్లిన బిహారీ దళిత కుటుంబంలో, రావల్పిండిలో ఆయన జన్మించారు. తరువాత షైలేంద్ర మథురలో, ఆపై బొంబాయిలో నివసిస్తూ పనిచేశారు.
కానీ వలస వచ్చినవారికి ఈ అనుభూతి బాగా తెలుసు. ఎక్కడో ఒక చోట బతుకును నిర్మించుకున్నా ఆ నేల పూర్తిగా తనదేనని చెప్పుకునే హక్కు తనకుందని అనిపించదు. బతుకు కోసం వచ్చిన నేలలోనే జీవించి పనిచేసినా దాన్ని తన కర్మభూమిగా సొంతం చేసుకునే భావన అంత సులభంగా కలగదు. అలాంటి చోట, ఆ నేల పేరునే తన పేరులో కలుపుకుని— ఇది నాదే’ అని ఎలా చెప్పుకోగలడు?
బొంబాయిలో షైలేంద్ర రైల్వే వర్క్‌షాప్‌లో వెల్డర్‌గా పనిచేసేవారు. ఆయన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (IPTA) లో సభ్యుడు. దేశ విభజన, చుట్టూ ఉన్న సామాజిక శక్తుల్లో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పుల కాలంలో తనకు చెందిన కార్మిక వర్గం ఎదుర్కొంటున్న కష్టాలు, పోరాటాలపై ఆయన కవితలు రాసేవారు.
1940లలో జరిగిన ఒక IPTA సమావేశంలోనే రాజ్ కపూర్ తొలిసారి షైలేంద్ర గురించి విన్నారు. ఆయన ప్రతిభకు ముగ్ధుడై, తన సినిమాల కోసం పాటలు రాయమని ఆహ్వానించారు. అయితే షైలేంద్ర ఆ అవకాశాన్ని తిరస్కరించారు. వాణిజ్య ప్రయోజనాల చుట్టూ తిరిగే బాలీవుడ్ ప్రపంచంతో తనను తాను ముడిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు.
కానీ కొంతకాలం తరువాత భార్య వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరం కావడంతో షైలేంద్ర రాజ్ కపూర్‌ను సంప్రదించారు. అలా అవసరం నుంచి మొదలైన ఆ పరిచయం భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మహత్తర భాగస్వామ్యానికి నాంది పలికింది.
అందుకే షైలేంద్ర పాటలు సామాన్యుడి జీవితంలోనే లోతుగా వేళ్లూనుకుని ఉంటాయి. ఆయన ఉపమానాలు, ప్రతీకలు కూడా మన రోజువారీ జీవితంలో కనిపించే సాధారణ వస్తువుల నుంచే పుట్టుకొస్తాయి. అయితే వాటిలో ఒక మానవ మేధస్సు సృష్టించగల అసాధారణమైన శక్తి, సౌందర్యం వెలుగులు నింపుతాయి.
ఆయన IPTA రోజుల నాటి రచన నుంచి ఒక ఉదాహరణ చూద్దాం:
(Tu zinda hai tou zindagi ki jeet par yakeen kar/agar kahin hain swarg tou utaar la zameen par)
నువ్వు బతికే ఉన్నావంటే జీవితం గెలుస్తుందనే నమ్మకం ఉంచు, ఎక్కడైనా స్వర్గం ఉందంటే దాన్ని భూమిపైకి దించు.
మనిషి జీవించి ఉన్నంతకాలం అవకాశాలు కూడా సజీవంగానే ఉంటాయి. అయితే ఆ అవకాశాలను సార్థకం చేసుకోవాలంటే విశ్వాసం అవసరం. జీవితాన్ని ఎవరూ ఓడించలేరన్న విశ్వాసం. స్వర్గాన్ని వెతికి కనుగొనగలమన్న నమ్మకం. ఆ స్వర్గాన్ని మన జీవితంలోనే మన చుట్టూ ఉన్న ఈ భూమిపైనే సాకారం చేసుకోగలమన్న విశ్వాసం.
