బ్రిటన్ జర్మనీపై యుద్ధ ప్రకటన. మొదటి ప్రపంచ యుద్ధం వెనుక చరిత్ర. మానవ నాగరికత చరిత్రలో కొన్ని తేదీలు ప్రపంచ గమనాన్నే మార్చివేస్తాయి. అలాంటి చారిత్రక రోజులలో 1914 ఆగస్టు 4 ఒకటి. ఈ రోజున బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించడంతో అప్పటివరకు యూరప్‌కు మాత్రమే పరిమితమై ఉంటుందని భావించిన సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మొదటి ప్రపంచ యుద్ధంగా రూపాంతరం చెందింది.
నాలుగు సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ మహా యుద్ధంలో ఒక కోటి మంది సైనికులు, లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మానవాళికి అపారమైన ఆస్తి నష్టాన్ని మిగిల్చడమే కాకుండా, ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ సంబంధాలను పూర్తిగా మార్చివేసింది.
సామ్రాజ్యవాద దాహం.. వలస రాజ్యాల పోటీ..
ఈ యుద్ధం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. దానికి అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. 19వ శతాబ్దం చివరి భాగంలో యూరప్‌లో పారిశ్రామిక విప్లవం వేగంగా విస్తరించింది. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, ఉత్పత్తుల విక్రయానికి కొత్త మార్కెట్లు, వాణిజ్య మార్గాలు, కాలనీలు కావాలనే ఆశయం బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ వంటి శక్తివంతమైన సామ్రాజ్యవాద దేశాల మధ్య తీవ్రమైన పోటీకి దారితీసింది.
అప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్ ప్రపంచంలోని అనేక దేశాలను తమ వలసలుగా మార్చుకుని అపారమైన సంపదను కొల్లగొట్టాయి.
జర్మనీ మాత్రం ఆలస్యంగా పారిశ్రామిక శక్తిగా ఎదిగింది. జర్మనీ కూడా కాలనీలు కోరుకుంది. దీనివల్ల పరస్పర విభేదాలు పెరిగాయి. అందువల్ల ఇప్పటికే కాలనీలను ఆక్రమించిన దేశాలతో జర్మనీ పోటీపడింది. ఈ పోటీ క్రమంగా రాజకీయ శత్రుత్వంగా మారింది.
వివిధ జాతుల ప్రజలు స్వతంత్ర దేశాలు ఏర్పరచుకోవాలని కోరుకున్నారు. ముఖ్యంగా బాల్కన్ ప్రాంతంలో ఈ భావజాలం తీవ్రంగా పెరిగింది.
నౌకాదళ ఆధిపత్యం – సాయుధ శాంతి..
ఇదే సమయంలో ఆయుధాల తయారీలోనూ దేశాల మధ్య తీవ్రమైన పోటీ మొదలైంది. ప్రతి దేశం మరింత పెద్ద సైన్యాన్ని, ఆధునిక నౌకాదళాన్ని, తుపాకులు, కొత్త రకం యుద్ధ సామగ్రిని సమకూర్చుకోవడానికి పోటీ పడింది.
ముఖ్యంగా బ్రిటన్ సముద్రాధిపత్యాన్ని కాపాడుకోవాలని, జర్మనీ బ్రిటన్‌కు సమానమైన నౌకాదళాన్ని నిర్మించాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఈ పరిస్థితిని చరిత్రకారులు “సాయుధ శాంతి”గా పేర్కొంటారు. బయటకు శాంతి ఉన్నట్టే కనిపించినా, ప్రతి దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది.
రహస్య సైనిక కూటములతో పొంచి ఉన్న ముప్పు..
ఇంకో ప్రధాన కారణం రహస్య సైనిక కూటములు. జర్మనీ, ఆస్ట్రియా–హంగేరీ, ఇటలీ కలిసి ట్రిపుల్ అలయన్స్ అనే కూటమిని ఏర్పాటు చేశాయి. దీనికి ప్రతిగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కలిసి ట్రిపుల్ ఎంటెంటే అనే మరో కూటమిని ఏర్పాటు చేశాయి.
ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటాయని ఈ ఒప్పందాల సారాంశం. ఈ కూటములే ఒక చిన్న సంఘటనను ప్రపంచ యుద్ధంగా మార్చాయి.
యుద్ధానికి దారితీసిన రాజకుమారుడి హత్య..
ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే 1914 జూన్ 28న బోస్నియాలోని సారాజేవో నగరంలో ఆస్ట్రియా–హంగేరీ యువరాజు ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీని సెర్బియన్ జాతీయవాది గావ్రిలో ప్రిన్సిప్ కాల్చిచంపాడు. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన రాజకీయ హత్యగా గుర్తించబడింది. ఈ ఘటనను సాకుగా తీసుకున్న ఆస్ట్రియా–హంగేరీ, సెర్బియాకు కఠినమైన షరతులు విధించింది. వాటిని పూర్తిగా అంగీకరించలేదనే కారణంతో 1914 జూలై 28న సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.
సెర్బియాకు రష్యా మద్దతు ప్రకటించడంతో జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది. రష్యాకు మిత్రదేశమైన ఫ్రాన్స్‌పై కూడా జర్మనీ యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్‌ను త్వరగా ఓడించడానికి జర్మనీ రూపొందించిన “ష్లీఫెన్ ప్రణాళిక” ప్రకారం తటస్థ దేశమైన బెల్జియం మీదుగా దండయాత్ర ప్రారంభించింది.
