వర్షాభావం లేదా కరువు సంవత్సరాలలో నీటి కొరతను తగ్గించడానికి, తాగునీటి భద్రత కల్పించడానికి, మొదటి పంట(ఖరీఫ్) ఆరుతడి పంట వేసుకోవడానికి లేదా ఉన్న పంటను రక్షించడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో వరదల కాలంలో 150 టీఎంసీ అదనపు నీటి నిల్వ(క్యారీ ఓవర్ స్టోరేజ్)కు బచావత్ ట్రిబ్యునల్ అనుమతించింది.
ఆ మేరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ నిల్వ సామర్థ్యానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వ్యతిరేకించినా బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించింది.
తద్వారా బాగా వర్షాలు కురిసిన సంవత్సరాల్లోని అదనపు నీటిని నిల్వ చేయడం వల్ల, నదులలో నీటి దిగుబడి నిర్దేశిత స్థాయి కంటే తగ్గినప్పుడు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి వీలవుతుంది.
కరువు పరిస్థితులు నెలకొన్న సంవత్సరాలలో కృష్ణా నది ఎగువ నుంచి నీటి ప్రవాహాలు ఆలస్యం అయినప్పుడు ముఖ్యంగా పురాతనమైన కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలలో తొలి పంట(ఆరుతడి)కు అవసరమైన నీటికి భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
రెండవ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) కూడా క్యారీ ఓవర్ స్టోరేజ్‌కు ఆమోదించింది. కానీ, ఆ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో మొదటి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (బచావత్ ట్రిబ్యునల్) తీర్పే ప్రస్తుతం చట్టబద్ధంగా అమలులో ఉన్నది. కాబట్టి నిరభ్యంతరంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అదనపు నీటిని నిల్వ చేసుకోవచ్చు.
జలాశయాల ఖాళీ – పాలకుల బాధ్యతారాహిత్యం..
2025-26 నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ దాటి 1,651 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్ళింది. 400 టీఎంసీలకుపైగా తుంగభద్ర జలాలు సుంకేసుల ఆనకట్ట దాటి శ్రీశైలం డ్యాంలోకి ప్రవహించాయి.
2025-26 నీటి సంవత్సరంలో, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలో క్యారీ ఓవర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఎప్పుడూలేనంత అవకాశం ఉండింది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించి, దూరదృష్టితో క్యారీ ఓవర్ నిల్వలను రెండు జలాశయాల్లో చేసి ఉండాల్సింది. అలా చేయకపోగా రెండు జలాశయాలను డెడ్ స్టోరేజీ వరకు ఖాళీ చేశాయి.
శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటి మట్టం తర్వాత త్రాగునీటికి తప్ప మిగిలిన అవసరాలకు వాడకూడదన్న నిబంధనలు 1996 జూన్ 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.69లో స్పష్టంగా ఉన్నా, వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా 821 అడుగుల నీటి మట్టం వరకు తోడేశారు.
దాంతో 42 టీఎంసీ మాత్రమే మిగిలింది. నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజ్ నిల్వ 137 టీఎంసీ మిగిలింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా జలాల వినియోగంలో ప్రజలకు జవాబుదారితనంతో వ్యవహరించి ఉంటే ఇది జరిగేది కాదు. దీనిపైన స్పష్టమైన వివరణను రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు ఇవ్వాలి.
బోర్డుల వైఫల్యం – విద్యుత్ ఉత్పాదనపైనే మోజు..
నేడేం జరుగుతున్నదో కూడా చూడండి. శ్రీశైలం రిజర్వాయరులోకి వరద ప్రవాహం మొదలయ్యింది. నీటి నిల్వ 42 టీఎంసీ నుంచి 74 టీఎంసీలకు మాత్రమే పెరిగింది. వీటి వినియోగానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కానీ, తెలంగాణ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని తరలించడం మొదలుపెట్టారు.
అంటే, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏర్పడిన కృష్ణా నది యాజమాన్య బోర్డు కేవలం పేపర్ బోర్డుగానే మిగిలిపోయి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది.
గత ఏడాది జరిగిందీ ఇదే తంతు. అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, పార్లమెంటు చేసిన చట్టాలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఉల్లంఘిస్తూ కృష్ణా నదీ జలాలను అడ్డగోలుగా వాడేస్తే, కృష్ణా నది యాజమాన్య బోర్డు అడ్డుకట్ట వేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించలేదు.
శ్రీశైలం రిజర్వాయరు నిండడానికి, అటుపై నాగార్జునసాగర్ కు చేరడానికి, ఎగువ నుంచి నదీ ప్రవాహం కొనసాగింపుపై ఆధారపడి ఉంటుంది.
కిందికి నది ప్రవాహం ఆలస్యం కావడంతో కృష్ణా డెల్టాలో నారుమళ్ళు ఎండిపోయే ప్రమాదం ముంచుకొచ్చినా, రాయలసీమ ప్రాంతానికి కనీసం త్రాగునీళ్లు అందించలేక పోయినా ప్రజలే బాధలు పడాలి, నష్టపోవాలి.
ప్రభుత్వం మాత్రం “ఎల్ నినో” పై నెపం నెట్టేసి, చేతులు దులుపుకుంటుంది. ఇదీ నేడు నడుస్తున్న చరిత్ర.
గత ఏడాది భారీగా వరద ప్రవాహాలు వచ్చినప్పటికీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 150 టియంసిల క్యారీ ఓవర్ నిల్వలను ఉంచుకోలేకపోవడానికి ప్రధాన కారణం, విద్యుత్ ఉత్పత్తి కోసం ఉన్న నీటిని వాడేయడమే.
ఇది అందరికీ విదితమే. భవిష్యత్తులో తలెత్తే వర్షాభావ పరిస్థితులపై అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. పర్యవసానంగానే నీటి సమస్య తీవ్రంగా ఎదురయ్యింది.
