న్యూయార్క్‌లో బాగా ప్రచారం పొందిన మోహన్ భగవత్ పాల్గొన్న కార్యక్రమంలో ఇద్దరు అమెరికన్ మత నాయకులు — అది ఆర్ఎస్ఎస్ కార్యక్రమమని తమకు ముందే తెలిసి ఉంటే తాము హాజరయ్యేవాళ్లం కాదని తెలిపారు.
ఆగస్టు 29న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో “వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ” అనే పేరుతో జరిపిన కార్యక్రమంలో 5,000 మందికి పైగా అమెరికన్ హిందువులు, ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి ముందు, తరువాత జరిగిన పరిణామాలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆగస్టు 25న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్(ఐఏఎంసీ), దానితో కలిసి పనిచేసే వివిధ సామాజిక, మత సంస్థలు న్యూయార్క్‌లో ఒక విలేకరుల సమావేశం నిర్వహించి భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకించాయి.
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
కార్యక్రమం ముగిసిన తరువాత, భగవత్‌తో కలిసి అక్కడ కనిపించిన అమెరికాకు చెందిన ఇద్దరు మత నాయకులు ఆ కార్యక్రమంలో హిందుత్వ నాయకుడు పాల్గొంటారని నిర్వాహకులు తమకు ముందుగా చెప్పలేదని తెలిపారు.
నన్ను మోసం చేసి పాల్గొనేలా చేశారు..
న్యూయార్క్‌లోని రివర్సైడ్ చర్చ్‌కు చెందిన మంత్రి అడ్రియెన్ థోర్న్, ఈ కార్యక్రమంలో పాల్గొనేలా తనను మోసం చేశారని సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తెలిపారు.
‘ది వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్’ అనే సంస్థ నుంచి తనకు ఆరు వారాలపాటు పదే పదే ఆహ్వానాలు వచ్చాయని ఆమె చెప్పారు.
నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఒక అంతర్మత సమావేశంగా తనకు వివరించారని ఆమె తెలిపారు.
“ఆర్ఎస్ఎస్ ఇందులో భాగమని నాకు ఎప్పుడూ చెప్పలేదు. అహెడ్ గురించి లేదా హిందూ జాతీయవాదంతో సంబంధం ఉన్న ఏ సంస్థ గురించీ నాకు ఎప్పుడూ చెప్పలేదు” అని ఆమె అన్నారు.
కార్యక్రమంలో తాను కనిపించడం ఒక “భయంకరమైన తప్పు” అని, కార్యక్రమం అనంతరం విడుదల చేసిన వీడియో ప్రకటనలో థోర్న్ పేర్కొన్నారు.
పాల్గొనేవారికి పంపిన కార్యక్రమ వివరాల్లో “గౌరవ అతిథి” పేరును ఖాళీగా ఉంచారని, తరువాత ఆ స్థానం మోహన్ భగవత్ కోసం కేటాయించారని తనకు తెలిసిందని ఆమె చెప్పారు.
“ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ నాయకుడిని కేంద్రంగా చేసుకుని జరుగుతోందని నాకు ముందే తెలిసి ఉంటే, నేను ఎట్టి పరిస్థితులలో ఇందులో పాల్గొనేదాన్ని కాదు” అని థోర్న్ అన్నారు.
ఇమామ్ షంసీ అలీ వివరణ..
థోర్న్ ప్రకటన అనంతరం న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ముస్లిం మత నాయకుడు, అంతర్మత కార్యకర్త ఇమామ్ షంసీ అలీ కూడా ఒక వివరణ ఇచ్చారు.
ది పియర్ హోటల్లో జరిగిన అనుబంధ అల్పాహార సమావేశానికి తాను హాజరు కావడం “తీవ్రమైన నిర్ణయపరమైన తప్పిదం” అని ఆయన పేర్కొన్నారు.
“వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ” అనే అంశంతో జరిగే సమావేశానికి తనను ఆహ్వానించారని, అయితే ఆ కార్యక్రమానికి మోహన్ భగవత్ ప్రధాన అతిథిగా ఉంటారని తనకు చెప్పలేదని అలీ తెలిపారు.
“ఈ కార్యక్రమం మోహన్ భగవత్‌ను సత్కరించేందుకు నిర్వహిస్తున్నదని నాకు తెలిసి ఉంటే, నేను వెంటనే ఆహ్వానాన్ని తిరస్కరించే వాడిని” అని ఆయన చెప్పారు.
కార్యక్రమ స్వరూపం గురించి మరింత తెలుసుకున్న తరువాత, మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగే తదుపరి కార్యక్రమానికి తాను హాజరు కావడానికి నిరాకరించానని కూడా ఆయన తెలిపారు.
పరిశీలన, విమర్శలు కొనసాగుతున్నాయి..
