వేదం చదవడం, వేదోపదేశం తీసుకోవడం అంతా ఒక దశలో విజ్ఞానమనే అనుకున్నారు. అందుకే వేదం, విజ్ఞానం, వేదోపదేశాన్ని ఒకే గాడిలో కట్టగట్టి పడేశారు.
అయితే ఆధునిక ఆలోచనా ధోరణితో వైజ్ఞానిక ప్రగతి సాధిస్తున్న కొద్దీ స్పష్టమైంది ఏమిటంటే, వేదం గానీ, వేదోపదేశం గానీ విజ్ఞానానికి సరిరావు.
వేదాలు, వేదోపదేశాలు గొప్పవి అని విశ్వసించే వారితో మనకు వాదన లేదు. వారి విశ్వాసాలు వారివి. విజ్ఞానం – సైన్సు ఈ విశ్వానిది.
వేదం కేవలం భారతదేశంలో ఒక హిందూ మతం వారు విశ్వసించేది, వారికి మాత్రమే పవిత్రమైంది.
ఎవరైనా సరే ఈ విషయం మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే. అదీ, ఇదీ అంతా ఒకటే అంటే మాత్రం కుదరదు. సైన్సు – ఏ ఒక్క మతమో విశ్వసించేది కాదు.
నిజానికి అన్ని మత విశ్వాసాల్ని బద్దలు కొట్టేది, వాస్తవాల్ని తేటతెల్లం చేసేది సైన్సు.
అసలైన జ్ఞానం అంటే ఏమిటి?
ప్రాచీనకాలంలో భావించిన జ్ఞానం వేరు. ఇప్పుడీ అత్యాధునిక యుగంలోని జ్ఞానం వేరు. ‘జ్ఞానమొసగ రాదా.. సుజ్ఞానమొసగరాదా’ అని త్యాగరాజ కీర్తన ఉంది. అక్కడ జ్ఞానమంటే ఏమిటి? “ఓ ప్రభూ, ఓ దేవా నిన్ను పూజించే, నిన్ను కీర్తించే జ్ఞానం నాకివ్వరాదా” అని ప్రాధేయ పడడం.
అంతేగాని, మనం అనుక్షణం పీల్చే ప్రాణవాయువు – ఆక్సిజన్ ఎలా తయారవుతుందన్న అవగాహన ఇమ్మని కాదు.
జ్ఞానమంటే గుడ్డిగా ప్రతిదాంట్లో దేవుణ్ణి చూడగలగడం కాదు. దేవుణ్ణి ప్రశ్నించేది జ్ఞానం. దేవుణ్ణి శోధించేది జ్ఞానం.
నమ్మడం జ్ఞానం కాదు. నమ్మకాల్ని ఛేదిస్తూ, వాస్తవాల్ని వెలికి తీసేది జ్ఞానం.
“జ్ఞానమొసగరాదా” అంటే ఉన్నఫళంగా ఎవరో ప్రసాదించేది కూడా కాదు – జ్ఞానం. ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో పాండిత్యం(ప్రొఫిసియన్సీ) సంపాదించుకోవాల్సి ఉంటుంది. అందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.
ఎవరో ప్రసాదిస్తే ఉన్నఫళంగా వచ్చేది కాదు. సాధించుకోవాల్సిన పరిజ్ఞానం, గొప్ప వివేచనతో, వివేకంతో పనిచేయగల సత్తా క్రమక్రమంగా సంపాదించుకోవాలి.
వారి వారి రంగాల్లో ఉండాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి భావ వ్యక్తీకరణ పరిజ్ఞానం కూడా ఉండాలి.
విషయ పరిజ్ఞానం లేక కేవలం అందమైన భాష మాత్రమే ఉంటే పెద్దగా లాభం ఉండదు.
జ్ఞాన సాధన – సామాజిక ప్రయోజనం..
మొదట అక్షరాలు, సంఖ్యలు నేర్చుకుని ఆ తర్వాత భూమి గురించి, విశ్వం గురించి, సమాజం గురించి, సమాజంలోని అనేకానేక విషయాల గురించి, ముఖ్యంగా జీవ పరిణామం గురించి నిరంతరం లోతుగా అధ్యయనం చేస్తూ ఉండడమే జ్ఞానం.
ఆది, అంతం లేనిది జ్ఞానం. పరిపూర్ణ జ్ఞాన సాధన అంటూ ఏదీ ఉండదు. ఇంతవరకు ఎవరివల్లా కాలేదు కూడా. నువ్వు సాధించిన జ్ఞానాన్ని నియమబద్ధంగా, నిబద్ధతతో ఉపయోగిస్తూ, ఒక మంచి మానవుడిగా మనగలిగితే చాలు. నలుగురికి ఉపయోగపడితే చాలు.
