నిరసన శిబిరానికి ఇక నుంచి ఏమాత్రం ఆహారం సరఫరా చేయరాదని ఢిల్లీ పోలీసులు వచ్చి చెబుతున్నట్లు, అనేక కేఫ్‌లు, రెస్టారెంట్ల యజమానులు ది వైర్‌కు చెప్పారు.
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ నిరసన శిబిరం వద్ద పడి ఉన్న ఆహార ప్యాకెట్లు, కవర్ల ద్వారా వాటిని సరఫరా చేసిన ఆ ప్రాంతం చుట్టూ ఉన్న రెస్టారెంట్లను పోలీసులు వేటాడుతున్నారు.
తరచూ జరుగుతున్న పరీక్షల వైఫల్యాలకు చిహ్నంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని జూలై 25న ఉత్సవంగా జరుపుకున్న నిరసనలో ఉన్న యువతకు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఢిల్లీ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల లక్ష్యం ఏమిటి? నిరసన వేదికకు ఉచిత ఆహారం లేదా పెద్ద మొత్తంలో ఆహార పదార్థాల పంపిణీని నిలిపివేయడమే.
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతృత్వంలో నిరసనకారుల కీలక డిమాండ్‌పై 36 రోజుల సుదీర్ఘ నిరసనలు, నిరాహార దీక్షల తర్వాత ఒత్తిడికి లోనై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
రెస్టారెంట్ యజమానులకు పోలీసుల బెదిరింపులు..
ఆ తర్వాత నుంచి నిరసనకారులకు ఎవరు మద్దతు పలికారు, ఎవరు సహాయం అందించారనే దానిపై ఢిల్లీ పోలీసులు వేట మొదలుపెట్టారు.
తమకు తోచిన విధంగా చిన్నపాటి సహాయం చేసిన వారిని కూడా వదలడం లేదు. నిరసన స్థలానికి ఇక నుంచి ఏమాత్రం సహాయం లేదా ఆహారం సరఫరా చేయరాదని పోలీసులు ఆదేశిస్తున్నట్లు అనేక మంది కేఫ్, రెస్టారెంట్ యజమానులు ది వైర్‌కు తెలిపారు.
వారు పోలీస్ స్టేషన్‌కు రప్పించుకుని, ఏ స్వచ్ఛంద సంస్థ కోసం మీరు ఇది చేస్తున్నారు, లేదా ఆహారం సరఫరా చేయమని ఎవరు మీకు చెప్పారని అడుగుతున్నారు. “మేము ఉద్యమానికి మద్దతునిస్తున్నామనే ఆ పని చేశాము, మా రెస్టారెంట్లో తయారు చేసిన ఆహారాన్నే సుమారు వారం రోజుల పాటు సరఫరా చేశాము. సీజేపీ ఆశయానికి మద్దతు తెలుపుతున్నందుకు మమ్మల్ని వేధిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వేషపూరిత సందేశాలు కూడా పెడుతున్నారు”అని ఒక యజమాని ది వైర్‌కు వెల్లడించారు.
సంఘీభావం తెలుపుతున్న రెస్టారెంట్ల ఆందోళన..
నిరసనకు మద్దతు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను కూడా తొలగించాలని పోలీసులు కోరారని ఆ యజమాని చెప్పారు.
ఆహారంతో ఉద్యమానికి మద్దతు తెలిపిన చిన్న బ్రాండ్ల కోసం ఇతర అనేక రెస్టారెంట్లను భయపెడుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, తమను ఒంటరి వాళ్లను చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆహారాన్ని తయారు చేసి వడ్డించే సంస్థలపై ఢిల్లీ పోలీసుల వేధింపుల నేపథ్యంలో అనేక రెస్టారెంట్ల యజమానులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు తెలిసిందని మహబెల్లీ యజమాని జకారియా జాకబ్ అన్నారు.
పెద్ద మొత్తంలో ఆహారాన్ని సరఫరా చేసిన కొన్ని రెస్టారెంట్లనే పోలీసులు సంప్రదించినట్లు తనకు అర్థమవుతోందని తెలిపారు.
ఏ విలువలు, విశాలమైన నీతి కోసం ఉద్యమం వాదించిందో, దాని చుట్టూ చేరిన యువత పక్షాన గట్టిగా నిలబడటాన్ని కొనసాగిస్తామని ది వైర్‌కు జాకబ్ స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి హామీకి తూట్లు..
