నేడు భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఇప్పటికే భయంకరమైన రూపాన్ని దాల్చాయి.
ఈ పరిస్థితుల్లో కార్మికుల అసంతృప్తి అనే నిప్పుకణిక రాజుకుంటే, అది భారీ సామాజిక విస్ఫోటనానికి దారితీయవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక ప్రైవేట్ కంపెనీ కార్మికులు చేపట్టిన నిరసన కేవలం స్థానిక సంఘటన కాదు.
ఇది దేశంలో పెరుగుతున్న కార్మిక వర్గ పోరాటానికి, పెట్టుబడిదారీ వ్యవస్థలోని కఠిన వాస్తవాలకు సజీవ సాక్ష్యం.
కనీస వేతనాలు, నిర్ణీత పని గంటలు, ఓవర్‌టైమ్ చెల్లింపు వంటి ప్రాథమిక, చట్టబద్ధమైన హక్కుల కోసం కార్మికులు వీధుల్లోకి రావాల్సి రావడం ప్రస్తుత వ్యవస్థలో అతిపెద్ద విషాదం.
పెట్టుబడిదారీ వర్గపు అణచివేత..
ప్రారంభంలో కార్మికులు తమ డిమాండ్లను ముందుంచడం, చర్చలు జరపడం, శాంతియుతమైన ఫాలో-అప్ల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ గళాన్ని వినిపించడానికి ప్రయత్నించారు.
అయితే, అపరిమిత లాభాలే లక్ష్యంగా ఉన్న యజమానులు ఎటువంటి సామాజిక బాధ్యతను ప్రదర్శించకపోగా, సూపర్వైజర్లు- మేనేజ్మెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించి కార్మికుల గళాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు.
ఇది కేవలం పారిశ్రామిక అణిచివేతకు ఉదాహరణ మాత్రమే కాదు. ఉత్పత్తి సాధనాలపై గుత్తాధిపత్యం వహించే పెట్టుబడిదారీ వర్గం సాగిస్తున్న బహిరంగ వేధింపులు, అణచివేత, నిర్బంధాలకు నిదర్శనం.
మరోవైపు ఇంధన కొరత, గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెటింగ్, విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కార్మికుల జీవితాలను దుర్భరం చేశాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి పాకితే కార్మికుల నిజమైన వేతనాలు పడిపోతున్నాయి.
అన్ని వైపులా దిగ్బంధనానికి గురైన కార్మిక వర్గం కోపం విస్ఫోటనం చెందడం ఖాయం. మనుగడకు అవసరమైన కనీస వనరులు దూరమైనప్పుడు పోరాటం అనివార్యమవుతుంది. ఇది చరిత్ర నేర్పిన పాఠం.
కార్మిక వర్గ పోరాటాలకు ఆజ్యం పోస్తున్న ప్రధాన అంశాలు..
ఆర్థిక అసమానత : ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు.
హక్కుల ఉల్లంఘన: చట్టప్రకారం లభించాల్సిన కనీస వేతనాలు కూడా అందకపోవడం.
ద్రవ్యోల్బణం : పెరుగుతున్న ధరల వల్ల సామాన్యుడి జీవనం భారమవ్వడం.
ప్రభుత్వ పాత్ర-యాజమాన్యాల పక్షపాతం..
ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్మిక శాఖ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. కానీ నేడు ఈ యంత్రాంగం నిష్పక్షపాత మధ్యవర్తిగా వ్యవహరించడం మానేసి, బహిరంగంగా యాజమాన్యాల పక్షం వహించే ఏజెన్సీగా మారింది. ఈ శాఖ కార్మికులు- యజమానుల మధ్య సరైన సమతుల్యతను కాపాడటానికి బదులుగా ప్రభుత్వ యంత్రాంగం పెట్టుబడిదారుల పక్షం వహిస్తోంది.
ఫలితంగా, కార్మికులకు అందుబాటులో ఉన్న చట్టపరమైన, పరిపాలనాపరమైన వ్యవస్థ అర్థరహితంగా మారుతోంది.
అంతకంటే తీవ్రమైన విషయం ఏమిటంటే, శాసనసభలు, పార్లమెంటు వంటి ప్రజాస్వామ్య సంస్థలలో కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం దాదాపుగా లేకపోవడం.
ఎన్నికయ్యే వారు ఎక్కువగా పాలక వర్గ ప్రయోజనాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటప్పుడు కార్మికుల గోడు ఎవరు వింటారు? ఈ రాజకీయ అంతరం కార్మికులలో నిస్సహాయత, నిరాశ, వైఫల్య భావనలను పెంచుతోంది.