వర్షాభావ పరిస్థితులు – ప్రత్యామ్నాయ మార్గాలు..
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీటి కొరత ఏర్పడింది. “ఎల్ నినో” ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు మన దేశంలోను నెలకొన్నాయి. నైరుతీ రుతుపవనాలపై పెట్టుకున్న కొండంత ఆశ, నిరాశగా మిగిలింది.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాల్లో ఆలస్యంగా కురిసిన వర్షం వల్ల కాస్తా వరద నీరు శ్రీశైలం రిజర్వాయరులోకి చేరడం మొదలయ్యింది. గోదావరి నది ఆలస్యంగానైనా బాగానే ప్రవహిస్తున్నది.
పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు నీళ్ళిచ్చి ఆదుకునే అవకాశం ఉన్నది. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది.
గోదావరి నీటిని నిల్వ చేసుకోవడానికి మరొక రిజర్వాయరు లేదు. కాబట్టి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని పూర్తిస్థాయిలో ప్రకాశం బ్యారేజీకి తరలించాలి. ఆ నీటిని డెల్టాలోని నారుమళ్ళు, ఇప్పటికే నాట్లు వేసిన పొలాలకు యుద్ధప్రాతిపదికన అందించాలి.
పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న సుమారు 25 టీఎంసీల వినియోగించదగిన నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, డెల్టా చివరి ఆయకట్టు వరకు నారుమళ్ళు ఎండిపోకుండా కాపాడటానికి ప్రణాళికాబద్ధంగా విడుదల చేయాలి.
కరువుపీడిత రాయలసీమ ప్రాంతంలో అరకొర వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలించాలంటే శ్రీశైలం రిజర్వాయరులో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే సాధ్యం.
హంద్రీ – నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కాస్తా ముందుగానే త్రాగునీటిని తరలించే అవకాశం ఉన్నది.
నియమ నిబంధనల ఉల్లంఘన – కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రతిష్టంభన..
1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారిచేసిన జీవో నెం.69లో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించి కచ్చితమైన నియమ నిబంధనలను (మార్గదర్శకాలు) నిర్దేశించడం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన జీవోలన్నింటికీ రెండు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయినా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆ జీవోను కూడా అమలు చేయలేకపోయింది. ఆ తీర్పులోని భవిష్యత్తు నీటి భద్రత అనే మౌలిక స్ఫూర్తిని పక్కనబెట్టి, కేవలం తక్షణ ప్రయోజనాల కోసం నీటిని ఖాళీ చేయడం రెండు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే.
వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ నీటిని భవిష్యత్తు కోసం నిల్వ చేసుకోవడంపై ఏ మాత్రం దృష్టి సారించలేదు.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల నిల్వ ఉంచాల్సిన నీరు దిగువన ఉన్న నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయాయి.
“ఎల్ నినో” పర్యవసానంగా నైరుతి రుతుపవనాల వైఫల్యం, తగ్గిన వర్షపాతం, ఆలస్యమైన వరదలు. గత ఏడాది నీటితో కళకళలాడిన రిజర్వాయర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నీటి సంవత్సరంలో(జూన్, జూలై నెలల్లో) ఎల్ నినో ప్రభావం వల్ల ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు లేక, ఆశించిన వరద ప్రవాహం రాలేదు.
భవిష్యత్తులో ఇలాంటి నీటి కొరత రాకుండా ఉండాలంటే క్యారీ ఓవర్ నిల్వలపై ఉభయ రాష్ట్రాలు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయాల ఆధారంగా నిర్మించబడిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించడంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఆ సమస్య పరిష్కారం కావాలి.
మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలానికి ఎగువ వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి.
ఈ ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేఆర్ఎంబీ నిర్ణయాల మేరకు నీటిని వినియోగించుకోవాలి.
బచావత్ తీర్పు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు, కేఆర్ఎంబీ నిర్ణయాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞతతో కట్టుబడి వ్యవహరిస్తేనే భవిష్యత్తులోనైనా కరువు కాటకాల సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
రైతులకు నష్టం – ప్రభుత్వాల ముందుచూపు లేమి..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని, ప్రకాశం బ్యారేజిలో ఉన్న నీటిని కొంత మేరకు కాలువలకు విడుదల చేయడంతో రైతులు నారు పోసి, వరి నాట్లకు సిద్ధమైన పూర్వరంగంలో వరి పంట వేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చాలా ఆలస్యంగా రైతులకు సలహా ఇచ్చింది. పర్యవసానంగా రైతాంగం నష్టపోతున్నది.
కృష్ణా డెల్టాలోని సాగుభూమి వరి పంటకు తప్ప ఆరుతడి పంటలకు అనుకూలమైనది కాదన్న రైతుల ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి.
ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు(మినుము, పెసర, మొక్కజొన్న వంటివి) ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలి. అలాగే, నారు పోసి, వరి నాట్లకు సిద్ధమైన రైతులకు జరిగే నష్టానికి పరిహారం తక్షణమే చెల్లించాలి.
కృష్ణా డెల్టా కాలువల్లో గుర్రపుడెక్క కలుపు మొక్కలు, పూడిక వల్ల చివరి భూములకు నీరందడం దుర్లభంగా మారింది.
మే-జూన్‌లోనే వీటిని పూర్తి స్థాయిలో శుభ్రం చేసి ఉంటే పరిమితంగానైనా కాలువల్లోకి వదిలే నీరు మరింత సద్వినియోగం అయ్యేది. భవిష్యత్తు పట్ల శ్రద్ధవహించే ప్రభుత్వాలకు నేర్చుకుంటే ఇవన్నీ గుణపాఠాలే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