అయితే 1839లో కుదిరిన లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం తటస్థతను రక్షించే బాధ్యత బ్రిటన్‌పై ఉంది. జర్మనీ బెల్జియంపై దాడి చేయడంతో బ్రిటన్ తీవ్రంగా స్పందించింది. జర్మనీ తన సైన్యాన్ని వెనక్కు తీసుకోకపోవడంతో 1914 ఆగస్టు 4 రాత్రి బ్రిటన్ అధికారికంగా జర్మనీపై యుద్ధం ప్రకటించింది.
ఈ ప్రకటనతో యూరప్‌లోని ప్రాంతీయ ఘర్షణ క్షణాల్లోనే ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. మిత్ర దేశాన్ని కాపాడటం కోసం ఏర్పడిన కూటమి తర్వాత కాలంలో నాటో కూటమి వంటి రూపాలు తీసుకున్నాయి.
మిత్ర రాజ్యాల కూటమి.. అమెరికా ప్రవేశం..
ఈ యుద్ధంలో ఒక వైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, తరువాత ఇటలీ, జపాన్, అమెరికా తదితర దేశాలు మిత్ర రాజ్యాలుగా నిలిచాయి.
1917లో జర్మనీ తన జలాంతర్గాములతో అనేక వాణిజ్య నౌకలను ముంచివేసింది. అమెరికా నౌకలు కూడా దాడికి గురయ్యాయి. అలాగే జర్మనీ మెక్సికోను అమెరికాపై యుద్ధానికి ప్రేరేపించే జిమ్మర్మాన్ టెలిగ్రామ్ కుట్ర ప్రయత్నం బయటపడింది. దీంతో అమెరికా మిత్ర రాజ్యాల తరఫున యుద్ధంలో చేరింది.
కేంద్ర రాజ్యాల కూటమి..
మరోవైపు జర్మనీ, ఆస్ట్రియా–హంగేరీ, ఒట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియా కేంద్ర రాజ్యాలుగా పోరాడాయి. ప్రపంచంలోని అనేక వలస దేశాలు కూడా తమ పాలక దేశాల తరఫున యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయుల పాత్ర..
ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండటంతో, భారతీయులకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఈ యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది.
సుమారు పదమూడు లక్షల మంది భారతీయ సైనికులు యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా రంగాల్లో పోరాడారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలు ప్రపంచ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయంగా నిలిచాయి. యుద్ధం అనంతరం భారతీయులలో స్వాతంత్ర్య ఆకాంక్ష మరింత బలపడింది.
ఆధునిక ఆయుధాల ప్రయోగం.. అపార ప్రాణనష్టం..
ఈ యుద్ధం మరో విషయంలోనూ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ట్యాంకులు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మెషిన్ గన్లు, విషవాయువులు వంటి ఆధునిక ఆయుధాలను భారీ స్థాయిలో తొలిసారిగా ఉపయోగించారు.
యుద్ధరంగాలు లక్షలాది మంది సైనికుల సమాధులుగా మారాయి. సుమారు ఒక కోటి మంది సైనికులు, లక్షలాది మంది పౌరులు మరణించగా, కోట్లాది మంది గాయపడ్డారు. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి.
జర్మనీ పతనం.. రెండో ప్రపంచ యుద్ధానికి బీజం..
1918 నాటికి జర్మనీ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడింది. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. చివరకు 1918 నవంబర్ 11న కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. అనంతరం జరిగిన వెర్సాయిల్స్ ఒప్పందంలో జర్మనీపై విధించిన కఠినమైన నిబంధనలు, భారీ పరిహారాలు ఆ దేశంలో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. అదే తరువాత అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదలకు, చివరకు రెండో ప్రపంచ యుద్ధానికి బీజం వేసింది.
రష్యాలో విప్లవం.. లెనిన్ చారిత్రక ఘట్టం..
ఈ ప్రపంచ యుద్ధాన్ని అంతరంగీకంగా జారు చక్రవర్తికి వ్యతిరేక పోరాటంగా మలిచిన లెనిన్ 1917లో జారు చక్రవర్తిని తొలగించి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని, తదనంతరం కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించి ప్రపంచ మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయాన్ని ప్రారంభించారు.
మానవాళికి గుణపాఠం.. శాంతి ఆవశ్యకత..
1914 ఆగస్టు 4న బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించిన సంఘటన కేవలం ఒక దేశం మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ఘటన మాత్రమే కాదు. అది సామ్రాజ్యవాద పోటీ, ఆయుధాల మోజు, రహస్య సైనిక కూటములు, జాతీయవాద ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఎంతటి విపత్తులోకి నెట్టగలవో మానవాళికి నేర్పిన చేదు పాఠం.
నేడు కూడా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే అవసరాన్ని ఈ చరిత్ర మనకు గుర్తు చేస్తూనే ఉంది.
ఈ కారణంగానే 1914 ఆగస్టు 4 ప్రపంచ చరిత్రలో యుద్ధం, శాంతి, దౌత్యం, అంతర్జాతీయ సంబంధాలపై శాశ్వత ముద్ర వేసిన ఒక చారిత్రక దినంగా నిలిచిపోయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
