బిజెపి మినహా మిగిలిన అన్ని జాతీయ పార్టీల మొత్తం విరాళాల కంటే గుజరాత్‌కు చెందిన ఆరు పార్టీలకే2023-24లో ఎక్కువ డబ్బు వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతానికి చెందిన నాలుగు పార్టీలతో సహా ఈ ఆరు నమోదు చేయబడిన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు (RUPPs), ఏకంగా రూ. 1,700 కోట్లు వసూలు చేసినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవలం 15 మంది అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించాయి.
బిజెపి మినహా, భారత దేశంలోని మిగిలిన అన్ని జాతీయ పార్టీల కంటే గుజరాత్‌కు చెందిన ఆరు నమోదు చేయబడిన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు (RUPPs) 2023-2024 సంవత్సరంలో అత్యధిక విరాళాలు పొందాయని బిబిసి న్యూస్ హిందీ చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పార్టీలు ఎన్నికల సమయంలో కేవలం ఒకరిద్దరు అభ్యర్థులను మాత్రమే, అది కూడా చాలా అరుదుగా బరిలోకి దింపుతుంటాయి. సెప్టెంబర్ 4 న ప్రచురితమైన బిబిసి న్యూస్ హిందీ వార్త ప్రకారం ఆ పార్టీలు ఆమ్ జన్మత్ పార్టీ, భారతీయ నేషనల్ జనతా దళ్, గరీబ్ కళ్యాణ్ పార్టీ, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ, సత్యవాది రక్షక్ పార్టీ, స్వతంత్రత అభివ్యక్తి పార్టీ.
బి.బి.సి. వార్త ప్రకారం, ఆమ్ జన్మత్ పార్టీ 2023-2024లో విరాళాల రూపంలో రూ. 620 కోట్లకు పైగా సేకరించింది. అదే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సేకరించిన రూ. 281 కోట్ల నిధుల కంటే రెండు రెట్లు పైగా ఎక్కువ. అయితే, ఈ RUPP పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒక్క నియోజకవర్గంలో ఒకే ఒక్క అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. ఆమ్ జన్మత్ పార్టీకి చెందిన ఫేస్బుక్ పేజీలో ప్రస్తుతం బీహార్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న అనామికా పాసవాన్ ను తమ జాతీయ అధ్యక్షురాలిగా పేర్కొన్నారు. అయితే తాను 2022లోనే ఆమ్ జన్మత్ పార్టీకి రాజీనామా చేశానని, ఆ తర్వాతే ఆ పార్టీని బీహార్ నుండి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మార్చారని పాసవాన్ బిబిసి న్యూస్ హిందీకి తెలిపారు. 2020-2022 సంవత్సరాల్లో ఆమ్ జన్మత్ పార్టీ విరాళాలు చాలా తక్కువగా ఉండేవి, కానీ ఆ తర్వాత నిధుల్లో విపరీతమైన పెరుగుదల కనిపించి, 2022-2023 నాటికి ఏకంగా రూ. 216 కోట్లకు చేరింది.
విలేకరులు ఆ పార్టీ అహ్మదాబాద్ కార్యాలయానికి వెళ్లి చూడగా, అది గత ఆరు నెలలుగా మూతపడి ఉందని, అక్కడ ఏ ఒక్క పార్టీ నిర్వాహకుడు కూడా లేరని తెలిసింది. అంతేకాకుండా, పార్టీకి చెందిన సభ్యులందరూ రాజీనామాలు చేయడంతో ఆమ్ జన్మత్ పార్టీని మూసి వేసినట్లు పార్టీ కోశాధికారి ధర్మేంద్ర వైష్ణవ్ విలేకరులకు చెప్పారు. అధికారికంగా ఈ పార్టీ కార్యకలాపాలు సాగించడం లేదని చెబుతున్నప్పటికీ, దాతలు ఆ పార్టీ బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయగలిగారు. ఈ పార్టీలు ప్రజా సంక్షేమం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ, దాని గురించిన ఖచ్చితమైన ఆధారాలు లేదా బ్యాంకు లావాదేవీల రికార్డులు మాత్రం చూపించ లేకపోయాయి.
అదేవిధంగా, గరీబ్ కళ్యాణ్ పార్టీ, సత్యవాది రక్షక్ పార్టీ, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీల కార్యాలయాలు కూడా ఖాళీగా, బోసి పోయి కనిపించాయి. మీరు వేరే ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు, తాము “మనస్ఫూర్తిగా” బిజెపికి మద్దతు ఇస్తున్నామని న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ అధ్యక్షుడు అమిత్ చతుర్వేది బిబిసి న్యూస్ హిందీకి తెలిపారు. మరో వైపు, ఈ పార్టీల వెబ్సైట్లు పనిచేయకపోవడం, ఫోన్ నంబర్లు కలవకపోవడం, ఆడిట్ నివేదికలు కనిపించకపోవడంతో ఆ వెబ్సైట్లు కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు.
భారతదేశంలో మొత్తం 2,800 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో ఆరు జాతీయ పార్టీలుగా, 67 ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. మిగిలిన 2,727 కంటే ఎక్కువ పార్టీలు నమోదు చేయబడిన గుర్తింపు లేని రాజకీయ పార్టీల (RUPP) వర్గం కిందకు వస్తాయి.
బిబిసి న్యూస్ హిందీ దర్యాప్తు చేసిన ఈ ఆరు RUPP పార్టీలు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,700 కోట్ల నిధులను సేకరించాయి. అదే సమయంలో బిజెపిని మినహాయించి మిగిలిన జాతీయ పార్టీలన్నీ (కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), నేషనల్ పీపుల్స్ పార్టీ) కలిపి సేకరించిన మొత్తం విరాళాలు రూ. 1,480 కోట్లు మాత్రమే.
ఈ ఐదు జాతీయ పార్టీలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 893 మంది అభ్యర్థులను పోటీకి దింపగా, గుజరాత్‌కు చెందిన ఈ ఆరు RUPP పార్టీలు ఎన్నికల ఖర్చుల పేరుతో రూ. 1,700 కోట్లకు పైగా నిధులు కలిగి ఉన్నప్పటికీ, కేవలం 15 మంది అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించగలిగాయి. ఈ ఆరు పార్టీలలో నాలుగు పార్టీలు అహ్మదాబాద్‌లోని ‘నరోడా’ అనే ఒక్క ప్రాంతంలోనే ఉండడం విశేషం.
అంతకుముందు, ఆగస్టు 2025 నాటి దైనిక్ భాస్కర్ నివేదికలో గుజరాత్‌లోని 10 “పేరు లేని పార్టీలు” ఎన్నికల్లో చాలా అరుదుగా పోటీ చేసినప్పటికీ, 2019-2020, 2023-2024 మధ్య కాలంలో రూ. 4,300 కోట్లు పొందాయని వెల్లడించింది.
ది వైర్ ఇంగ్లీష్ లో ప్రచురితమైన వార్తకు తెలుగు అనువాదం.
“రాజు గారు తలుచుకుంటే దెబ్బల కేమి కొరవ” అన్న సామెతగా నేరుగా ఒక పార్టీకే 90% దాకా నిధులు వస్తున్నాయనే ముద్ర చెరిపేయాలనుకుంటే మార్గాల కేమి కొరవ అని జనం అనుకుంటున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
