అన్నే అంజయ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, సామాజిక సంస్కర్త.
స్వాతంత్య్ర ఉద్యమం, ఖాదీ ప్రచారం, గ్రామీణ చైతన్యం, భూగర్భ పోరాటాలతో ఆయన జీవితం ముడిపడి ఉంది.
1905లో అప్పటి కృష్ణా జిల్లాలోని ముదునూరు గ్రామంలో అన్నే అంజయ్య జన్మించారు.
చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు ఆయన వయసుతోపాటు బలంగా పెరిగాయి. మహాత్మా గాంధీ పిలుపుతో జాతీయోద్యమంలో పాల్గొనాలని సంకల్పించారు.
స్వచ్ఛంద సేవకునిగా 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. యువతలో జాతీయ చైతన్యం పెంపొందించేందుకు “వాల్మీకి ఆశ్రమం” అనే శిక్షణ కేంద్రాన్ని స్థాపించారు. అక్కడ దేశసేవకులకు శిక్షణ ఇచ్చేవారు. అన్నే అంజయ్య మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గాఢంగా విశ్వసించారు.
స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఖాదీ ప్రచారానికి విశేష కృషి చేశారు. గాంధీజీ సూచనల మేరకు హైదరాబాద్ ప్రాంతంలో అనేక ఖాదీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల్లో స్వదేశీ భావనను వ్యాప్తి చేశారు.
సత్యాగ్రహంలో సవాల్..
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనకు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. జరిమానా కూడా విధించారు. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు.
1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు మళ్లీ అరెస్టయ్యారు. జైలు శిక్షలు, ప్రభుత్వ నిర్బంధాలు ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయి. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన నిరంతరం పోరాడారు. 1940లలో వయోజన విద్య కోసం పాఠశాలను స్థాపించారు.
అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రహస్య ప్రచార పత్రికలను ప్రచురించారు. “రెడీ”, తరువాత “కాంగ్రెస్” అనే రహస్య పత్రికలను నడిపి స్వాతంత్ర్య ఉద్యమ సందేశాలను ప్రజలకు చేరవేశారు. ముదునూరు గ్రామాన్ని స్వాతంత్య్ర సమరయోధుల కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారు.
1942లో “భారత్ విడిచి పో”(క్విట్ ఇండియా) ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సమీకరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఈ కారణంగా 1942 డిసెంబర్ 24న అరెస్టై అమరావతి, వెల్లూరు జైళ్లలో 1945 వరకు నిర్బంధ జీవితాన్ని గడిపారు.
రాజకీయ, సామాజిక సేవ..
స్వాతంత్య్రం అనంతరం కూడా ప్రజా సేవను కొనసాగించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్ర శాఖకు నాయకత్వం వహించారు. “మాతృభూమి” పత్రికకు సంపాదకత్వం వహించారు.
కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం కృషి చేశారు.
అన్నే అంజయ్య నిరాడంబర జీవితం గడిపిన గాంధేయవాది. స్వార్థరహిత సేవ, దేశభక్తి, త్యాగనిరతి ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం కలిగించడం, యువతను జాతీయోద్యమంలోకి తీసుకురావడం ఆయన జీవిత లక్ష్యంగా నిలిచింది.
1975 జూన్ 22న హైదరాబాద్‌లో అన్నే అంజయ్య మరణించారు. ఆయన జీవితం భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా నిలిచిపోయింది.
అన్నే అంజయ్య పేరు పెద్దగా ప్రచారంలో లేకపోయినా, ఆయన చేసిన త్యాగాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్ర ఎంతో గొప్పది. ఖాదీ ప్రచారం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, భూగర్భ కార్యకలాపాలు వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజలు గర్వించదగినవిగా నిలిచాయి.
స్వాతంత్య్రం కోసం జైలు శిక్షలు అనుభవించి, జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన ఈ మహనీయుడు భావితరాలకు ఆదర్శప్రాయుడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