నువ్వొక మనిషివని నువ్వు గుర్తుంచుకుంటే చాలు. పిచ్చి జనం వింటున్నారు కదా అని కొందరు మత పెద్దలు తమ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని వారి మీద ప్రయోగించడం జ్ఞానం కాదు.
నకిలీ గురువులు – పలాయనవాదం..
‘ఉదరపోషణార్థం బహుకృత వేషం’ – అంటే పొట్ట పోసుకోవడానికి కొందరు నానా గడ్డీ తింటూ జనం ముందు వేషాలు వేస్తుంటారు. వారిదంతా జ్ఞానం కాదు. వారంతా జ్ఞాన గురువులు కాదు.
కామన్ సెన్స్ లేక, సైన్స్ తెలియని వాడిది జ్ఞాన బోధ ఎలా అవుతుంది? ఊహల గురించి, భ్రమల గురించి చెపుతూ జనాన్ని భయపెట్టే వాడిది మోసమే తప్ప, జ్ఞాన బోధ కాదుకదా? వారంతా జ్ఞాన మార్గాన్ని వదిలేసిన వాళ్ళు. దారి తప్పిన వాళ్ళు. జీవాత్మ పరమాత్మ అంటూ పలాయనవాదం ప్రబోధించే వాళ్ళు జ్ఞాన గురువులు ఎలా అవుతారు?
పాత కాలపు మంత్రాలు – నేటి వాస్తవాలు..
సామాన్య జనం ఆలోచించాలి. గతంలోని రుషుల్ని, సాధువుల్ని వారు ఆయా కాలాలలో, సమాజాలలో చేస్తూ వచ్చిన కృషిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఆయా కాలాలకు, ఆయా సమాజాలకు కావల్సింది వారు చేస్తూ వచ్చారు. అది అట్లా ఉండనిద్దాం.
అయితే ఇప్పుడు ఆ కాలం, ఆ సమాజ స్వరూపం పూర్తిగా మారిపోయినప్పుడు, ఇంకా మారిపోతూ ఉన్నప్పుడు వేల ఏళ్ల క్రితం రాసుకున్న మంత్రాలు, శ్లోకాలు, కీర్తనలు వగైరా సమకాలీన జీవనానికి ఏమాత్రం ఉపయోగపడవు. ముందు ఆ విషయం గ్రహించుకోవాలి.
విహార యాత్రకు వెళ్ళి మహాబలిపురం శిల్పాలు, అక్కడి రాతి రథాలు చూసి ఆనందించినట్టు, వీటిని కూడా అలాగే పరిగణించాలి. ఆ రథాలు ఎలా ఉపయోగంలోకి రావో, ఈ మంత్రాలు పనిచేయవు. శ్లోకాలకు, కీర్తనలకు ఏ శక్తి లేదు. ఈ విషయం అందరూ గ్రహించుకోవడం మంచిది. లేదు శక్తి ఉంది అని ఎవరైనా అంటే మంత్రం వేసి చనిపోయిన వారిని బతికించాలి. లేదా బాగా జబ్బు పడ్డ వారి ముందు కీర్తనలు పాడి ఆరోగ్యవంతుల్ని చెయ్యాలి.
డాక్టర్లు, వైద్య పరికరాలు దరిదాపుల్లో లేకుండా ఆ పనులు చేసి చూపాలి. ‘మంత్రాల బలం లేకపోయినా తుమ్మెదల బలమైనా ఉండాలి’ అన్న మాట అందుకే వచ్చింది. ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అని కూడా ఊరికే అనలేదు.
మారుతున్న సమాజమే ఆ మాటల నుంచి స్ఫూర్తిని పొందాల్సి ఉంది. గతంలోని మంచిని మనం స్వీకరించాలి కదా అని అంటే నిజమే తప్పకుండా స్వీకరించాలి. ఉదాహరణకు “అబద్ధం ఆడకు” సూక్తి వేల సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని స్వీకరిద్దాం. ఆచరిద్దాం.
అయితే, అది అసాధ్యమని మహాభారతంలోనే ఉంది. అబద్ధాలాడిన వాళ్ళను అందులోనే సృష్టించారు కదా? ధర్మరాజే అబద్ధాలాడాల్సి వచ్చింది.
