రాష్ట్రాల వారీగా అధికారిక సీట్ల కేటాయింపు వివరాలను(సీట్ మాట్రిక్స్) ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. స్వతంత్ర విశ్లేషకులు గణితాత్మక ఫలితాలను అంచనా వేశారు.
పార్లమెంటరీ నియోజకవర్గాలను తక్షణమే పునర్విభజన చేయడానికి, లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850కి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా చట్టం, దాని అమలు సాధ్యాసాధ్యాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
2026 ఏప్రిల్ 16న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ(131వ సవరణ)బిల్లు, 2026తో పాటు నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లు, 2026ను సర్క్యులేట్ చేసింది.
ఈ బిల్లు ప్యాకేజీ భారతదేశ పార్లమెంటరీ మ్యాప్‌ను ప్రాథమికంగా పునర్నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా తమ జనాభాను నియంత్రించుకున్న రాష్ట్రాల్లో ఇది ఆందోళన కలిగిస్తోంది.
ముసాయిదా చట్టం – దాని నిర్మాణం..
రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు ఒక కొత్త గరిష్ట పరిమితిని నిర్దేశిస్తుంది. దీని ప్రకారం, లోక్‌సభలో రాష్ట్రాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే సభ్యులు 815 మందికి మించకూడదు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉంటారు.
అయితే, రాష్ట్రాల వారీగా ఈ సీట్ల కచ్చితమైన కేటాయింపు గురించి ముసాయిదాలో స్పష్టంగా ఏమీ పేర్కొనలేదు.
ముఖ్యంగా, 131వ సవరణ ఆర్టికల్ 82 కింద ఉన్న రాజ్యాంగ నిబంధనను తొలగిస్తుంది.
ఈ నిబంధన ప్రకారం, తదుపరి పునర్విభజన ప్రక్రియ 2026 తర్వాత నిర్వహించే మొదటి జనాభా గణన వరకు వేచి ఉండాలి.
2026 అనంతర జనాభా గణన గడువుతో పునర్విభజనను విడదీయడం వల్ల, అందుబాటులో ఉన్న తాజా డేటాను ఉపయోగించి తక్షణమే సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.
అంతేకాకుండా, 106వ సవరణ చట్టం(2023) ద్వారా తప్పనిసరి చేసిన 33% మహిళల రిజర్వేషన్‌ను తదుపరి ఎన్నికలలోనే అమలు చేయడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను ఈ బిల్లు తొలగిస్తుంది.
సీట్ల పంపిణీ లక్ష్యం- డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు..
సీట్ల పంపిణీని మార్చడం ఈ ప్రతిపాదనల ఉద్దేశ్యం. రాజ్యాంగ సవరణ బిల్లు ‘ఉద్దేశ్యాలు, కారణాలు’ ఇలా పేర్కొంటున్నాయి: “1971 జనాభా గణన గణాంకాల ఆధారంగా సీట్లపై విధించిన నియంత్రణ ఒక ముఖ్యమైన విధానపరమైన ప్రయోజనాన్ని అందించినప్పటికీ, దేశ జనాభా ముఖచిత్రం అప్పటి నుంచి గణనీయమైన మార్పులకు లోనైంది. తాజా జనాభా గణన గణాంకాల ప్రకారం అంతర్-రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర జనాభా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.”
రాష్ట్రాల వారీగా సీట్ల పంపిణీని నిర్ణయించడానికి, డీలిమిటేషన్ బిల్లు, 2026 ఒక ‘డీలిమిటేషన్ కమిషన్’ ఏర్పాటును నిర్దేశిస్తుంది. “తాజా జనాభా గణన గణాంకాల” ఆధారంగా సీట్ల కేటాయింపును సర్దుబాటు చేయడం ఈ కమిషన్ బాధ్యత అని బిల్లులో పేర్కొనబడింది.
డీలిమిటేషన్ కమిషన్‌కు ప్రస్తుత లేదా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు.
ఇందులో ప్రధాన ఎన్నికల కమిషనర్(లేదా వారి ప్రతినిధి), సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు.
కమిషన్‌కు సహాయం చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది”అసోసియేట్ సభ్యులు” (రాష్ట్ర స్పీకర్ ద్వారా నామినేట్ చేయబడిన ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు) ఉంటారు.
అయితే, ఈ అసోసియేట్ సభ్యులకు ఓటు వేసే హక్కు ఉండదు. కమిషన్ నిర్ణయాలపై సంతకం చేసే అధికారం ఉండదు.
కమిషన్ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించబడిన తర్వాత, వాటికి చట్టబద్ధత ఏర్పడుతుంది. వీటిని ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి వీలుండదు.