ఇటువంటి అణిచివేత, నిర్లక్ష్య వాతావరణంలో ఆగ్రహం కట్టలు తెంచుకుని హింసాత్మక రూపం దాల్చినప్పుడు కేవలం ఆ హింసను ఖండించడం వల్ల సమస్య పరిష్కారం కాదు.
అటువంటి హింస వెనుక ఉన్న సామాజిక-ఆర్థిక కారణాలను గుర్తించి పరిష్కరించడం ప్రభుత్వ నైతిక బాధ్యత. హింస అనేది ఒక లక్షణం మాత్రమే– అసలు వ్యాధి కాదు. అసలు వ్యాధి అన్యాయమైన ఆర్థిక వ్యవస్థ.
ఇది విస్తృత ఉద్యమానికి నాందియా?..
ఇలాంటి ఘటనలు కేవలం నోయిడాకే పరిమితం కాలేదు, కావు. గుజరాత్, బీహార్, హర్యానా వంటి పారిశ్రామిక, కార్మిక కేంద్రాలలో కూడా ఇటువంటి ఘర్షణలు తలెత్తాయి.
వీటన్నింటినీ కలిపి చూసినప్పుడు, సమీప భవిష్యత్తులో దేశంలో విస్తృత సామాజిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని ఈ పరిణామాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
ఒకవైపు దేశంలో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
మరోవైపు అందుబాటులో ఉన్న ఉపాధి అస్థిరంగా మారి- ఎలాంటి భద్రత, కార్మిక హక్కులు, సౌకర్యాలు లేని నియామకాలు సాధారణమయ్యాయి.
శ్రమ దోపిడీ ద్వారానే అపరిమిత లాభాలు సంపాదించడం, మరొక వైపున భద్రతా చర్యలు పూర్తిగా కనుమరుగు చేయడం నేడు సర్వసాధారణం అయింది.
అగ్నికి ఆజ్యం తోడైనట్టు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా యాజమాన్యాల అక్రమాలను సక్రమం(చట్టబద్ధం) చేసింది. కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు.
స్థిరమైన వేతన నిర్మాణం లేదు. కరువు భత్యం లేదు. సామాజిక భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారు అత్యంత అభద్రతలోకి నెట్టబడ్డారు.
మానవ శ్రమను కేవలం ఒక ఖర్చుగా మాత్రమే పరిగణించే నయా ఉదారవాద విధానాల ప్రత్యక్ష ఫలితమే ఇవన్నీ.
పెట్టుబడిదారీ వర్గం, ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ వంటి అన్ని సంస్థాగత శక్తులు ఒకే వర్గం వైపు నిలబడినప్పుడు, వర్గ పోరాటం అనివార్యంగా ఉధృతమవుతుంది. ఈ పోరాటం ఒక విస్తృత సామాజిక ఉద్యమంగా మారే అవకాశం ఉంది.
పొరుగు దేశాల పాఠాలు – తక్షణ కర్తవ్యం..
ఆర్థిక అసమానతలు, నిరుద్యోగంతో పాటు పాలక వర్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ వంటి పొరుగు దేశాలలో ఇప్పటికే మనం భారీ ప్రజా ఉద్యమాలను చూశాము.
ఈ తిరుగుబాట్లు అక్కడి అధికార యంత్రాంగాలను గడగడలాడించాయి. ఈ పరిణామాల నుంచి భారతదేశం పాఠాలు నేర్చుకోవడం చాలా అవసరం.
నేడు భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఇప్పటికే భయంకరమైన రూపాన్ని దాల్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుల అసంతృప్తి అనే నిప్పుకణిక రాజుకుంటే, అది భారీ సామాజిక విస్ఫోటనానికి దారితీయవచ్చు. కాబట్టి, అణిచివేత ధోరణిని అవలంబించడానికి బదులుగా, ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను గుర్తించాలి. పరిశ్రమల కోసం కాకుండా కార్మికుల ప్రయోజనాల కోసం రూపొందించిన విధానాలను అమలు చేయాలి.
తక్షణం లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఉమ్మడి బేరసారాలు, సమ్మె హక్కుతో సహా కార్మిక ప్రయోజనాలు కాపాడే చట్ట సవరణలు తేవాలి. లేకపోతే చరిత్రే సాక్షి- అణచివేతకు గురైన వారు తిరగబడినప్పుడు, ఏ శక్తి వారిని ఆపలేదు!
స్వేచ్ఛానువాదం: ఆర్ లక్ష్మయ్య
వ్యాస రచయిత దేవిదాస్ తుల్జాపూర్కర్- అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జాయింట్ సెక్రటరీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ డైరెక్టర్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