స్వరం–సందేశం
నన్నయితే షైలేంద్ర పాటల్లోని ఈ లక్షణమే ఎంతో ఆకట్టుకుంటుంది—ఆయన జీవితం కష్టాలతో నిండిపోయింది. అయినా పాట తర్వాత పాటలో జీవితం అందమైనదని, జీవించడానికి విలువైనదని ఆయన మనకు గుర్తుచేస్తూనే ఉంటాడు. మనలో దాగి ఉన్న ఆ వెలుగును మనం కనుగొనగలిగితే చాలు.
1965లో వచ్చిన గైడ్ సినిమాలోని *ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై* పాటను బాలీవుడ్లో వచ్చిన తొలి స్త్రీవాద గీతాల్లో ఒకటిగా తరచూ పరిగణిస్తారు.
ఊపిరాడనివ్వని వివాహ బంధం నుంచి రోజీ అప్పుడే బయటకు వచ్చింది. మళ్లీ తనలో జీవం నిండిన అనుభూతిని పొందుతోంది. ఆమె పాడే ఆ ప్రసిద్ధ పంక్తులు
ఈ రోజు మళ్లీ జీవించాలనే కోరిక కలుగుతోంది, ఈ రోజు మళ్లీ చావును సైతం ఎదుర్కోవాలనిపిస్తోంది
ఈ పంక్తుల్లో వినిపించేది విముక్తి స్వరం. మళ్లీ తన జీవితంపై రోజీకి అధికారం వచ్చింది. ఇక తన జీవితం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో—అన్నది ఆమె తన షరతులపై తానే నిర్ణయించుకోగలదు.
ఎందుకంటే జీవితాన్ని నిజంగా పూర్తిగా అనుభవించకుండా దేని కోసం అయినా ప్రాణత్యాగం చేయడం ఎలా సాధ్యం? జీవించడం అంటే ఏమిటో తనకు తాను తెలుసుకున్నప్పుడే దేని కోసం చావడానికైనా ఒక అర్థం ఉంటుంది.
అయితే షైలేంద్ర తత్వానికి ప్రతిధ్వనిలా నాలో మిగిలిపోయే పంక్తులు మాత్రం ఇవి నిన్నటి చీకట్ల నుంచి బయటకొచ్చి, కళ్లను నులుముకుంటూ చుట్టూ చూసేసరికి
అంతా పూలే పూలు జీవితం వసంతమై విరబూస్తోంది ఇదే నేను నిర్ణయించుకున్నాను.
రోజీ తన జీవితాన్ని *తయ్ కర్ లియా* అంటే *నేనే నిర్ణయించుకున్నాను*—అని ప్రకటించుకుంటుంది. ఇక తన జీవితం బహార్—వసంతం. తాను మళ్లీ వికసిస్తోంది. తన జీవితాన్ని తనదైన రీతిలో సుసంపన్నం చేసుకుంటోంది. ఆ వసంతాన్ని ఆమెకు ఎవరో ప్రసాదించలేదు. తన జీవితానికి తానే దాన్ని ఎంచుకుంది.
షైలేంద్ర రాసిన మరో చిరస్థాయి పాట 1952లో వచ్చిన ఆవారా చిత్రంలోని ఆవారా హూన్.
సాధారణంగా ఆవారా అనే పదాన్ని ఇంగ్లిష్‌లో సంచారి లేదా వీధుల వెంట తిరిగే నిరాశ్రయుడు అని అనువదించవచ్చు. కానీ ఆ పదంలో అంతకంటే లోతైన భావం ఉంది. ఒక ఇంటి నీడ లేకపోవడమే కాదు—ఇంటి, కుటుంబం, స్థిరమైన జీవితపు బంధనాలకు కూడా లోబడని స్వేచ్ఛాజీవి అన్న అర్థం కూడా అందులో ఉంది.
ఈ పాటలో ఆ ఆవారా రాజు తన గురించి పాడుకుంటూ, తాను కష్టాల చీకటిలో ఉన్నప్పటికీ ఆకాశంలోని ఒక నక్షత్రాన్నేనని చెబుతాడు—
గర్దిష్ మే హూన్ పర్ ఆస్మాన్ కా తారా హూన్ (కష్టాలు చుట్టుముట్టినా నేను ఆకాశంలోని నక్షత్రాన్నే).
అంటే పరిస్థితులు తనను ఎంతగా కుదిపేసినా తనలోని వెలుగును మాత్రం అవి ఆర్పలేవని అతని నమ్మకం. ప్రకృతిలోని మెరుపు, కాంతి, చైతన్యం తనలోనూ ఉన్నాయన్న భావంతో అతను ముందుకు సాగుతాడు.