మూలంలో లోపాలు – రాజకీయ అంచనాలు..
ప్రభుత్వం అధికారిక సీట్ల వివరాలను వెల్లడించకపోవడంతో, స్వతంత్ర విశ్లేషకులు గణితాత్మక ఫలితాలను అంచనా వేశారు.
‘ది హిందూ’ లెక్కల ప్రకారం, ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే, లోక్‌సభలో హిందీ బెల్ట్ రాష్ట్రాల వాటా ప్రస్తుత 38.1% నుంచి 43.1%కి పెరుగుతుంది.
అదే సమయంలో, దక్షిణాది రాష్ట్రాల వాటా 24.3% నుంచి 20.7%కి తగ్గుతుంది.
815 సీట్లు 2011 జనాభా పంపిణీ ప్రకారం కేటాయించబడతాయని భావిస్తే..
1. ఉత్తరప్రదేశ్‌లో 58 సీట్లు పెరుగుతాయి(80 నుంచి 138కి). మొత్తం సీట్లలో వాటా 14.73% నుంచి 16.24%కి పెరుగుతుంది.
2. బీహార్‌లో 32 సీట్లు పెరుగుతాయి(40 నుంచి 72కి). వాటా 7.37% నుంచి 8.47%కి పెరుగుతుంది.
3. మహారాష్ట్రలో 30 సీట్లు పెరుగుతాయి(48 నుంచి 78కి).
4. కేరళలో కేవలం మూడు సీట్లు పెరుగుతాయి(20 నుంచి 23కి). వాటా 3.68% నుంచి 2.7%కి తగ్గుతుంది.
5. తమిళనాడులో 11 సీట్లు పెరుగుతాయి(39 నుంచి 50కి). వాటా 7.18% నుంచి 5.88%కి తగ్గుతుంది.
2011 జనాభా గణన వాటా ఆధారంగా తన అంచనాలను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ విడుదల చేశారు. “లాభపడే, నష్టపోయే రాజకీయ పార్టీలు, బీజేపీ బలం, బలహీనత ఉన్న ప్రాంతాలతో సరిగ్గా సరిపోలుతోంది” అని యాదవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి అదనంగా ప్రతి రాష్ట్రానికీ సీట్లు పెరుగుతాయి. కానీ వాస్తవ ప్రాతినిధ్యాన్ని కొలవాలంటే, ఒక రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న దామాషా వాటా ప్రకారం ఎన్ని సీట్లు రావాలి, ఈ ప్రతిపాదనలో ఎన్ని వస్తున్నాయి అనే దానిని పోల్చి చూడాలి.
యాదవ్ ప్రకారం, “కేరళకు 23 సీట్లు అంటే అదనంగా 3 సీట్లు వస్తాయి. కానీ మొత్తంగా పెరిగే సీట్లకు అనుగుణంగా దామాషా ప్రకారం 31 సీట్లు రావాలి. ఆ విధంగా కేరళ 8 సీట్లు కోల్పోతుంది. ఉత్తరప్రదేశ్‌కు 125 సీట్లు రావాలి. కానీ 138 వస్తాయి. అంటే 13 సీట్లు అదనంగా వస్తాయి.”
కార్నెగీ ఎండోమెంట్ విశ్లేషణ-చారిత్రక నేపథ్యం..
2019లో మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్ రచించిన ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అధ్యయనం ఈ నిర్మాణపరమైన వ్యత్యాసాలను వివరంగా తెలియజేసింది.
గత దశాబ్దాలలో భారత రాష్ట్రాల మధ్య సంపద అంతరం విపరీతంగా పెరిగిందని రచయితలు గుర్తించారు. ప్రవీణ్ చక్రవర్తి, వివేక్ దేహెజియా పరిశోధన ప్రకారం- 2017 నాటికి భారతదేశంలోని మూడు అత్యంత ధనిక రాష్ట్రాల సంపద, మూడు పేద రాష్ట్రాల సంపద కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
అయితే ఫైనాన్స్ కమిషన్ వనరుల కేటాయింపు ఇప్పటికీ పాత(1971) జనాభా లెక్కల ఆధారంగానే ఉందని వారు పేర్కొన్నారు.
రాజ్యాంగ చరిత్ర ప్రకారం 81వ అధికరణం ఏడవ సవరణ(1956) ద్వారా మొత్తం ఎన్నిక కాబడే సభ్యుల సంఖ్య 520గా నిర్ణయించబడింది. ప్రస్తుతం ఆమోదించబడిన గరిష్ట సీట్ల సంఖ్య 552(ప్రస్తుతం 545 సీట్లు మాత్రమే భర్తీ చేయబడుతున్నాయి).