పరీక్షల కుంభకోణాలపై ఆందోళన చేస్తున్న నిరసనకారులపై ఎలాంటి కేసులను నమోదు చేయబోమని, తదుపరి దాడులు, వేధింపులు, అణచివేత చర్యలు ఉండవని, పోలీసుల బల ప్రయోగాన్ని నిలుపుదల చేస్తామని సీజేపీకి కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
అయినప్పటికీ, మద్దతుదారులను గుర్తించి వారికి జరిమానా విధించడం వంటి వ్యూహాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రభుత్వం ఈ హామీలను ఉల్లంఘిస్తోందని సీజేపీ ఆరోపించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిర్బంధాలు కొనసాగుతుండటంతో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి.
సీజేపీకి మద్దతు ఇస్తున్న కారణంగా ఒక కేఫ్‌తో సంబంధం ఉన్న మరో వ్యక్తి వేధింపులకు గురయ్యారు. ఈ కథనం రాసే సమయానికి వారు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పెట్టిన పోస్టులను తొలగించలేదు.
ఉద్యమానికి మద్దతు తెలిపే ఆలోచనను సమర్థిస్తూ, తమ నుంచి ఆర్డర్లు తీసుకోవడాన్ని నిలిపివేస్తామని అనేక సామాజిక మాధ్యమాల ఖాతాలు హెచ్చరించాయని, కానీ అనేక మంది మమ్మల్ని ప్రశంసించారని ఆయన తెలిపారు.
పోలీసులు తమను ఆపుతున్నారని డెలివరీ భాగస్వాములు చెప్పారని, చివరికి ఆహార పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత ఉద్యమానికి ఆహారం సరఫరా చేసిన ప్రజలను ఇలా వేటాడటం సరికాదని ఈ వ్యక్తి అన్నారు.
నిరసనకారులకు అండగా నిలిచిన సంస్థలు..
లోధీ కాలనీలోని గార్నిటాస్, మెహెర్ చంద్ మార్కెట్లోని డుంబో డెలీ, న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని కేఫ్‌ల వంటి ఇతర రెస్టారెంట్లు నిరసనకారులకు తమ వద్ద ఉచిత ఆశ్రయం కల్పించి మంచినీళ్లు, తినుబండారాలు అందించాయి.
నిరసన జరిగిన నాటి నుంచి ఇలాంటి రెస్టారెంట్లను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఛలో సంసద్ మార్చ్ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి, భాష్పవాయువును ప్రయోగించడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులకు, కార్యకర్తలకు జన్‌పథ్‌లోని బ్లూ టోకాయ్ ఔట్లెట్ ఆశ్రయం కల్పించి ఉచితంగా తాగడానికి నీరు, ప్రాథమిక చికిత్స అందించింది.
మహిళా నిరసనకారులపై ఆన్లైన్ దాడులు..
సాయుధ దళాలను కించపరుస్తున్నారని లేదా ప్రధానమంత్రిని దూషిస్తున్నారని ఆరోపిస్తూ ఆన్లైన్ ద్వారా మహిళా నిరసనకారులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. వారికి లైంగిక వేధింపులు, ప్రాణ బెదిరింపులు రావడమే కాకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నారు.
నిరసనల వద్ద ఉన్న అనేక మంది మహిళల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుతూ, వారి ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాలు వంటి వ్యక్తిగత వివరాలను బహిరంగ పరిచారు.
దీని ఫలితంగా ఆ మహిళలు లైంగిక వేధింపులు, మరణ బెదిరింపులు వంటి అనేక భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
నిరసన స్థలం వద్ద ఆహార పార్శిళ్లను అందిస్తూ విధి నిర్వహణలో ఉన్న డెలివరీ సిబ్బంది పట్ల ఢిల్లీ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారనే దానిపై అధికారిక ప్రకటన కోసం స్విగ్గీ, జొమాటో సంస్థలకు ది వైర్ లేఖ రాసింది.
కేంద్ర మంత్రి హామీ తర్వాత కూడా రెస్టారెంట్ యజమానులను బెదిరింపులకు గురిచేయడంపై స్పందించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులను కూడా ది వైర్ సంప్రదించింది. స్పందనలు వచ్చిన తర్వాత ఈ కథనాన్ని నవీకరిస్తాము.
– తరుషీ అస్వాని
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
