గుజరాత్లోని రెండు జంతు ప్రదర్శనశాలల్లో వన్యప్రాణులకు ఆహారం పెట్టేందుకు గేదెలను వధించడాన్ని యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ సవాలు చేసింది.
జంతు ప్రదర్శనశాల ప్రాంగణంలో జంతువులను వధించడం వధశాలను నడపడంతో సమానమని, జంతు హింస నివారణ చట్టంతోపాటు ఇతర చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వాదించింది. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది.
న్యూఢిల్లీ: గుజరాత్లోని రెండు జంతు ప్రదర్శనశాలల్లో వన్యప్రాణులకు ఆహారంగా వాడేందుకు గేదెలను వధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మే 18న కొట్టివేసింది.
హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు..
లైవ్ లా కథనం ప్రకారం, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో ఉన్న సక్కర్బాగ్ జూలో అనుసరిస్తున్న పద్ధతికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పీఐఎల్) కొట్టివేస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి ఈ ధర్మాసనం నిరాకరించింది.
జనవరి 29న, జూ అధికారులు లీగల్ నోటీసుకు ప్రతిస్పందనగా- జూను 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, సెంట్రల్ జూ అథారిటీ రూపొందించిన నిబంధనల ప్రకారమే నడుపుతున్నట్లు పేర్కొన్నారని చెబుతూ హైకోర్టు గతంలో ఆ పీఐఎల్ను కొట్టివేసింది.
జూలను వారి ఇష్టానుసారం నిర్వహించుకోనివ్వండి: జస్టిస్ సందీప్ మెహతా
విచారణ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా మాట్లాడుతూ, “ఈ ప్రవర్తనా నియమావళి మొత్తం మానవ వినియోగం కోసం జంతువులను వధించే వధశాలల కోసమే- జంతుప్రదర్శనశాలలను వాళ్లకు నచ్చినట్టుగా నిర్వహించుకోనివ్వండి. నిజానికి, ఈ జంతుప్రదర్శనశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాల్సింది. అది కూడా జంతువుల పట్ల క్రూరత్వమే” అని అన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు..
పిటిషనర్ యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్, జంతుప్రదర్శనశాల ప్రాంగణంలో జంతువులను చంపడానికి నియమాలు అవసరమని వాదించారు.
‘ఈ చర్యను వాణిజ్యేతర ప్రయోజనాల కోసం చేస్తున్నంత మాత్రాన నిబంధనలు వర్తించవని అర్థం కాదు’ అని ఆయన పేర్కొన్నారు.
‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017)’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు.
ఆ తీర్పులో, కోర్టు ఆదేశాల మేరకు, జంతువులను వధించే ముందు, వధించే సమయంలో, వధ తర్వాత దశలకు సంబంధించి ప్రభుత్వం 24 నిబంధనలను నిర్దేశించింది.
ఈ మాంసం మానవ వినియోగం కోసం కానందున ఈ కేసులో 24 నిబంధనలన్నీ వర్తించనప్పటికీ, కనీసం మిగిలిన నిబంధనలైనా వర్తిస్తాయని గోయల్ అన్నారు.
భారతదేశంలోని ఇతర జంతుప్రదర్శనశాలల్లో జంతువులకు సిద్ధం చేసిన మాంసం లేదా ఆహారం సరఫరా కోసం టెండర్లు జారీ చేస్తారు.
కానీ గుజరాత్లోని ఈ రెండు జంతుప్రదర్శనశాలలు మాత్రం బతికున్న గేదెలను ప్రాంగణంలోకి తీసుకువచ్చి అక్కడే వధించడానికి అనుమతిస్తాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జంతుప్రదర్శనశాల ప్రాంగణంలో జంతువులను వధించడం వధశాలను నడపడంతో సమానమని, దీనికి జంతు హింస నివారణ చట్టంతో సహా చట్టపరమైన నిబంధనలు, లైసెన్సింగ్ నియమాలను పాటించాల్సి ఉంటుందని గోయల్ అన్నారు.
దీనివల్ల కాలుష్యం ఏర్పడి, నీటి వనరులపై ప్రభావం పడుతుందని కూడా ఆయన వాదించారు.
వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం..
అయితే, న్యాయవాది చేసిన ఈ వాదనలతో కోర్టు సంతృప్తి చెందలేదు. కాబట్టి ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