సెప్టెంబర్ 3న న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, భగవత్‌తో కలిసి అల్పాహార సమావేశానికి హాజరైన తరువాత తాను “ఏదో విధంగా మోసపోయినట్లు” అనిపించిందని అలీ చెప్పారు.
జూలై, ఆగస్టు నెలల్లో మత నాయకులకు నిర్వాహకులు పంపిన 12 ఇమెయిళ్లలో ఆర్ఎస్ఎస్ లేదా మోహన్ భగవత్ పేర్లు ప్రస్తావించలేదని ఆ కథనం నిర్ధారించింది.
ఈ ఆహ్వానాలను బావా జైన్ సమన్వయం చేశారు. ఆయన తనను తాను అంతర్మత నాయకుడిగా పేర్కొంటారు.
‘వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్’, ‘సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్’ అనే సంస్థలతో ఆయనకు సంబంధం ఉంది.
టైమ్స్ ప్రకారం, అసలు విషయం తెలుసుకున్న తరువాత థోర్న్ జైన్‌ను సంప్రదించి వివరణ కోరారు. భగవత్ భద్రతకు సంబంధించిన కారణాల వల్ల ఆయన గురించి ముందుగా వెల్లడించలేదని బావా చెప్పారని ఆమె తెలిపారు.
“ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అది కారణం కాదు” అని థోర్న్ అన్నారు.
అయితే భగవత్‌ను సత్కరించినందుకు తాను చింతించడం లేదని జైన్ టైమ్స్‌తో చెప్పారు.
భగవత్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తనకు ఒక సంవత్సరం ముందే తెలుసని, మత నాయకులు కార్యక్రమానికి రావాలని తానే ప్రయత్నించానని తెలిపారు.
“ప్రపంచం ఆయన నోటి నుంచి నేరుగా వినాలని నేను కోరుకున్నాను” అని జైన్ టైమ్స్‌తో అన్నారు. అల్పాహార సమావేశానికి హాజరైన మరో వ్యక్తితో కూడా పత్రిక మాట్లాడింది.
ఆ వ్యక్తి అక్కడి నుంచి భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు చేరుకున్న వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
కట్టుబాట్లను ఆర్ఎస్ఎస్ ప్రకటనగా మార్చారు..
కార్యక్రమం అనంతరం విడుదల చేసిన ‘ప్రకటన’లో తమను కార్యక్రమంలో భాగస్వాములను చేయడాన్ని హాజరైనవారు వ్యతిరేకిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ప్రచారంలోకి వచ్చిన ఒక డోసియర్‌లో(వివరాలతో కూడిన నివేదిక), బావా జైన్‌కు సంఘ్ పరివార్‌తో సంబంధం ఉన్న సంస్థలతో చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
2000లో జరిగిన “మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్”, అలాగే 2007లో న్యూఢిల్లీలో జరిగిన హిందూ-యూదు నాయకత్వ సదస్సు వంటి గతంలో జరిగిన మతపరమైన సమావేశాల్లో ఆయన పాల్గొన్న విషయాన్ని ఆ డోసియర్ ప్రస్తావించింది.
ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా హాజరయ్యారు.
ఆహ్వాన పత్రాల్లో పాల్గొనేవారు సంప్రదాయ మతపరమైన దుస్తులు ధరించి రావాలని కోరినట్లు కూడా ఆ డోసియర్ పేర్కొంది. దీని ద్వారా మొదటి నుంచే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఫొటో అవకాశాన్ని సృష్టించుకోవడంపైనే ఆసక్తి చూపిందని, అంతకుమించి పెద్దగా మరేమీ ఉద్దేశం లేదని అది సూచిస్తోంది. ఆహ్వానాల్లో పాల్గొనేవారిని పదే పదే కొన్ని “కట్టుబాట్లు” సమర్పించాలని కోరారు.
అయితే ఆ “కట్టుబాట్లు” తరువాత ఒక ప్రకటనగా సంకలనం చేశారు. మోహన్ భగవత్ స్వయంగా చదివారు. అనంతరం వాటిని ఆర్ఎస్ఎస్ పత్రిక అయిన ఆర్గనైజర్‌లో ప్రచురించారు.
తాము పంపిన కట్టుబాట్లను ఆర్ఎస్ఎస్ అధిపతి బహిరంగంగా విడుదల చేస్తారని ఆహ్వానితులకు ముందుగా తెలియజేయలేదు.
జైన్‌కు చెందిన అంతర్మత సంస్థలు తమను తాము స్వతంత్ర వేదికలుగా పరిచయం చేసుకున్నప్పటికీ, సంఘ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలతో సంబంధాలను కొనసాగిస్తున్నాయని కూడా ఆ డోసియర్ పేర్కొంది.
ది వైర్ ఇంగ్లీష్‌లో తరుషి అస్వాని రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం: డి వెంకన్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