కుటుంబ నియంత్రణ విధానాన్ని బాగా అమలు జరిపిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 2001 జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యేదాకా పార్లమెంటు సీట్ల సంఖ్య పెరగకుండా 1976లో 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు.
తదుపరి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సీట్ల పెంపుదల నిషేధాన్ని 2026 జనాభా లెక్కలు పూర్తయ్యేదాకా పొడిగిస్తూ 84వ రాజ్యాంగ సవరణను 2002లో చేశారు.
మరలా 2003లో 87వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలలో సీట్లపై నిషేధం 2001 లెక్కలకు లోబడి మొత్తం రాష్ట్రాల అసైన్మెంట్ మారకుండా ఉండాలని నిర్ణయించబడింది.
ప్రస్తుత బిల్లుకు ముందు రాజకీయ శాస్త్రవేత్త అలిస్టర్ మెక్‌మిలన్ 2001 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి 7 సీట్లు తగ్గుతాయని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి 7 సీట్లు పెరుగుతాయని నిర్ధారించారు. ఈ లెక్కలను తాజాపరుస్తూ వెబ్‌స్టర్ విధానాన్ని ఉపయోగించి వైష్ణవ్, హింట్సన్లు 2026 నాటికి భారీ మార్పులు ప్రతిపాదించారు.
ఒక అధ్యయనం ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రాజ్యాంగం కింద రిజర్వ్ చేయబడిన సీట్లు తగ్గుతాయి. ప్రాతినిధ్యం తగ్గే దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు కోల్పోతే, భారీగా పెరిగే హిందీ బెల్ట్ రాష్ట్రాలలో పెరుగుతాయి.
రాజకీయ ప్రభావాన్ని తెలియజేయడానికి పరిశోధకులు 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను 2011 జనాభా లెక్కల ప్రకారం విశ్లేషించారు.
రాజకీయ పార్టీలు గెలిచిన స్థానాలలో మార్పు లేదనుకుంటే బీజేపీ ప్రస్తుత 282 నుంచి 299కి(17 స్థానాలు) పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు కోల్పోయే స్థానాల వల్ల బీజేపీకి ఈ పెరుగుదల సాధ్యమవుతుంది. జనాభాకి, ఓటర్లుగా నమోదైన వారికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందని పరిశోధకులు గుర్తించారు.
ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లో 30 లక్షల నివాసాలకు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంటే, తమిళనాడులో 18 లక్షల నివాసాలకు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. కానీ నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య రెండు చోట్లా ఒకే విధంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ కంటే తమిళనాడులో నియోజకవర్గాల వారీగా ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేశారు.
ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రాలు నష్టపోకుండా లోక్‌సభ స్థానాలను పెంచవచ్చని మెక్‌మిలన్ గతంలో ప్రతిపాదించారు.
2001 లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను 668కి పెంచవచ్చని ఆయన ప్రతిపాదించారు. అయితే 2026 జనాభాను దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రం నష్టపోకుండా కార్నెగీ పరిశోధకులు ఆ స్థానాలను 848కి పెంచాలని ప్రతిపాదించారు.



రాష్ట్రం-కేంద్రం వివాదం – ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు..
రాష్ట్రం-కేంద్రం వివాదం మధ్య, పలువురు విధాన నిపుణులతోపాటు రాజకీయ నాయకులు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించారు.
♦ దేశానికి రాష్ట్రాలు ఇచ్చే ఆర్థిక సహకారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలోనే వాదించారు.
♦ కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని, కేంద్ర విధానాలను కేవలం జాతీయ ప్రాధాన్యత ఉన్న వాటికే పరిమితం చేయాలని; రాజ్యసభను అమెరికన్ సెనేట్ తరహాలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా మార్చాలని ప్రణయ్ కోటస్థానే; సుమన్ జోషీలు ప్రతిపాదించారు.
♦ రాష్ట్రాల ఆర్థిక స్థితిని పెంచేవారికి ఎక్కువ స్థానాలు ఉండేలా రాజ్యసభను”రెవెన్యూ సభ”గా మార్చాలని సూచించారు.
♦ లోక్‌సభ పునర్విభజన కంటే రాష్ట్ర అసెంబ్లీలను విస్తరించడం మరింత ప్రభావవంతమైన చర్య అని ఆర్ రంగరాజన్ సూచించారు. అదనపు సీట్లను ప్రస్తుతమున్న 543 కంటే పెంచాలనుకున్నప్పుడు సంతానోత్పత్తి రేటును పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాలకు సీట్ల పంపిణీ చేయాలని ఎస్ రాజ సేతు దురై, ఆర్ శ్రీనివాసన్ సూచించారు.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.