పురాణ కావ్యాల్లో అనైతిక అంశాలు ఎన్ని లేవు? అవి పవిత్ర గ్రంథాలెట్లా అవుతాయి? అందువల్ల వాస్తవం ఎప్పుడూ వాస్తవమే, నిజమెప్పుడూ నిజమే. ఒక్కసారి ఆలస్యంగా వెలుగులోకి రావొచ్చు. అది వేరే విషయం. శాస్త్రీయ అవగాహనతో ఆలోచించే మానవవాదులు ఎప్పుడూ నైతికతకే ప్రాధాన్యమిస్తారు.
దేవుడు, సంస్కృతి సంప్రదాయాల పేరుతో సాటి మానవుల్ని చావబాదుతున్న చర్యల్ని, చంపుతున్న దుర్మార్గాల్ని నిరంతరంగా ఖండిస్తారు. ఏ భేదాలు లేకుండా విశ్వమానవులంతా ఒకటేనని నినదిస్తారు.
మారిన కాలం – జ్ఞానానికి కొత్త నిర్వచనం..
అలాగే “పండిత పుత్రః పరమ శుంఠః” అనే మాట ఉంది. తండ్రి గొప్ప భాషా పాండిత్యం ఉన్న పండితుడు. మంచి ధారణా శక్తి గలవాడు. ఆశువుగా కవిత్వం చెపుతాడు. అవధానాలు చేస్తాడు. ఈ విద్యలన్నీ కొడుక్కి అబ్బలేదు. అందువల్ల అందరూ అతణ్ణి ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అని వ్యవహరిస్తుంటారు.
‘మా నాన్న గారు మహా పండితులండీ. అందులో కొంతైనా మాకు అబ్బలేదు’ అని ఆ కొడుకు కూడా అందరికీ చెప్పుకుని తను ‘పరమ శుంఠ’ అని కూడా ఒప్పేసుకుంటాడు.
నిజానికి, అది అతనికి తండ్రిపై గల గౌరవం మాత్రమే. ఇతనికి తండ్రి విద్యలు వంటబట్టలేదనే గానీ, ఇతను చదువుకున్న దాంట్లో బాగా రాణించాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఎంబీఏ చదివి, మంచి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉండి లక్షలు సంపాదించే వాణ్ణి ‘శుంఠ’ అని అనవచ్చా? తప్పు కదా?
బట్టీ పట్టిన శ్లోకాలు అనర్గళంగా చదవగలిగితే, భాషా పాండిత్యముంటే మహా పండితుడు, ‘జ్ఞాని’ అని వాడుకలో వ్యవహరిస్తున్నాం గానీ, ఆ తండ్రి చేస్తున్నదేమిటి? అతనెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న అమరం, రామాయణం, భాగవతం వగైరాలు అప్పజెప్పడం తప్ప, అందులో సృజనాత్మకత ఏముంది? అతని ఒరిజినాలిటీ ఏముంది? మరి కొడుకు పని అలా కాదుకదా? నేర్చుకున్నది అప్పజెప్పడం కాదుగదా?
కంపెనీలో వస్తున్న సమస్యల్ని అర్థం చేసుకుని, వాటిని పరిష్కరించే దిశలో పనిచేయాలి. దేశవిదేశీయులతో వ్యవహారం నడపాలి. ఆ రంగంలో వస్తున్న కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. తన కింది వారికి నేర్పిస్తూ ఉండాలి.
ఇలా చాకచక్యంగా ఎంతో నైపుణ్యంతో అనేక రకాల పనులు చేస్తూ, రోజురోజుకూ ఎదుగుతున్న కొడుకును ‘శుంఠ’ కింద జమకట్టవచ్చా? తండ్రీకొడుకులు చేస్తున్న పనిలో ఏది కష్టమైంది? సమకాలీన సమాజానికి ఏది ఎక్కువ ఉపయోగపడేది? ఆలోచిస్తే విషయం తేటతెల్లమవుతుంది.
ఈ కఠిన వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే కొడుకే జ్ఞాని, తండ్రి కాదని తేలుతుంది. అందువల్ల మనం “జ్ఞానం”, “పాండిత్యం” వంటి అనేక పదాలకు నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే వాటి పరిధి పెరిగింది. అవి విస్తరించాయి. ఒక్కోసారి అర్థం కూడా మార్చుకుంటున్నాయి.
ప్రవచనకారులు – ప్రగతి శూన్యం..
ఈ పంతుళ్ళు, పండితులు, జ్యోతిష్కులు, ప్రవచనకారులు, బాబాలు, స్వాములు, పీఠాధిపతులు, మానవ దేవుళ్ళ వల్ల ప్రపంచంలో ఎక్కడా రవ్వంతయినా అభివృద్ధి జరగలేదు. గ్యారెంటీగా ఇక ముందు కూడా జరగదు. వీళ్ళేమైనా ఆర్థికరంగ నిపుణులా, రక్షణ శాఖ నిపుణులా? చరిత్ర పరిశోధకులా? లేక వీరికి ఏ కళలోనైనా ప్రవేశముందా? వైజ్ఞానిక స్పృహ ఉన్నవారా? కనీసం ఇంగిత జ్ఞాన సంపన్నులా? ఏదీ కారే.