సుఖసంతోషాలతో లేక
చిన్నాభిన్నమైన వాడినే కావచ్చు.
అయినా నేను ఆనంద గీతాలే పాడుతాను.
నా గుండె గాయాలతో నిండిపోయి ఉండొచ్చు,
కానీ ఈ మత్తెక్కిన చూపులు మాత్రం
ప్రపంచాన్ని నవ్వుతూ చూస్తూనే ఉంటాయి ఆ సంచారి జీవితం వర్ధిల్లడం లేదు. నిజానికి అతని జీవితం ఛిన్నాభిన్నమైపోయింది. అయినా అతను పాడేది మాత్రం ఆనందపు పాటలే. అతని గుండె గాయాలతో నిండిపోయినా, ప్రపంచాన్ని అతను మాత్రం నిర్లక్ష్యంగా, స్వేచ్ఛగా, చిరునవ్వులు చిందించే కళ్లతో చూస్తాడు.
బయట జీవితం ఎంతగా విరిగిపోయినా తనలోని ఆనందాన్ని మాత్రం వదులుకోకపోవడం—ఇదే షైలేంద్ర పాటల్లో పదేపదే కనిపించే జీవన తత్వం.
అయితే ఈ లోకంలోని రోజీలు, రాజూలు నిజాన్ని అంగీకరించకుండా భ్రమలో బతుకుతున్నవాళ్లేనా? ఎదురయ్యే ప్రతి సమస్యకూ షైలేంద్ర చెప్పే పరిష్కారం ఎంతటి కష్టమైనా సరే, పట్టుబట్టి ఆశావాదాన్ని నమ్ముకోవడమేనా?
కాదు. తీవ్రమైన కష్టాల్లోనూ సానుకూలంగా ఎలా ఉండాలో షైలేంద్ర ఒక మార్గాన్ని కూడా చూపిస్తాడు—మన గురించి మాత్రమే ఆలోచిస్తూ బతకకూడదు. మన చుట్టూ ఉన్న మనుషుల కోసం, వారికి ఆనందాన్ని, ఓదార్పును అందించడం కోసం బతకాలి.
ఎవరి చిరునవ్వు కోసం అయినా నిన్ను నీవు అర్పించుకో,
ఎవరి బాధనైనా పంచుకునే అవకాశం వస్తే, దాన్ని నీ వంతుగా స్వీకరించు,
ఎవరి కోసమైనా నీ హృదయంలో ప్రేమను నింపుకో—
జీవితం అంటే ఇదే.
అంటే ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు పూయించడానికి మనల్ని మనం అర్పించుకోవడం. వీలైతే ఎదుటివారి బాధలో కొంత భాగాన్ని మన భుజాలపై వేసుకోవడం. ఎవరో ఒకరి కోసం నీ హృదయం ప్రేమతో కొట్టుకునేలా జీవించడం.
అలా జీవిస్తే మనం కేవలం పరిపూర్ణమైన జీవితాన్ని గడపడం మాత్రమే కాదు—మన జీవితం ముగిసిన తరువాత కూడా గుర్తుండిపోయే అమరత్వాన్ని సంపాదించుకుంటాం.
నిజానికి, షైలేంద్ర తన మాటల్లోనే తన జీవితాన్ని ముందుగానే రాసుకున్నట్టున్నారు.
చనిపోయిన తర్వాత కూడా ఎవరో ఒకరి జ్ఞాపకాల్లో నేను బతికే ఉంటాను, ఎవరి కన్నీళ్లలోనో ఒక చిరునవ్వుగా మళ్లీ వెలుగుతాను.
షైలేంద్ర లేడు. కానీ ఆయన పాటలు ఉన్నాయి. ఎప్పుడో ఒకరి హృదయాన్ని తాకిన ఆ పదాలు ఈరోజు మరొకరి కన్నీటిని తుడుస్తూ చిరునవ్వును పూయిస్తున్నాయి. అదే ఆయన కోరుకున్న అమరత్వం—మరణం తర్వాత కూడా మనుషుల జీవితాల్లో ఒక చిన్న వెలుగుగా మిగిలిపోవడం.
అనువాదం : మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