“విషయం” ఇదీ అనేది లేకుండా జీవాత్మ పరమాత్మ అంటూ మనువాదమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేవారిని పక్కన పెడితే ప్రజలు బాగుపడతారు.
ఎవరికి ఏ విషయం మీద పరిజ్ఞానం ఉందో అది వారి నుంచి తెలుసుకోవాలి. అంతే గానీ, మానసిక బలహీనులకు జనం ఎందుకు సమయమిస్తున్నారో వారే ఆలోచించుకోవాలి.
అభూతకల్పనల్ని ఎందుకు నమ్ముతున్నారో వారికి వారే అవలోకించుకోవాలి. బలహీనతల్లోంచి జనం బయటపడితే దొంగ స్వాముల ఆటలు సాగవు. జనం తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తే వారికి వారే మేలు చేసుకున్న వారవుతారు.
వాడుకలో లేని సంస్కృత శ్లోకాలు చదివి, జనాన్ని మభ్యపెట్టి భయపెట్టే వారిది ఏమాత్రం జ్ఞానం అనిపించుకోదు.
భాషా పండితులేకాదు, మత జ్ఞానాన్ని ప్రసాదించే ‘పెద్దలు’ కూడా కొందరుంటారు. ఇలాంటి వారిది అజ్ఞానమే కానీ, జ్ఞానం కాదు. మోడీ ఎన్నికయితే విదేశాల్లో ఉన్న నలబై లక్షల కోట్ల నల్లధనాన్ని దేశంలోకి తీసుకొస్తారని పతంజలి రామ్‌దేవ్ బాబా చెప్పారు.
మోడీ అధికారంలోకి వస్తే డాలరు విలువ రూ 40కి దిగువ ఉండేట్లు చూస్తారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రవచించారు.
ఈ జ్ఞాన గురువుల జ్యోస్యాలు తప్పాయి. కానీ “మీ జ్ఞానం ఇలా తగులబడిందేమిటి” అని అడిగేవారు లేరు. ఆయా విషయాలలో వీరికి ఏ ప్రవేశం ఉందని ఈ ప్రకటనలిచ్చారు? నిజంగా వారు మహిమాన్వితులే అయితే అవి నిజం కావాలి కదా? అహంభావంతో తమది “జ్ఞానబోధ” అనుకునే ఇలాంటి జ్ఞాన గురువులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
రాజకీయ నేతల సహకారంతో వ్యాపారాలు చేసుకుంటున్న ఈ జ్ఞాన గురువులు వాస్తవాలు గ్రహిస్తే మంచిది. తమను తాము మోసం చేసుకోకుండా ఉంటే మంచిది.
మరోవైపు సామాన్య జనం వివేకవంతులై, అలాంటి వారిపై దృష్టి సారించకుండా, పట్టించుకోకుండా ముందుకు పోవడం అవసరం. నానుడు ధోరణి మాని, పాలకు పాలు – నీళ్ళకు నీళ్ళుగా ఆలోచించుకోవాల్సి ఉంది. ఆచరించాల్సి ఉంది. సంశయాలతో, సందిగ్ధాలతో బతుకు దుర్భరం చేసుకోనవసరం లేదు.
సైన్స్ ఇచ్చే ధైర్యం: పలాయనవాదం వద్దు – పోరాటం ముద్దు..
ఇంగ్లీషు పదం ఫియర్ (భయం – F.E.A.R) ఉంది. మనమిప్పుడు ఒక ఫియర్ వదిలేసి మరో ఫియర్కి వెళ్ళాల్సి ఉంది. ఒక ఫియర్ ఏమిటంటే – ‘ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్'(Forget Everything and Run): అంతా మరిచిపోయి పారిపో అని అర్థం. మరో ఫియర్ ఏమిటంటే -‘ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్'(Face Everything and Rise)- ప్రతిదాన్ని ఎదుర్కొని ఎదుగు అని అర్థం.
ఎఫ్.ఈ.ఏ.ఆర్ అక్షరాలు అవే. కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటే అది అలా ఉంటుంది. తీసుకునే మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.
పలాయనం చిత్తగించమని ఆధ్యాత్మికం చెపుతుంది. ఎదురొడ్డి వాస్తవాల్ని ఎదుర్కోమని సైన్స్ చెపుతుంది. అదే తేడా.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

